Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 31


    "ఎక్కు"
    "సీటు పెట్టు."
    "ఎవరో కాలు తొక్కేసారు బాబూ."
    అయ్యో నా గాజులు పగిలిపోయాయి."
    ఒకరి అరుపులకు మరొకరు పట్టించుకోవడం లేదు. బస్సులోకి దూరుతున్నారు.
    రామ్మూర్తి షడన్ గా వెనక్కి వచ్చాడు. ముందున్న వాడు అంత బలంగా వెనక్కి నెట్టాడన్న మాట.
    ఎక్కుతున్న జనాన్ని చూసి కండక్టర్ విసుక్కున్నాడు. డ్రైవర్ మాత్రం చిద్విలాసంగా సిగరెట్ తాగుతూ పొగవదులుతున్నాడు.
    రామ్మూర్తి ఒక్కసారిగా కాళ్ళల్లోకి బలం తెచ్చుకుని ముందుకు వురికాడు. ద్వారం దగ్గరికి వచ్చేశాడు. మెట్లు ఎక్కబోయాడు.
    అంతలో ఎవరో అతని చేయిపట్టుకున్నారు. విసుగ్గా వెనక్కి చూశాడు. జగదీష్, మనోహర్ నవ్వుతున్నాడు.
    ఒక్కసారిగా రామ్మూర్తికి నిస్సత్తువ కమ్మింది. కళ్ళు తిరుగుతున్నట్లనిపించింది, కాళ్ళు పట్టు తప్పాయి. మెదడంతా మొద్దుబారిపోయింది.
    కొంతసేపు అలానే నిలబడిపోయాడు.
    "ఏమిట్రా రామ్మూర్తీ! ఎక్కడికి?" జగదీష్ గట్టిగా ప్రశ్నించాడు.
    "తిరుపతికి."
    "ఇప్పుడా సాయంకాలం మన ప్రోగ్రామ్ మరిచిపోయావా?"
    "వచ్చేస్తాను.... మూడు గంటలకంతా ఇక్కడ వుంటాను."
    "వద్దు ఇప్పుడెళ్ళావంటే రావడం కుదరదు. అందునా ఈ రోజు ఆడికృత్తిక. తిరుపతిలో జనం బాగా వున్నారు. వచ్చేందుకు బస్సులు దొరకడం లేదట"
    "నిజమే కానీ అర్జెంట్ పని వుంది."
    "మనయూత్ క్లబ్ కంటే ఎక్కువా ఆ పని?"
    "అలా అని కాదు కానీ..."
    "కానీ లేదు.....అణాలేదు. నువ్వు వెళ్ళకు చాలా దూరంలోకి వచ్చేశాడు.
    "అదిగాదురా నీకు ఉదయమే చెప్పి ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తే, చెప్పా పెట్టకుండా తిరుపతికి చెక్కేస్తావా?" జగదీష్ నిలదీశాడు.
    "అదీ.... అదీ...."
    "ఇంకేం చెప్పకు సాయంకాలం మనమంతా గొల్లపాలెం వెళ్ళుతున్నాం అంతే చాలా లక్కీగా కనిపించావు. లేకుంటే మిస్ అయ్యేవాళ్ళం జగదీష్ కాపీ తాగుదామంటే ఇలా బస్టాండ్ కు వచ్చాం. మొదట కాఫీ తాగుదాం రా."
    ఇక వాళ్ళతో వాదించి లాభంలేదు. సాయంకాలంలోగా మరో ఎత్తువేసి గొల్లపాలెం వెళ్ళకుండా ఆగిపోవాలి. అక్కడికి పోతే ఇంకేమయినా వుందా?
    గొల్లపాలెం వెళితే ఏం జరుగుతుందో వూహించుకుంటూనే రామ్మూర్తికి వెన్నులోంచి చలి పుట్టుకొస్తోంది.
    మెల్లగా టీ అంగడికి వాళ్ళతోపాటు నడిచాడు.
    కాఫీ తాగాక అతన్ని ఇంటి దగ్గర దింపి ఎక్కడికీ వెళ్ళవద్దని మరీమరీ చెప్పి వెళ్ళిపోయారు జగదీష్, మనోహర్.
    నవనాడులూ కుంగిపోయినట్టు మంచంలో కూలబడిపోయాడు ఒళ్ళంతా అగ్గులు ఆరబోసినట్టు వేసిగా కాలిపోతూ వుంది. శ్వాస పీల్చడం కూడా కష్టమై పోతోంది.
    కాంతమ్మ భోజనానికి పిలిచిందిగానీ ఆకలి లేదని చెప్పి తప్పించుకున్నాడు. ఏదేదో ఆలోచిస్తూ అటూ ఇటూ దొర్లుతూ వుండిపోయాడు.
