Previous Page Next Page 
రెండోమనసు పేజి 31


    "అరె! ఆ దెబ్బ ఎలా తగిలింది?" అడిగాడు ఆదుర్దాగా.
    "ప్రణయకలహంలో దెబ్బ తగిలింది...."నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాడు చలపతి.
    "ప్రణయకలహాలు ఇంత భయంకరంగా వుంటాయన్నమాట......." తనూ నవ్వుతూ అన్నాడు అతడు. సావిత్రి లోపలి కెళ్ళిపోయింది.
    మర్నాడు శ్రీకాంత్ గదిలో కెళ్ళాడు చలపతి.
    "నేను ఆఫీస్ కేళుతున్నాను! రమ్మని కబురొచ్చింది! నువ్వో చిన్న సహాయం చేయాలి!"
    "ఏమిటది?" అడిగాడు అతడు.
    "సావిత్రికి దెబ్బ తగిలింది కదా! అంచేత జ్వరం వచ్చినట్లుందట. కొంచెం నువ్వు ఆఫీస్ కెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరకు కెళ్ళి చూపించి ఇంటికి పంపించు."
    "సరే?"
    "మరో విషయం ! నిన్న పోట్లాడానని ఆమెకు నా మీద కోపంగా వుంది! అందుకని ఇంటి దగ్గర వదిలినపుడు బయటకు పోకుండా చూస్తుండమని తోటమాలికి చెప్పు......."
    "అంటే చాలా పెద్ద గొడవే జరిగిందన్న మాట......." అడిగాడు అతను.
    "మరీ చంటిపిల్లలా ప్రవర్తిస్తుందోకోసారి..........." నవ్వుతూ అన్నాడు చలపతి.
    అతనికి ఆనందంగా వుంది. ఇప్పుడు చూడాలి తమాషా! శ్రీకాంత్ సావిత్రిని డాక్టర్ దగ్గరకు వెళదాం రమ్మంటాడు. 'మన విషయం చలపతికి తెలిసిపోయింది, ఇంకెలా తిరగుదాం! నేను రాను' అంటుంది సావిత్రి. అతడు ఆశ్చర్యపోతాడు. ఆమెని వెంబడి తీసుకెళ్ళడానికి అతనికి భయం వేస్తుంది.కానీ తీసుకెళ్ళక తప్పదు! లేకపోతే ఎందుకు తీసుకెళ్ళ లేదని నడుగుతాను. ఇద్దరూ ఏం చేయాలో తెలీక తల్లడిల్లిపోతారు. అలాగే బాధించాలి వీళ్ళని. అప్పుడు గాని తన కసి తీరదు.
    చలపతి ఆఫీస్ కి బయలుదేరాడు. మరికొద్ది సేపటికే శ్రీకాంత్ తనూ రెడీ అయి సావిత్రి దగ్గరికి నడిచాడు.
    "మనం డాక్టర్ దగ్గర కేళధాం పదండి! ఆ దెబ్బకి డ్రస్ చేయించి కట్టు కట్టిద్దాం" అన్నాడు.
    సావిత్రి అతని కళ్ళలోకి చూసింది. నెమ్మదిగా . అతనిలో ఎలాంటి కల్మషం లేవు. అతనిక్కావలసింది కేవలం తనూ, చలపతీ సుఖంగా వుండటం! నిజానికి తనకూ అతనికీ ఎలాంటి స్నేహమూ లేదు. కేవలం చలపతి మీద అభిమానం ఇద్దరనూ దగ్గరకు చేర్చింది. ఒకరి మీద ఒకరికీ గౌరవాన్ని ఆత్మీయత కలుగజేసింది.
    "ఇది చిన్న దెబ్బే ! దీనికి డాక్టరెందుకు! తగ్గిపోతుంది!" నవ్వు తెచ్చుకుంటూ అంది.
    "ఒకసారి డాక్టర్ డ్రస్ చేస్తే బాగుంటుంది. అదీగాక మిమ్మల్ని డాక్టర్ కి చూపించకపోతే చలపతే గొడవ చేస్తాడు మళ్ళీ!"
    "ఎందుకూ?"
    "వాడిగా చెప్పింది - మిమ్మల్ని తీసుకెళ్ళమని"
    "చలపతి చెప్పాడా?"
    "అవును!"
    "మీరు నిజమే చెపుతున్నారా?" నమ్మలేనట్లు అడిగింది సావిత్రి.
    "బాగుంది! ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన పనేముంది? అయినా మీ ఇద్దరకూ ఏవో కీచులాటలొచ్చినంత మాత్రాన ఒకరి మీద ఒకరికి ప్రేమ పూర్తిగా తుడిచిపెట్టుకుపొతుందేమిటి?" నవ్వుతూ అన్నాడు అతడు.
    సావిత్రి అంతా అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
    చలపతి ఇలా ఎందుకు చేస్తున్నట్లు ! శ్రీకాంత్ తో విహారాలు చేస్తోందని నిందించి మళ్ళీ అతనినే తనని బయటకు వెళ్ళమని ప్రోత్సహించడంలో అర్ధం ఏమిటి?
    ఇందులో ఏమి నాటకం వుంది?
    "దయచేసి మీరు వెళ్ళండి! నేనిపుడు బయటకు రాలేను!" ప్రాధేయపూర్వకంగా అందామె.
    "ఎందుకని?"
    "కారణం ఏమీ లేదు! కొంచెం బద్దకంగా వుంది అంతే!"
    "కార్లో వెళ్ళి రావదమేగా! మిమ్మల్ని మళ్ళీ ఇంటి దగ్గర వదలివెళతాను."
    "నన్ను బ్రతిమాలకండి! నేను రాలేను!" అసహనంగా అందామె.
    అతడు నివ్వెరపోయాడు.
    "సావిత్రి ఎందుకిలా అంటోంది! డాక్టరు దగ్గరకు రాకపోవడానికి కారణం ఏమిటి!" చలపతి ఆమెను కొట్టినవాడు డాక్టరు దగ్గరకు ఎందుకు తీసుకెళ్ళలేదు! తననే తీసుకెళ్ళమని ఎందుకు చెప్పాడు.
    ఇందులో తనకు తెలీని కధేదో వుందని అర్ధమయింది.
    "సరే మీ ఇష్టం! మీకు 'రాకూడదు' అన్న విషయం వుంటే నేనేమి చేయలేను....వస్తాను....." వెళ్ళిపోయాడతను.


