"మీ బుద్ది ఎందుకిలా మారిపోయింది? చెప్పండి? హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చిన దగ్గర్నుంచీ చూస్తూనే ఉన్నాను. మీ ధోరణీ మారిపోయింది. అసలీలాంటి అనుమానం ఎలా కలిగింది? ఇన్ని రోజులుగా నన్నర్ధం చేసుకొందిదేనా........."
కళ్ళవెంబడి కారిపోతున్న నీళ్ళు తుడుచుకుంటూ .........పౌరుషంగా అంది.
"ఇదుగో......మిసెస్ శ్రీకాంత్ నీకొచ్చిన ఆహ్వాన పత్రిక! ఊరందరికీ నువ్వు మిసెస్ శ్రీకాంత్ వని ఎలా అనుమానం వచ్చింది? సరే నేను అర్ధం చేసుకోలేదు? ఊరంతా కూడా నిన్ను అర్ధం చేసుకోలేదా? మీరు ఎంత బాహాటంగా ప్రవర్తిస్తే ఇలాంటి ఆహ్వానాలు అందుతాయ్?"
"ఎవరిచ్చారిది?" ఆహ్వానం అందుకొంటూ అడిగింది సావిత్రి.
"ఎవరో ఒక స్త్రీ పురుషుడూ వచ్చి ఇచ్చారు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒకసారి వచ్చారుట! అప్పుడు మిమ్మల్ని కలుసుకున్నరుట! అప్పుడే మీరిద్దరూ భార్యా భర్తలని తెలుసుకున్నారుట! ఎలా తెలుసుకొంటారు! మీ మాటల్ని బట్టి, మీ ప్రవర్తనని, అన్యోన్యతని మీ మధ్య ఉన్న చనువునీ చూసి సరిగ్గానే కనుక్కున్నారు! ఇందులో వాళ్ళ తప్పేముందీ?"
"మీరు ఒకరిని మాటలనే ముందు కొంచెం ఆలోచించండి! ఇదెలా జరిగిందో నాకు తెలుసు! ఆరోజు హాస్పిటల్ మంచి నేనూ శ్రీకాంత్ కార్లో ఇంటికొచ్చే సరికి వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుని చూస్తున్నారు. మమ్మల్నిద్దరినీ చూడగానే భార్యాభర్తలనుకున్నారు. శ్రీకాంత్ ని ఆహ్వానించి తరువాత ఆమె వెళ్ళే ముందు నన్ను కూడా తప్పక రమ్మని చెప్పి వెళ్ళిపోయింది. వెంటనే నేను శ్రీకాంత్ భార్యను కాదు అని చేపుదామన్న వాళ్ళప్పటికే వెళ్లిపోతున్నారు. చేసేది లేక మాట్లాడకుండా ఊరుకున్నాను.
అయినా వాళ్ళకూ నాకూ సంబంధమేముందని? తరువాత వాళ్ళకు చెప్తానని శ్రీకాంత్ అన్నారు గానీ ఆ విషయం ఎవరికి మాత్రం గుర్తుంటుందీ? అందుకే మళ్ళీ ఈ పొరబాటు జరిగి వుంటుంది. నేను మార్కెట్ కెళ్ళినప్పుడు కూడా అటో కోసం చూస్తోంటే అదే సమయానికి శ్రీకాంత్ కార్లో వస్తూ కనిపించారు. నన్ను కార్లో ఇంటికి తీసుకువచ్చారు. మీ బుద్దులు వక్రించడం చేత దానికి కధలల్లుకుని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు ........." ఆయాసంతో రొప్పుతూ అంది సావిత్రి.
"మొగుడి చాటు వ్యవహారాలు చేసేవాళ్ళు చాలా చక్కగా తమ చేష్టలనీ కప్పి పుచ్చుకుంటారు సావిత్రీ! నేను నిన్ను నిందించడం లేదు! నీ బాగుకోరి అన్నాను. అలాంటి భావం నేనే మీ ఇద్దరికీ కలిగించాను! అంచేత అది నా తప్పు?" కుర్చీలో కూలబడిపోతూ అన్నాడతను.
"ఏమిటి , ఏదో తప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు?" ఆ గదిలో కోస్తూ నవ్వుతూ అన్నాడు శ్రీకాంత్. చప్పున చలపతి తన ముఖంలో భావాలు చెరిపేశాడు.
"ఆ ఏదో పిచ్చాపాటి మాట్లాడుతున్నాం" అన్నాడు నవ్వుతూ.
సావిత్రి అక్కడ నుండి వంటింటివేపు వెళ్ళిపోయింది.
ఆ రాత్రి శ్రీకాంత్ ఒక్కడే భోజనం చేశాడు. సావిత్రి అతనికి వడ్డించడానికి రాలేదు. తలనొప్పి అని చెప్పి గదిలోనే పడుకుండి పోయింది. చలపతి ఆకలి లేదన్నాడు.
* * *
మర్నాడు ఉదయం ఆమె తనతో ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం శ్రీకాంత్ కి ఆశ్చర్యాన్ని కలిగించింది. చలపతి ధోరణి చాలా రోజుల్నుంచి అతనికి వింతగా కనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా కారణమేమిటో అర్ధం కావడం లేదు.
శ్రీకాంత్ ఆఫీసు కెళ్ళిపోయాడు. చలపతికి ఇంకా కోపం చల్లారలేదు. తను ఏర్పరచుకున్న రుజువులన్నీటినీ సావిత్రి క్షణంలో ఏవేవో కధలు చెప్పి అవి అసత్యాలని అనేసింది. ఒకవేళ సావిత్రి నిజంగా శ్రీకాంతే కావాలని ఉంటే, తన భార్యగా వుండటం ఇష్టం లేదని తేల్చేస్తే తనేం చేయాలి? ఏం చేయగలడు?
