Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 30

  

    "ఏం కావాలి?" అని ఆశ్రితని అడగబోయిన వశిష్ట స్టీవార్డ్ ని చూసి "ఓ అయిదు నిమిషాల తర్వాత రండి" అన్నాడు.
    
    "ఎస్సర్" అంటూ అదృశ్యమైపోయాడతను.
    
    అక్కడ చాలామంది తమనే గమనించడాన్ని చూసిన ఆశ్రిత ఇబ్బందిగా తలవంచుకుంది.
    
    "ఏమిటి అలా అయిపోయారు?" అన్నాడు ఆమెను మూడ్ లోకి రప్పించే ప్రయత్నం చేస్తూ...
    
    "అబ్బే..."
    
    "బహుశా అంతా మనల్నే చూస్తున్నారని మీకు తెలిసిపోయి వుంటుంది"
    
    "స్పష్టంగా కనిపిస్తూందిగా" అంది మృదువుగా నవ్వుతూ.
    
    "వాళ్ళెందుకళా చూస్తున్నారో తెలుసా?" అడిగాడు అతను సీరియస్ గా.
    
    "డ్యూటీలో వుండి గర్ల్ ఫ్రెండ్ తో షికార్లు చేస్తున్నాడనుకుంటున్నారేమో" కేజువల్ గా అనేసింది ఆమె.
    
    ఆమె గమనించలేదు అతడి ముఖంలో వేగంగా వచ్చిన మార్పుని.
    
    "అదొక్కటే కాదు ఆశ్రితా! హోటల్ సిబ్బంది ఇంత సిన్సియర్ గా రెస్పాండ్ చేసి డిసెంట్ గా సర్వ్ చేసినా చివర బిల్లు పే చేయకుండా వెళ్ళిపోతాడని కూడా"
    
    పంటి బిగువున నవ్వాపుకుంది.
    
    "ఆశ్చర్యపోకండి ఆశ్రితా! ఖాకీ బట్టల గురించి జనానికి వున్న అభిప్రాయం అది"
    
    అతడలా నిక్కచ్చిగా మాట్లాడ్డం ఆనందంగా వుంది.
    
    "బహుశా! ఖాకీ బట్టలూ అనేసరికి మీకు పోస్ట్ మెన్, కండక్టర్లూ గుర్తుకొచ్చారనుకుంటాను. వాళ్ళని కించపరచటం నా ఉదేశ్యం కాదు నేను చెప్పింది కేవలం మా పోలీస్ జాతి గురించి మాత్రమే"
    
    మృదువుగా నవ్వేసిన ఆమె "పిలిచింది నేను కాబట్టి బిల్లు నేను పే చేస్తాన్లెండి" అంది.
    
    "దయుంచి అలాంటి పని చేయకండి"
    
    "అదేం?"
    
    "నాతో మీకు ఏదో పనుండి ఇలా పార్టీ ఇచ్చారనుకునే ప్రమాదముంది."
    
    ఫకాల్న నవ్వేసింది ఆమె.
    
    ఎన్ని రోజులైంది ఇలా నవ్వగలిగి...
    
    ఈ వ్యక్తితో మాట్లాడుతుంటే ఇంత ఆహ్లాదంగా ఉందేమిటీ...
    
    "సైన్స్ ఇంకా డెవలప్ అయ్యుంటే ఎంత బాగుండేది?" అన్నాడు అతను టక్కున...
    
    విస్మయంగా అడిగింది "ఉన్నట్టుండీ సైన్స్ గురించి మాట్లాడుతున్నారేమిటీ?"
    
    "అవును ఆశ్రితా! అక్కడేముందో తెలుసుకోవటానికి అంగారక గ్రహం దాకా విస్తరించిన సైన్స్ అసలు మనిషి మనసులో ఏముందో ఎదురుగా వున్న వ్యక్తి మన గురించి ఏమనుకుంటూందో తెలుసుకునే అవకాశాన్నీ కల్పించి వుంటే ఇప్పుడు మీ అరనిముషం మౌనంలో నా గురించి ఏమనుకుంటున్నారో నాకు అర్ధమయ్యేదిగా."
    
    అతడి మాటలు, కలుపుగోలుతనం హృదయపుష్పపు రేకురేకునీ తడిమి అలజడిని రేపుతుంటే "నేను మీ గురించి చెడుగా ఏమీ అనుకోవటంలేదు" అంది మరెటో చూస్తూ.
    
    "పోనీ మంచిగా ఏమనుకున్నారో చెప్పండి?"
    
    ఆశ్రిత మౌనం అతడిలో ఏ కంగారుకి కారణమయిందో టాపిక్ మార్చుతూ "చెప్పండి ఏం తీసుకుంటారు" అన్నాడు.
    
    "నాకు ఐడియా లేదు మీరే చెప్పండి"
    
    "అడగటానికి ఐడియాలు అవసరంలేదు టేస్టుంటే చాలు" మళ్ళీ జోవియల్ గా అన్నాడు. "అదిగో మీరలా సీరియస్ గా చూడకండి మీకేం కావాలో చెప్పండి?"
    