    సాయంకాలం నాలుగు గంటలప్పుడు లేచి కూర్చున్నాడు. తల నొప్పి ప్రారంభమైనట్లనిపించింది. శారదను పిలిచి కాఫీ కావాలన్నాడు. ఆమె ఏదో గొణుక్కుంటూ వెళ్ళి కాఫీ పెట్టి గ్లాసులో పోసి పట్టుకొచ్చింది.
    వేడి కాఫీ పడగానే ఒళ్ళు తేరుకుంటున్నట్లనిపించింది.
    గ్లాసు కింద పెట్టాడో లేదో జగదీష్, మనోహర్ ప్రత్యక్షమయ్యారు.
    "నిద్రపోయావా ఏమిటి? నాలుగైంది. లేచి ముఖం కడుక్కో." అని తొందర చేశారు.
    "జ్వరంగా వుంది" బలహీనంగా అన్నాడు రామ్మూర్తి.
    జగదీష్ చేయిపట్టుకుని పరిశీలించి "వేడిగా లేదే అయినా శెట్టమ్మ మందుల షాపులో టాబ్లెట్ కొందాం లే" అన్నాడు.
    ఇక తప్పులేదు రామ్మూర్తికి. భారంగా పైకి లేచి దొడ్లోకెళ్ళాడు మామూలుగా అయిదు నిమిషాల్లో తయారయ్యే అతనికి ఆ రోజు అరగంట పట్టింది.
    జగదీష్, మనోహర్ తో కలిసి యూత్ క్లబ్ దగ్గరికి వచ్చాడు.
    వీళ్ళకోసమే మిగిలిన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.
    మరోమారు కాఫీ లుతాగి అందరూ గొల్లపాలెం బయల్దేరారు.
    అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడింది.
    రైసు మిల్లు ఓనర్ వెంకట్రామయ్య ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళారు. విద్యుత్ దీపాలతో, అరటి చెట్లతో, బంధుమిత్రులతో కోలాహలంగా వుంది ఇల్లు. మాజీమంత్రి సుధాకర్ నాయుడు కోసం వాకబు చేశారు. రైస్ మిల్లు దగ్గరున్న ఔట్ హౌస్ లో వున్నారని చెప్పారు.
    దాన్ని వెదుక్కుంటూ బయల్దేరారు.
    రైసు మిల్లుకు పక్కగానే వుంది ఔట్ హౌస్. ముందంతా పచ్చిక బలిసి పచ్చటి తివాచీ పరిచినట్టుంది.
    వీళ్ళు వెళ్ళి రైసుమిల్లుదగ్గర నిలుచున్నారు.
    "అదే ఔట్ హౌస్ అక్కడే పార్టీ జరుగుతూ వుంటుంది. లోపలి నుంచి ఎవరైనా నువ్వు వచ్చావని, కలవాలనుకుంటున్నట్టు చెప్పు. రమ్మంటారు. నువ్వెళ్ళి మాట్లాడు" జగదీష్ చెప్పాడు.
    మౌనంగా తల ఆడించారు రామ్మూర్తి జ్వరం మరింత ఎక్కువైనట్టు కళ్ళలోంచి నీళ్ళు కారుతున్నాయి అతనికి.
    లోపలి నుంచి ఎవరైనా వస్తారేమోనని వెయిట్ చేస్తూ నిలుచున్నారు.
    మరో అయిదు నిమిషాలకు ఓ యువకుడు నీళ్ళ జగ్ పట్టుకుని బయటికివచ్చాడు. అతని ఆకారం చూస్తుంటేనే పనిమనిషి అని తెలిసిపోతుంది. జగదీష్ చిన్నగా చప్పట్లు చరిచి దగ్గరకు రమ్మన్నట్టు చేయివూపాడు.
    ఎవరు మీరన్నట్టు ఓసారి చూసి దగ్గిరకు వచ్చాడు అతను.
    "ఎవరండీ?"
    "మేము పక్కవూరి నుంచి వచ్చాం. సుధాకర్ నాయుడ్ని కలవాలి" మనోహర్ చెప్పాడు.
    "ఇప్పుడు కుదరదండీ లోపల...." అతను చెప్పడానికి సందేహించాడు.
    "మాకు అర్జెంట్ పని పడింది. పాపానాయుడు పేట రామ్మూర్తి వచ్చాడని చెప్పు వాళ్ళే రమ్మంటారు" జగదీష్ ధీమాగా అన్నాడు.
    "ఏం పేరండీ......"
    "పాపానాయుడు పేట రామ్మూర్తి."
    "అలానే చెబుతానండీ."
    అతను లోపలికి వెళ్ళబోతుండగా "లోపల ఏం చేస్తున్నారు వాళ్ళంతా?" అని అడిగాడు మనోహర్.

 Previous Page Next Page