Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 30

    "సుహాసినిలాంటి పిల్ల ప్రేమిస్తే పాలుపోవడానికే ముందీ? హాయిగా పెళ్ళిచేసుకోక..." అన్నాడు.   
    "మా అమ్మొప్పుకోదు. వాళ్ళ బామ్మొప్పుకోదు."   
    "ఇది మీసమున్న మగాడు చెప్పేమాట కాదు. మీ ఇద్దరికీ ఇష్టమయ్యాక ఇంక పెద్దాళ్ళదేముంది? మీరిద్దరూ కలిసి పెళ్ళి చేసుకుని వేరే కాపురం పెడితే కొంపలు మునిగి పోతాయా? ప్రపంచం తలల క్రిందులైపోతుందా?"   
    "నా చెల్లెలికి పెళ్లికాదు" అన్నాడు సుబ్బారావు.   
    "నీ చెల్లెలికి పెళ్ళయితే నువ్వీపెళ్ళి చేసుకుంటావా?" అన్నాడు రచయిత.   
    "సుబ్బారావు కంగారుగా మీరిలా అడిగేస్తే నేనేం చెప్పగలను? ఇది నాకు క్లిష్ట సమస్య" అన్నాడు.   
    "ఏడిసినట్లుంది. ఇందులో అంత సమస్యేముంది? నీకు ఉద్యోగం వుంది. అమ్మాయి నిన్ను ప్రేమించింది. నువ్వు ఆమెను ప్రేమిస్తున్నావు మీ పెళ్ళివల్ల నీ చెల్లెలి పెళ్ళి ఆగి పోతుందన్న భయంలేదా నేను ఏర్పాట్లు చేస్తాను. త్వరగా ఆమెకో సంబంధం చూడు. పెళ్ళి నేను జరిపిస్తాను" అన్నాడు రచయి  
    "నాకేమిటో భయంగా ఉందండి. మా అమ్మకిష్టం లేని పెళ్ళి చేసుకుని నా సంసారంలో కలతలు తెచ్చుకోలేను" అన్నాడు సుబ్బారావు.  
    రచయిత దిగాలు పడిపోయాడు. సుబ్బారావు వాటం చూస్తూంటే తల్లిని తప్ప ఈ ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించే లాగున్నాడు.   
    ఈలోగా రాయుడు రచయిత దగ్గరకు వచ్చాడు__ "ఏమయ్యా మనకింకో కొత్త సమస్య వచ్చిపడింది. సుహాసిని సుబ్బారావును చేసుకోవడం మా శంకర్ సహించలేడుట. కథ ఇంకా ముందుకు వెళ్ళడానికి వీల్లేదంటున్నాడు. మన మింకేంచేసినా వెళ్ళి ఆ సుహాసిని ఇంట్లోనూ సుబ్బారావు ఇంట్లోను జరిగినదంతా చెప్పేస్తాడట!"  
    "చచ్చాం" అన్నాడు రచయిత- "శంకర్ బాబు మన కథకు విలన్ అవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు."  
    "అసలీ కథే వాడిమూలంగా పుట్టింది. ఇప్పుడేం చేయాలో నాకు తోచడంలేదు. వాడు చాలా మొండిగా ఉన్నాడు. స్వంత మామయ్యనైవుండి తన ప్రియురాలిని తనక్కాకుండా చెయ్యడం చాలా అన్యాయమన్నాడు. వాడికి చాలా కోపం వచ్చింది. ఇప్పుడు వాణ్ని శాంతపరిచే మార్గం చూడాలి!" అన్నాడు రాయుడు.   
    "ఎలాగైనా మన కథకో మలుపు కావాలి! సుబ్బారావుకూడా చెయ్యిదాటి పోయేలాగున్నాడు" అన్నాడు రచయిత.   
    రచయిత ఆ రాత్రంతా ఆలోచించాడు. ఉన్నట్లుండి ఓ రాత్రివేళ అతడి బుర్రలో ఏదో ఉపాయం మెరిసింది. అతను అప్పటికప్పుడు వెళ్ళి రాయున్ని నిద్రలేపాడు. రాయుడు విసుక్కోకుండా నిద్రలేచి- "నీకేం తట్టిందో చెప్పు" అన్నాడు.   
    "వాటం చూస్తే, వనజకూడా సుబ్బారావుని ప్రేమించింది. ఆమె నెరజాణలా అనిపిస్తోంది నాకు. తల్చుకుంటే సుబ్బారావును తన్నుకు పోగలదామె. ఆమె దృష్టిని సుబ్బారావుమీంచి మళ్లించాలి. అందుకు ఏం చేయాలి? ఆమెను మీ మేనల్లున్ని ప్రేమించమనాలి! మీ మేనల్లున్ని ఆమె ప్రేమించడంలో కొన్ని సదుపాయాలున్నాయి, వనజ స్వతహాగా అందగత్తె, ఆమె వెతుక్కుంటూ వచ్చి తనను ప్రేమించిందంటే మీవాడు అయిసైపోతాడు. ప్రేమించే అతడు దొరకడం మగాడికి అరుదైన వరం. పెళ్ళయ్యాక అది వేరే సంగతనుకోండి..."   
    రాయుడు సాలోచనగా, "ఆ అమ్మాయి వనజని మరి మా కులమేనా? కులం తేడా పెళ్ళికి నా చెల్లెలొప్పుకోదు ఆ మాటకొస్తే నేను ఒప్పను..." అన్నాడు.   