    "మీ ఛాయిస్ కే వదిలిపెడుతున్నాను"
    
    నిజానికి ఎప్పుడూ అలాంటి ఖరీదైన రెస్టారెంట్స్ కి రాని ఆమెకి నిజంగానే అవగాహనలేదు. తండ్రి పెన్షన్ డబ్బుల్తో బొటాబొటీగా కాలాన్ని వెళ్ళబుచ్చిన ఆమెకి చాలా విషయాల్లో పరిజ్ఞానం వున్నా ఇలాంటి చోట ఖచ్చితంగా ఇగ్నోరెంట్...ఆ నిజం అంగీకరించటానికి ఆమె సిగ్గుపడదు.
    
    బేరర్ కి ఆర్డర్ గురించి చెప్పిన వశిష్ట అమాయకంగా నేలచూపులు చూస్తున్న ఆమెతో అన్నాడు నెమ్మదిగా "మీరేం అనుకోనంటే..."
    
    "చెప్పండి"
    
    "కొన్ని విషయాల్లో మేధావులూ అమాయకుల్లానే ప్రవర్తిస్తారన్నది చరిత్ర చెప్పిన సత్యం."
    
    "మీరేం చెబుతున్నారో నాకు అర్ధంకావడంలేదు"
    
    "ప్రపంచంలో చాలా పాపులర్ సైంటిస్ట్ అనిపించుకున్న న్యూటన్ కి ఓ రోజు షూస్ కొనుక్కుందామనిపించింది"
    
    అతను చాలా సీరియస్ గా చెప్పుకుపోయాడు "న్యూటన్ తల్లి ఓ నౌఖరుని పిలిచి కొడుకు కాలి బూటు కొలతలిచ్చి షూమార్ట్ కి పంపించింది. తర్వాత కొంతసేపటికి నౌఖరు తెచ్చే బూట్లు తనకు నచ్చవేమో అనిపించిన న్యూటన్ థానే బయలుదేరాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి వచ్చాడు ఖాళీ చేతుల్తో...'బూట్లు కొనుక్కోలేదూ' అని తల్లి అడిగిందట... 'నాకు నౌఖరు కనిపించలేదమ్మా' అన్నాడట. 'వాడితో నీకేం పని నువ్వయినా కొని తెచ్చుకోవచ్చుగా' అందట న్యూటన్ తల్లి దానికి న్యూటన్ ఏమన్నాడో తెలుసా?"
    
    ఆసక్తిగా వింటూంది ఆమె.
    
    "షూస్ తెచ్చుకునే వాడ్నేగాని సైజులు నౌఖరు దగ్గర వుండిపోయాయిగా అన్నాడట."
    
    అరచేతిని పెదవులకి అడ్డంగా వుంచి నవ్వాపుకుంటున్న ఆమెని చూస్తూ "ఐ.ఎ.ఎస్. స్థాయికి వెళ్ళిన మీరు ఇక్కడ హోటల్ డిన్నర్ డిటైల్స్ గురించి చెప్పలేని స్థితికి సిగ్గుపడాల్సిన అవసరం లేదని సరదాగా న్యూటన్ గురించి చెప్పాను" అన్నాడు.
    
    అబ్బురంగా కాదు- దిగ్భ్రాంతిగా చూస్తూ వుండిపోయింది ఆమె.
    
    తను తనవరకే పరిమితం చేసుకున్న ఆలోచనల్ని అతడు చాలా స్పష్టంగా చదివి ఆశ్చర్యపరుస్తున్నాడు.
    
    నిజానికి వశిష్టని మళ్ళీ కలవాలని ఆమె అనుకోలేదు. ఒక నేరాన్ని నిరూపించలేక విఫలుడైన అతడిమీద కొన్ని గంటల క్రితందాక అంత సదభిప్రాయంలేదు. కాని మనసు ప్రేరణతో అతడ్ని కలుసుకోవాలనిపించింది. పిలిచింది. ఒకవేళ ఈ క్షణం అతడ్ని అర్ధంచేసుకునే అవకాశం ఇచ్చి వుండకపోతే ఇప్పుడు కలిసినందుకూ బాధపడేదేమో... అయితే అతడి మాటలూ, ప్రవర్తన అలసిన మనసుకి కొత్త ఊపిరిని అందిస్తున్నాయి.
    
    "మళ్ళీ మీరు ఆలోచనల్లోకి జారిపోయారు" అన్నాడు నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ.
    
    "సారీ" అంది అసంకల్పితంగా.
    
    "దేనికి?"
    
    "మిమ్మల్ని అపార్ధం చేసుకున్నందుకు!"
    
    అప్రతిభుడై చూస్తున్న అతనితో కొన్ని గంటల క్రితందాకా తనకున్న అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పింది.

 Previous Page Next Page