Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 31


    
    "నాకు ఆడపిల్లల పక్కన కూర్చునే అలవాటు లేదు."


    "అదేం! మరెక్కడ కూర్చుంటావ్?"


    "ఒళ్ళో కూర్చోవడం అలవాటు."


    "అదేం రోగం?"


    "తెలీడం లేదు ఏం చేస్తే పోతుందో!"


    "ఆ రోగాన్ని నేను వదిలిస్తాను"


    "ఏమో! ఒంటరివాడిని. నమ్మి నీతో వస్తున్నాను. ఏం చేస్తావో ఏమో?"


    ఆమె వస్తున్న నవ్వుని ఆపుకొంటోంది. కారు రేపు రోడ్డుమీద పరుగుదీస్తోంది.


    "గీతా!" పిలిచాడు అభినయ్.


    సీటు బ్యాక్ మీదనుంచి అతని చేయి ఆమె భుజం మీదకి జారింది. భుజాన్ని గుచ్చిపట్టుకున్నాడు.


    విండో స్క్రీన్ లోంచి రోడ్డు మీదకి చూస్తున్నాడు. అప్పటివరకూ వున్న చిలిపితనం అతనిలో ఒక్కసారిగా మాయమైంది.


    చెదిరి మొహం మీదికి పడుతోన్న కురులని చేత్తో వెనక్కి తోసుకుంటూ క్షణంపాటు అతనికేసి చూసింది.


    "ఏమిటి?" అడిగింది.


    "నిన్నొక్కమాట అడగనా?"

    
    "ఒక్కటికాదు, కోటి మాటలు అడుగు"


    అతను ఆమె మొహంలోకి చూస్తూ నవ్వాడు.


    "నన్నెందుకు విడిపించావు?" అడిగాడు.


    ఆ ప్రశ్నతో కారు సడెన్ బ్రేకు వేసి ఆపింది గీత.


    "నువ్వెందుకలా చేశావో తెలిశాక!" అంది గీత.


    "గీతా!" ఆమెను కొంచెం దగ్గరగా లాగాడు.


    "నిజంగా నీకు నామీద కోపంలేదా?" అడిగాడతను.


    అతని మొహంలోకి చూస్తూ వుండిపోయింది గీత.


    "నిజం చెప్పనా?"


    "అవును"


    గీత మొహాన్ని తిప్పుకొని బయటకు చూస్తూ-


    "ఆ క్షణంలో నిన్ను మర్డర్ చేయించాలనిపించింది అభీ!"


    "నువ్వలా అనుకోవడంలో తప్పులేదు. నిన్ను నవ్వులపాలు చేశాను కదా!"

    
    "కానీ సిద్దార్థ వచ్చి నాకు నిజం చెప్పాడు. ముందు నేను నమ్మలేకపోయాను. అప్పటివరకూ నువ్వంటే ఓ పోకిరీ అబ్బాయివన్న అభిప్రాయంలోనే ఉండిపోయాను అభీ!"


    నేను తొందరపడ్డానేమోననిపించింది.


    అప్పటికే పోలీసులు నిన్ను కొట్టారు.


    సారీ, సో సారీ అభీ!


    పోలీస్టేషన్ కి వచ్చాక నీ పూర్తి వ్యక్తిత్వం నాకర్ధం అయింది.


    నీవు పోకిరీవాడివి కావనీ లవర్ బోయ్ వని అర్ధం చేసుకొన్నాను.


    నాకు తెలియకుండానే ఆ క్షణంలో నా గుండె తలుపు తెరుచుకుంది.


    "లవ్ యూ! ఐ లవ్ యూ సోమచ్ అభీ! ఇప్పుడనిపిస్తోంది నిజంగా ఆ క్షణంలో నీకేమన్నా జరిగితే నేను నరకాన్ని అనుభవించేదాన్నో నీకు తెలీదు."


    ఆమె కళ్లల్లో నీటి పొరలు అలుముకొస్తున్నాయి.


