Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 30


    "చాలా చిన్న పని. నీలాంటివారు చిటికెలో చేయొచ్చు. మన యూత్ క్లబ్ కు స్థలం కావాలి క్లబ్ కోసం ఓ బిల్డింగ్ కట్టారనుకుంటున్నాం. ఈ వి.ఎల్. డబ్ల్యు క్వార్టర్స్ పక్కనే ఎకరా పోరుంబోకు స్థలం వుంది దాన్ని క్లబ్ కు ఇప్పించాలి."
    రామ్మూర్తి జగదీష్ చెప్పిందంతా సావధానంగా విని "ఇంతేనా ఓ నిమిషంలో చేస్తాను. ఎమ్.ఆర్. ఓకు చెబితే సరిపోతుంది. వెంటనే పట్టాలిప్పిస్తాడు" అన్నాడు.
    "అది సరిపోదు. మేం ఇంతకముందే ఎమ్ ఆర్ ఓను సంప్రదించాం. ఆయన కుదరదన్నాడు. కొత్తగా పట్టాలిచ్చేందుకు బ్యాన్ వుందన్నాడు. మరీ స్పెషల్ కేసులైతే తప్ప పట్టాలివ్వటం లేదన్నాడు. చివరగా ఆయనే ఓ ఉపాయం చెప్పాడు. కలెక్టర్ కి చెబితే- ఆయన ఆర్డర్ వేస్తే వెంటనే పట్టా ఇచ్చేస్తానన్నాడు" మనోహర్ వివరించాడు.
    కలెక్టర్ తో మాట్లాడాలా? అయితే చిత్తూరుకి వెళ్ళాలన్నమాట. కానీ నాకు కలెక్టర్ తెలీదు."
    "ఆ విషయం మాకూ తెలుసు- మాజీ మంత్రి సుధాకరనాయుడికి కలెక్టర్  చాలా దోస్తీ అట. నాయుడు ఒక్కమాట చెబితే పని అయిపోతుంది. అందువల్ల నువ్వు మన క్లబ్ తరపున ఓ వినతి పత్రం సుధాకరనాయుడి కివ్వాలి. స్ట్రాంగ్ గా కలెక్టర్ కి చెప్పమనాలి."
    "అలానే చెబుతాను. ఏదీ అరిక్విజిషన్ లెటర్?"
    "తయారుచేశాం. ఇదిగో" జగదీష్ ఓకవర్ అందించాడు.
    రామ్మూర్తి అందులోని కాగితాలను బయటకు తీశాడు. అన్నింటినీ పరిశీలిస్తున్నాడు.
    "ఓకే. ఈ రోజే నేను సుధాకరనాయుడితో మాట్లాడతాను."
    "మేమూ నీతోపాటు వస్తాం. మనక్లబ్ తరపున అందరూ వచ్చి వినతిపత్రం ఇచ్చినట్టు వుంటుంది."
    రామ్మూర్తి గతుక్కుమన్నాడు.
    "ఇంత మంది ఎందుకు? మొదట నేను వెళ్ళి మాట్లాడుతాను. "కంగారును బలవంతంగా అణుచుకుంటూ చెప్పాడు.
    "మేం వస్తే మాత్రం ఏం?" మనోహర్ అడిగాడు.
    దానికి రామ్మూర్తి జవాబు చెప్పలేకపోయాడు.
    "ఏం లేదనుకో...." నీళ్ళు నమిలాడు అతను.
    "అందులో ఈ రోజు మీ పార్టీ పెద్దలంతా గొల్లపాలెం వస్తున్నారు. ఆ వూర్లోని వెంకట్రామయ్య రైస్ మిల్లు ఓపెన్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన సుధాకరనాయుడికి, భక్తవత్సలానికి, ఎం.ఎల్. ఏకి డిన్నర్ ఇస్తున్నాడు. సాయంకాలం వాళ్ళంతా గొల్లపాలెం వస్తున్నారు. వెంకట్రామయ్య రైస్ మిల్లులో డిన్నర్. నిన్నూ పిలిచారా?"
    వెంటనే జవాబు చెప్పలేకపోయాడు రామ్మూర్తి. నిజానికి ఆ డిన్నర్ గురించి అతనికి తెలీదు. కానీ తమ పక్కవూరికి వాళ్ళు వస్తున్న విషయం తనకు తెలియదంటే నామోషీగా వుంటుంది. అందుకే వెంటనే సమాధానం చెప్పడానికి తటపటాయించాడు.
    "నన్నూ పిలిచారు. ప్రయివేటు పార్టీ కదా వెళదామా వద్దా అనుకుంటున్నాను"
    "వెళదాం" ఎలానూ నిన్ను పిలిచారు. కాబట్టి ప్రాబ్లమ్ లేదు మనమందరం కనిపించి విషయం చెప్పి వినతి పత్రం ఇస్తాం. మేము వచ్చేస్తాం. ఆ తరువాత నువ్వు డిన్నర్ కు వుండు! అప్పుడు కలెక్టర్ కు చెప్పమని నాయుడ్ని అడుగు. ఈజీగా పని అయిపోతుంది."
