Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 30

 

    శారద ప్రశ్నార్ధకంగా చూసి అంతలోనే- "మీరా?" అంది సంభ్రమంగా, వెంటనే ఆమె మొహం నల్లబడిపోయింది.  

 

    అది గమనించింది శశి.
    
    "ఎలా వున్నావ్, శారదా? మళ్ళీ రాలేదే?" అంది శశి పలకరింపుగా నవ్వుతూ.
    
    తన ప్రశ్న తనకే అసహజంగా, అసహ్యంగా కనబడింది. బలైపోయిన పశువుని 'కులాసానా?" అని కుశల ప్రశ్న అడిగినట్లనిపించింది.
    
    'ఏం చెప్పాలా?' అని ఒక్కక్షణం ఆలోచించింది శారద. ఏం చెబితే బావుంటుంది? అంతలోనే అనిపించింది. 'ఆమె మొగుడు చేసిన ఘనకార్యానికి తను తప్పు చేసినట్లు తడబడటం ఎందుకు? జరిగింది చెప్పేద్దామా?" అనిపించింది.
    
    శశివైపు చూసింది.
    
    గచ్చకాయ రంగు పట్టుచీర, అందంగా కట్టుకుంది. మొహాన కుంకుమబొట్టు. మెడలో రెండు వరసల నానుతాడు. ఒక చేతికి వాచీ, ఇంకో చేతికి బంగారు గాజులు.
    
    మొహంలో కళ! కళ్ళలో దయ! పెదిమల మీద చిరునవ్వు!
    
    ఈమెతో కటువుగా మాట్లాడ్డం ఎవరికన్నా చేతనవుతుందా అసలు?
    
    "నాకు హాస్పిటలంటే చిన్నప్పటి నుంచీ భయం! అందుకే..." అంది శారద మెల్లిగా.
    
    "ఇంకా నయం! బూచాడంటే భయం అని చెప్పలేదు" అని నవ్వింది శశి. "ఏదీ చెయ్యి ఇలా ఇవ్వు!" అంది మృదువుగా- కానీ దృఢంగానే.
    
    తప్పనిసరిగా చెయ్యి అందించింది శారద.
    
    అదే సమయంలో చేతిలో ఖాకీగుడ్డ సంచీ పట్టుకుని శంకర్రావు వచ్చాడు.
    
    "అమ్మగారూ! మీరే వచ్చేశారా? శారదా! అమ్మగార్ని గుమ్మంలోనే నిలబెట్టేశావేమిటి? చాపవెయ్, మంచినీళ్ళు కావాలా అమ్మగారూ?" అన్నాడు కంగారు పడిపోతూ.
    
    నవ్వుతూ వారించింది శశి. "నువ్వూరికే హడావిడి చెయ్యకు. ఏమన్నా కావాలంటే నేనడుగుతాలే!" అంది.
    
    శంకర్రావు భక్తిగా తల ఊపి వంటింట్లో జొరబడి పోయి, 'పాలున్నాయా?' అని అక్కడ్నుంచే శారదకి సైగ చేస్తున్నాడు. ఆ సైగని అందుకుని దుర్గకి ఇంకో సైగ ద్వారా అందజేసింది శారద. దుర్గ పాలు తెచ్చే ప్రయత్నం మీద అక్కడ నుంచి వెళ్ళిపోయింది నిశ్శబ్దంగా.
    
    శారద చాప పరిచింది. ఒక చివర చేతిలో పట్టుకుని ఆమె చాప దొర్లించగానే, రెండో చివర సరిగ్గా లాగి చాపమీద కూర్చుంది శశివదన. ధనవంతులు బీదవాళ్ళ ఇళ్ళకి రాగానే వాళ్ళ మొహాల్లో కనబడే అలుసూ, విముఖత్వమూ, అతిశయమూ, శశివదన మొహంలో కనబడటం లేదు. చిన్నప్పట్నుంచీ తను అలాంటి కొంపల్లోనే పెరిగినంత మామూలుగా, గోడకి ఆనుకుని కూర్చుంది.
    
