ఆడవారంతా ఊపిరి బిగపట్టి చూస్తున్నారు.
కొట్టింది పాణిని అనే విషయం కూడ గమనించినట్టులేదు రెడ్డిగారు. మరొక బెత్తపు దెబ్బపడింది పాణి మీద.
"చచ్చాను" అని పడిపోయాడు పాణి.
"నాయ్నా!" కేక పెట్టింది మంజరి స్పృహలోకి వచ్చి.
అప్పుడుగాని రెడ్డిగారికి తెలియలేదు తాను బాదుతున్నది పాణినని.
"పంతులేమనలే, నాకే చక్కరొచ్చింది (ఒళ్ళు తిరిగింది)." అన్నది మంజరి.
"తల్లీ! లేచినావా?" అని బెత్తం అక్కడ పారేసి మంజరి దగ్గరకు చేరారు రెడ్డిగారు.
వనజ పాణిని లేవనెత్తి చేత్తో పట్టుకొని తీసికెళ్ళింది బైటికి.
ఆ దృశ్యం మంజరి గుండెలో వేల సూదులు గుచ్చింది.
"నాయ్నా!" అని తండ్రి తొడమీద ముఖంపెట్టి బావురుమంది. జలజలా కన్నీరు రాల్చింది. మళ్ళీ స్పృహతప్పిపోయింది.
"మంజరీ!" రెడ్డిగారి గుండె బీటలువారింది. రెండు బాష్పబిందువులూ రాలేయి.
ఇందిరమ్మ హోరుమని ఏడ్చేసింది.
చుట్టూరా ఉన్న దాసీలంతా కంట తడిపెట్టారు.
మందుల డబ్బా పట్టుకొచ్చిన అయ్యవారు 'దొరవారూ! కాస్త జరగండి' అన్నాడు. తొడమీదినుంచి కూతురు తల దిండుమీద పెట్టి లేచి నుంచున్నారు రెడ్డిగారు. ఇందిరమ్మ పైట సర్దుకొని కళ్ళు తుడుచుకుంటూ నుంచుంది. అయ్యవారు మంజరి చేతిని మోచేతివరకు పిసికి, మూడు వేళ్ళతో నాడి పట్టుకొని ధ్యానంగా చూచి, చేతిని మెల్లగా దిండుమీద ఉంచి అక్కడ నుంచునున్న దాసీదానితో సాన తెమ్మని చెప్పి 'దొరవారూ! భయం ఏమీలేదు. బాగా అలసిపోయినట్లున్నది. నాడి బహు నీరసంగా వున్నది. కంట్లో కలికం వేస్తాను. ఇప్పుడే తెలివి వస్తుంది. తరవాత నిశ్శబ్దంగా ఉన్న గదిలో పండబెట్టండి, ఎవ్వరు లేపొద్దు. మెలకువ వచ్చేవరకు బాగై పోతుంది' అని చెప్పి, సానమీద కుప్పె రంగరించి కంటికి కలికం వేశాడు.
కొద్దిసేపటికి కళ్ళు తెరిచింది మంజరి. వైద్యుడు కనిపించాడు. తండ్రి కనిపించకపోయేసరికి 'నాయ్నా' అని పిలిచింది.
'ఏందీ తల్లీ?' అని దగ్గరకు వచ్చాడు తండ్రి.
'ఏందిదంత? బాగనే ఉన్నను కదా?'
'ఏం లేదు తల్లీ, కలికమేసిండు అయ్యోరు. ఇగ నిద్రపో' అని జోకొట్టాడు. మంజరి కళ్ళు మూసుకుంది. నిద్రపోయింది. మెల్లగా తలుపుమూసి అంతా బయటకొచ్చేరు.
అంతా మౌనంగానూ, గంభీరంగానూ ఉన్నారు. అయినా అందరి హృదయాల్లోను సంక్షోభం చెలరేగింది.
పంతులు చదువుకున్నవాడు. రామాయణ, భారతాలు విడమరచి చెప్పగలవాడు. సంగీతంలో రాళ్ళను కరిగించగలవాడు. బ్రాహ్మణుడు. అలాంటివాడిమీద చెయ్యిచేసుకున్నాడు భర్త. గడీకి ఏదో ముప్పు వాటిల్లింది. ఎత్తి ముప్పు లేకుండా రక్షించమని ఇందిరమ్మ దేవున్ని ప్రార్ధించింది.
'దునియంత (ప్రపంచమంతా) తెలిసివోడు. తస్వీర్లు గుంజేటోడు. అసువంటోన్ని కొట్టిండు దొర ఊరుకుంటాడాయన? ఎందో జరుగుతుంది' అనుకున్నది గడీలోని పరివారమంతా.
