Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 30


    "అరుణ నిజమే చెప్పింది. వెంకటమ్మ కూడా నిజమే చెప్పింది."
    సునంద కూతుర్ని పిచ్చిదాన్ని చూసినట్టు చూసింది.
    "అతడు గౌతమ్ కాదు. గౌతమ్ లా పోలికలున్న మరొకడు."
    కూతురుకు పూర్తిగా మతిపోయిందనే అనిపించింది సునందకు.
    "నిజం మమ్మీ!"
    "ఏమిటి నిజం?"
    "గౌతం లాంటి వాడే మరొకడు ఉన్నాడు. అతడి పేరు కూడా గౌతమే."
    సునందకు భయం వేసింది.
    "ఇందూ! ఏమైంది నీకు?"
    "నాకేం కాలేదు మమ్మీ! నాకు మతిపోలేదు. నేను నిజమే చెపుతున్నాను."
    "చాల్లే. ఇక ఊరుకో. ఇంకెక్కడా ఇలా మాట్లాడకు.నీకు మతిపోయిందని అంటారు."
    "నిజం మమ్మీ!"
    "ఏమిటే నిజం?"
    "మొన్న సినిమాహాల్లో ఒకడ్ని చూశాను. అచ్చం గౌతమ్ లాగే ఉన్నాడు. ఆ రోజు అసలు గౌతమ్ సినిమాకే రాలేదు."
    "ఆ మాట ఎవరన్నారు?"
    "గౌతమ్ చెప్పాడు."
    "అబద్దం చెప్పి ఉండొచ్చుగా?"
    "మొన్నమటుకు మొన్న ఆఫీసులో ఏం జరిగిందనుకొన్నావ్?...." అంటూ ఆఫీసులో జరిగిన సంఘటన గురించి చెప్పింది.
    సునంద ఆలోచనలో పడింది.
    "దీనికి ఏమంటావ్ మమ్మీ?"
    "ఏమంటాను? గౌతమ్ నాటకం ఆడుతున్నాడంటాను."
    "మమ్మీ!"
    "అవునమ్మా. తను కాకపోతే ఆఫీసు వాళ్ళతో తనుకాదని అంటాడుగా? అంత డబ్బు తీసుకెళ్ళినప్పుడు పోలీసు రిపోర్టు ఇస్తాడుగా?"
    ఇందుమతికి ఏం సమాధానం ఇవ్వాలో తెలియలేదు. నీళ్ళునమిలింది.
    "మనిషిని పోలిన మనుషులుంటారు. కాదనను. మరీ ఒకటిగానే ఉండటానికి ఇదేం సినిమానా ;లేక కథా?"
    "అలాంటివాళ్ళు అసలు ఉండరంటావా?"
    "ఒక తల్లి బిడ్డలైతే - అదీ కవలలైతే- ఉండటానికి అవకాశం ఉంది. అదీ కోటి కొక్కరుంటారేమో?"
    "ఆ కోటిలో ఒక్కరు.....వీళ్ళెందుకు కాకూడదు?"
    "వాళ్ళిద్దరూ ఒక తల్లి బిడ్డలా?"
    "కారనుకో."
    "సునంద కూతుర్ని జాలిగా చూసింది.
    "మరి ఆ రాత్రి జరిగిన సంఘటన సంగతేమిటి?"
    "ఏ సంఘటన?"
    "అదే___గౌతమ్ బెంగుళూరులో ఉన్నాడు. ఇక్కడ నేను చూశాను."
    సునంద ఆలోచనలో పడింది.
    "ఇందూ! ఆ రోజు నువ్వు చూసిందికూడా గౌతమ్ నే."
    "అతను మైసూర్-బెంగుళూర్ మధ్య...."
    "అతడు ఆ సాయంత్రమే ప్లేన్ లో వచ్చి ఉండొచ్చు. ఈ ఊరినుంచే ఫోన్ చేసి ఉండొచ్చు."
    "కాదు మమ్మీ. గౌతమ్ బెంగుళూరు నుంచే చేశాడు ఫోన్."
    "దానికి దాఖలా ఏమిటి? ఆ తరవాత ఎంక్వయిరీ చేశావా?"
    "లేదు." ఇందుమతికి ఎక్కడికో లోతు తెలియని అగాధంలోకి జారిపోతున్నట్టుగా ఉంది.
    "గౌతమ్ ఇద్దరిలా నాటకం ఆడుతున్నాడన్నమాట."
    "అందువల్ల ప్రయోజనం?" అగాధంలోకి జారిపోతున్న ఇందుమతికి మెట్టు చేతికి దొరికినట్టు అనిపించింది.
    "అదో క్యారెక్టర్. కొందరు కొన్ని పనులు ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియదు. నాకు అనుమానంగా ఉంది."
    ఇందు చేతికందిన మెట్టు జారిపోయింది.
    "ఏమిటి మమ్మీ!" మెట్టు అందుకొనే ప్రయత్నం.
    గౌతమ్ ది స్పిట్ల్ పర్సనాలిటీ ఏమోనని."
    "మమ్మీ!" గావుకేక పెట్టింది ఇందుమతి.
    సునంద కూతుర్ని రెండు చేతులతో దగ్గరకు తీసుకుంది.
    "ఇందూ.....ధైర్యంగా ఉండు." తల నిమురుతూ అన్నది సునంద.
    "మమ్మీ, పోలీసు రిపోర్టు ఇచ్చావా?"
    "ఇచ్చాను."
    ఇందుమతి మాట్లాడలేదు.
    "ఇందూ!"
    "ఏం మమ్మీ!"
    "నేను తప్పుపని చేశానా?"
    "నాకు అర్ధం కాలేదు. ఏ విషయంలో అడుగుతున్నావ్?"
    "పోలీసు రిపోర్టు ఇచ్చి తప్పు చేశానా?"
    "లేదు మమ్మీ! మంచి పనే చేశావు. చెయ్యాల్సిన పనే చేశావు" అన్నది ఇందుమతి.
    ఇందుమతి కంఠంలో పలికింది వ్యంగ్యమో, బాధో సునందకు బోధపడలేదు.
    
