Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 30

   
    "మనోళ్ళే గదా. డోన్ట్ వర్రీ" మత్తుగా అన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఏదో జ్ఞాపకానికొచ్చి-
   
    "అవునూ మనెవరికీ తెలియకుండా మా బావ కొత్త పావు సవనీత్ గాడ్ని బరిలోకి దింపాడేవిటి ఇంతకీ ఎవడాడు" అని అడిగాడు.
   
    "వాడా వాడి గురించి మీరడుతారని నాకు తెల్సు. వాడేం ప్రమాదమైనోడు కాదు మనోడే" చెప్పిందామె నవ్వుతూ.
   
    "మనోడే అంటే నీ వోడా, నా వోడా" అని అడిగాడు భుజంగపతి.
   
    "నా వాడయితే మీవాడు కాడా? నవనీత్ నా పి.య్యే నా వ్యవహారాలన్నీ చూస్తుంటాడు" అలా రవళి చెప్పగానే-
   
    "హా...." గుడ్లు తేలేసి చూసాడు భుజంగపతి రవళి వేపు
   
    అదే సమయంలో కరెంట్ పోయింది.
   
                                                                             *    *    *    *
   
    మర్నాడు-
   
    మధ్యాహ్నం రెండున్నర గంటలు-
   
    విశాలమైన బెడ్ రూమ్ లో విసుగ్గా వుంది మయూషకు బెడ్ రూమ్ పక్కన డైనింగ్ హాల్.
   
    ఆ పక్కన చిన్న స్టోర్ రూమ్. స్టోర్ రూమ్ డోర్ కి నిగనిగ లాడుతూ తాళం కప్ప వేలాడుతోంది. ఆ స్టోర్ రూమ్ దాటాక కారిడార్. కారిడార్ లోకి అడుగుపెట్టి చుట్టూ చూసింది.
   
    గార్డెన్ దట్టంగా అంతెత్తున పెరిగిన చెట్లు దూరంగా నిలువెత్తు గోడ గోడమీద ఐరన్ పెన్సింగ్. ఆ వెనక కొండలు.
   
    చుట్టుపక్కల ఎవరూ మనుషులు లేరా? అనుమానం రాగానే ఎందుకో సన్నగా వెన్నుముకలోంచి చలి పుట్టింది.
   
    తల తిప్పి మెయిన్ గేట్ వేపు చూసింది. సెక్యూరిటీ రూమ్ దగ్గర ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ యమభటుల్లా నుంచునున్నారు.
   
    కారిడార్ గ్రిల్స్ మీద నుంచి కొంచెం తలెత్తి చూస్తే కుడివేపు గోడ పక్కన చిన్న ఔట్ హౌస్ లాంటిది కనబడింది.
   
    ఆ ఔట్ హౌస్ లో కుక్కర్ వాళ్ళావిడ వుంటారేమో అనుకుంది మయూష.
   
    తనకు భోజనం తెచ్చిపెట్టే  ఆడమనిషి ఎక్కడయినా కన్పిస్తుందేమోనని చూసింది. ఎక్కడా కనిపించలేదు.
   
    ఆ మనిషి పేరు అడగాలి అనుకుంది మయూష.
   
    కోడిగుడ్డు ఆకారంలో వున్న గ్రిల్స్ ని ఆనుకుని నెమ్మదిగా నడుస్తోందామె.
   
    ఒకచోట గ్రిల్స్ తాకుతూ, దుబ్బుగా ఎదిగిన వైల్ట్ క్రోటన్స్ విసనకర్రంతా ఎర్రటి ఆకులు రక్తవర్ణంలో వున్న ఆకుల్ని చూస్తుంటే ఎందుకో భయమేసింది ఆమెకు.
   
    గ్రిల్స్ కి ఆనుకుని నిలబడి ఔట్ హౌస్ వేపు చూసిందామె లివింగ్ రూమ్ తర్వాత బాత్ రూమ్
   
    బాత్ రూమ్ గోడమీద టప్ మని ఎర్రని జాకెట్ పగడంతో ఆసక్తిగా అటువేపు చూసింది.
   
    చిన్నగా హమ్ చేస్తూ తమిళంలో ఏదో పాట అంటే తనకు భోజనం తెచ్చే ఆ ఆడమనిషి స్నానం చేస్తోందా? నెమ్మదిగా విన్పిస్తున్న నీళ్ళ చప్పుడు. లివింగ్ రూమ్ డోర్ చప్పుడయితే అటువేపు చూసింది నల్లటి మొద్దులాంటి మనిషి అతన్ని అదే మొదటిసారి మయూష చూడడం. ఆ నల్లటి మనిషి తమిళంలో ఏదో చెపుతున్నాడు లోన్నించి  ఆడమనిషి తమిళంలో ఏదో చెపుతున్నాడు లోన్నించి ఆడమనిషి ఏదో బదులిస్తోంది.
   
    కాసేపయ్యాక నల్లటి మనిషి బాత్ రూమ్ నుంచి అవుట్ హౌస్ కెళ్ళి ఆకుపచ్చటి చీరతో వచ్చి ఆ చీరను గోడమీద వేసి ఏదో అనుకుంటూ వెళ్ళిపోయాడు.
   
    బదులివ్వటం కాదన్నమాట ఆ ఆడ మనిషి ఇంట్లోంచి చీరను తెచ్చిపెట్టమని అడిగి వుంటుందనుకుని.
   
