Previous Page Next Page 
హిమసుందరి పేజి 29

      కాని


   రామకృష్ణ చేసింది అదే పెద్ద తప్పు.


   దాని ఫలితం ముందు ముందు ఎలాగూ తప్పదు

 

                         13

    ఆ రోజు.

    సెకండ్ సాటర్ డే.

    రామకృష్ణ యింట్లోనే వున్నాడు.

    రామకృష్ణ యింటి పట్టున వుండటం వల్ల ఓ దృశ్యం చూశాడు.

    ఆ దృశ్యం!

    అతి మనోహరమైనది. అద్భుతమైనది. సృష్టిలో అతి తీయనైనది.

    అదేమిటంటే.

    ఉదయం రామకృష్ణ వరండాలో ఫేము కుర్చీలో కూర్చుని ఉదయం దినపత్రిక చదువుతున్నాడు. ఆ సమయంలో మామిడికాయలు అమ్ము వచ్చాయి.

    పెరట్లో వున్న సీత మామిడికాయల కేక వింటూనే వరండాలోకి పరుగెత్తుకుని వచ్చి మామిడికాయలబ్బాయ్ అంటూ గావుకేక పెట్టింది.

    మామిడికాయలు అమ్మే అతను వచ్చాడు.

    "రసాలా బంగినపల్లా!" రామకృష్ణ అడిగాడు.

    "ఇప్పుడు అవి రావు బాబూ! ఇవి పునాస మామిడికాయలు కాలంగాని కాలంలో కాస్తాయి" చెప్పాడు అతను.

    సీత కాయలు బేరం చేసింది. అమ్మే అతను కాయ రెండు రూపాయలు అన్నాడు. సీత కాయ రూపాయకి ఇవ్వమంది. బేరం కుదరలేదు. అతను రెండు రూపాయలకి పది పైసలు పెంచింది. ఆ బేరం అలా అలా సాగి చివరికి అయిదు రూపాయలకి మూడు కాయలు ఖరారు అయింది.

    మామిడికాయల అబ్బి మూడుకాయలు అయిదు రూపాయల కిచ్చి వెళ్ళిపోయాడు.

    "అయిదు రూపాయలకి రెండున్నర కిలోల వంకాయలు వస్తాయి" రామకృష్ణ అన్నాడు.

    "తోటకూర అయితే గంపెడు వస్తుంది" కిల కిల నవ్వుతూ చెప్పింది సీత.

    మండిపోతున్న మామిడికాయలు అని ఉదయంలో ఎక్కడన్నా వేశారేమో అని దినపత్రికంతా తిరగేశాడు రామకృష్ణ. అలాంటి వార్తేలేదు.

    ఆ పూట సీత మామిడికాయ పప్పు మామిడికాయ పచ్చడి చేసింది. ప్లేటులో కాస్త ఉప్పు కారం వేసుకుని మామిడికాయ ముక్కలకి అద్దుకుని పర పర నములుతూ ముక్కలని తింది.

    రెండోసారి కాఫీ తాగుదామనిపించి రామకృష్ణ వంట గదిలోకి వచ్చేసరికి సీత మామిడికాయ ముక్కలమీద దండయాత్ర చేస్తున్నది.

    రామకృష్ణ చటుక్కున పక్కకి తప్పుకున్నాడు.

    రామకృష్ణ డబ్బుకి ఆలోచించడు. ఎందుకు అంత దండగ పెడతారు. అని అప్పుడప్పుడు సేత అంటుంటుంది. అలాంటి సీత అయిదు రూపాయలు పెట్టి మూడు మామిడికాయలు కొంది.

    అంటే

    ఏదో వున్నట్లే.

    అంత ఖరీదు పెట్టి కొన్నదంటే.

    ఏదో వున్నట్లే.

    పళ్ళు పులిసే పుల్లని ముక్కలు పర పర నమిలి తింటున్నదంటే -

    ఏదో వుండకుండా ఎలా వుంటుంది?

    కనుక

    ఏదో వున్నట్లే.

    ఆ..... ఏదో అన్నది.

    అది...... అది..... కాదు కదా!

    రామకృష్ణ వళ్ళు పులకరించింది.

    సీత మామిడికాయ ముక్కలని బెల్లం గడ్డలాగ తింటుంటే అది చూస్తున్న రామకృష్ణ పళ్ళు పులిశాయి. అదే అయి వుంటుంది కనుకనే స్వీట్ తిన్నంత తేలికగా పుల్ల మామిడికాయ ముక్కలని ఉదయానే తినగలుగుతున్నది.

    సీతకి అడ్డు తగలకూడదనే వుద్దేశ్యంతో రామకృష్ణ కాఫీ తాగటం వాయిదా వేసి వెళ్ళి వరండాలో కూర్చున్నాడు.

 Previous Page Next Page