    శంకర్రావు ఆ నిమిషంలో ఆ ఇంట్లో ఉన్నాడు. మరునిముషంలో చౌకరకం స్వీటు అమ్మే దుకాణంలో కొద్దిగా కారప్పూసా, కొద్దిగా కోవా కొన్నాడు. ఆ తరవాత నిమిషంలో పాన్ షాప్ కెళ్ళి ఒక పది పైసల తమలపాకులూ, రెండు వక్కపొడి పొట్లాలూ కొన్నాడు. రెండు నిమిషాల తరవాత అరటిపండ్ల బండిలో రెండు అరటిపళ్ళు కొన్నాడు. వెరసి అయిదు నిమిషాల్లో ఈ పనులన్నీ ముగించుకుని, ఇంట్లో వాలి, ప్లేట్లో కారప్పూసా, కోవా సర్ది అమ్మగారికి అందించాడు. ఈలోగా పెరటి గుమ్మంలోంచి దుర్గ అరగ్లాసెడు నీళ్ళపాలు తెచ్చింది. కాఫీ కలిపి శశివదనకి అందించింది శారద.
    
    ఉన్నంతలో అమ్మగారికి మర్యాదలు చేయించాడు శంకర్రావు.
    
    "ఇవన్నీ వద్దంటే వినలేదు నువ్వు!" అని అతనితో ఆరోపణగా అని, మూడు నాలుగు రోజుల క్రితం చేసి, అదో రకమైన నూనె వాసన వస్తున్న కారప్పూస తినడం మొదలెట్టింది శశి - కుచేలుడ్ని సంతోషపెట్టడానికి అటుకులు తింటున్న కృష్ణుడిలా. ఆమె మొహం అసహ్యంగా పెట్టుకోలేదు. కొద్దిగా తిని, "నువ్వు కూడా తీసుకో, శారదా!" అని ప్లేటు ఆమె ముందుకి తోసింది.
    
    వద్దని తల వూపింది.
    
    "అబ్బో! చాలా కాలెండర్లు తగిలించారే! ఇదిగో! ఈ కాలెండరు కూడా కావాల్నా?" అంటూ షాపు వాళ్ళిచ్చిన కాలెండర్ రబ్బర్ బాండ్ విప్పింది. దానికున్న కొక్కాన్ని పట్టుకుని బొమ్మ అందరికీ కనబడేలా చూపించింది. అప్పుడు తను గూడా చూసింది.
    
    ముద్దొచ్చేలా ఉన్న చిన్న అబ్బాయి-బాబా సూట్ వేసుకుని, జేబులో చేతులు పెట్టుకుని ఠీవిగా నిలబడి ఉన్నాడు.
    
    అది చూడగానే కొద్దిగా చామనచాయగా ఉండే శారద మొహం నల్లబడిపోయింది.
    
    బాగా తెల్లగా ఉండే శశివదన మొహం ఎర్రబడిపోయింది.
    
    కాలెండర్ మీద ఆ బొమ్మ ఉంటుందని వూహించలేదు శశివదన.
    
    ఛీ! ఛీ!
    
    ఎంత తప్పు! ఎంత తప్పు! జరిగిపోయిన తప్పుని వేలెత్తి చూపిస్తున్నట్లుగా వుంది తను, ఈ కాలెండర్ ఇవ్వడం!
    
    ఏమనుకుంటుంది శారద? చూసింది.
    
    శారద బొమ్మలా బిగుసుకుపోయి ఉంది. ఆమె కళ్ళలో కొద్దిగా రోషం!
    
    దుర్భరమైన ఆ సన్నివేశాన్ని మళ్ళీ మామూలుగా మార్చింది శంకర్రావు అమాయకత్వమే!
    
    "అమ్మగారు మనకి అలాంటి కొడుకు పుట్టాలని దీవిస్తున్నారు. చెప్పేశాలే అమ్మగారికి! దణ్ణం పెట్టు" అన్నాడు పొంగిపోతూ. కొద్దిగా విసురుగా చేతులు జోడించి శశివదన వైపు చూసింది శారద.

 Previous Page Next Page