    జగదీష్ ప్రపోజల్ కి అందరూ వంతపాడారు. తప్పనిసరి పరిస్థితుల్లో రామ్మూర్తి ఒప్పుకోవలసి వచ్చింది.
    "అలానే ఈవెనింగ్ వెళదాం"
    చుట్టూ వున్న యువకులంతా సంతోషంతో చప్పట్లు చరిచారు. యూత్ క్లబ్ కి అప్పుడే స్థలం వచ్చేసినంత సంబరపడిపోయారు.
    ఇక అక్కడ వుండలేకపోయాడు రామ్మూర్తి అయినా వెంటనే వచ్చేస్తే ఏమనుకుంటారేమోనన్న భావనతో కాసేపు అదీ యిదీ మాట్లాడాడు. ఆ తరువాత సాయంకాలం కనిపిస్తానని అందరి దగ్గరా శెలవు తీసుకొని యింటికి వచ్చాడు.
    మంచంమీద పడుకొన్నాడు. వళ్ళంతా వేడిగా తయారయింది. జ్వరం వచ్చేసిన ఫీలింగ్ కలిగింది. జలుబు కూడా ప్రారంభమయినట్టు అనిపించింది. వళ్ళంతా చెమటలుపట్టాయి.
    ఈ గండం నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తూ వుండిపోయాడు చాలాసేపు.
    వాళ్ళకి తెలియకుండా తిరుపతికి వెళ్ళిపోతే మంచిదనిపించింది. సాయంకాలం తనకోసం వెదికి కనపడకపోయేసరికి ప్రోగ్రాంక్యాన్సిల్ చేసుకుంటారు. సాయంకాలం వాళ్ళను తప్పించుకోవాలనుకుంటే తిరుపతికి వెళ్ళిపోవడమే ఉత్తమమయిన మార్గం అనిపించింది.
    పడక మీద నుంచి ఠక్కున లేచాడు రామ్మూర్తి.
    ఇంట్లోకి వెళ్ళి డ్రస్ మార్చుకున్నాడు.
    ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికో ఓ చోటుకి వెళ్ళడం మామూలు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఎక్కడికని అడగలేదు.
    చెప్పులేసుకుని నడవడం మొదలుపెట్టాడు.
    మరో ఐదు నిమిషాలకు బస్టాండ్ కు చేరుకున్నాడు.
    అటూ యిటూ బెరుగ్గా చూస్తూ నిలబడ్డాడు.
    జగదీష్ గాని మనోహర్ గాని యిటు రాకూడదని దేవుళ్ళందరికీ మొరపెట్టుకున్నాడు. బస్సు తొందరగా రావాలని మొక్కుకున్నాడు.
    యూత్ క్లబ్ సభ్యులెవరూ గుర్తించకుండా పేపర్ ను ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు.
    బస్సు వచ్చే టైం అయింది కనుక బస్టాండ్ కు జనం రావడం మొదలు పెట్టారు.
    రామ్మూర్తి మరింత జాగ్రత్తపడ్డాడు. ఓ మూలకి వెళ్ళి నిలుచున్నాడు. అటూ యిటూ దొంగ చూపులు చూస్తున్నాడు.
    దూరంగా బస్సు వస్తున్నట్టు శబ్దం వినిపించింది.
    జనం హడావిడిగా సర్దుకోవటం మొదలుపెట్టారు. రామ్మూర్తి పేపర్ ను మడిచి చంకన పెట్టుకున్నాడు. ఎవరూ గుర్తించకుండా జనం మధ్యలోకి చొరబడ్డాడు.
    బస్సు రొద మరింత స్పష్టంగా వినిపిస్తోంది.
    రెండు బస్సులకు పట్టే జనం వున్నారక్కడ ఎలాగైనా సీటు సంపాదించాలని అందరూ ముష్టియుద్దానికి తలపడడానికి సంసిద్దులవుతున్నారు.
    "అదిగో బస్సు."
    గుంపులోంచి ఎవరో గట్టిగా అరిచారు.
    అందరూ చూపులను సాగదీశారు.
    మలుపు తిరిగిన బస్సు  ఎర్రటి దుమ్ము రేపుకుంటూ వస్తోంది.
    రామ్మూర్తికి కంగారుగా అటూ ఇటూ చూసి జనం ముందుకొచ్చి నిలబడ్డాడు. వెనుక వాళ్ళు ముందుకు. ముందువాళ్ళు వెనక్కి నెట్టుకోవడం ప్రారంభించారు.
    బస్సు దుమ్మును ఛేదించుకుంటూ వచ్చి ఆగింది.
    ఒక్కసారిగా హాహాకారాలు మిన్నుముట్టాయి.

 Previous Page Next Page