Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 29

    మంజరి గదిలో వీణ పట్టుకొని కూచుని ఉంది. తండ్రి పిలుపు విని లేచి వచ్చింది. 'తస్వీర్లొచ్చినయి చూసినవా?' అని అందించాడు. ఒక్కొక్క ఫోటో చూచింది. పాణి చిత్రాన్ని అంత తొందరగా వదల్లేక పోయింది. తండ్రి ఉన్నాడని మార్చి ఇంకోటి చూచింది. 'తస్వీర్లు నేనుంచుకుంట' అన్నది.
    'సరే మీ అమ్మకు చూపుతవు కదా!' అని వెళ్ళిపోయారు.
    తలుపుమూసి పాణి పటం చూచింది. గుండెమీద పెట్టుకుంది, గుండెలో ఇదివరకే ఒక పటం ఉందనే విషయం మరచిపోయి. తన పటమూ, పాణి పటమూ ఒకచోట పెట్టుకొని చూచింది. జుట్టు ఇద్దరిది ఒకే రకంగా ఉంది! కళ్ళు తనకళ్ళకంటే కొద్దిగా చిన్నగా ఉన్నా ఏదో పోలిక కనిపించింది. వాస్తవంగా ఉందా? తన భ్రమా? మళ్ళీ చూచింది. తల్లితో చెబుదామనుకుంది. ఏమనుకుంటుంధో అనుకుంటూ ఉండగానే తలుపు తట్టిన చప్పుడూ, తల్లి పిలుపూ వినవచ్చాయి. తలుపు తెరిచింది-
    'తస్వీర్లున్నయట'
    తండ్రి తస్వీర్లు తల్లికి చూపమన్నాడు. తాను మరిచేపోయింది. ఫోటోలు అందుకొని మంచంమీద కూచుని చూచింది. 'ఎంత మంచిగ తీసిండు తస్వీర్లు' అని ఒక్కొక్కటే చూడసాగింది. పాణి పటం చూస్తున్నప్పుడు ఇందిరమ్మ కూతురువైపు చూచింది. మళ్ళీ పటం చూచింది. తల్లినడుగుదామనుకుంది మంజరి. కాని, అడగలేదు. పోలికలేమిటో అని సతమతపడింది ఇందిరమ్మ. అయినా, తన భావం వ్యక్తం కానివ్వలేదు కూతురి ముందు, తరవాత రామారెడ్డిగారిని అడిగింది. అతనూ దీక్షగా చూశాడు. "ఉంటయిలే" అన్నాడు దానికాట్టే ప్రాధాన్యం ఇవ్వకుండా.
                                                                    x      x    x
    సారంగపాణి ప్రధమ పర్యాయం సహపంక్తిని భోజనం చేస్తున్నాడు రెడ్డిగారితో. రెడ్డిగారి కుడిప్రక్కన పాణి, ఎడమపక్కన ఇందిరమ్మ, ఆమె పక్కన మంజరి కూచున్నారు. వనజ గారెలు వడ్డిస్తుంటే అడిగారు రెడ్డిగారు, "వనజకు పెండ్లి చేద్దామనుకుంటున్న, ఏమంటావ్!" అని భార్యను.
    పాణి గుండె జల్లుమంది.
    వనజ తడబడ్డది.
    మంజరి ఆశ్చర్యంగా చూసింది.
    "ఎవరికిచ్చి...." ముద్దా నోట్లో ఉండగానే అడిగింది ఇందిరమ్మ.
    "పంతులు కిచ్చి" - రెడ్డిగారు జవాబు చెప్పారు.
    మంజరి మీద పిడుగు పడ్డది. ఆకలి లేదనే నెపంతో చేయి కడుక్కొని గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది. మంచం మీద పడిపోయింది. దుఃఖం పొంగి గండిగొట్టి కళ్ళ ద్వారా ప్రవహించింది. వనజ ఎంత నీచురాలు! ఎంత దుర్మార్గురాలు! ఎంత కపటి? తనతో చెప్పనైనాలేదు. ఎంత ఘోరం చేసింది! పాణి ఆమెనే ప్రేమించాడేమో! తానంటే అతని కిష్టంలేదేమో! అయితే, పూజముందు తననలా ఎందుకు చూసినట్టు! మర్రిచెట్టు క్రింద అతని చూపులు !! పాణికి తానంటే ఇష్టమే! వనజే ఏదో నాటకం ఆడి ఉంటుంది! వనజే అతన్ని పీడించి ఉంటుంది. తండ్రిని కూడా పీడించి ఒప్పించి ఉంటుంది. దాసీది తనకు అడ్డు తగులుతుందా? అమాంతంగా పీక నులిమి చంపేయాలనుకుంది. గడీలోంచి వెళ్ళగొట్టాలనిపించింది. వెళ్ళగొట్టాలి. కానీ ఎలా? ఎవరితో చెప్పి? ఏమని? దాసీదిగా అది పాణి దగ్గరికి ఎన్నిసార్లయినా వెళ్ళవచ్చు. అతన్ని మురిపించవచ్చు. తాను? దొర కూతురు, అతని దగ్గరకు వెళ్ళలేదు. తన బాధ వ్యక్తపరచలేదు. తాను ప్రేమించానని చెప్పలేదు. తనకంటే దాసీదే నయం, తాను దాసీయైనా బాగుండును? ఎందుకీ దొరతనపు బతుకు? ఏం దొరతనం తనది! ఇంత పెద్ద దేశ్ ముఖ్ కూతురు ఒక దాసీదాన్ని వెళ్ళగొట్టలేదనిపించేసరికి దుఃఖం పొంగిపొర్లింది. గొంతులో నిలపడానికి చేసిన ప్రయత్నం విఫలం అయింది. దారాపాతంగా కన్నీరు వస్తుంటే పరుపుమీద బోర్లాపడి ఏడ్చింది. ఎవరికీ వినిపించకుండా నోట్లో పైటచెరగు పెట్టుకొని ఏడ్చింది. వెక్కెకి ఏడ్చింది, సాయంకాలందాకా ఏడ్చింది.
