Previous Page Next Page 
రాక్షస నీడ (రెండవ భాగము) పేజి 29


    బాగానే ఉంది. అబార్షన్ కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు."
    "మరి అలా ఉన్నావేం?"
    విమల మాట్లాడలేదు.
    "చెప్పు విమలా ఏమైంది? అరుణ ప్రాణానికి ముప్పేంలేదుగా?"
    "లేదు."
    "మరెందుకలా ఉన్నావ్?"
    "అరుణ అలా అవడానికి కారణం నీకు తెలియదా?" నిలదీసినట్టుగా అడిగింది విమల.
    "తెలుసు."
    "ఆ పని చేసిందెవరో కూడా తెలుసా?"
    "తెలుసు."
    "తెలిసే రేప్ కేసుగా నమోదు చెయ్యమన్నావా?"
    "అవును" అన్నది సునంద.
    "గౌతమ్ అలాంటి పని చేసి ఉంటాడంటే నాకు నమ్మకంగాలేదు" అన్నది విమల.
    "నీతో ఎవరు చెప్పారు?" సునంద ఆశ్చర్యంగా అడిగింది.
    "అరుణ."
    "అరుణకు స్పృహ వచ్చిందా?"
    "వచ్చింది. నిన్ను పిలుస్తున్నదంటే నేను వెళ్ళాను."
    "అరుణ స్వయంగా చెప్పిందా? గౌతమ్ ఆ దారుణానికి పాల్పడ్డాడని చెప్పిందా?"
    "రేప్ చెయ్యలేదు. ఇద్దరూ పెనుగులాడుతూ ఉండగా వంటమనిషి తలుపు కొట్టిందట. అతడు పారిపోయాడట. ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదంటూంది."
    సునంద లోపలకు వెళ్ళబోయింది. విమల చెయ్యి పట్టుకొని ఆపింది.
    "అక్కా! వెళ్ళకు. అరుణ చాలా ఉద్రేకపడుతోంది. నర్సింగ్ హోమ్ సీనియర్ డాక్టర్ ఎవర్నీ లోపలకు రానివ్వవద్దని చెప్పిందట."
    "సుమతి లేదా?"
    "గంటలో వస్తానని ఇంటికి వెళ్ళింది. అరుణ గురించి భయపడవలసిన పనిలేదని చెప్పింది."
    "విమలా, ఇక్కడే ఉండు. నేనొకసారి బయటికి వెళ్లొస్తాను."
    విమల సునంద ముఖంలోకి పరిశీలనగా చూసింది. సునంద స్వభావం విమలకు బాగా తెలుసు.
    "ఎక్కడికి? నాకు చెప్పు ఆ పనేదో నేను చేస్తాను" అంది విమల.
    "కాదు నేనే వెళ్ళాలి."
    విమల సునంద కళ్ళలోకి లోతుగా చూసింది.
    "పోలీసు స్టేషన్ కేనా?
    "అవును."
    "నీకు మతిపోయిందా?"
    "ఎందుకలా అంటున్నావు."
    "రేప్ జరగలేదు. ప్రయత్నం జరిగింది."
    "అయితే?"
    విమల మాట్లాడలేదు.
    సునంద ముందుకు అడుగువేసింది. విమల చటుక్కున ఆమె చెయ్యి పట్టుకుంది.
    సునంద విమల ముఖంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది.
    "గౌతమ్ మీద పోలీసు రిపోర్టు ఇస్తావా?"
    "గౌతమ్ కాకపోతే నీకు అభ్యంతరం లేదు కదూ? నువ్వే ముందు ఆవేశంగా బయలుదేరతావు. ఉరికంబం ఎక్కించాలని వేదికలమీద అరుస్తావు అవునా!"
    విమలకు ఏం సమాధానం ఇవ్వాలో తోచక తికమకపడింది.
    "అదికాదు అక్కా ఇందు గురించి ఆలోచించు."
    "విమలా! ఇందు నా బిడ్డ. నేను పెంచిన బిడ్డ. ఈ సమయంలో ఇందు ఉంటే తనే ముందు పోలీసుస్టేషన్ కు వెళ్ళేది." గర్వంగా అన్నది సునంద.
    "మరోసారి ఆలోచించు!" అన్నది విమల.
    "ఆలోచనకేముంది? ఊళ్ళో ఎక్కడ ఏం జరిగినా అపరాధుల్ని బయటకు లాగటానికి ప్రయత్నించే మనం. ఒక బాలికమీద__ తన తమ్ముడి భార్యమీద___గర్భవతి మీద అలాంటి దారుణానికి పాల్పడిన రాక్షసుడ్ని వదిలెయ్యాలా? మనకొక నీతి, పరాయివాళ్ళకొక నీతీనా? విమలా, నువ్వలా మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది" అన్నది సునంద.
    "గౌతమ్ అలాంటి పని చేశాడంటే నాకు నమ్మకంగా లేదు. అందుకే తొందర పడొద్దు అంటున్నాను."
    "చేశాడు. అతడ్ని గురించిన మన అంచనాలన్నీ తలకిందులు చేశాడు. మేకవన్నె పులి. వాడ్ని వెంటనే అరెస్టు చేయిస్తేగాని నా మనసుకు శాంతి ఉండదు."
    "అరుణ చెప్పడమేగా?"
    "అరుణ నాకు చెప్పలేదు. చెప్పే స్థితిలో లేదు."
    "వెంకటమ్మ చెప్పింది."
    విమల మౌనంగా ఉండిపోయింది.
    "అరుణ ఏం చెప్తుందో వినాలనే ఇంతసేపు ఊరుకున్నాను. నేను వచ్చేవరకు ఇక్కడే ఉండు" అని సునంద చరచర బయటికి వెళ్ళిపోయింది.
    సునంద వెళ్ళిన వైపు చూస్తూ నిలబడి పోయింది విమల.
    