ఆమెను వదిలేసి తనదారిన తను పోవడమా? లేక ఆమెను బలవంతంగా లాక్కొని పోయి, ఇంకెక్కడయినా మళ్ళీ జీవితం మొదలు పెట్టడమా:? అదీ ఇదీ కాక అసలు సావిత్రి కింత విషం ఇచ్చి తనూ ఇంత తీసుకోవదమా?
ఏమీ పాలుపోవడంలేదతనికి. సావిత్రి ని వదిలి తను ఉండగలడా? ఎలా సాధ్యం అది? ఆమె కొసమే తన ఇన్ని అవస్థలు పడుతున్నాడు. అమెకోసమే బ్రతుకుతున్నాడు! తన సర్వస్వం ఆమె అని అనుకుంటున్నాడు. అలాంటిది హటాత్తుగా సావిత్రి ఇక కనబడదు అనుకుని ఎలా బ్రతకగలడు?
పోనీ సావిత్రిని చంపి తనూ చనిపోగలడా? చాలాసేపు ఆలోచించాడు చలపతి. సాసిత్రిని తను తనచేతులతో చంపగలడా? సుఖ పెట్టాలనీ, కష్టాల నీడ ఆమె మీద పడకుండా చెయ్యాలనీ అనుకొన్న తను ఇలాంటి దారుణం చేయగలడా?
సావిత్రి బొమ్మలా నడచి అతని దగ్గరకొచ్చింది. ఆమె ముఖంలో అందం కనిపించడం లేదు. కఠినత్వం కనిపిస్తోంది. ఆకర్షణ కనిపించడం లేదు. పట్టుదల కనబడుతోంది.
"నేను వెళుతున్నాను........" అంది చలపతి తో అతని వంక చూడకుండానే.
"ఎక్కడికి?" అడిగాడు చలపతి.
"ఎక్కడికో చోటకి! ఇంక ఇక్కడ మరొక్క క్షణం కూడా వుండటం నా కిష్టం లేదు."
"ఎందుకని?"
"ఎందుకో మీకు తెలుసు!"
"వెళ్ళడానికి వీల్లేదు?"
"నేను వెళ్ళాల్సిందే......."
"ఊహు నేను వెళ్ళనివ్వను......."
"ఎందుకు! నను బలవంతంగా ఆపినా నేను ఏదొక అఘాయిత్యం చేసి ప్రాణం తీసుకొంటాను."
"నీ ప్రాణం అంత తేలిగ్గా పోవడం నాకిష్టం లేదు."
సావిత్రి బయటకు నడవబోయింది.
చటుక్కున ఆమెను రెండు చేతులతో పట్టుకొని లోపలకు ఈడ్చుకుపోయి మంచం మీదకు విసురుగా తోశాడు. తల మంచం బద్దికీ కొట్టుకొని నుదుటి మీద గాయమయి రక్తం ప్రవాహించసాగింది. లేచి నుంచుని చేతితో గాయాన్ని నొక్కిపట్టుకొని దుఃఖం అపుకోసాగిందామె.
"అరె! ఏమయింది?" లోపలికొస్తూ అన్నాడు నర్సరాజు.
చలపతి ఖంగారు పడ్డాడు. "దెబ్బ తగిలింది........" అన్నాడు పొడిగా. ఆ సమయంలో అక్కడికి నర్సరాజు ఎందుకోచ్చాడో అతనికి తెలీలేదు.
"ఎలా?" అనుమానంగా చూస్తూ అడిగాడు.
"మంచం బద్దీ తలకు తగిలింది."
"తగిలితే నువ్వూ చూస్తూ ఊరుకున్నావా?"
"చిన్న దెబ్బెగా!"
"ఒక ఆపరేషనయ్యేసరికి నువ్ డాక్టర్ వి కూడా అయిపోయావన్నమాట!" కొంచెం కోపంగా అన్నాడతను.
"చూడమ్మా , దూది వుంటే దాంతో గాయం కడుక్కో........" సావిత్రితో అన్నాడతను.
సావిత్రి లోపలకు వెళ్ళిపోయింది.
వ"నువ్వురేపోసారి ఆఫీసుకి రావాలి! ఈ విషయం చెప్పడానికే వచ్చాను! నీ విషయం మానేజ్ మెంటువారితో మాట్లాడాలట! వెంటనే ఉద్యోగం ఇవ్వమని చెప్పారుట! కనుక నీ స్థానంలో కొత్తగా తీసుకున్నతనికి ఉద్వాసన చెప్పి నీ కిస్తారుట!"
చలపతి కెందుకో ఆ వార్త అంతగా అనందం కలిగించలేదు.
"సరే......"అన్నాడు నెమ్మదిగా.
"నేనికవెళతాను. అవతల వేరే పనులున్నాయ్........."వెళ్ళిపోయాడు నర్సరాజు.
సావిత్రి దెబ్బకి కొంచెం పౌడరు అద్ది దూది అడ్డం పెట్టుకుంది.
* * *
మధ్యాహ్నం కూడా ఇద్దరూ అన్నాలు తినలేదు. సాయంత్రం శ్రీకాంత్ వచ్చాక పరిస్థితి కొంత మెరుగయింది. చలపతికీ, శ్రీకాంత్ కీ టీ తీసుకొచ్చి ఇచ్చిన ఆమె వంక చూసి ఆశ్చర్యపోయాడు శ్రీకాంత్.