Previous Page Next Page 
షా పేజి 30

 

    "ఓ...అయ్ సి........" అంటూ ఆలోచనలో పడిందామే.
    "పోనీ ఓ పని చేయండి. మీరూ ఆ హోటల్లోనే దిగి, వీలు దొరికినప్పుడు ఆ గదిని.....హోటల్ బాయ్స్ ద్వారా ........తెరిపిస్తే తేలిగ్గా పనవుతుందనుకుంటాను.'
    "అవునవును" ఆమె ఆలోచనకు ఆశ్చర్యపోతూ అంగీకరించాడతను. ఆమె ఇంత ఫాస్ట్ గా ఈ సమస్యను పరిష్కరిస్తుందనుకోలేదు.
    "ఏదేమయినా మీరు వీలయినంత త్వరలో ఇంటికెళ్ళిపోవటం మంచిది."
    "అలాగే నండీ! వస్తాను మరి! ఇవాళే "వైజాగ్ సీషోర్ ' హోటల్ కి మారిపోతాను. రేపు ఏదొక సమయంలో మిమ్మల్ని కలుసుకుంటాను."
    "సరే"
    అతను లేచి బయటికి నడిచాడు. అతనితో పాటు తనూ బయటకు నడిచింది భారతి. ఆమె పిన్ని కూడా రహస్యంగా వెనుకే వచ్చి తలుపు చాటున నిలబడింది.
    "గుడ్ నైట్" అన్నాడతను బయట నిలబడి.
    "గుడ్ నైట్" అందామె చిరునవ్వుతో.
    సృజన్ బస్ లో "వైజాగ్ కోస్ట్" హోటల్ చేరుకున్నాడు. ప్రోప్రయిటర్ బ్రాకెట్ చార్ట్ చూస్తున్నాడు సీరియస్ గా.
    "నేను రూమ్ ఖాళీ చేస్తున్నాను" అన్నాడు సృజన్.
    అతను చార్ట్ లోంచి తల పైకెత్తి చూసాడు.
    "ఓ మీరా-------మీ రూమ్ మేమే ఖాళీ చేసాము. అదిగో మీ సూట్ కేస్ అక్కడ పెట్టాము" అంటూ ఓ మూలగా ఉంచిన తన సూట్ కేస్ చూపించాడు.
    సృజన్ కి ఆశ్చర్యం కలిగింది.
    "నా రూము మీరే ఖాళీ చేయించారా?"
    "అవును"
    "ఎందుకని?"
    "ఇన్ స్పెక్టర్ గారు చెప్పారు........ఇంక మీరిక్కడ ఉండాల్సిన అవసరం లేదని."
    "అద్దె నేను కడుతున్నానా? ఇన్ స్పెక్టర్ కడుతున్నాడా?"
    అతను చార్ట్ చూస్తూ మాట్లాడుతున్నవాడల్లా చార్ట్ పక్కన పెట్టాడు.
    "అద్దె లేదు - గాడిద గుడ్డూ లేదు మర్యాదగా నీ సూట్ కేస్ తీసుకుని ఫో! ఎక్కువ మాట్లాడావంటే ఈ రెండు నెలలకూ నూట పాతిక రూపాయలు చార్జ్ చేస్తాను. పోనీలే గదాని ఇప్పుడు నువ్ కట్టిన యాభై రూపాయల అడ్వాన్స్ తో వదిలేస్తున్నాను.'
    సృజన్ ఇంక మాట్లాడలేకపోయాడు.తను అతనితో ఘర్షణ పడి లాభం లేదని తెలుసు.
    మళ్ళీ పోలీసులు , లాకప్పూ అన్నీ మాములే!
    సూట్ కేస్ తీసుకుని బయటికొచ్చాడతను.
    ఆటోలో హోటల్ వైజాగ్ సీషోర్ చేరుకున్నాడు. పగటికంటే కూడా ఇప్పుడు మరింత సందడిగా , మరింత రద్దీతో నిండిపోయింది. విదేశీ నౌక సిబ్బంది చాలా మంది కూర్చుని వున్నారు సోఫాల్లో. వాళ్ళ పక్కనే తను ఉదయం చూడని మరికొంతమంది యువతులు మరింత రివీలింగ్ చీరతోనూ, జాకెట్లతోనూ కూర్చుని వున్నారు.
    సృజన్ ను చూడగానే ఓ యువతి లేచి వచ్చింది నెమ్మదిగా ------ సమీపంగా వచ్చి చిరునవ్వు నవ్వింది సృజన్ ఆమెను పట్టించుకోకుండా కౌంటర్ దగ్గరకు నడిచాడు. మాములుగానే కౌంటర్ దగ్గర వ్యక్తీ చుట్టూ నలుగురయిదుగురు బాయ్స్ నిలబడి వున్నారు.
