"అవును దయ్యాలు లేవు ఉండటానికి వీల్లేదు అనుకోని కళ్ళు తెరిచాడు. అతనికేమీ కనిపించలేదు. మాములు మనిషి అయినాడు. తన భ్రమకు తనే నవ్వుకున్నాడు. లేచాడు. నీళ్ళు తాగాడు. పడుకున్నాడు. ఆలోచనలను అవతలకు నెట్టి నిద్రపోవాలనుకున్నాడు.
మనసు చిత్రమైంది. అది ఎన్నైనా వింతలూ చేయగలదు.
రామయ్య పడుకున్నాడనే గాని మళ్ళీ నిద్ర రాలేదు. వీరభద్రం కనిపించాడు. వీరభద్రం మీద నెట్టాడు తాను చేసిన పాపం! కాకుంటే తననే బద్నాం చేయచూస్తాడా? ఒకే మాటతో లొంగిపోయాడు, ప్రజలు తన చేతిలో ఉన్నారు. కాదు తన డబ్బు చేతిలో ఉన్నారు. తాను ఆడించినట్లా ఆడాల్సిందే. ప్రతివాడూ డబ్బు చేతి కీలుబొమ్మ! డబ్బు లేకున్నా ఆడించాడు వీరభద్రం. ఆడించడం ఏమిటి వణికించాడు. ఆకాలం పోయింది. ఇది ధనస్వామ్యం. డబ్బుతో ముడిపడిన కాలం. అందుకే వీరభద్రాన్ని అంత తేలిగ్గా ఓడించగలిగాడు. కానని పాపం మంగమ్మేం చేసింది? మంగమ్మ! మంగమ్మ అతని ముందు ప్రత్యక్షం అయింది. ఆమె చేతుల్లో బిడ్డ వున్నాడు. బిడ్డ? తన బిడ్డ! తన బిడ్డనే దూరం చేసుకున్నాడు. హృదయంలో ఎక్కడో మమత మేల్కొన్నది. గుండె కొద్దిగా కరిగింది. తన బిడ్డ వేరే వాని బిడ్డగా పెరుగుతాడు! వేధన మనసులో చోటు చేసుకుంది.
"వీడు నీ బిడ్డడు కాదా!"
"నాకు అన్యాయం చేస్తావా?" మంగమ్మ పలికింది.
రామయ్య గుండె రాయి అయింది.
"కాదు, కాడు , కాడు నడువ్ ఇక్కడి నుంచి ' కేకవేసి కళ్ళు తెరిచాడు. ఈ తడవ గుండె దడదడ లాడలేదు. ఏదో చిచ్చు మనసులో రగులసాగింది. మంగమ్మను తాను పట్టుకోవడం. ఆమె తల వంచుకోవడం , ఆవిడను గట్టిగా కౌగలించుకోవడం ఆమె అందం తన ఆనందం.
మంగమ్మ నగ్నంగా నుంచుంది.
తనను రమ్మంటుంది.
రామయ్య నరాలు బిగిశాయి. రక్తం వేగంగా ప్రవహించింది. నరాల్లో చిచ్చు రగిలింది. కల్లు పొగలు, సెగలు కక్కాయి. ఇంద్రియాలు వశం తప్పాయి. మనసుకూ, మెదడునూ, అన్నింటినీ గెలిచాయి. రామయ్య భరించలేకపోయాడు. సుమతిని ఏ దశలోనైనా పట్టాలను'కున్నాడు.
గది తలుపు తెరిచాడు.
బయట పడ్డాడు.
అర్ధరాత్రి దాటింది. అంతా అంధకారం. అలికిడి లేదు. అంతా నిద్రలో ఉన్నారు. బంగాళా బావురుమంటుంది. సాగిపోతున్నాడు. రాముడు అంధకారంలో . అంధకారం అతని బంధువు. అందుడుగా సాగిపోతున్నాడు. ఆరని తాపంతో ఉ రుకుతున్నాడు.
సుమతి గది దగ్గరికి చేరాడు.
ఆమె నిద్రపోవడం లేదు. ఆమె ఏడుస్తుంది. ఎవరికీ వినిపించకుండా ఏడుస్తుంది. కుమిలి కుమిలి ఏడుస్తుంది.
రామయ్య గదిలో దూరి తలుపేశాడు.
సుమతి దిగ్గున లేచి కూర్చుంది.