    "అంతా ఆలోచించే చెప్పాను. ఇక్కడ కులాలు కూడా కలిశాయి..."   
    రాయుడింకా ఆలోచిస్తూనే-"ఏమిటో ఈ వ్యవహారం లోకి కుటుంబ సభ్యుల్ని లాగడం నాకిష్టంలేదు. ముందు పిల్ల నా చెల్లెలకి నచ్చాలి. అంతా యిష్టపడ్డాకనే అసలు నాటకం ఆరంభించొచ్చు" అన్నాడు.   
    "సుబ్బారావు, సుహాసిని విషయంలో కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళని కలాపాలనుకుంటున్నారు. కానీ మీ ఇంట్లో అలా కుదరదంటున్నారు. ఇది చాలా అన్యాయం. ఇలాగైతే కధలెలా నడుస్తాయి?" అన్నాడు రచయిత.   
    రాయుడు గంభీరంగా-"కథను నడిపించడమే నా ఉద్దేశ్యం కథతోపాటు నడవడంకాదు. నా మేనల్లుడికి ఈ కథకు సంబంధముండకూడదు" అన్నాడు.   
    "అలా ఎందుకు ఆవేశపడతారు? అతనెలాగు సుహాసినిని చేసుకోవాలని అనుకున్నాడు. అందుకు మీ సాయం కోరాడు. సుహాసినితో ఎలాగూ మీకు కులం కలవలేదు. అలాంటప్పుడు వనజ ప్రేమ శంకర్ కు లభిస్తే అన్ని విధాలా మీ కుటుంబానికి మేలు జరుగుతుంది. తననో అమ్మాయి ప్రేమించిందన్న తృప్తినీ మేనల్లుడికి కలిగించిన వారవుతారు."  
    "సరే! ఇంతకీ వనజవద్దకు వెళ్లడం ఎలా?" అన్నాడు రాయుడు.   
    "మీరు ఊ అంటే అంతా నేనే చూసుకుంటాను." అన్నాడు రచయిత. రాయుడు ఊ అన్నాడు.   
    మర్నాడు రచయిత వనజ ఇంటికి సూర్యముఖిని పంపించాడు.   
    "నువ్వు సుబ్బారావును ప్రేమించడం ధర్మంకాదు. ఆమెను సుహాసినికి వదిలిపెట్టు" అంది.   
    సూర్యముఖిని కాసేపు పరిచయ సంభాషణ నడచిన తర్వాత-  
    వనజ సూర్యముఖిని సూటిగానే అడిగేసింది__"ఈ వ్యవహారంలో నీ ఆసక్తి ఏమిటని!"   
    సూర్యముఖి వివరించింది. ఆ వివరణలో కొన్ని అబద్ధాలూ, నిజాలూ ఉన్నాయి.   
    సూర్యముఖి శంకర్ కి దూరపు బంధువు. శంకర్ సుహాసినిని ప్రేమించాడు. కానీ వర్ణాంతర వివాహం ఆ ఇంట్లో సమస్యలు తెచ్చిపెడుతుంది. ఈలోగా అదృష్టవశాత్తూ సుహాసిని, సుబ్బారావు ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు వనజ సుబ్బారావును ప్రేమిస్తే మళ్ళీ శంకర్-సుహాసిని అంటాడు.   
    వనజ నవ్వింది_ "ఆ సుబ్బారావును నే నెందుకు ప్రేమించా ననుకుంటున్నారు?"   
    "ఎర్రగా బుర్రగా ఉన్నాడు కదా, అందుకు అయితే ఎర్రగా బుర్రగా ఉన్నప్పటికి అతను మేథకుడు. స్వతంత్ర భావాలు లేనివాడు. మీదు మిక్కిలి పేదవాడు. శంకర్ సవర్నీకుడు. విధ్యాధికుడు. ఆస్తిపరుడు..." అంటూ సూర్యముఖి వనజను శంకర్ ని ప్రేమించవలసిందిగా అర్ధించింది. ఎవరి కోరికపైనో శంకర్ ని ప్రేమిస్తున్నట్లు ఎవరికీ తెలియకూడదంది.   
    వనజ క్షణం ఆలోచించి__ "సుబ్బారావును నేను ప్రేమించడంలేదు. పోటీ ఉన్నప్పుడే దేనిమీదన్నా మోజు పెరుగుతుంది. సుహాసిని నా స్నేహితురాలు సుబ్బారావును చూడకమునుపు అది ప్రభాకరాన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంది. అది ప్రభాకరాన్ని చేసుకోవడం నాకిష్టంలేదు. అయితే ఎవ్వరూ దాని మనసు మార్చలేకపోయారు. సుబ్బారావును చూసినప్పట్నించీ దాని మనసు ఊగిస లాడ్డం మొదలయింది. అది సుబ్బారావు విలువను గ్రహించాలని నేను డానికి పోటీ వచ్చాను. తప్పితే - నాకు అతడిమీద ఆకర్షణ లేదు. అయితే శంకర్ ని ప్రేమించడం విషయంలో నేనేమీ చెప్పలేను. నాకింకా పెళ్లిమీద దృష్టి మళ్ళలేదు" అంది.

 Previous Page Next Page