ఆ మాటలకు ఆశ్చర్యపోవడం మయూష వంతయింది. రెండు క్షణాలు సేపు బాధగా నిలబడిపోయింది.
"కనీసం కుక్కకయినా నేను అన్నం పెట్టొచ్చా?"
ఆ ప్రశ్నకు రాధమ్మ బదులివ్వడంలేదు. చైన్ తో కుక్కను లాగుతూ కిందకు వెళ్ళిపోయింది. మెట్టు దిగుతూ జిమ్మీ తల తిప్పి మయూష వేపు చూసింది.
* * * *
రాత్రి ఎనిమిది గంటలు దాటింది.
ట్రింగ్ ట్రింగ్ మని ఫోన్ మోగుతుంటే ఆశ్చర్యంగా రూమ్ లో ఒక మూలనున్న ఫోన్ వేపు చూసింది మయూష.
ఆ ఫోన్ చచ్చినా పనిచేయదని జ్వాలాముఖిరావు చెప్పాడే......ఇప్పుడెలా మోగుతోంది?
రెండు నిమిషాల తర్వాత రిసీవర్ అందుకుని "హలో" అంది మయూష.
చిన్న నవ్వు వినిపించింది ఫోన్ లో మయూషకు.
"మొగదని చెప్పిన ఫోన్ ఎలా మోగుతోందనుకుంటున్నావ్ ఈ ఫోన్ నీకు పనిచెయ్యదు నాకు మాత్రమే పనిచేస్తుంది. బైదిబై బోరు కొడుతోందా సహజమే గదా. పెళ్ళయిన వయసులో వున్న నీలాంటి బ్యూటీఫుల్ యంగ్ లేడీ ఈ టైమ్ లో ఒంటరిగా ఉండడం చాలా బాధాకరం కదూ."
ఆ మాటలకు భారంగా నిట్టూర్చింది మయూష. ఫోన్ రిసీవర్ని పక్కన పెట్టేద్దామనుకుంది.
"రిసీవర్ పెట్టేద్దామానుకుంటున్నావ్ గదూ. నువ్వు రిసీవర్ ని పక్కన పెట్టేసి నా నా మాటలు నీకు వినబడే ఏర్పాటు ఆ ఫోన్ లో వుంది. అంచేత నేను చెప్పేది విను.
ఒక పది నిమిషాల్లో నువ్వు అందంగా తయారై కిందికొస్తావు నీ కోసం అక్కడ బ్రౌన్ కలర్ కంటెస్సా కారు ఆగి ఉంటుంది. ఆ కారులో కూర్చో తర్వాత కారు డ్రయివర్ నిన్ను ఎక్కడకు తీసికెళ్ళాలో అక్కడకు తీసికెళతాడు."
"ఎక్కడికి?" విసురుగా అడిగింది మయూష.
"వచ్చాక నువ్వే చూస్తావుగా"
"రాకపోతే"
"భర్త పిలిచాక ఏ భార్యా రాకుండా ఉండదు. ఎందుకంటే ఆడా మగా కలయికలో వున్న సుఖం కోసమే గదా పెళ్ళిళ్ళు జరిగేవి. నీ కోసం ఎదురు చూస్తుంటాను. ఇంకో విషయం. నువ్వు కారులోంచి తప్పించుకుని వెళ్ళిపోవాలనుకున్నావనుకో నిర్దాక్షిణ్యంగా డ్రయివర్ నిన్ను చంపేస్తాడు గుర్తుంచుకో ఒకే" ఫోన్ కట్ అయింది.
వీడు మనిషా రాక్షసుడా? ఆలోచిస్తూనే రెండు నిమిషాలు గడిపేసింది మయూష.
ఆడా, మగా కలయికలో సుఖం కోసమే గదా పెళ్ళిళ్ళు జరిగేవి జ్వాలాముఖిరావు మాటలే గుర్తుకొస్తున్నాయి ఆమెకు. అంటే త్ననతో ఏకాంతంగా ఎంజాయ్ చేస్తాడా? తను ఒప్పుకోదుగా అయినా అలాంటప్పుడు ఇక్కడికి రాకుండా ఎక్కడికో తనని రమ్మనడం ఎందుకు?
పది నిమిషాలు గడిచిపోయాయి.
వెళ్ళాలా? వెళ్ళకూడదా? సందిగ్ధావస్థలో కొట్టు మిట్టాడిన మయూష జ్వాలాముఖిరావు మనస్తత్వాన్ని అన్ని యాంగిల్స్ లోంచీ పరిశీలించాక ఆలోచనతో గబగబా తయారయిపోయి మెట్లు దిగింది.
ఈ నెపంతోనయినా కన్పించినంత మేరకు ఊరు చూడొచ్చునని అనుకుందామె.
* * * *
కారు డోర్ తెరచుకుని కూర్చుంది మయూష.
డ్రయివర్ మర మనిషిలా కారుని స్టార్ట్ చేసాడు.
అయిదు నిమిషాలు గడిచాక, కారు శ్రీనగర్ కాలనీ పార్కు దగ్గర మలుపు తిరిగింది.