    "రూమ్ నెంబర్ ఫోర్ వెకేటేడ్ సార్" అంటూ తాళం చేతులు పడేశాడో కుర్రాడు.
    "అయితే అదిగో! అక్కడ ఆ జపానోళ్ళు వున్నారు వాళ్ళ కిచ్చెయ్ అది......." అన్నాడతను.
    ఆ కుర్రాడు తాళం చెవులు తీసుకుని సోఫాల్లో కూర్చున్న ఇద్దరు జపాన్ యువకులను పిలుచుకెళ్ళిపోయాడు.
    "రూమ్ నెంబర్ ఎలివెన్ లో వాళ్ళకు అర్జెంటుగా వెయ్యి రూపాయలు కావాలంటసార్! ఈ టేప్ రికార్డర్ ఎవరికయినా అమ్మి డబ్బిమ్మంటున్నారు ---" అన్నాడింకో కుర్రాడు. కౌంటర్ దగ్గర వ్యక్తీ ఆ టేప్ రికార్డర్ ని పరీక్షగా చూశాడు. తరువాత ప్లే నొక్కాడు. బోనీ- యమ్ లేటెస్ట్ ఆల్బం లో పాట వినిపించసాగింది. వెంటనే స్టాప్ చేశాడు మళ్ళీ .........
    "ఎంత కావాలంట."
    "వెయ్యి రూపాయలు కావాలంటూన్నారు సార్.'
    "అయిదొందలయితే యిస్తామని చెప్పు........."
    ఆ కుర్రాడు వెళ్ళిపోయాడు.
    సృజన్ కౌంటర్ మీదకు వంగాడు. "ఎక్స్ క్యుజ్ మీ."
    అతడు సృజన్ వేపు చూశాడు.
    "ఏం కావాలి?"
    "రూమ్ కావాలి!"
    "అతను సృజన్ వేపు పరీక్షగా చూశాడిప్పుడు.
    "రూమ్స్ ఏమీ లేవు?"
    "ప్లీజ్! ఉంటుందని ఇంతదూరం వచ్చాను" అన్నాడు బ్రతిమాలాడే ధోరణిలో.
    "లేదండీ ! ఒక్కటి కూడా ఖాళీ లేదు."
    "ఇంత రాత్రి వేళ ఇంకెక్కడికి వెళ్ళటం సాధ్యం కదండీ ప్లీజ్ ఈ ఒక్కరాత్రి ఏదొక రూమ్ ఇచ్చారంటే రేపు ఉదయం ఇంకెక్కడయినా రూమ్ చూసుకుంటాను.'
    "వీల్లేదయ్యా! లేదని చెప్తూంటే మీక్కాదూ! ఖాళీ లేదంటే లేదు. అంతే......."
    ఈలోగా లోపలికెళ్ళిన కుర్రాడు మళ్ళీ వచ్చాడు.
    "ఎడొందలు ఇమ్మంటున్నారండి! అయిదొందలు మరీ తక్కువంట."
    కౌంటర్ దగ్గర వ్యక్తీ మరోసారి టేప్ రికార్డర్ వేపు చూశాడు. దానిని ఓచేత్తో పట్టుకుని తన వెనుకే ఉన్న గది కర్టెన్ తొలగించాడు లోపల ఉదయం సృజన్ చూసిన బలిష్టమైన వ్యక్తీ మరో ఇద్దరు కూర్చుని పెకాడుకుంటున్నారు.
    "ఇదిగో ఈ టేప్ రికార్డర్ ఎడొందలంటున్నారు. పనికొస్తుందేమో చూడండి?" అంటూ వాళ్ళకు చూపించాడతను.
    ఓ నిమిషం తర్వాత వాళ్ళు దానిని తిరిగి అతనికి అందించారు.
    "తీసుకో! బాగానే వుంది" అన్నాడు ఓ వ్యక్తీ.
    "రేయ్! ఇది తీసుకెళ్ళి మన గదిలో అల్మారాలో పెట్టేయ్-------" అంటూ ఇంకో కుర్రాడికి టేప్ రికార్డర్ తో పాటు టేబుల్ సొరుగులో నుంచి ఏడు వందలు రూపాయలు లెక్కపెట్టి ఆ కుర్రాడికిచ్చాడు.
    ఇంకా అక్కడే నిలబడి వున్న సృజన్ వేపు అప్పుడు చూశాడతను.
    "ఏమిటింకా ఇక్కడే వున్నావ్?" చిరాకుగా అడిగాడతను -------"రూమ్ లేదని చెప్పాను కదా?"
    సృజన్ చేసేది లేక వెనక్కు తిరిగాడు ........అప్పుడే మరికొంత మంది విదేశీయులు బిగ్గరగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ లోపలి కొచ్చేసరికి అంతా కోలాహలంగా తయారయిపోయింది.

 Previous Page Next Page