Previous Page Next Page 
సుహాసిని పేజి 30


    "నీకతడంటే యిష్టంలేదు. అతణ్ని చేసుకుని నువ్వేం సుఖపడతావే!"

    "కట్నం లేకుండా ఏ చింతపండుగాడినో చేసుకునే బదులు ఇదే నయంగదా! మొదటిసారి చూసినప్పుడే అతడు నాకు నచ్చాడు. అటుపైన ఈ రమణగారు బాగా భయపెట్టారు. ఇలాంటి మ్యారేజ్ లైఫ్ కూడా ఓ సవాలే. నిజం చెప్పాలంటే మన దేశంలో చాలామంది భార్యాభర్తలొకర్నొకరు ప్రేమించుకున్నట్లు నటించుకుంటూ తమ్ము తాము మోసం చేసుకుంటారు. అంతకంటే మేము నయం.... నటిస్తున్నట్లు ముందే మాకు తెలుసు" అని నవ్వింది ప్రతిభ.

    రమణ తనేం మాట్లాడలేదు.... అంతా కలిసి క్లినిక్ లో అడుగుపెట్టారు.


                                                                      26


    అక్కడ డాక్టర్ విశ్వేశ్వరయ్య ముందు నిలబడి వున్నవాళ్ళు దక్షిణామూర్తి, కోదండపాణి, రమణ.

    "ఆ అమ్మాయిని చూస్తూంటే ఇది చెప్పడానికి నాకు నోరు రావడం లేదు.ఆమె జీవితం రోజుల లెక్కలో వుంది. మహా అయితే మాగ్జిమమ్ మూడునెలలు...."

    దక్షిణామూర్తికి దుఃఖం ఆగడం లేదు. ల్యుకేమియాం బ్లడ్ కాన్సర్. భయంకరమైన ఈ వ్యాధి వెతుక్కుంటూ తమ ఇంటికెలా వచ్చింది? ఇంట్లో ఇంతమంది వయసుమళ్ళిన వాళ్ళుండగా ఆ నవ్వుల రాణి నెలా ఆశ్రయించింది?

    రమణ పళ్ళబిగువున దుఃఖమాపుకుంటున్నాడు.

    దుఃఖమాపుకోలేనని తెలిసి కోదండపాణి పెదవి కదపడంలేదు.

    "ఈ మూడు నెలలూ ఆ అమ్మాయి మనసు నొప్పించకండి...." డాక్టర్ విశ్వేశ్వరయ్య సలహా యిచ్చాడు.

    "ఇది నయమయ్యే మార్గం లేదా?" అన్నాడు రమణ.

    "ఇప్పుడింకే మార్గం లేదు" అన్నాడు విశ్వేశ్వరయ్య.


                        *    *    *    *


    ఇంటివద్ద ఒక్కసారిగా వాతావరణం మారిపోతే హాస ఆశ్చర్యపడింది.

    "అందరికీ ఏమయింది?" అందామె.

    ఒక్కరు కూడా దుఃఖం ఆపుకోలేకపోతున్నారు. అయితే ఎవ్వరూ ఆమెకి అసలు విషయం చెప్పదల్చుకోలేదు. తనకేమయిందీ ఆమెకు తెలియకూడదని వారంతా కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం.

    "మీ చూపులు చూస్తూంటే సినిమాల్లో బ్లడ్ కాన్సర్ పేషెంట్లా ఫీలవుతున్నానేను" అంది హాస నవ్వుతూ.

    ఆ మాట అందరి దుఃఖాన్నీ మరింతగ పెంచింది.

    హాసకా వాతావరణం నచ్చలేదు. "ఇది మనిల్లులా లేదు" అంటూ విసుక్కుందామె.

    "నువ్వున్నంతకాలం ఇది మనిల్లులా ఎందుకుండదూ....?" అంది పార్వతమ్మ నవ్వడానికి ప్రయత్నిస్తూ.

    "ఎల్లకాలం నేనిక్కడే ఉండాలనుకుంటున్నాను.... మీరే నన్ను బయటికి పంపేయాలనుకుంటున్నారు" అంది ఆమె గారంగా.

    "అంతా నీ యిష్టం. నీ మనసు నొప్పించే పని ఒక్కటీ చేయం. నువ్వెలాగంటే అలాగే!" అన్నాడు కోదండపాణి.