    డప్పుల చప్పుడు వినిపిస్తే లేచి కళ్ళు తుడుచుకొని బయటికి వచ్చింది.
    ఊరి డప్పులవాళ్ళంతా దప్పులు వాయిస్తూ ఊరంతా తిరిగి గడిముందుకు వచ్చేశారు. వాళ్ళవెనక జనం కూడా వచ్చేసింది. గడీ ముందు దప్పులు, కొములు, జనం కోలాహలంగా ఉంది. రెడ్డిగారు నూతనవస్త్రధారులై, తలపాగా ధరించి, కుంకుమబొట్టుతో బయటికి వచ్చారు.
    దూరంనించి సన్నాయి వినిపించింది.
    "ఓ రామ నీ నామ మెంత రుచిగా....." తాళాలూ, భజనా వినిపించాయి. రెడ్డిగారూ, జనం దేవుని సేవకై నిరీక్షిస్తున్నారు. గరుడ వాహనారూఢుడైన రాముడు కరవాలపాణియై వేంచేశాడు. రెడ్డిగారి సహితంగా జనమంతా రామునికి సాష్టాంగ దండ ప్రణామ మాచరించారు. గడీ ముందు రాముడు ఆగాడు. కొంతసేపు భజన జరిగింది. వనజ హారతి తెచ్చి అయ్యవారి కందించింది. అయ్యవారు ఆరగింపచేసి హారతి ఇచ్చి పళ్ళెం వనజకు అందించాడు. వనజ అందరికీ హారతి అందించి ప్రసాదం ఇచ్చి లోనికి వెళ్ళిపోయింది.
    రాముడు సాగిపోయాడు. కొంతజనం సాగిపోయింది. సైసు (గుర్రాల పోషకుడు) వాడు గుర్రం తెచ్చి రెడ్డిగారిముందు నుంచోపెట్టాడు. జనంలోకి చూస్తే కారణం కనిపించలేదు. పాణి కనిపించాడు రెడ్డిగారికి. 'పంతులు, నువ్వు గడీల్నే ఉండు' అని గుర్రం ఎక్కారు.
    పాణి మనసు కలుక్కుమంది.
    రెడ్డిగారు ఖడ్గపాణియై అశ్వారోహులైనారు. గుర్రం సాగింది. గుర్రం వెంట జనం సాగింది. దేవునిముందు బాజాలు, డప్పులు, కొమ్ములు మ్రోగుతున్నాయి. వెనకనుంచి అప్పుడప్పుడూ తుపాకులు పేలుతున్నాయి.
    ఊరేగింపు శమీవృక్షం దగ్గరికి చేరింది. జమ్మిచెట్టు మొదట వేదిక కట్టివుంది. బాజుతోనూ సున్నంతోనూ అలంకరించారు దాన్ని. స్వామిని వేదికమీద ఆసీనులను చేయించారు. చాకళ్ళు స్వామి ముందు చాపలు పరచారు. రెడ్డిగారు జమ్మిచుట్టూ ప్రదక్షిణం చేశారు. జనమంతా ఆయన్ను అనుసరించారు. తరువాత స్వామి ముందు కూర్చున్నారు రెడ్డిగారు. వారిపక్కనే కారణం కూచోగా ఎవరి అంతస్తుల్ననుసరించి వారు దూరం దూరంగా కూర్చున్నారు.