"ఎక్కడకు వెళుతున్నాం మనం?" మయూష ప్రశ్నకు జవాబు రాలేదు. కారు మరో ఇరవై అయిదు నిమిషాల తర్వాత కోఠీ మార్కెట్ రోడ్డు దగ్గర స్లో అయింది. దానిక్కారణం ట్రాఫిక్ రద్దీగా ఉండడమే! తల పక్కకు తిప్పి రోడ్డు మీద పోతున్న మనుషుల్ని చూస్తోందామె. సరిగ్గా అప్పుడు పోలీస్ ఐలాండ్ కు కొంచెం దూరంలో స్కూటర్ మీద అన్నయ్య శర్మ కనబడడంతో ఒక్కసారి సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిందామె.
"అన్నయ్యా....." గట్టిగా కేకేసింది. ఆ పిలుపుకి డ్రయివర్ ఆశ్చర్యంగా తల తిప్పి వెనక్కి చూసి చటుక్కున గేరు మార్చాడు. మార్కెట్ దాటి కారు ముందుకెళ్ళిపోతుండగా అప్పుడు గుర్తుకొచ్చింది మయూషకు కారు డోర్స్ క్లోజ్ చేసి వున్న విషయం.
ఆ గ్లాస్ డోర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించి విఫలమై పోయింది కనురెప్పల్ని కన్నీళ్ళు చుట్టూ ముడుతుండగా__
డ్రయివర్ ఒక్కసారి కారాపగలవా మా అన్నయ్య....మా అన్నయ్య...." బొంగురుపోతున్న గొంతుతో అడిగింది.
డ్రయివర్ మాట్లాడలేదు.
మయూషకు ఉప్పెనలా దుఃఖం పొంగుకొచ్చింది భోరుమని ఏడ్చేసింది. అయినా డ్రయివర్ తల తిప్పయినా చూడలేదు.
* * * *
దిల్ షుక్ నగర్ ఏరియాలోకి కారు ప్రవేశించింది. ఎమ్.ఐ.జి. క్వార్టర్స్ దాటి సంపూర్ణథియేటర్ దాటాక సిమ్మెంట్ రోడ్డుకి ఎడమ ప్రక్కన ఉన్న విశాలమైన బిల్డింగు పోర్టికోలో కారాగింది.
తన సీట్లోంచి లేచి కిందకు దిగి బ్యాక్ డోర్ ని తీసి పట్టుకున్నాడు డ్రయివర్ దిగమన్నట్టుగా-
కారు దిగి అటూ ఇటూ చూసింది మయూష.
నిశ్శబ్దంలో, ఏకాంతంలో పుచ్చపువ్వుల్లా మెరుస్తున్న నియాస్ లైట్ల వెలుగులో తాజ్ మహల్లా మెరిసిపోతున్న ఆ బిల్డింగులోకి అడుగు పెట్టిందామె. ఇక్కడేదో బిజినెస్ పీపుల్ పార్టీ జరుగుతుందేమో. ఆ పార్టీలోని బిజినెస్ ఫ్రెండ్స్ కు తనని జ్వాలాముఖిరావు పరిచయం చేస్తాడేమో! తను సాధించిన ఘన విజయాన్ని అందరి ముందూ ప్రదర్శించుకోవాలనే తాపత్రయమేమో!
రకరకాలుగా ఆలోచిస్తూ దగ్గరగా వేసున్న డోర్ తెరచుకుని హాల్ దాటి లోనికి పోబోయిన మయూష ఎడమ వేపు కనిపించిన దృశ్యానికి బిక్కచచ్చిపోయి సిగ్గిల్లిపోయి, మ్రాన్పడిపోయి నిలబడి పోయింది.
ఎడమవేపున ఓ గ్లాస్ రూమ్ మధ్యన అతి ఖరీదైన డబుల్ కాట్ బెడ్ ఆ బెడ్ మీద వంటి మీద కనీసం నూలుపోగైనా లేకుండా ఆడా, మగ - ఆ మగవ్యక్తిని చప్పున గుర్తుపట్టిందామె అతను జ్వాలాముఖిరావు.
ఇద్దరూ ఈ ప్రపంచాన్ని పట్టించుకోని దశలో ప్రణాయవస్థలో ఉన్నారు. చప్పున కళ్ళు మూసుకుంది మయూష.
ఇంత పశువా జ్వాలాముఖిరావు? నడిరోడ్డు మీద జంతువులా? మనసులో అనుకుంటూ వెనుతిరగడానికి ఉద్యుక్తురాలై ఒక్కడుగు వెనక్కి వేసింది.
"హలో....వెయిట్ ఏ మినిట్......బేబీ.....ఇంత దూరం నిన్నెందుకు రప్పించానో తెలుసా....ఇందుకే....ఈ జ్వాలాముఖిరావుకి మగతనం లేదని, నువ్వూహించుకొని ఉండొచ్చు గదా.....ణా మగతనం పదును నువ్వు ప్రత్యక్షంగా చూడాలన్నదే నా కోరిక.....భాష, దృశ్యం....ఈ నా ప్రపంచం.....అంతా పచ్చిగా ఉంది కదూ.....తప్పదు బేబీ.....
నీకివ్వాల్సిన సెక్స్ సుఖాన్ని డబ్బిచ్చి మరీ ఇంకొకరి కిస్తున్నాను. "ఎందుకో తెలుసా?" ఆయాసంతో రెండు నిమిషాలు మాట్లాడలేదు జ్వాలాముఖిరావు.
"నౌ యు కెన్ గో" అని ఆ అమ్మాయితో చెప్పి నైట్ డ్రస్ వేసుకుని ఆ గ్లాస్ రూమ్ లోంచి బయటికొచ్చి మయూష ఎదురుగా నుంచున్నాడు.