రెడ్డిగారు ఎంతమందిని బాదాడో తెలియదు. కానీ అతని హృదయం నేడు క్షోభించినంతగా ఎన్నడూ క్షోభించలేదు. పంతులెంతో మంచివాడు. సంగీతం వినిపించి ఎన్నోసార్లు తనను ఆనందపరచాడు. అలాంటివాన్నేనా తాను కొట్టింది? ఎందుక్కొట్టాడు? ఏమో, తనకు తెలియకుండానే కొట్టేశాడు. అతడు మంజరి నేమైనా అని ఉంటాడా? అంటే మంజరి చెప్పకపోయిందా? ఆస్తితోపాటు పెళ్ళి చేసుకుంటానంటే తాయార్ను త్రోసివేశాడే! ఎంత నిగ్రహం గలవాడు! మంజరిమీద మనసు లేదుకదా! ఉంటె వనజకు అడ్డం వచ్చి దెబ్బలు తింటాడా? అదీ మంజరి ముందు. పాణికి వనజ అంటేనే ప్రేమ. అంతస్తుకు తగిన ఆడదాన్ని ఎన్నుకుంటాడు మగవాడు. మంజరి అంతసైక్కడ? అతని అంతస్తెక్కడ? అయితే తానెందుకు బాదినట్లు? తనకు తెలియకుండానే బాదాడు. అయినా దెబ్బ ఐతే అతనికి తగిలింది. 'చచ్చాను' అని అరచి పడిపోయాడు పాపం! ఆ మాట తలుసుకునేసరికి తన గుండెమీద ఎవరో కొరడాతో కొట్టినట్లనిపించి 'అమ్మ' అన్నారు ఆయనకు తెలియకుండానే. బాధపడ్డారు. పాణిదగ్గరకు వెళ్ళి తప్పయిందని అంగీకరిద్డామనుకున్నారు. దొరతనం అడ్డువచ్చింది. ఏవేవో ఆలోచనలు వచ్చి ఆయన మనస్సును చీల్చిసాగాయి. సాధారణంగా ఈ పరిస్థితిలో ఆయన సంగీతం వినేవారు.
కాని ఈ రోజు?
"మధుపానం!"
x x x
వనజ పాణిని తీసుకుని అతని గదిలోకి వెళ్ళింది. "నాకోసం దెబ్బలు తిన్నవులే" అని వెక్కెక్కి ఏడ్చింది. తన దెబ్బలు మరచి, ఆవిడ కన్నీరు తుడిచి "వనజా! చెల్లెవికదూ! ఈ మాత్రం త్యాగం చెయ్యొద్దా అన్న అయినవాడు" అన్నాడు జీరవోయిన గొంతుతో.
వనజ "మా అన్నయ్య" అని భుజంమీద వాలిపోయింది. ఆమె తన జన్మలో ఎరుగని ఆనందం అనుభవించింది. తన బాధలు పంచుకునేవాడు దొరికాడు. అతని బాధ చూస్తే తన గుండె తరుక్కుపోయింది. తాను కోరిందే అది. తనకో పెన్నిధి దొరికింది.
పాణి శారీరకం అయినా బాధ క్షణం మరిచాడు. వెంటనే గుండె భగ్గున మండింది. చిన్నతనంలో తల్లితండ్రులచేతగూడ దెబ్బలు తినలేదు తాను. ఏమిటీ దొర పొగరు? తానేమన్నాడని అతన్ని? వనజను అనవసరంగా గొడ్డును బాదినట్లు బాదుతూంటే అడ్డుపోయాడు. అందుకు తనపై ఇన్ని దెబ్బలా? బహుశా రామారెడ్డి కొట్టాలని కొట్టలేదేమో? అయితేమాత్రం కళ్ళులేవూ? ఎవరిని ఎందుకు కొడుతున్నదీ చూడొద్దూ? ఛీ. దుర్మార్గుడు. వీడి ఇంట్లో ఉండరాదని నిశ్చయించుకున్నాడు. తరువాత విషయం ఆలోచించలేకపోయాడు.
"దొర చదువుకున్నోర్ని ఎప్పుడు కొట్టలే." తనకు తెలియకుండానే అనేసింది వనజ.
"వనజా! ఈ దెబ్బలు శరీరానికి కాదు-గుండెకు తగిలాయి! శరీరానికి తగిలిన గాయం మానిపోతుంది. ఇది మానె గాయం కాదు. నీకోసం దెబ్బలు తిన్నాననే ఆనందంలో ఆ గాయంమీద పొర ఏర్పడింది. 'అహం' ఆ పొరను కాల్చేసింది. గుండె గాయం మండిపోతూంది. ఇక ఈ గడీలో ఉండలేను" అని చివ్వున లేచి ఫిడేలు చేతపట్టుకొని, కండువా వేసుకొని బయలుదేరాడు, గడీలో ప్రవేశించినట్లే.
'అన్నయ్యా! నేను ...' అడ్డు తగిలింది వనజ.
"వనజా! నేనెక్కడున్నా నీవు నాకు చెల్లెలువే. అన్నాచెల్లెళ్ళ సంబంధం శారీరకం అయింది కాదు. వారిద్దరూ ఒకచోట ఉండాల్సిన అవసరమూ లేదు. నా పరిస్థితి బాగుపడితే నిన్నీ చెరనుండి విడిపిస్తాను" అని వనజను తప్పుకొని సాగిపోయాడు.