    శమీపూజ జరిగింది. జనమంతా చదువు వచ్చినవారు, కాగితాలు తీసుకొని-
    "శమీ శమయతే పాపం
    శమీ శత్రువినాశనం
    అర్జునస్య ధనుర్దారీ
    రామస్య ప్రియదర్శినీ"
    అని వ్రాసి ఆ సంవత్సరంలో వారికి కలగాల్సిన శుభ, లాభాలు వ్రాసి జమ్మికొమ్మలకు గుచ్చారు. తరవాత చీట్లన్నీ రెడ్డిగారి తుపాకి ముందు పెడ్తే తుపాకి పేల్చారు రెడ్డిగారు. వెంటనే అనేక తుపాకులు ప్రేలాయి. చాకళ్ళు స్వామివాహనాన్ని ఎత్తుకోగా, కుమ్మర్లు దివిటీలు పట్టారు. స్వామి 'సీమోల్లంఘనం' చేసి ఆలయానికి తిరిగివచ్చారు. పూజాదికములు ముగిసింతర్వాత ప్రసాదాదికములు తీసుకొని బయల్దేరారు జనం. డప్పులూ కొమ్ములూ ముందు నడువగా ఆశ్వారూఢులై రెడ్డిగారు గదీలో ప్రవేశించారు. డప్పులవాళ్ళూ పనిపాటలవాళ్ళూ ఒకపక్కన నుంచున్నారు. రెడ్డిగారు పేరు పేరునా పిల్చి అంతస్తులనుబట్టి అందరికీ డబ్బూ, వస్త్రాలు బహూకరించారు.
    ఆ రాత్రి గదీలో జనమంతా విపరీతంగా త్రాగేశారు-పాణి, మంజరి తప్ప. హాల్లో కేకలూ, నవ్వులు, లోకాన్ని మరచి, అంతస్తులు మరచి దొరవారి సహితంగా అందనాలాడారు ఆ రాత్రి.
                                              16
     మంజరిని చూచి చకితుడైనాడు పాణి. ఒక్కరోజులో ఎంతమార్పు! ముఖం కమిలింది. కళ్ళు లోతుకు పీక్కుపోయి ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి. శిరోజాలు చెదిరి గాలికి ఎగురుతున్నాయి. అలంకారం లేదు. వీణముందు కూచుని ఉంది.
    'మంజరీ! ఏమిటిది?' అడిగాడు పాణి ఆవేదనతో.
    దుఃఖం ముంచుకొచ్చింది. దిగమింగటానికి ప్రయత్నిస్తూ వీణ తీవలమీద వేళ్ళు ఆడించసాగింది.
    ఇంతలో వనజా వచ్చి కూర్చుంది. వనజను చూచి దుఃఖము, కోపమూ రెండూ పొంగాయి. వనజ ఎందుకు రావాలి? తాను పాణితో మాట్లాడతానని కాపలా? ఛీ, ఎంత దుష్టురాలు!  దుఃఖం మింగుడుపడ్డంలేదు. వనజను చూచిప్పుడల్లా కోపం మండుతూంది. మధ్య వనజ గోడ అయి నుంచుంది. వనజ పాణివైపు చూచింది. ఆ చూపు ఆమె గుండెలో శర వర్షం కురిపించింది. పాణి మాట్లాడడేం? ఏదో పిచ్చి పిచ్చిగా వుంది. తాను ఒట్టి నిస్సహాయురాలు! తానేమీ చేయలేదా? ఒక దాసీదాన్ని ఏమీ చేయలేదు. ఛ, ఏమిటీ బ్రతుకు? దుఃఖం పొంగింది. గొంతులో ఆగలేదు. పొర్లింది, టపటపా కన్నీరు కారింది వీణమీద.
    బావురుమని ఏడ్చేసింది.
    "ఏం మంజరీ, యేమి?" అంటూనే వున్నాడు పాణి. వీణ మీద పెద్దగా గొంతెత్తి యేడ్చింది. క్షణంలో గడీలోని స్త్రీ జనం యావత్తూ పోగయింది.  చెమటలు ముంచెత్తాయి మంజరిని. స్పృహతప్పి పడిపోయింది. "బిడ్డా! యేమైంది బిడ్డా?" అని ఇందిరమ్మ ఏడ్వసాగింది. అందరూ కలిసి మంజరిని మంచంమీద పడుకోబెట్టారు. పాణి తన గదికి వెళ్ళిపోయాడు. అతని తలమీద నూరు సమ్మెట పోట్లు పెట్టినట్లయింది. తను యేది తల్చుకున్నా దైవం తలకిందులు చేస్తున్నాడు. ఏదో అవాంతరం రానున్నదనుకున్నాడు. అతని మనస్సు అనేక అశుభాలు శంకించింది.
    మంజరి అలా ఎందుకు పడిపోయింది?
    ఆమె కంత దుఃఖం కల్గటానికి కారణం?
    తానేమయినా తప్పుచేశాడా?
    'అమ్మా!' అనే వనజ కేకా, "చెప్పు యెం చేసినావో?" అనే రెడ్డిగారి గర్జనా విని గదిలోకి పరిగెత్తాడు పాణి. రెడ్డిగారు బెత్తంతో బాదుతున్న దృశ్యం కనిపించిందతనికి. పరుగెత్తి వనజకు అడ్డంగా నుంచున్నాడు. పాణి. కుడి భుజంమీద పడింది రెడ్డిగారి బెత్తం. "అమ్మా!" అని అరిచాడు పాణి.
    రెడ్డిగారి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి.

 Previous Page Next Page