Previous Page Next Page 
రెండోమనసు పేజి 29


    చలపతితో మాట్లాడకుండానే అవతలి వేపుకి తిరిగిపడుకుంది. ఒకటి రెండు సార్లు పిలిచినా జవాబివ్వలేదు .
    ఉదయం శ్రీకాంత్ ఆఫీస్ కెళ్ళగానే తనూ ప్రయాణమయ్యాడు చలపతి.
    "మళ్ళీ మీ ఆఫీస్ కెనా?" అడిగింది సావిత్రి.
    "అవును?" ఏం?"
    "వాళ్ళు ఇప్పుడే ఉద్యోగం రాదన్నారుగా!"
    "నర్సరాజు స్నేహితుడెవరో ఉన్నాట్ట! అతని దగ్గరకు పంపిస్తానన్నాడు నన్ను."
    "ఎందుకని?"
    "అక్కడ ఒక ఉద్యోగం ఉందట....."
    "ఏమిటది?"
    "ఫ్యూన్......."
    సావిత్రి భరించలేకపోయింది.
    "నాలుగురోజులు ఆలస్యమయినా కొంచెం గౌరవంగా ఉండే ఉద్యోగం చూసుకోకూడడూ? మీకు మరీ అంత తొందరెందుకు?"
    చలపతికి అనుమానం రాన్రాను దృవపడుతోంది. సావిత్రికి ఇక్కడి నుంచి వెళ్ళటం ఇష్టం లేదు. అందుకే ఇలా మాట్లాడుతోంది.
    "సరే! మీరు వెళ్ళిరండి. నేను మార్కెట్ కెళ్ళి వస్తాను మధ్యాహ్నం"
    "ఎందుకు?"
    "ఇంట్లోకి చాలా వస్తువులు తేవాలి. వంటిల్లు ఖాళీ అయిపొయింది........."
    "మరి డబ్బు..."
    "డబ్బు మన దగ్గరెక్కడుంది?"
    "అందుకే అడుగుతున్నాను. ఎలా కొనుక్కోస్తావా అని!"
    "బాగుంది ఇన్ని రోజుల్నుంచీ శ్రీకాంత్ గారి డబ్బేగా వాడుతోంది. ఇప్పుడూ అదే"
    "నీకు డబ్బిచ్చి వెళ్ళాడా?"
    "ఊహూ! బీరువాలో వుంటుంది. అవసరమయితే వాడమని ముందే చెప్పారు!"
    "ఓహో......." అర్ధమైనట్లు అన్నాడు చలపతి.
    "నీకీ ఇంట్లో చాలా అధికారాలోచ్చేసీనయ్యన్నమాట!" నవ్వు తెచ్చుకుంటూ అన్నాడతను.
    "బాగుంది మీరు చెప్పేది . ఇది మన అవసరం కూడా కదా! అధికారమో, దయాదాక్షిణ్యాలో, ఏదయితేనేం?" అద్దం వేపు తిరిగి తల దువ్వుకుంటూ అందామె.
    చలపతి ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. ఆమెకేమీ చెప్పకుండానే బయట కెళ్ళిపోయాడు.కావాలనీ ఉద్యోగం గురించి అబద్దం చెప్పి బయటపడ్డాడు గానీ ఎక్కడికీ కెళ్ళాలో మాత్రం తెలీలేదు. ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. ముందీ ఇంట్లో నుంచి బయటపడాలి. అంతవరకూ మనశ్శాంతి ఉండదు తనకు. సావిత్రి విషయం ఆ తరువాత ఆలోచించవచ్చు. ఆమె దారి తప్పిందా, తప్పలేదా.
    తన తెలిసిన వాళ్ళందరి దగ్గరకూ తిరిగాడతను. ఎక్కడా ఉపయోగం కనిపించలేదు. మధ్యాహ్నం మూడున్నరకి కాళ్ళీడ్చుకొంటూ ఇల్లు చేరుకొన్నాడు.
    బయట కుర్చీల్లో కూర్చున్న స్త్రీ పురుషులిద్దరూ కనిపించారతనికి.
    "ఎవరు?" అడిగాడు చలపతి వారి దగ్గరికి నడిచి.
    "శ్రీకాంత్ గారినీ, వారి మిసెస్ నీ కలుసుకోడానికి కొచ్చాము! మీరు వారి బంధువా?"
    "అవును?" ఇంకేమనడానికి తోచలేదు చలపతికి. కాని వాళ్ళ మాటలే అతనికి అర్ధం కాలేదు.
    "శ్రీకాంత్ కి వివాహం కాలేదు కదా?" ఆశ్చర్యం అణుచుకొంటూ అడిగాడు.
    కొద్దిక్షణల తర్వాత ........" భలేవారే! కాకపోవడమేమిటి? ఈ మధ్యన వారిద్దరినీ మేమే స్వయంగా కలుసుకొని మా డ్రామా ప్రదర్శనకి ఆహ్వానించాం కూడానూ!" నవ్వుతూన్నాడా వ్యక్తీ.
    చలపతి నివ్వెరపోయాడు. ఈ మధ్య అంటే ఎప్పుడు? తను హాస్పిటల్ లో ఉన్నప్పుడా?
    అప్పుడు ఇంట్లో వుంది సావిత్రీ , శ్రీకాంత్ లే! అంటేవారు అందరి ఎదుటా అప్పుడే భార్యాభర్తలుగా వ్యవహరించారా? భార్యాభర్తలమని చాటారా?
    ఇంత ఘోరమా! తను చనిపోతే వారిని భార్యా భర్తలవాల్సిందని కోరాడు. బ్రతికుండగానే వారలా ప్రవర్తించడం మొదలు పెట్టారన్న మాట. ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది?
    "ఇప్పుడు మిసెస్ శ్రీకాంత్ గారిని మా అసోసియషన్  లేడీస్ వింగ్ కి ఆహ్వానించడానికొచ్చాము......"
    "సరే, ఇన్విటేషన్ నాకిచ్చి వెళ్ళండి. ఆమె రాగానే ఇస్తాను........."

