Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 30


    
    "ఇక్కడేనా!?" అతను చిలిపిగా అడిగాడు.


    "షటప్! బూతులు మాట్లాడితే పళ్ళు ఊడిపోతాయి. నేనిప్పుడు కాలేజీ ఎగ్గొట్టేస్తున్నాను. నువ్వు కాలేజీ బయట వుండు."


    "ఎందాకా?"


    "సముద్రం దాక!"


    "అంతదూరం దేనికి?"


    "నువ్వు మునగడానికి!" అల్లరిగా నవ్వేసి అక్కడ నించి పరుగు లాంటి నడకతో వెళ్ళిపోయింది గీత. అతను ఆమె వెళ్ళిన వేపే చూస్తూ నిలబడిపోయాడు.


    ఆమెలో ఇంతమార్పు ఒక్కసారిగా ఎలా వచ్చిందో అతనికి తెలీదు.


    అదే అడగాలనుకున్నాడు.


    ఇది గీతలో నిజంగా వచ్చిన మార్పా? లేక తనని పూల్ని చేయడానికి ఏదన్నా పథకం వేస్తుందా? కానీ అలా అనిపించడం లేదు.


    ఆడపిల్లల కంటిచూపుని చదవడంలో లయ నేర్పరి అతను.


    ఏది ఏమైనా ఆమె ఆహ్వానాన్ని అతను విడిచిపెట్టలేడు.


    గీత.....

    
    తనకోసం ఎదురుచూస్తూ వుంటుంది. వెళ్ళాలి.


    అతను గబగబా బయటకొస్తుంటే పూర్ణ బృందంతో ఎదురొచ్చాడు.


    "ఎక్కడికి హడావిడి?" అడిగాడు పూర్ణ.


    "సముద్రానికి" చెప్పాడు అభినయ్.


    "బీచ్ కా? దేనికి?" దాసు అడిగాడు.


    "మునగడానికి" అని మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా ముందుకు దూసుకెళ్ళిపోయాడు అభినయ్.


     "మనం కూడా వెళ్దామా?" అడిగాడు కమల్.


    "మనవాడు క్షీర సాగరమధనానికి వెళుతున్నాడు. మధ్యన మనం అడ్డుదేనికి?" పూర్ణ నవ్వాడు.


    అభినయ్ కి ముందుగా కొన్ని నిమిషాల క్రితం గీత రావడం, కారులో బయటికి వెళ్లడం పూర్ణ చూశాడు.


    ఇప్పుడు అభినయ్ బీఛ్ కని చెప్పడంతో గీతతో ప్రోగ్రాం పడిందని గ్రహించాడు. అందుకనే మిత్రుడు కమల్ మాటకి నవ్వాడతను.


    "పాపం క్షీర సాగరమధనం అంటే చాలా కష్టతరమైందీ, క్లిష్టమైందీ కదా! దానికెందరో సాయం పట్టాలి కదా! ఒక్కడి వల్ల అవుతుందో లేదో!" దాసు అన్నాడు.


    "మన సాయం వాడికి అవసరం లేదు లేరా! సాయపడే వాళ్ళని వాడు చూసుకునే వెళుతున్నాడు."


    "కానీ హాలాహలం పుడితే?" అనుమానంగా అడిగాడు సిద్ధార్థ.


    "సునాయాసంగా మింగేసి గరళకంఠుడు అవుతాడులే!" పూర్ణ నవ్వుతూ చెప్పాడు.


    "ఇంతకీ సాయం చేసేవాళ్ళు ఎవరో చెప్పలేదు?" కమల్ అడిగాడు.


    "గీత!" అక్షరాల్ని విరుస్తూ చెప్పాడు పూర్ణ.


    "అమ్మో గీతా!" భయంగా అన్నాడు దాసు.


    "ఏదన్నా గొడవ జరుగుతుందేమో! మనం కూడా వెళదాం రా!" కమల్ అన్నాడు.


    "మీరు బిగ్ ఫూల్స్ రా.


    వాళ్ళు గొడవ పడాలనే వెళుతున్నారు. మనం వెళ్ళినా పీత బోరియల్ని లెక్కపెట్టుకుంటూ కూర్చోవాలి."