    అయిదు నిమిషాల సేపు అక్కడే నిలబడి ఏదో చప్పుడు వినిపిస్తే ఆతృతగా తల తిప్పి చూసింది మయూష.
   
    వెంటనే ఒక్కసారి త్రుళ్ళిపడింది.
   
    ఏపుగా ఎదిగిన డాబర్ మేన్ డాగ్. నెత్తురు పులుముకున్నట్టుగా పైకి ఊగుతున్న నాలుక. చీకట్లో రేడియం ముల్లుల్లా మెరుస్తున్న కళ్ళు. కిందకూ పైకీ ఊగుతున్న తోక.
   
    మనిషిమీద దూకి చంపడానికి సిద్దంగా వున్నట్టు వుంది.
   
    తను కదిలితే మీద పడుతుందేమో! నెమ్మదిగా అడుగు ముందు కేసింది.
   
    కుక్క కూడా ముందుకు కదిలింది.
   
    దాని కళ్ళవేపే సూటిగా చూస్తూ కుడిచేతిని సాచింది. కుక్క దగ్గరకు రాలేదు.
   
    తనతో స్నేహం చెయ్యొద్దని జ్వాలాముఖిరావు ఈ కుక్కను కూడా శాసించాడా? తన ఆలోచనలకు నవ్వొచ్చి నెమ్మదిగా ముందు కడుగేసి కిచెన్ రూమ్ వరకూ వెళ్ళింది కుక్క ఆమెను నెమ్మదిగా అనుసరిస్తోంది.
   
    ఏదయినా ఆహారం పెడితే ఇది మచ్చికవుతుందేమో ఆలోచన రాగానే డైనింగ్ టేబుల్ మీదున్న స్టీల్ పాత్రల్లో ఒక పాత్ర మూత తీసి చూసింది. పప్పు ఆ పాత్రను తీసుకుని కుక్కముందు పెట్టి దాని వేపే చూసిందామె కుక్క ఆ పాత్ర చుట్టూ రెండుసార్లు తిరిగి వాసన చూసి కాలితో కదిపి పక్కకు తోసేసింది.
   
    టేబిల్మీదున్న రెండో స్టీల్ పాత్రను తీసి చూసింది. మిగిలిపోయిన మటన్ కర్రీ.
   
    ఆ కర్రీని కుక్క ముందు పెట్టింది. దాని పేరెం పేరో తెలీక రకరకాల పేర్లతో పిలవసాగింది మయూష.
   
    బబ్లూ.....పీటర్....టైగర్.....బ్లాకీ.....సడన్ గా జ్వాలాముఖిరావు జ్ఞాపకం రావడంతో జిమ్మీ అని పిలిచింది.
   
    చటుక్కుమని కుక్క తలెత్తి మయూష కళ్ళల్లోకి ఒకసారిచూసి ముందుకు కదిలి పాత్ర వాసన చూసి అందులోని మటన్ ను గబగబా తినడం ప్రారంభించింది.
   
    కాసేపయ్యాక__
   
    ఖాళీ పాత్రలో నీళ్ళుపోసి దాని ముందుంచింది. ఆ నీళ్ళను కూడా చప్పరిస్తూ తాగుతున్న సమయంలో-
   
    గబగబా మెట్లెక్కి తనవేపే వస్తున్న ఆ ఆడమనిషిని చూసి విస్తుపోయింది మయూష.
   
    ఆ ఆడమనిషి కుక్క వేపు మయూష వేపు సీరియస్ గా చూసి-
   
    తన చేతిలో వున్న చైన్ ను కుక్క మెడలో వేస్తున్న సమయంలో-
   
    "కుక్క పేరేం పేరు" అని అడిగింది మయూష.
   
    "జిమ్మీ" అని ఆ ఆడమనిషి చెప్పగా ఆ విషయం అప్పుడే తెల్సినట్టుగా తల పంకించింది మయూష.
   
    "నీ పేరు" మళ్ళీ అడిగింది మయూష.
   
    "రాధమ్మ" తెలుగులో కొంచెం తమిళయాసతో చెప్పిందామె.
   
    "నువ్వూ, నీ భర్తా కలిసి వుంటున్నారా అవుట్ హౌస్ లో...." అడిగింది మయూష.
   
    అవునన్నట్టుగా తల ఊపింది రాధమ్మ.
   
    "నీ భర్తపేరు?"
   
    "రంగస్వామి"
   
    "మీరు కాక యింకెవరు వుంటున్నారు ఈ యింట్లో....?" అడిగింది మయూష.
   
    రాధమ్మ వెంటనే జవాబు చెప్పకపోతే మళ్ళీ అడిగింది మయూష.
   
    రాధమ్మ అటూ ఇటూ చూసి నెమ్మదిగా ఆమె పక్కకొచ్చి....."నేనుగానీ మా రంగస్వామిగానీ ఇంకెవరుగానీ మీతో మాట్లాడగూడదమ్మా. భోజనం, కాఫీ టైములో తప్ప మేడమీదకు రాగూడదమ్మా మీరు మాతో మాట్లాడినా, మేం మీతో మాట్లాడినా మా ఉద్యోగాలు పోతాయమ్మా దయచేసి మరోసారి మాతో మాట్లాడ్డానికి ప్రయత్నించకండమ్మా" దండం పెడుతూ నెమ్మదిగా చెప్పింది రాధమ్మ.

 Previous Page Next Page