అంత రాత్రిపూట
అటువేపు నడుస్తూ వస్తోంది ఒక ముప్పయ్ ఏళ్ళ స్త్రీ!
కలలో నడిచి వస్తున్నట్లు వస్తోంది తను!
ఆ అమ్మాయి వంటిమీద స్పృహ వున్నట్లు లేదు.
చివరికి ఆ అమ్మాయి వంటిమీద నూలుపోగు కూడా లేదు!
పూర్తిగా నగ్నంగా ఉంది తను!
తన ఒంటిమీద బట్టలు లేనందుకు ఏ మాత్రం సిగ్గుపడుతున్నట్లు కూడా లేదు ఆ అమ్మాయి.
పైగా
"నాకెందుకు సిగ్గు! నన్ను ఈ స్థితికి తెచ్చిన ఈ లోకమే సిగ్గు పడాలి!" అన్నట్లు నిస్సగ్గుగా నడిచి వస్తోంది.
ఇంకా చెప్పాలంటే.
తను అసలు ఈ లోకంలో మనిషిలాగానే లేదు.
ఆ అడకుతురిని అలాంటి స్థితిలో చూడగానే గుండె నీరయిపోయినట్లు అయింది రాజాకి.
"ఒక నిముషం!" అని మీనాక్షితో చెప్పి గబగబ తన షర్టు విప్పేసి త్వరత్వరగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు రాజా.
"అమ్మా ! ఈ షర్టు వేసుకో!" అన్నాడు.
అతను మాట్లాడుతున్నదానిలో ఏ ఒక్క మాటా తనకి అర్ధంకానట్లు నిర్లిప్తంగా చూస్తూ, ఇంకో అడుగు ముందుకు వేసింది ఆమె.
అలా ఆమె ఒక్క అడుగు ముందుకు వెయ్యగానే, స్ట్రీట్ లైట్ వెలుతురు ఆమె మొహం మీద పడింది.
ఆమె మొహంలోకి చూశాడు రాజా.
తక్షణం -
కమ్చితో తనని ఎవరో కొట్టినట్లుగా ఉలిక్కిపడ్డాడు.
ఆమె మొహం మీద -
ఆమె పుట్టుకనే శపిస్తున్న బీజాక్షరాలలాగా నాలుగుక్షరాలు పచ్చబొట్టు పొడిచి ఉన్నాయి.
"ఇది దొంగ!"
కళ్ళార్పకుండా, నిశ్చేష్టుడయి , అలాగే చూస్తూ వుండిపోయాడు రాజా.
అతని మనసు మాత్రం కలవరిస్తోంది.
ఇది దొంగ! ఇది దొంగ! ఇది దొంగ!
ఎవరూ అలా ఆ పచ్చబొట్టు ఆమె మొహం మీద పొడిచింది?
ఎవరూ ఆమెకి శాశ్వతంగా దొంగ అని అలాంటి ముద్ర వేసింది?
ఎవరా మృగం?
అంత ఘోరాపరాధం ఏమి చేసింది ఈమె?
రాజా అలా కొయ్యబారిపోయి చూస్తుండగానే, "సరోజా!" అని వినబడింది ఒక గొంతు.
చటుక్కున తిరిగి చూశాడు రాజా.
అక్కడ -
లైటు స్తంభం క్రీనీడలో -
ముడుచుకుని కూర్చుని ఉన్న ఒక గుడ్డి బిచ్చగాడు. తెల్లటి గెడ్డం - గళ్ళ లుంగీ - టోపీ.
చూడగానే ముస్లిం అనిపించేటట్టు ఉన్నాడు.
సరోజా!" అన్నాడు ఆ బిచ్చగాడు మళ్ళీ.
తను ఈ లోకంలోనే లేనట్లు, శూన్యదృక్కులతో కదిలి వెళ్ళిపోబోతున్న ఆ నగ్నంగా ఉన్న స్త్రీ ఈ లోకంలో తను ఇంకా గుర్తు పట్టగలిగేది ఆ ఒక్క కంఠస్వరాన్నే అన్నట్లు చటుక్కున ఆగిపోయింది. నెమ్మదిగా తలతిప్పి, శూన్య దృక్కులతోనే ఆ స్వరం వినవచ్చిన దిక్కువైపు చూసింది.