    తండ్రి తనతో ఎప్పుడూ అలా మాట్లాడి ఉండకపోవడం వల్ల ఆమె బాగా ఆశ్చర్యపడింది. ఆమె తల్లితో నెమ్మదిగా, "అమ్మా? అయితే ఎమ్మే అయ్యేదాకా నన్ను దేనికీ డిస్టర్బ్ చేయొద్దు" అంది.

    "అలాగేనమ్మా!" అంది సుభద్ర.

    "ఈ రోజు మీ అందరినీ నిజంగానే ఏదో అయింది. ఇలా నాకు బాగో లేదు" అంది హాస.

    ఎవ్వరూ మాట్లాడలేదు.

    హాస కాసేపాగి తమ్ముడ్ని బైనాక్యులర్స్ అడిగింది. వారంరోజుల క్రితం ఓ స్నేహితుడది వాడికి ప్రజంటు చేశాడు. రోజూ ఫోను పేరుతో ఎవరితోనో మాట్లాడి తన్ను భయపెడుతోందని హాసకు వాడది చూపించడం లేదు. అసలు ఆమెను వాడది ముట్టుకోనివ్వడం లేదు. ఇప్పుడడగ్గానే వాడది అక్కకిచ్చేసి, "అక్కా! ఇది నీకే!" అన్నాడు.

    ఆమె మతిపోయిన దానిలా వాడివంక చూసింది.

    "బామ్మా నువ్వు బ్రేక్ డాన్స్ చేయాలి" అందామె బామ్మతో.

    "నాకు రాదమ్మా, నేర్చుకుని చేస్తాను...." అంది పార్వతమ్మ శాంతంగా.

    ఆమెకు విసుగొచ్చినట్లుంది. "నాకు కాశ్మీర్ వెళ్ళాలనుంది....పంపిస్తారా?" అంది.

    "ప్లేన్ లోనా? ట్రయిన్ లోనా?" అన్నాడు కోదండపాణి శాంతంగా.

    ఆమెకు నోటమాట రాలేదు.


                        *    *    *    *


    "హలో!" అంది హాస.

    "హాసా!" అన్నాడు గౌతమ్.

    "ఈ రోజు నాకేదో అయింది...." అంతా జరిగిందతడికి చెప్పుకుందామె. కావాలనే కాస్త గట్టిగా మాట్లాడింది.

    పక్క మంచంమీదే ఉన్న గిరిధర్ నిద్రాభంగమై కళ్ళు తెరిచాడు. మాట్లాడుతున్న అక్కను చూసి ఆమెవైపే చూస్తూండిపోయాడు. ఆమె అతడ్ని ఓరకంట గమనించింది. కానీ తన ధోరణి మానలేదు.

    గిరిధర్ కి ఆమెను చూస్తూంటే కన్నీళ్ళు వచ్చాయి.

    అక్క ఎంత సరదా మనిషి? కొన్ని రోజుల్లో ఆ మనిషి ఏమైపోతుంది? అక్కతో ఎంత పోట్లాడినా ఆమె లేదన్న భావం కూడా సహించలేడు తను.

    తను ఏడుస్తున్నట్లు ఆమెకి తెలిసిపోతుందన్న భయంతో గిరిధర్ కళ్ళు మూసుకుని దుప్పటి ముఖం మీదకు లాక్కున్నాడు.   

    ఆమె గౌతమ్ తో మాట్టాడుతూనే పక్కచూపులు చూస్తూ తమ్ముడ్ని గమనించింది. వాడేడుస్తున్నట్లు మాత్రం ఆమెకు తెలియలేదు.

    గౌతమ్ ఆమె చెప్పిందంతా విని, "నీది చాలా సున్నితమయిన మనస్తత్వం. అందుకే గట్టిగా దెబ్బబ్బలాడేసరికి స్పృహతప్పి పడిపోయావు. పెద్దవాళ్ళు తమ తప్పు గ్రహించారు. వరుసగా నీ మెదడుకి అఘాతాలివ్వడం ఇష్టంలేక కొన్నాళ్ళు తమ పద్ధతి మార్చుకోవాలనుకుంటున్నారు.... ఈ అవకాశం ఉపయోగించుకో" అన్నాడు.