                                                              * * *

    చలపతి ఉద్యోగం వచ్చింది. అయితే ఈ వార్త అతను సావిత్రితో చెప్పలేదు. ఆమెకూ అతనికి బొత్తిగా మాటల్లేవ్.
    టైముకి నిద్రలేవడం - ఇంట్లో పని చూచుకోవడం -----చేస్తోందామె. తను ఉద్యోగాన్వేషణతో తిరిగిరావడం - భోజనం చేస్తుండగా, శ్రీకాంత్ వచ్చాడతని దగ్గరకు.
    "ఏమిట్రా అలా కనిపించకుండా తిరుగుతున్నావ్!' అన్నాడు తనూ భోజనానికీ కూర్చుంటూ.
    "నేను కనిపించకపోవడం వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగదు కదా......." పొడిగా అన్నాడు చలపతి. శ్రీకాంత్ కి అతని మాటల్లో అర్ధం ఏమి కనిపించలేదు.
    "నిన్ను కొన్నాళ్ళు మెంటల్ హాస్పిటల్లో చేర్చటం మంచిదనుకుంటున్నాను....." అన్నాడు నవ్వుతూ.


                                                             * * *

    "అక్కడికి ఇక్కడి! పెద్ద తేడా ఏముందిలే?"
    "చాలా తేడా వుంటుంది! ఎందుకంటే అక్కడ నీకు మంచి కంపెనీ వుంటుంది. నీ మాటల్ని అర్ధం చేసుకునే జనం బోలెడు మంది వుంటారు........."
    చలపతి మాట్లాడలేదు. మౌనంగా భోజనం ముగించి చేయి కడిగేసుకున్నాడు.
    అతని పరిస్థితి శ్రీకాంత్ ఆశ్చర్యం కలిగిస్తోంది! ఎందుకిలా తయారయ్యాడు వీడు? కేవలం ఉద్యోగం లేకపోవడం వల్లా?
    సావిత్రి తో కూడా చాలా ముభావంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తూనే వుంది. ఒకవేళ ఇద్దరికీ ఏదయినా వివాదం లాంటిది వచ్చిందేమో! వాళ్ళిద్దరూ తనకు తెలిసి ఏ ఒక్క రోజూ కుడా ఒక్క మాట అనుకోవటం తానింత వరకూ చూడలేదు. ఇపుడు ఇద్దరూ పోట్లాడుకోవడానికి కూడా కారణం ఏమి కనిపించటం లేదు.ఆఫీస్ కి బయల్దేరాడు శ్రీకాంత్. బస్ స్టాఫ్ దగ్గర నిలబడ్డ చలపతిని చూసి కారాపాడు.
    "నేను డ్రాప్ చేస్తాన్రారా!" అన్నాడు ఆప్యాయంగా.
    "వద్దులే - బస్ ఉందిగా మా ఆఫీస్ కి"
    "మీ ఆఫీస్ కెందుకు?"
    "ఉద్యోగం ఇస్తానన్నారు - ఇవ్వాళ్ళ నుంచీ-"
    "మరా సంగతి చెప్పలేదేమిటి?"

 Previous Page Next Page