                                                              * * *

    "అల్ రైట్ ! మేము మళ్ళీ ఫోన్ ద్వారా ఆమెను కాంటాక్టు చేస్తాంలెండి" ఇన్విటేషన్ చలపతి కిచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు.
    చలపతి ఇన్విటేషన్ చేతిలో ఉంచుకొని అలాగే చూస్తుండిపోయాడు. దాని మీద వ్రాయబడ్డ మిసెస్ శ్రీకాంత్ అన్న అక్షరాలు అతనిని వెక్కిరిస్తున్నట్లు కనబడుతున్నాయ్. అక్కడే కుర్చీలో కూలబడిపోయాడతను.
    ఇంతకంటే ఇంకేం రుజువు కావాలి?
    సాయంత్రం అయిదవుతొండగా కారు రివ్వున వచ్చి కాంపౌండ్ లో ఆగింది. అందులో నుంచి శ్రీకాంత్, సావిత్రీ దిగారు.
    చలపతిలో ద్వేషం వేగంగా ప్రవాహించసాగింది. మార్కెట్ కు వెళ్ళిన సావిత్రి, శ్రీకాంత్ ని ఎక్కడ కలుసుకొంది? ఇద్దరూ ఎక్కడ తిరిగారు ఇంతసేపూ? ఎక్కడ విహరించారు? మార్కెట్ కని తనతో నాటకమాడింది ఇందుకా?
    "ఎంత సేపయింది మీరు వచ్చి?" లోపలికోస్తూ అంది సావిత్రి. శ్రీకాంత్ తోటమాలితో కారులోని సామాన్లు లోపలికి పట్టిస్తున్నాడు.
    "చాలా సేపయింది."
    ఆమె వెనుకే తమ గదిలోకి నడిచాడతను.
    "ఎక్కడో విహారాలు చేసివస్తున్నట్లున్నారు?" కర్కశంగా అన్నాడతను. టక్కున ఆగిపోయి వెనక్కు తిరిగి అతని వంక చూసింది సావిత్రి.
    "ఏమిటి మీరు అంది?" నమ్మలేనట్లు అడిగింది.
    "ఇంత వరకూ ఎక్కడ విహారాలు చేసి వస్తున్నారు అనడుగుతున్నాను" నెమ్మదిగా అన్నాడతను.
    సావిత్రి నిశ్చేష్టురాలయిపోయింది. శిలాప్రతిమలాగా నిలబడి పోయింది. కొద్ది క్షణాల తర్వాత" విహరాలా?" అంది వణకుతున్న గొంతుతో.
    "అవును! మార్కెట్ కని వంకబెట్టి బయలుదేరావ్! అక్కడ నీ కోసం శ్రీకాంత్ ఎదురుచూస్తున్నాడు! ఇద్దరూ ఏ వనంలో ప్రణయవిహారాలు చేసి ఇంటికి చేరుకొంటున్నారిప్పుడు . అలా చూస్తావే! ఇదంతా ఎలా తెలిసిందనా?"
    "మీకూ.......మీకు మతిపోయింది, మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలీదు........."రోషంగా అందామె. ఆమె కళ్ళవెంబడి నీళ్ళు జలజలతాలిపోతున్నాయ్.
    "పొతే బాగానే ఉండేది! మీ వ్యవహారాలన్నీ కనిపెట్టే శక్తి ఉండేది కాదు!"
    సావిత్రి ఆవేశంతో అతని దగ్గరకు నడిచింది.

 Previous Page Next Page