                                                         11
    
    "మరో కామాంథుడి రాక్షసత్వం.
    స్వయాన బావగారు (భర్త అన్న) మరదలి మీద అఘాయిత్యం. ఆమె వట్టి మనిషికాదు. ఆరునెలల గర్భవతి. పరువుగల కుటుంబంలో జరిగిన ఘోరం ఒంటరిగా  ఉన్న మరదల్ని తన కామానికి బలిచేసిన రాక్షసుడు. ఆమె పేరు అరుణ. అతడి పేరు చాలామందికి తెలిసిన పేరే. అతడు క్రికెట్ ప్లేయర్. పేరు గౌతమ్. నగరంలో ఒక పెట్రోల్ బంకుకూ, ఆటోమొబైల్ వర్క్ షాపుకూ యజమాని. అతడు పరారీలో ఉన్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు.
    అరుణ ఆసుపత్రిలో ఉంది. ఆమె ఇంకా షాక్ నుంచి కోలుకోదని తెలుస్తోంది. ఇన్ స్పెక్టర్ పిచ్చయ్య కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. కేసు వివరాలు ఇంతకంటే తెలుయడం లేదు.
    ఉదయం కాఫీ తాగి ఇందుమతి దినపత్రిక తీసుకుంది. మొదటి పేజీలో కొట్టొచ్చినట్టుగా ఉన్న వార్తమీద ఆమె చూపులు నిలిచాయి.
    వార్త చదివిన ఆమె ముఖం కందగడ్డలా అయింది. యాంత్రికంగా చివ్వున లేచి నిల్చుంది. పత్రికను టేబుల్ మీద విసిరి కొట్టింది. గదిలో అటూ ఇటూ ఉసిగా పచార్లు చేసింది. ఠక్కున ఆగి కుర్చీలో కూర్చుంది.
    ఇందుమతి తలలోని నాళాలు చిట్లడానికి సిద్దంగా ఉన్నాయి.
    కణతలు రెండుచేతుల చూపుడు వేళ్ళతో నొక్కిపట్టుకుంది కొద్ది క్షణాలు.
    మళ్ళీ పేపరు చేతిలోకి తీసుకుంది. మళ్ళీ మళ్ళీ ఆ వార్త చదివింది ఇందుమతికి ఇన్స్ పెక్టర్ పిచ్చయ్య మీద కోపం వచ్చింది. పత్రికల వాళ్ళ మీద కోపం వచ్చింది.
    ఆమెకు కోపం వచ్చింది వార్త వేసినందుకు కాదు.
    నిందితురు ఎవరో రుజువు కాకుండానే పేరు ప్రచురించినందుకు రేప్ జరిగిన రోజుకు ముందు రోజే ఊరికి వెళ్ళిన వ్యక్తిని పరారీలో ఉన్నట్టుగా చిత్రించినందుకు. పబ్లిక్ జీవితం ఉన్న యువకుడి మీద ఇంత దారుణమైన అపరాధం మోపే ముందు పూర్తిగా ఇన్వెస్టిగేట్ చెయ్యనందుకు.
    అన్యాయం!
    అక్రమం!
    పాపం! గౌతమ్ ఆ వార్త చదివితే ఎంత బాధపడతాడో? అసలే సెన్సిటివ్. మళ్ళీ ప్రజల ముఖం చూస్తాడా? ఈ ఊరు తిరిగి వస్తాడా రాకపోతే? అతడే అపరాధి అని అందరూ భావిస్తారు. కేసు మరీ బలపడే అవకాశం ఉంది.

 Previous Page Next Page