ఆమె కళ్ళు మిలమిలా మెరుస్తున్నాయి.
రామయ్య ఆమెను సమీపించాడు.
ఆమె లేచి నుంచుంది.
రామయ్య బుసలు కొడుతున్నాడు - మీదికి ఉరికాడు.
ఆమె తప్పుకుంది - "అరుస్త" అన్నది.
"నువ్వు నా పెళ్ళానివి. అరువు చూస్త ఎవడోస్తడో?" అని నోరుమూసి ఆమెను లాక్కొచ్చి మంచంలో పడేశాడు.
ఎలుకను పిల్లి పట్టినట్టు పట్టాడు. దాహం తీర్చుకున్నాడు.
ఆమెకు కడుపులో తిప్పుతుంది. ఆమె అతన్ని నెట్టేసింది. తల ఓరగా పెట్టి భల్లున కక్కినది.
గది సాంతం గలీజు అయింది.
పిలిసిన వాసనతో నిండిపోయింది.
రామయ్య ప్రతిమలా నుంచుండిపోయాడు.
ఆమె లేచి మూతి తుడుచుకొని దూరంగా నుంచుంది. ఆమె కళ్ళలో భయం నాట్యమాడింది.
"ఎందది?' రామయ్య అడిగాడు.
"నా కెమెరక?"
" నా అర్రలకు పోదాం రా"
ఆమె బెదురు చూపులు చూసింది.
అతడు ఆమెను లాక్కుపోయాడు.
తెల్లవారింది. రామయ్యకు బాగా పొద్దెక్కిన తర్వాత గాని తెల్లవారలేదు. అతడు లేచాడు. సుమతిని చూచాడు. ఆమె వాడిపోయిన తామరపువ్వులా కనిపించింది. నలిగిన మల్లెలా ఉంది. మబ్బుచాటు వెన్నెలలా ఉంది.
రామయ్య ఆమెను చాలాసేపు చూచాడు - ధ్యాసగా చూశాడు - ధ్యానంగా చూచాడు. అంత యిదిగా ఆమెను ఎప్పుడూ అంతవరకు చూడలేదు.
సుమతిలో అందం ఉంది. ఆకర్షణ ఉంది. ఏదో ఠీవి ఉంది. ఎందుకో లోన్గినట్లాయినాడు. రామయ్య ఓడినట్లయినాడు. అతనికి తెలియకుండానే సుమతి అతనిలో అంతర్భాగం అయిపొయింది.
రామయ్య ముఖం మీద పడిన ఆమె ముంగురులను సవరించాడు. దుప్పటి సరిగా కప్పాడు. గది బయటకు వచ్చాడు.
రామయ్య చాయ్ తాగుతున్నప్పుడు గది కడుగుతున్న చప్పుడు వినవచ్చింది. అవును ఆ గదిలోనే సుమతి వాంతి చేసుకుంది. సుమతి వాంతి ఎందుకు చేసుకుంది? ఆలోచనే అతనిని ఎవరో ఫెళ్ళున కొట్టినట్లనిపించింది. సుమతి కడుపుతోవుందా? వేవిళ్ళు కావుకదా? కాకుంటే రాత్రి గదిలోకి ఎందుకు రాలేదు? తనకు దూరంగా దూరంగా ఎందుకు నిలిచింది. ఏదో అనుమానం? అతన్ని వేధించింది. ఏవేవో వెర్రి వెర్రి ఊహలోచ్చాయి. ఇంతలో సుమతి కనిపించింది. ఆమెను చూచాడు. నిదానంగా చూచాడు. అలా కావడానికి వీల్లెదనుకున్నాడు. ఏదో నలత అయ్యూంటుందనుకున్నాడు. అంతే కావాలనుకున్నాడు. అయినా ఎక్కడో అనుమానం వేధిస్తూనే ఉంది. ఎవరినైనా అడగాలనుకున్నాడు. యేమని అడగాలి/ ఛా - తన భార్య కడుపుతో ఉందా అని మందిని అడగాలా? ఎలాంటి స్థితి వచ్చింది! ఇతరులకు చెప్పుకోలేడు. తనకు అర్ధం కాదు. ఎంత కాదనుకున్న ఏదో అనుమానం మనసులో కేలుకుతూనే ఉంది సుమతిని అడిగేస్తే? యేమని అడుగుతాడు? అయితే ఏం చేయాలి? అతనికి ఏమీ తోచలేదు. ఏదో గందరగోళంగా ఉంది మనసులో. వెలుగు కనిపించడం లేదు. అంతా అయోమయంగా ఉంది.