"అన్నం తిన్నావా బేటీ!" అన్నాడు బిచ్చగాడు ఆమెతో ఆర్ధ్రంగా.
ఆ ప్రశ్న ఆమె మనసుకి ఎక్కినట్లు లేదు. జవాబు చెప్పకుండా స్తబ్దంగా నిలబడిపోయింది.
అంతలోనే -
ఆ గుడ్డి బిచ్చగాడు అక్కడ సరోజే కాక ఇంకెవరో మనుషులు కూడా ఉన్నారని గ్రహించాడు.
"ఎవరదీ?" అన్నాడు కోపంగా. ఆ పిల్ల మీద చెయ్యి వేశావంటే కాళ్ళిరగ్గోడతా! దయ లేదుట్రా! మీరు మనుషులు కారూ?"
రాజా తనే బలవంతంగా తన షర్టుని ఆమె భుజాల మీద కప్పాడు. తర్వాత, మృదువుగా ఆమె చేతిని పట్టుకుని, నడిపిస్తూ బిచ్చగాడి దగ్గరికి తీసుకెళ్ళాడు.
"ఇదిగో! నీ పేరేమిటి?" అన్నాడు.
:"నా పేరెందుకు బాబూ! నేను ఒక బిచ్చగాణ్ణి."
"బిచ్చగాళ్ళు కూడా మనుషులే కదా!"
"నేనూ మనిషిగా బ్రతికిన రోజుల్లో నన్ను మస్తాన్ అనే వాళ్ళు."
"మస్తాన్ మియా! ఈ అమ్మాయి ఎవరు?"
"పచ్చబొట్టు కనబడట్లా! అదొక దొంగ!" అన్నాడు మస్తాన్ కసిగా. కనబడని ఈ లోకం మీద పేరుకుపోయి ఉన్న కసి .అంతా ఆ గొంతులో వినబడుతోంది.
"దొంగలకి పేరూ ఊరు ఉండదా?" అన్నాడు రాజా మృదువుగా. "చెప్పు! ఏం దొంగతనం చేసింది ఈమె?"
రాజా గొంతులోని మార్దవం, నిజాయితీ మస్తాన్ కి అర్ధమయినట్లున్నాయి. కొంతసేపు మౌనంగా ఉండిపోయి, తర్వాత చెప్పడం మొదలెట్టాడు మస్తాన్.
"ఈ సరోజ కూడా నాలాగే ఒక బిచ్చగత్తే. బిచ్చగత్తే కాకముందు బాగానే బతికింది సరోజ! తండ్రి లేడు అయినా తల్లి అష్టకష్టాలు పడి సరోజకి పెళ్ళి చేసింది. ఆ తర్వాత ఆమె మంచం పట్టింది. సరోజ మీద కొత్త మోజు తీరక ఆమె మొగుడు మరింత కట్నం తెమ్మని వేధించి, తన్ని తగిలేశాడు. రోగంతో ఆమె తల్లి చనిపోయింది. తనని, సంవత్సరం దాటని తన కొడుకుని బతికించుకోవడానికిగానూ తన తల్లి పనిచేసిన ఇళ్ళలోనే తను కూడా కుదురుకుంది సరోజ. కానీ ఆడదానికి వయసు ఒక శాపం గదా! వంటలు రుచిగా చేసిపెట్టేది గాని, ఆ ఇళ్ళలో మగాళ్ళు ఇంకో 'ఆకలి' తీర్చడానికి మాత్రం సిదపడలేదు సరోజ. అందుకని ఇళ్ళలో పనులు మానేసి రోడ్డునపడింది. కూలి పని దగ్గర నుంచి ఎవరే పని చెప్పినా చేసేది.