    "ఉపయోగించుకుంటున్నా.... బహుశా ఈ సెలవుల్లో కాశ్మీర్ వెడతాను."

    "కాశ్మీరా?"

    "అవును. అది నా కోరిక. చాలాకాలంగా నా మనసులో ఉంది. ఎందుకో ఆ ప్రాంతమంతా నాకు తెలిసిందే అనిపిస్తుంది, సినిమాల్లో చూసిన మూలానో ఏమో! స్వయంగా నా కళ్ళతో నేను చూడాలనుకుంటున్నాను" అంది ఆమె.

    "నువ్వు వెళ్ళే ముందు నాకు చెప్పడం మర్చిపోకు...."

    "నీకు చెప్పకుండానా? అది ఈ జన్మకు సాధ్యం కాదేమో?"

    "థాంక్యూ హాసా!"

    "నేను కాశ్మీర్ వెడుతున్నానని తెలిస్తే నువ్వేం చేస్తావు?"

    "ఏం చేస్తాను....నేనూ నీతో వస్తాను."

    "ఏయ్....ఎవరు నువ్వు?"

    "నేను నేనే!" గౌతమ్ నవ్వాడు.

    "నువ్వెవరో చెప్పకపోతే నీతో మాట్లాడను.

    "అలా బెదిరించలేవు. నేను మాట్లాడేది నీతోకాదు, నీ మనసుతో."

    "నా మనసు నదుపు చేస్తాను...."

    "మనసు నదుపు చేయి మాటలు పొదుపు చేయి. నన్ను మాత్రం తప్పించుకోలేవు. నిన్ను వెంటాడి మాట్లాడుతూనే వుంటాను."

    "నీ కందని చోటు లేదా?"

    "మృత్యువొక్కటే మనల్ని వేరు చేయగలదు" అన్నాడు గౌతమ్.

    "అయితే నిన్ను తప్పించుకోడానికా మృత్యువునే ఆహ్వానిస్తాను.

    గౌతమ్ చలించలేదు. "అది నీ వల్లకాదు. నా అనుమతి లేకుండా మృత్యువు కూడా నీ దరి చేరదు."

    "ఎవరు నువ్వు?"

    "అదొక్కటి తప్ప ఇంకేమయినా అడుగు, మరి సెలవా?"

    "ఊఁ" అని__"నేను నిజంగా భ్రమపడుతూంటే ఇది చాలా విచిత్రమయిన భ్రమ" అనుకుందామె.

    తర్వాత తమ్ముడు కప్పుకున్న ముసుగులాగి, "ఏరా, భయపడ్డావా?" అంది.

    "నువ్వేం చేసినా నాకు భయం లేదక్కా-నువ్వుండాలి, అంతే...." అన్నాడు గిరిధర్.

    "నేనుండక ఏమయ్యాన్రా?"

    "మధ్యాహ్నం నువ్వు స్పృహ తప్పి పడిపోతే ఎంత భయమేసిందో నాకు...." అని, "మనుషుల విలువలు ఉన్నన్నాళ్ళూ తెలియదు. ఇన్నాళ్ళు నిన్ను బాధపెడితే నన్ను క్షమించక్కా" అన్నాడు గిరిధర్.

    వాడి ముఖం చూసి ఆమె నవ్వడం ప్రారంభించింది.

    మామూలుగా అయితే గిరిధర్ మూతి ముడుచుకునే వాడే! వాడిప్పుడు అక్క వంకే చూసి, "నవ్వక్కా! నువ్వు నవ్వుతుంటే ఇంకా బాగుంటావు" అన్నాడు.

    హాస నవ్వాగిపోయింది.


                         *    *    *    *


    ఏడంతస్థుల మేడలో మూడో అంతస్థు. నలభై గదుల్లో నాలుగో గది అక్కడ అయిదు కుర్చీల్లో యిద్దరు మనుషులు.

    ఒకడు నడివయస్కుడు.

    అతడి కెదురుగా రమణ.

    "వెరీ గుడ్ ప్రోగ్రెస్! మనకు అన్నీ సానుకూలమవుతున్నాయి" అన్నాడు నడివయస్కుడు.

 Previous Page Next Page