ఈ మధ్య సీత వంట్లో బాగుండలేదండి అదోలా వుందని చెపితే తను హాస్యంగా తీసుకున్నాడు. స్త్రీ అంటే ఏమిటి సిగ్గుల మొగ్గ. ఎంత భర్త అయితే మాత్రం ఈ విషయం నోరు తెరచి ఎలా చెపుతుంది? అయినా మీరు తండ్రి కాబోతున్నారని భార్య చెపితేనే అందం ఆనందం.
సీత తనతో ఈ విషయం చెప్పాలంటే తను ఓర్పు వహించాలి. సీత చెపుతుంది. తను అప్పుడు సినిమాలో లాగా రెండు చేతుల మీద ఎత్తుకుని గిర గిర తిప్పి గుండెకి హత్తుకుని ఆ తర్వాత నెమ్మదిగ బెడ్ మీద పడుకోబెట్టి మీదకి ఒరిగి మృదువుగ ముద్దు పెట్టుకోవాలి. "ఎంత మంచి వార్త వినిపించావు సీతా!" అనాలి. అప్పుడు సీత దోసిట్లో ముఖం దాచుకుంటుంది. బోలెడు సిగ్గుపడుతు.
"మిమ్మల్నే" గట్టిగ అరచి సీత ఎదురుగ కనపడేసరికి రామకృష్ణ తెలివి తెచ్చుకున్నాడు.
"సీతా! నా సీతా?" అంటూ కాఫీ కప్పు అందుకుంటూ సీతని ఆప్యాయంగా చూశాడు రామకృష్ణ.
"ఏమైంది మీకు?" సీత నవ్వుతూ అడిగింది.
"అనుకున్నదేదో అయ్యిందిలే. అది అలా అయ్యిందిలే అంటూ రామకృష్ణ రాగం తీశాడు.
"మొత్తానికి మీకు ఏదో అయింది."
"నాకు కాదు సీతా నీకు."
"నాకా?"
"అవును సీతా! నీలో కొత్త అందాలని చూస్తున్నాను."
"ఉదయాన్నే మీరిలా మాట్లాడుతున్నారంటే మీకు పైత్యం ప్రకోపించినట్లే" అంది సీత.
"నీ యిష్టం సీతా! నీవు తిట్టినా నాకు ఆనందమే" కాఫీ సిప్ చేస్తూ చెప్పాడు రామకృష్ణ.
సీత మూతి మూడు వంకరలు తిప్పి విస విస నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
"రెస్ట్ తీసుకో సీతా! నేను కూడా సాయం చేస్తా సీతా!" అంటూ సీత వెనుకనే తిరిగాడు రామకృష్ణ.
"ఇవాళ ఈయనకి ఏమైంది? తోచక నా వెనుకనే తిరుగుతున్నారులే" యిలా అనుకుంది సీతామనోహరి. ఇరువురు కలసి సినిమాకి వెళ్లారు. సినిమా నుంచి తిరిగి వస్తూ హోటల్లో భోంచేశారు.
ఇంటికి వచ్చిం తరువాత సీత అంది.
"హాయిగా యింట్లో వంటచేసి వస్తానంటే వద్డంటిరి. దిక్కుమాలిన హోటలు కూడు ఒక్క పదార్ధము సరీగలేదు. అన్నీ చప్పగా తగలడ్డాయి. దేశంలో ఉప్పు కారానికి కరువు వచ్చినట్లు బి. పి. పేషంట్లు పెరిగినట్లు వంట చేశాడు. ఇలాంటి తిండి తింటే జనాభా జీవచ్చవంలాగా తయారవుతారు. తిండి కలిగితే కండ గలదోయ్ అన్నమాట ఎవరికి గుర్తులేదేమో! నిమ్మకాయ ముక్క పుల్ల పుల్లగా ఓ బడ్డ వేశాడు కాబట్టి అది నాలుక్కి రాచుకుంటూ భోం చేయగలిగాను లేకపోతే ఆ కూడు తిన్నందుకు వాంతి ఒక్కటే తక్కువ.....
ఈ విధంగ సాగింది సీత వాక్ ప్రవాహం
విషయం అర్ధం చేసుకోగలిగాడు రామకృష్ణ.
సీతకి తిండి సయించటం లేదు. ఏం చేస్తుంది? ఖారం ఖారంగాను పుల్ల పుల్లగాను తినాలని వుంది కాబోలు. హోటలు కూడు కమ్మగా చచ్చిందని తను అనుకున్నాడు గాని అది కమ్మగా కాదు. చప్పగా చచ్చింది. అదే యింట్లో అయితే సీత తనకి యిష్టం వచ్చినట్లు చేసుకునేది.
కడుపుతో వున్న వాళ్లకి పుల్లటివి యిష్టం అంటారు. రేపు పుల్లటి పదార్ధాలన్నీ తెచ్చి యింట్లో పడేయాలి. పునాస మామిడికాయలు చింతకాయల్లో ఇంకేమన్నా రకాలు వుంటే అవి. నిమ్మకాయలు, పుల్లబచ్చలి కూర....
పుల్లని వస్తువులు పళ్ళు ఫలాలు అన్నింటి గురించి ఆలోచించాడు రామకృష్ణ.