                                                           10
    
    "నేను నమ్మను" కచ్చితంగా అన్నది ఇందుమతి.
    "నీ ఉద్దేశం అరుణ అబద్దం చెప్పిందనేనా? వెంకటమ్మా?" నిలదీసింది సునంద.
    "వాళ్ళు చూసింది నిజమే కావచ్చు. కాని అతడు గౌతమ్ కాదు"
    సునంద కూతుర్ని మతిపోయిన మనిషిని చూసినట్టు చూసింది.
    "గౌతమ్ ఊళ్ళోలేడు."
    సునంద ఆశ్చర్యంగా చూసింది.
    "ఊళ్ళో లేడా? ఎక్కడికి వెళ్ళాడు?"
    "ఎక్కడికి వెళ్ళాడో తెలియదు."
    "ఎప్పుడు వెళ్ళాడు?"
    "మొన్న రాత్రి."
    "అలా అని ఎవరు చెప్పారు?"
    "అతనే చెప్పాడు."
    "ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదా?"
    "అడిగాను వచ్చాక చెప్తానన్నాడు."
    "ఏం పనిమీద వెళుతున్నానన్నాడు?"
    "చెప్పలేదు."
    "అడగలేదా?"
    "అడిగాను. కాని, చెప్పలేదు."
    "అంటే ప్లాన్డుగానే చేశాడన్న మాట. ఎలిబి కోసం ఊరికి వెళ్తున్నట్టు నీతో చెప్పాడు."
    "లేదు. గౌతమ్ నిజంగానే ఊరికి వెళ్ళాడు."
    "ఎక్కడ కెళ్ళిందీ, ఎందుకు వెళ్ళిందీ నీ దగ్గరకూడా రహస్యంగా ఉంచడానికి కారణం?"
    "ఒక స్నేహితుడి కుటుంబానికి సంబంధించిన విషయం అట. ఆ స్నేహితుడికి ఎవరికీ చెప్పనని మాట ఇచ్చాడట."
    "అది నువ్వు నమ్మావట!" కోపంగా అన్నది సునంద.
    "మమ్మీ.....గౌతమ్ అలాంటిపని చేస్తాడని ఎలా అనుకుంటున్నావ్?"
    "అనుకోలేదు. అందుకే బాధగా ఉంది."
    "నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను మమ్మీ."
    "అరుణ చెప్పింది అబద్దమా?"

 Previous Page Next Page