అయితే ఏ సమస్యని టాప్;తప్పించుకోవడానికి తను ఇల్లు వదిలి రోడ్డు మీదికి వచ్చేసిందో అది ఇక్కడా తప్పలేదు.
ఆమె ఎక్కడ ఏ పని చేస్తున్నా , మొగాళ్ళ కళ్ళన్నీ ఆమె ఒంటిమీద ఉండేవి?
మొగాళ్ళకి వచ్చే కష్టాలన్నీ ఆడవాళ్ళకి వస్తాయి.
కానీ ఆడవాళ్ళకి ఎక్స్ ట్రా స్పెషల్ ఈ కష్టం ఇంకొకటి పెట్టాడు దేవుడు!
తనని తానూ రక్షించుకోవడం కోసం, అడ్డాలలో ఉన్న తన బిడ్డని బతికించుకోవడం కోసం వళ్ళు దాచుకోకుండా శ్రమపడేది సరోజ. కాని వళ్ళుమ్ముకోవడానికి ఇష్టపడలేదు.
అమె "అందుకు' ఒప్పుకోకపోవడం వల్ల మొగలోకం అంతా ఆమె పైన కక్ష కట్టినట్లు ప్రవర్తించేది. ఎవరూ ఆమెకి ఇవ్వవలసిన డబ్బులు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. పని కూడా ఒక రోజు దొరికేది. ఒకరోజు దొరికేది కాదు.
అలా ఉండగా ఒక దుర్దినాన-
ఆ రోజున ఆమెకి పని దొరకలేదు - అంతకు ముందు రోజున కూడా అంతే - చేతుల్లో బిడ్డ ఆకలికి ఓర్చుకోలేక నిలవనివ్వకుండా ఏడుస్తున్నాడు.
చివరికి -
చాలామంది ఈసడించుకున్నా పుష్టిగా వున్న ఆమె వంటిని ఇంకొద్ది క్షణాలు చూడవచ్చునన్న ఆశతో కొద్దిమంది "ధర్మాత్ములు" మాత్రం చిల్లరడబ్బులు చేతిలో పడేశారు ఆమె చేతిని తాకుతూ.
ఆ రోడ్డుమీదే ఒక పాల దుకాణం ఉంది. ఆ దుకాణం ముందే పెద్ద డేగిసాలో సతతం పాలు మరుగుతూ , మీగడ కట్టి వుంటాయి.
బిచ్చమెత్తుకున్న కాసిని డబ్బులతో కొద్దిగా పాలు కొన్నది సరోజ.
పాల దుకాణం వాడికి సరోజ మీద ఎప్పటినుంచో కన్ను. ఎన్నో విధాల "ట్రై" చేశాడు. సరోజ లొంగలేదు. ఇవాళ కొడుకు ఆకలి చూడలేక సరోజ అడుక్కోవడానికి కూడా సిద్ధపడడం అతను హుషారుగా గమనిస్తూనే ఉన్నాడు.
ఇంకాస్త దిగజారితే చాలు.
సరోజ తన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తుందని అతనికి తెలుసు!
అందుకని -
కొట్లోనే తనకి అసిస్టెంటుగా ఉండే కుర్రాడికేసి చూసి ఏదో సైగ చేశాడు.
సైగని అందుకున్న ఆ పధ్నాలుగేళ్ళ కుర్రాడు ఉత్సాహంగా లేచి, బయటికి వచ్చేసి, అదాటుగా తగిలినట్లుగా సరోజకి తగిలాడు. సరోజ చేతిలో రేకుడబ్బా ఉంది. అందులో పోయించుకుంది పాలు. ఉదుతూ చల్లార్చి పిల్లాడి నోటికి అందించబోతుంది.
ఈలోగా వచ్చి తగిలాడు కుర్రాడు.
డబ్బా కింద పడిపోయింది. పాలు దొర్లిపోయాయి.
అయ్యయ్యో! రూపాయిన్నర పాలూ నేలపాలె! అన్నాడు పాల దుకాణం వాడు కోరగా నవ్వుతూ.