"దొరా! దండం పెడ్తా"
రామయ్య అటు చూశాడు. ఒక గుంపు తనకోసం వచ్చింది. వారిని చూసి నవ్వుకున్నాడు రామయ్య. పూర్వం దొర దగ్గరికి ఇలాగె వచ్చేవారు. అక్కడే నుంచునేవారు. తాను కూర్చున్న స్థానంలోనే దొర ఉండేవాడు.
"ఏందిర ఎల్లిగ! మందను ఎంటేసు కొచ్చినవు?"
"రాకుంటే ఎల్తాది? బాంచను. గాలి వానచ్చి ఇండ్ల కొట్టుకుపోయినాయి. కాల్మొక్త'"
"అయితే ఏం చేయమంటావ్? బవంతులు కట్టియ్యమంటావా?"
'అంత మాటంటం దొర! బవంతులు బంగ్లాలు దొరలకు. మా కెందుకు బాంచెను. ఏదో గుడిసెలు కప్పుకుంటామని అడిగేటందుక్కు వచ్చినం!"
"కప్పుకోండి మల్ల నన్నేంది అడిగెడిది?"
"ఊరికి దొరల అడగకుండ ఎట్ల చేస్తాముండి. ఇండ్ల కప్పులు ఊడి కొటుకపోయినాయుండి."
"ఏం చెయ్యమంటవు మరి నన్నిప్పుడు?" విసుగు ధ్వనించింది.
"ఏం లేదు బాంచను గరీబోల్లం. లగ్గనికని పందిళ్ళు గిట్ట యేయించిన్రు గద! ఆ తాటాకు గట్ల ఇస్తే గుడిసెలు కప్పుకుంటం ,దరమ దొరలు"
"అక్కరపడ్తే నా దగ్గర కొస్తరు. ఒట్లేమో అడయేస్తారు. యియ్యను పందిట్లనే ఉంటయి పోరి"
వచ్చిన వాళ్ళంతా తలలు వంచుకున్నారు. క్షణం మౌనం వహించారు. తరవాత యల్లయ్య గునిశాడు. "అట్లంటే ఎట్ల దొర! ఓట్లు మాల మాదుగులమే వేసినాముండి? దయ దల్చకొంటే ఎట్ల బతుకుతం? మీ కాళ్ళ కాడ పడుండేటోల్లం."
"ఇయ్యనంటే యియ్యను. ఏం జగ్గయ్య గుడిసె పీక్కోరాదుండి. నా దగ్గరికి రాకుంటే"
జగ్గయ్య అనే మాట వినగానే అంటా తలలు వంచుకున్నారు. ఒక్కడూ మాట్లాడలేదు. క్షణం తర్వాత అందరూ తిరిగి వెళ్ళిపోయారు.
రామయ్యకు ఏదో అవమానం జరిగినట్లు అనిపించింది. అంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోతారా జనం? అంతా తనను నిర్లక్ష్యంగా చూస్తున్నారు. సుమతి కూడానా? మళ్ళీ సుమతి వాంతి గుర్తుకు వచ్చింది. మళ్ళీ ఏవేవో వెర్రి వెర్రి ఆలోచనలు వచ్చాయి. అనుమానాలు పుట్టలోని పాముల్లా తల బయటికి పెడ్తున్నాయి. లోనికి లాక్కుంటున్నాయి. అవుననుకుంటాడు ఒకసారి. కాదనుకుంటాడు మరోసారి. ఒకసారి మంగమ్మ కనిపిస్తుంది ఒకసారి సుమతి ప్రత్యక్షం అవుతుంది. అసలు విషయం అర్ధం కాదు. అనుమానం పీడిస్తుంది. అనుమానం అపూర్వమైన అగ్ని. అది లోపల్లోపలే మనిషిని కాలుస్తుంది. కొంపలు కాలుస్తుంది. ఆ నిప్పు చరచర లాడుతుంది. రామయ్యలో చితాచిత మండుతుంది. మనసు సరిగా లేదు. మనిషి సరిగా లేడు. సుమతిని అడిగితె ఏం తప్పా? ఆమె తన భార్య అనుకున్నాడు . విషయం తెల్చుకోవాలనుకున్నాడు. లేచి చరచరా గదిలోకి వెళ్ళాడు.