    "ఏమో బాబూ! ఏం గొడవ పడతారో ఏమో! నాకైతే నీరసం వస్తోంది."


    "నీరసపడ్డాక వాళ్ళే వస్తారు. మనం సిద్దార్థగాడి గదికిపోయి మందు కొడదాం పదండి" అన్నాడు పూర్ణ.


                                     17


    కారుని నేరేడు చెట్టుకింద ఆపి అభినయ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది గీత.


    అప్పటికే పది నిమిషాలు గడిచినాయి.


    అభినయ్ జాడలేదు.


    చాలా విసుగ్గా, అసహనంగా వుందామెకి క్షణం గడపటం కష్టంగా వుంది.


    అతనెపుడెపుడొస్తాడా అనిపిస్తోంది.


    వస్తాడా?


    ఏమో! రమ్మని చెప్పి తనొచ్చేసిందే కానీ అతనేమీ చెప్పలేదు వస్తానని.


    వెళ్ళిపోయాడేమో!

    
    ఉహూఁ! అతనలా వెళ్ళిపోడని ఆమెకి అనిపిస్తోంది.


    నిజంగా తను పిలిస్తే రాని మగాడుంటాడా? మిర్రర్ లో తన మొహాన్ని చూసుకొంది.


    ఎంత అందం.


    తన అందానికి ఎందరో పిచ్చివాళ్ళవుతుంటారు డాడీకి భయపడి నోరెత్తదు కానీ, తన అసమాన సౌందర్యానికి తనే తలమానికలయిపోతూ అభినయ్ ని తన అందంతో కట్టిపడేయాలని నిశ్చయించుకుంది.


    అసలు అతనంటే తనెందుకిలా పడి చచ్చిపోతోందో ఆమెకే అర్థం కావడంలేదు.


    "అభినయ్!" ఆమె మనసులోనే అతని పేరుని ఉచ్చరిస్తోంది.


    ఏమంటాడో?


    ఏం చేస్తాడో?


    సిగ్గుతో ఆమె చెంపలు ఎర్రబడుతున్నాయి.


    మరో అయిదు నిమిషాల తర్వాత అభినయ్ ఏదో పాకెట్ పట్టుకొని కారు దగ్గరికి వచ్చాడు.


    అతన్ని చిరుకోపంతో చూసింది.


    "నీకసలు నిజంగా బుద్ధిలేదు.


    ఏ ఆడపిల్లతోనన్నా ప్రోగ్రాం పెట్టుకొన్నప్పుడు అమ్మాయికన్నా ముందుగా వచ్చి ఎదురుచూడాలి.


    ఆమాత్రం కూడా తెలీకపోతే ఎలా?" కారు డోర్ తెరుస్తూ అంది.


    "అక్కడ తినడానికి ఏమైనా పట్టుకొద్దామని వెళ్ళాను" అన్నాడు కారెక్కుతూ.


    "నువ్వు తెచ్చేవి నాకు సరిపోతాయనుకున్నావా? నేను నిన్నే తినేస్తాను" అంది.


    "బాబోయ్ అయితే నేను దిగిపోతాను" కారు దిగబోయాడు.


    గీత సన్నగా నవ్వింది.


    అతన్ని వెనక్కి లాగి అతని మీదగా వంగింది డోర్ వేయటానికి.


    ఆమె గుండెలు అతని మోచేతికి తగిలాయి క్రీగంట అతన్ని చూస్తూ.....


    "పిచ్చి వేషాలేయకుండా కూర్చో!" అని కారు స్టార్ట్ చేసింది గీత.


    కారు రివ్వున దూసుకెళుతుంటే గాలికి ఆమె జుట్టు ఎగురుతోంది. అతను కొంచెం ఆమె పక్కకి జరిగాడు.


    "ఏం స్వామీ! సీటు చాలలేదా! మీది మీది కొస్తున్నావు?" అడిగింది.


    అభినయ్ చేతిని ఆమె వెనుకగా సీటు బ్యాక్ మీద వేశాడు.

 Previous Page Next Page