    "నువ్వు నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నావా గీతా!"


    ఆమె భుజాన్ని గుచ్చిపట్టుకుని దగ్గరగా లాగాడు.


    ఆమె గుండె అంచు అతని చేతివేళ్ళకి తగులుతోంది.


    ఆమె గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఆమె ఊపిరి వెచ్చగా అతని మొహానికి తగులుతోంది.


    "అభి!  నా జీవితంలో మొదటిసారిగా ముద్దుపెట్టుకున్న మగాడివి నువ్వు. అది నేను బతికినన్నాళ్ళూ గుండె లోతుల్లోని పొరల్లో చెరగని ముద్రగా నిలిచిపోతుంది, మిగిలిపోయింది."


    ఆమె గొంతు కంపించింది. పెదవులు తడి అవుతున్నాయి.


    అభినయ్ ఆమె గెడ్డాన్ని పైకెత్తి ఆమె పెదవులమీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు.

    
    "ఇది రెండో ముద్దు" అన్నాడతను.


    "మొదటి ముద్దు ఇచ్చినవాడే రెండో ముద్దు ఇచ్చాడన్న తృప్తితో మనసంతా నిండిపోతోంది అభీ.....

    
    ఆమె అతని పెదవుల్ని అందుకుంది.


    క్షణం...... ఇంకో క్షణం...... మరో క్షణం..... క్షణాలు నిమిషాలు అయిపోయాయి."


    "నన్ను నువ్వు...... క్షమించవూ?" అడిగింది గీత


    "దేనికి?"


    "శృంగార నాయకుడికి కన్నెపిల్లగా నా మనసివ్వడానికి బదులు లాఠీ దెబ్బలు పడేలా చేసినందుకు" అన్నది గీత.


    "ఆ విషయం నేనెప్పుడో మరిచిపోయాను."


    "నన్ను మరచిపోవుగా?"


    అతను నవ్వాడు.


    "మరచిపోకుండా చేస్తాను. కారుని పోనివ్వు" అన్నాడు.


    ఆమె కారు స్టార్టు చేసింది.


    కారు బాణంలా బీచ్ వేపు దూసుకుపోసాగింది.


                                       18


    అభినయ్ కంగారుగా చూశాడు గీత కేసి.


    అది గమనించిన గీత కారు స్పీడుని మరింతగా పెంచేసింది. అభినయ్ కొంచెం గీతకి దగ్గరగా జరిగి కూర్చున్నాడు. 'నా స్పీడే అంత' అంది గీత.  'ఇంతేనా?' అన్నాడు అభినయ్. గీత ఏక్సిలేటర్ని మరింత బలంగా తొక్కింది రివ్వుమని గాలిలో ఎగురుతున్నట్లు పోతోంది కారు. "భయం వేస్తుందా?" అడిగింది. "భయం దేనికి? కళ్ళు మూసుకుని నిన్నువాటేసుకుని కూర్చుంటే నా పనిలో నేను పడిపోతాను" అన్నాడతను.


    అతని మాటలకి గీత కొంటెగా చూసి- "అబ్బ ఆశ!" అంది.


    "ఆశపెట్టి తీసుకెళుతున్నావు. ఏం చేస్తావో మరి?"


    "నేనేం చెయ్యగలను- ఆడపిల్లని" అంది గీత.


    "పోనీ నేనేం చెయ్యాలో చెప్పచ్చునుగా ఆ కార్యక్రమం ఎలా వుండాలో ప్లాన్ చేసుకుంటాను."


    "నీకు డ్రయివింగ్ వచ్చా?" అడిగింది గీత స్పీడుని తగ్గిస్తూ.


    "రాదు" చెప్పాడతను.


    గీత క్రీగంట చూసింది.


    "డ్రైవింగ్ రానివాడివని నాకు తెలిదే! ఇప్పుడెలా?" అంది.

 Previous Page Next Page