'నీ కో నమస్కారం! ఇక వెళ్ళిరా!' అన్న భావం కనబడింది శశికి.
ఆమె చేతుల్ని తన రెండు చేతుల్లో పట్టుకుని "నీకంతా మంచే జరగాలి!" అంది శశి, కలవరిస్తున్నట్లు. 'నీకు పండంటి కొడుకు పుట్టాలి!' అనలేదు. 'ఇవి చేతులు కావు కాళ్ళనుకో! నన్ను క్షమించవూ!' అని ప్రార్దిస్తూ చేతులు పట్టుకున్నట్లు అనిపించింది శారదకి.
అంతా మవునమే!
సుళ్ళు తిరుగుతూ మనసుల్ని, మనుషుల్నీ మధించేస్తున్న మవునం!
ఒక అరటి పండు తాంబూలంలో పెట్టి శశికి అందించింది శారద. బొట్టు పెట్టింది.
"వీలుంటే ఒకసారి రా, శారదా! ఆరోగ్యం ముఖ్యం!" అని నవ్వుతూ చెప్పి బయటికి నడిచింది శశి. అమ్మగార్ని కారెక్కించడానికి వెంట వెళ్ళాడు శంకర్రావు.
కారు స్టార్టయిన శబ్దం వినబడింది.
లోపలి కొచ్చాడు శంకర్రావు, "అరె! ఇవాళ నుంచీ ఇంకో పాకెట్ పాలు ఎక్కువ కావాలని ఐలయ్యతో చెబుదామనుకుని మరిచే పోయాను. ఇవాళనుంచీ రాత్రిళ్ళు పాలు తాగు, శారదా! ఇప్పుడే వెళ్ళి చెప్పి వస్తా!" అంటూ గబగబ వెళ్ళిపోయాడు శంకర్రావు-'పుత్రోత్సాహము తండ్రికి. లాలలా, డడడా, అని పాడుకుంటూ.
అలాగే నిలబడిపోయి వుంది శారద.
అప్పుడు చూసింది శశివదన మరిచిపోయిన పాకెట్ ని. పోలిథిన్ పాకెట్లో పాము చర్మంలాంటి డిజైన్ తో ఉన్న టై. బహుశా సుధీర్ కోసం కొని ఉంటుంది ఆమె. శారద కళ్ళు మూసుకుంది. ఏవేవో అర్ధం లేని ఆలోచనలు.
ఆ టై తన మెడకు ఉచ్చులా వేసి సుధీర్ బిగిస్తూ వుంటే శశివదన ఆ ముడి వదులు చెయ్యాలని ప్రయత్నిస్తూంది. ఇదేమీ అర్ధం చేసుకోలేని శంకర్రావు- ఇది వినోదంగా భావించి పగలబడి నవ్వుతున్నాడు. ఒళ్ళు చెమటలు పట్టాయి శారదకి.
"బా! బే! బా!" అని వినబడింది.
కళ్ళు తెరిచింది.
ఎదురుగా దుర్గ! ఆదుర్దాగా చూస్తూంది.
కళ్ళు తుడుచుకుంది శారద.
అప్పటికి బాగా చీకటి పడిపోయింది.
* * *
ఇంటికి వచ్చేసి బట్టలు మార్చుకోకుండానే అలాగే మంచంమీద పడుకుని, దిండ్ల మధ్య తల దాచుకుంది శశి. లైటు కూడా వేసుకోలేదు. రెండుగంటలసేపు అలా పడుకునే ఉంది.
"అమ్మా!"
"......."
"అమ్మా!" వంటవాడు గోపాల్ పిలుస్తున్నాడు.
"ఏమిటి?" అంది దిండు లోంచి తల బయటికి తియ్యకుండానే.
"భోజనం వడ్డించాల్నా?
"అయ్యగారు రానీ!"
అతను వెళ్ళిపోయాడు.
ఇంకో అరగంట గడిచాక వచ్చాడు సుధీర్.
ఒక్క క్షణం చీకట్లోనే నిలబడి మంచం మీద బోర్లా పడుకుని వున్న శశిని చూశాడు.
అలికిడికి శశి కదిలింది.
"శశి?"
"వచ్చేశారా?"
"చీకట్లో పడుకున్నావేం?"
"వూరికే అలా పడుకుంటే నిద్ర పట్టేసింది. సినిమా బాగుందా?" అంది లేచి, పమిట ఒకసారి తీసేసి, సరి చేసుకుని భుజంమీద వేసుకుంటూ.
"చాలా ఎగ్జయిటింగ్ గా వుంది" అన్నాడు సుధీర్, భావగర్భితంగా ఆమెని చూస్తూ.
"ఏయ్!" అంది శశి బెదిరిస్తున్నట్లు.
సినిమా కంటే ఎగ్జయిటింగ్ గా ఉన్న కుక్క చావు అతనికి గుర్తొచ్చింది.
కుక్క! దాని నోటి ముందు రక్తపు మడుగు!
"సినిమా కంటే ఎగ్జయిటింగ్ గా ఉన్నావు నువ్వు."
"అబ్బ!" అని నవ్వింది శశి. "అన్నీ ఉత్తమాటలే!" అంది బాత్ రూం కెళుతూ.
సోప్ తాలూకు మెత్తటి నురగ ఆమె చెంపలమీద కనబడి కనబడకుండా ఉన్న కన్నీటి చారికల్ని తుడిచేసింది గానీ, మనసులో ఉన్న దిగుల్ని తుడిచెయ్యలేకపోయింది.
తడితడిగా ఉన్న మొహాన్ని టర్కిష్ టవల్ తో తుడుచుకుంటూ అప్పుడే విరిసిన పువ్వులా సువాసనలు వెదజల్లుతూ వస్తున్న శశిని చూసి-నిన్ను కొరికి తినెయ్యాలని ఉంది" అన్నాడు.
"ముందు అన్నం తినండి." అంది నవ్వుతూ, డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచి.
"నిజంగానే నిన్ను కొరికేస్తాను. నమిలేస్తాను. మింగేస్తాను. నిజం! నా మాటలు నమ్మేట్లేదు నువ్వు!" ఆమెని చూస్తుంటే అతని చూపులు వాడిగా అయ్యాయి. "ఆఫ్రికాలో కొన్ని కాన్నిబాల్ జాతులున్నాయి తెలుసుగా! నిజంగా మనుషుల్నే తినేస్తారు! నిన్ను చూస్తుంటే ఇవాళ కాన్నిబాల్ నయిపోవాలనిపిస్తూంది నాకు." అంటూ చేతులు పంజాలా చేసి 'ఆవ్' అని పళ్ళు బయట పెట్టాడు. సున్నితంగా, బేబీ పౌడరు డబ్బాలో ఉండే శాటిన్ పఫ్ లా మృదువుగా ఉన్న ఆమె బుగ్గని కొరికి పట్టుకున్నాడు.