Previous Page Next Page 
జనపదం పేజి 29

 

    సూర్యుడు క్రుంగాడు.
    చీకట్లు క్రమంగా కమ్ముకోసాగాయి.
    "ముసలిదాని ముల్లె కోసం తలగోరివి పెట్టిండు" వల్లకాటి నుంచి వెళ్ళిపోతూ వ్యాఖ్యానించాడు బలరామయ్య.
    

                                                      *    *    *

    రామయ్య పెళ్ళి నిశ్చయం అయింది.
    పెండ్లి కూతురు సుమతి. కలవారి కూతురు.
    పెండ్లి రోజు రానే వచ్చింది.
    పల్లె సాంతం కార్లతో నిండిపోయింది. బాజాలతో మారుమ్రోగింది. వంటల సువాసనలతో గుభాళించింది. పచ్చని తోరణాలతో పచ్చబడింది. ఖద్దరు బాబులతో గ్రామం కళకళలాడింది.
    గడీ ముందరి పందిరి జనంతో క్రిక్కిరిసింది. కళ్యాణ మండపం ధగధగా మెరిసింది. మంత్రాలు మైకుల్లో వినిపించాయి.
    వధువు వచ్చింది.
    తెరచాటున కూర్చుంది.
    ఆకాశంలో మబ్బులు ఏనుగుల్లా కమ్ముకున్నాయి. ఉరుము ఉరిమింది. గుండెలు దడదడలాడాయి. సుదీర్ఘ తటిల్లత మెరిసింది. కళ్ళు చెమక్కుమన్నాయి. తర్వత చీకట్లు కమ్మాయి.
    బాపడు మంత్రాలు గబగబా చదువుతున్నాడు.
    చిటపట చినుకులు మొదలై పెద్ద వాన సాగింది.
    హోరున గాలి. పందిరి కదలసాగింది ప్రజలు - పెద్దలు - చిన్నలు గడీలోకి ఉరికారు.
    మంగళసూత్రం కట్టగానే పందిరి ఒకవేపు కూలింది. ఆ కల్లోలంలో సుమతి చేయి పట్టి లాక్కుపోయాడు రామయ్య.
    కుండపోతగా వాన సాగింది.
    వంట పందిళ్ళు కూలిపోయాయి.
    పొయ్యిలు ఆరిపోయాయి.
    ఉరుములు ఉరుముతున్నాయి.
    మెరుపులు మెరుస్తున్నాయి.
    వాన ఆ రోజంతా ఆగలేదు.
    ఏర్పాట్లన్నీ అస్తవ్యస్తం అయినాయి. రాముడు చిరుబిర్లాడాడు. కేకలు వేశాడు. తిట్టాడు. పెద్దలందరినీ బ్రతిమాలుకున్నాడు. మరికొన్ని ఏర్పాట్లు చేసినా అవి అందరికీ అందలేదు. అడుగు బయటికి పెట్టేట్టు లేదు. ప్రళయంలా ఉంది. వీధుల్లో వరదలు ఏరులై పారుతున్నాయి. హోరుగాలికి గడిసేల కప్పులు ఎగిరిపోతున్నాయి.
    రామయ్య రక్తం సలసల కాగింది.
    అయినా అతడు ఏమీ చేయలేకపోయాడు.
    బయట అడుగు పెడ్తే వాన ముఖానికి కొట్టింది. బట్టలు తడిసిపోయాయి.
    పెండ్లికొడుకు ఆకారం మారిపోయింది .    
    సాయంత్రానికి ఆకాశం కొంత నిర్మలం అయింది. వీధులలో కాలవలు క్షీణించాయి. చెట్లు వాన నీరు రాలుస్తున్నాయి. చల్లని గాని ఫెళ్ళుమని వీస్తుంది. ఎండ పొడ అక్కడక్కడ పడుతుంది. మట్టిగోడలు పెల్లలు పెల్లలుగా కూలుతున్నాయి.
    "ముగ్గురు చచ్చారు. ముప్పై ఇండ్లు కూలాయి. అనే వార్త విని మంత్రులు నాయకులు కార్లలో ఊరు దాటారు. వెళ్ళేప్పుడు అధికారులకు ఆదేశాలిస్తూ , వారి తరువాత అధికారులు వెళ్ళిపోతూ సహాయ కార్యక్రమాల పని రామయ్యకు అప్పగించి వెళ్ళారు.
    తెల్లవారి తెరిపి ఇచ్చింది. ఆకాశం నిర్మలం అయింది. సూర్యుడు ఏమీ ఎరగనట్లే ఎండ కాచాడు. పందిళ్ళు మళ్ళీ లేచాయి. భాజాలు మళ్ళీ మ్రోగాయి. వంటలు మళ్ళీ సాగాయి. అయినా జనం పల్చబడ్డారు.
    మిగతా నాలుగు రోజులూ కార్యక్రమాలు జోరుగా సాగేయి. ఒకనాడు నాటకం, ఒకనాడు బుర్రకధ, మూడవనాడు పండిత గోష్టి జరిగింది. రాముడు పూర్వజన్మలో బ్రాహ్మడు అని నిర్ణయించడానికి పండితులు ఎన్నో ప్రమాణాలు ఉటంకించారు. సుమతీ, రాములకు పనసలు చదివి ఆశీర్వదించారు.
    అయిదవ నాటి కవి సమ్మేళనం అందరినీ ముగ్ధులను చేసింది. కవులకు పట్టు శాలువాలు కప్పి నూట పదహార్లు సమర్పించాడు రాముడు.
    కవులు యతి ప్రాసలు తప్పకుండాను, తప్పించిన్నీ వ్రాసి రాముని వైభవాన్ని కొనియాడారు. ఒక యువకవి సుమతి అంటే సీత అనే అర్ధం చెప్పి ఈ దంపతులు సీతారాముల వంటి వారని పొగిడాడు. అసలు యిది అయోధ్యే నన్నాడు ఒక కవి. త్రేతాయుగంలో ఉండవలసిన రాముడు కలియుగంలో అవతరించాడన్నాడు మరో కవి. రాముణ్ణి కృష్ణ దేవరాయలతో పోల్చిన కవి శేఖరులు లేకపోలేదు.
    ఆ వైభవం చూసి బలరామయ్యకూ మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనిపించిందంటే రామయ్య ఎంత పొంగిపోయాడో అర్ధం అవుతుంది. ఆ ఉత్సాహంలో , ఆ రాత్రి శోభనపు గదిలో ప్రవేశించాడు. తనకోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుందనుకున్న రామయ్యకు సుమతి కన్పించలేదు. గది జిగేలు మంటున్నా శూన్యంగా కనిపించింది. గుండె గుబగుబలాడింది. ఆతురత, ఆరాటం పెరిగాయి. రక్తంలో చిచ్చు రగిలింది.
    'సుమతి వస్తుంది ' అని ఎదురు చూడసాగాడు. నిమిషాలు యుగాలవుతున్నాయి. సహనం చస్తున్నది. తాపం భరించరానిది అవుతుంది. తహతహ పెరుగుతున్నది.
    సుమతి రాలేదు.
    రామయ్య మతిపోతుంది. గదిలో చుట్టూ తిరిగాడు. ఏవో పదార్ధాలు నోట్లో వేసుకున్నాడు. సిగరెట్లు కాల్చాడు. నేలను తన్నాడు. చిరచిరలాడాడు. చిరాకు పడ్డాడు.
    గది తలుపు తెరుచుకొంటున్న చప్పుడైంది.
    రామయ్య తలుపు దగ్గరికి ఉరికాడు.
    ఒక ముసలవ్వ లోన ప్రవేశించింది.
    ఆమెను చూచాడు - మండిపోయాడు . "ఏది?" అని కేక పెట్టాడు. ముసలవ్వ అదిరిపోయింది. కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది. నోట మాట రాలేదు.
    "ఏది సుమతి/ చెప్పు?" ఆమె భుజాలు పట్టుకొని ఊపి గట్టిగా అరిచాడు.
    ఆమె ఒక అడుగు వెనక్కు వేసింది.
    'వసతి కాదు. సుమతి రాదు' అని చెప్పి వెనక్కు తిరిగి సుమారు పరిగెత్తినట్లుగా నడిచిపోయింది.
    తలుపు ధడాలుమని వేసి మంచంలో కూలబడ్డాడు రామయ్య.
    ఆ సౌధంలో , ఎక్కడో, మూలకు కూలబడి మౌనంగా ఏడుస్తుంది సుమతి. అది ఎవరికి వినవచ్చే ఏడుపు కాదు. ఆమె గుండె ఏడుస్తుంది. ఆ ఏడుపు గుండె గలవారికి మాత్రమే అర్ధం అవుతుంది. అది వున్నవారు అక్కడ ఎవరూ ఉన్నట్లులేరు.
    ఒక ప్రాణి కుములుతుంది.
    ఒక ప్రాణి మండిపోడుతుంది.
    మంట ఎంతోసేపు మండదు. మనసు ఒకే విషయం మీద ఉండదు. రామయ్యకు నిద్ర రావడం లేదు. మంచంలో పొర్లుతున్నాడు. ఏవేవో ఆలోచనలు తరంగాలుగా వచ్చి తీరాన్ని తాకి ఆగిపోతున్నాయి. మరో తరంగం ఎక్కణ్ణుంచో వచ్చి అతణ్ణి ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
    కవులు పండితులు తనను రామచంద్రుడన్నారు! నవ్వుకున్నాడు రామయ్య. దొర గడీలో పడివున్నప్పుడు తానూ ఇక గులాము. దొర తంతే పడ్డాడు - పెడ్తే తిన్నాడు ఈరోజు తానెంత వాడైనాడు! ఎందుకు? ఎలా? డబ్బు! డబ్బు! అదంతా చేసింది డబ్బే! ధనం ఎంత గొప్పది? తాను ఇంకా సంపాదించాలి. ఇంకా గొప్ప వాడు కావాలి? ఎలాగైనా సంపాదించాలి. ఎలా సంపాదించానని ఎవడూ అడగడు. ఎంత ఉన్నదో చూస్తాడు. అందుకు ఏ పనైనా చేయి. అవును విమలమ్మను తాను ముంచలేదూ? వెధవముండ చచ్చింది. చచ్చిందా? తాను చంపించాడా? ఎలాగైతేనేం? పోయింది. ఒక పీడ విరగడైంది. వీరభద్రాన్ని ఆశ్రయించింది. తాను మునుగుతాననుకున్నాడు. చచ్చింది. ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది. ఇక తనకు అడ్డేవరు? ఆస్తి సాంతం తనది! ఎంత ఆస్తి! ఎంత అధికారం ! ఇన్నీ తనకే దక్కాయి. మరి విమలమ్మ! అదేమిటి ఇంకా బతికి వుందా? అన్నీ విన్నదా? వస్తున్నది , తనమీదికే! ఎంత భయంకరంగా ఉంది. వచ్చేసింది. ఇంకా ఎక్కడికి అగు. కేకవేశాడు. కళ్ళు తెరిచి చూశాడు ఏముంది? ఏమీ లేదు. అయినా గుండె నీరసించి పోయాడు. లేవలేడు దాహం, గొంతు అర్చుకొని పోతుంది. ప్రాణం పోతుందేమో! ఎవరూ లేరిక్కడ. ఏం  చేయాలి? చావకూడదు. తాను బ్రతకాలి? బలం పుంజుకున్నాడు. లేచాడు. కాళ్ళు వేళ్ళాడపాడుతున్నాయి. నీళ్ళ గ్లాసు అందుకున్నాడు. నీరు త్రాగబోయాడు. విమలమ్మ కనిపించింది గ్లాసులో నీళ్ళు గోడకు కొట్టాడు. తనుస్తూ కూర్చున్నాడు. ఆరాటం ఎక్కువ అవుతుంది. లేవలేకపోతున్నాడు. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఇంకెక్కడి విమలమ్మ! బూడిదై పోయింది? కావచ్చు దయ్యం కాదు కదా! అవును మనుషులు దయ్యలవుతారట! పట్టి పీడీస్తారట! ఏమో! దయ్యమేనేమో!
    గోడలోంచి వస్తున్నది విమలమ్మ.
    మళ్ళీ గుండెదడ హెచ్చింది . పుంజుకున్న ధైర్యం వచ్చింది. నీరసించి పోతున్నాడు. వస్తున్నది విమలమ్మ తనమేదకే - అదుగో రానే వచ్చింది. మీదికి, మీది మీదికి పడ్డది తన మీద. కెవ్వుమని కేకవేశాననుకొని పడిపోయాడు. గొంతు పెగల్లేదు - మాట రాలేదు.
    "దయ్యాలుండవు. అంతా పిచ్చి. వెర్రి, నమ్మకాలు. చచ్చినవాడు తిరిగిరాడు. ఇంతగా అడవుల్లో తిరుగుతున్నాం. ఉంటె మనకు కనిపించవా?పీడించవా?" వీరభద్రం చెపుతున్నాడు. ఒక్కసారి నిప్పులు కుప్పలుగా రాలుతుంటే భయపడ్డాడు. కొరివి దెయ్యం అని ఉరికి వీరభద్రాన్ని చేరుకున్నాడు. వీరభద్రం తనను ఆ నిప్పులు పడే చోటికి తీసికెళ్ళాడు. గుండెలో గుబులుతోనే వెళ్ళాడు తాను. ఈతచెట్టు తలదగ్గర నిప్పంటుకుంది. అది రాలినప్పుడల్లా గంపతో నిప్పులు గుమ్మరించినట్లు అవుతుంది. అప్పుడు చెప్పాడు వీరభద్రం దయ్యాల గురించి.

 Previous Page Next Page