వనజ చూస్తూ ఉండిపోయింది.
జల జలా కన్నీరు రాల్చింది.
ఫిడేలు పట్టుకొని రామారెడ్డిగారి గదికివెళ్ళాడు పాణి. గడీలో ప్రవేశించిన్నాటి పాణి కనిపించాడతనికి. నాటి దృశ్యం అతని మనోఫలకంమీద మెరిసింది. అతని సంగీతం, తీసిన ఫోటోలు, చెప్పిన కథలూ ఒక్కసారి తళుక్కుమన్నాయి కళ్ళముందు.
"దొరవారూ! మీరు నాకు ఆశ్రయం ఇచ్చినందుకు కృతజ్ఞున్ని. మీకు బాధ కలిగించి గడీలో ఉండతలంచలేదు. వెళ్తున్నాను, శలవు." నమస్కరించాడు పాణి. గొంతు జీవవోయింది.
"పంతులూ!" గొంతు పూడిపోయింది. కష్టంగా మాట పెకిలించుకొని "నువ్వీ గడీలో ఒకనివైనవు. నాకెందుకో నువ్వంటే గుంజుతది. నీ మీద చెయ్యి చేసుకోలేదు. వనజ కడ్డమొచ్చినవు. ఆ కోపంల చూడలేదు" అన్నారు. అంతస్తునుంచి దిగి, అహాన్ని చంపుకొని అతికష్టంగా ఆమాటంటున్నారు రెడ్డిగారని గ్రహించాడు పాణి. "గోష, పర్ధకూడ తీసేసి మా కుటుంబం ల ఒక్కణ్ణి చేసిన నిన్ను. చదువుకున్నోనివి, సంగీత పండితునివి నిను గడీల ఉంచుకోవాల్ననే ఉన్నది" అన్నారు.
మంజరి స్థితి తలపుకు వచ్చింది.
"అన్నయ్యా నేను?" అనిన వనజ గొంతు వినిపించినట్లయింది.
"తాయారు మాట నెగ్గుతది" అన్నారు రెడ్డిగారు ఆఖరి అస్త్రంగా.
"సరే ఉంటా" అని వెనక్కు తిరిగి, గదిలో ప్రవేశిస్తే వనజ మంచంమీద పడి వెక్కెక్కి ఏడుస్తూంది.
"వనజా! వచ్చేశాను. ఉండిపోతా" అన్నాడు.
"మా అన్నయ్య మంచివాడు" అంది లేచి కూచుని కళ్ళుతుడుచుకుంటూ.
17
స్నానంచేసి పిట్టగోడ పట్టుకొని నుంచున్నాడు మేడమీద పాణి. పాలు, ఫలహారం తెచ్చిపెట్టిన వనజ సహితం పక్కనే నుంచుంది ఏదో చెప్పాలని. హ హ-హ హ- అని నవ్వుతూ గేట్లో ప్రవేశించిందొక పిచ్చిది. పసిడిచాయ, ముడుతలు పడిన శరీరం, డొక్కొపోయిన చెంపలూ, చింపిరి తలా, ముడి విడిపోయిన రావికతో 'అంత దగా, అంత దగా, అన్నం పెడతారా, అందరూ పోతారా?' అని వికటంగా నవ్వేసింది. తరవాత నేలను చూస్తూ రెండు చేతుల్తోనూ నెత్తి గోక్కుంది. మరొకసారి అలాగే అరిచింది. అలాగే నవ్వేసింది. గడీలోంచి ఎంకటి పరిగెత్తుకొని వచ్చి, 'బువ్వ తెస్త కూకో' అని పట్టుకొని కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. ఆమె వెంటవచ్చిన కుక్కకూడా ఆమె పక్కనే కూర్చుంది. కలవారింటి ఆడపడుచులా ఉంది. పిచ్చిదై ఎందుకు అడుక్కొని తింటూందో అర్ధం కాలేదు పాణికి. పక్కకు చూస్తే వనజ కనిపించింది.
'ఎవరీ పిచ్చిది?' ఆశ్చర్యంగా అడిగాడు పాణి.
'కరణం మంగమ్మ.' నిర్లిప్తంగా జవాబు చెప్పింది.
ఎంకటి విస్తట్లో అన్నమూ, కూరలూ, పిండివంటలూ తెచ్చి ఆవిడ ముందుంచాడు. పిచ్చిది అన్నంమీదపడి తింటూంటే, ఆవిడ వెంటనే వచ్చిన కుక్క సహితం ఒకపక్కన తినసాగింది. గబగబా అన్నం తిని, చేతులు చీరకు తుడ్చుకొని వికటంగా మరొకసారి నవ్వి సాగిపోయింది. గేటుదాకా వెళ్ళి 'అంత దగా, అన్నం పెడ్తరా, అందరు పోతారా?' అనుకుంటూ దాటిపోయింది. చూపుకు అందినంత దూరం చూచాడు పాణి. గదిలోకి వెళ్ళడానికి వెనక్కు తిరుగుతూ అడిగాడు: