"నువ్వు చెప్పింది వింటుంటే అంతా నిజమేననిపిస్తోంది వినయ్. అయితే వీటిని ఒప్పుకోడానికి తగిన ధైర్యం లేదయ్యా" మేనేజర్ అన్నాడు.
మరో అరగంట వరకు అవీ ఇవీ మాట్లాడాక భోజనాలకు లేచారు.
టేబుళ్ళ మీద డిష్ లన్నీ సర్ది నిలబడ్డారు సర్వర్లు.
శకుంతల అన్నీ ఓ ప్లేట్ లో సర్ది "పందెం ప్రకారం మీకు వడ్డించి తీసుకొచ్చాను" అని ప్లేటు అందించింది వినయ్ కు.
మహాలింగం ఆంజనేయుల్ని ఓ మూలకు లాక్కెళ్ళాడు. "చూశారా ఆమె ఆఫీసుకు వచ్చి నిండా మూడురోజులు కూడా కాలేదు. అప్పుడే తనవైపుకు ఎలా తిప్పుకున్నాడో గమనించారా? టెక్నిక్ సార్."
ఆంజనేయులు అతని మాటలను పట్టించుకోలేదు. అతని స్వంత ప్రపంచంలో అతను వున్నాడు.
డిన్నర్ ముగిసింది.
కిళ్ళీ కూడా శకుంతలే వినయ్ కు అందించింది.
అందరూ వెళ్ళడానికి లేచారు.
ఒకరి దగ్గర ఒకరు శెలవు తీసుకుంటూ కిందకు వచ్చారు.
శకుంతల కోసం ఆటో పిలిచారు.
ఆమె ఆటోలో ఎక్కి అందరికీ వెళ్ళొస్తానని చేయి వూపింది. వినయ్ వైపు తిరిగి "గుడ్ నైట్" అంది.
అతను ఆటో కమ్మీలను పట్టుకుని వంగి "గుడ్ నైట్" అన్నాడు.
ఒక్కొక్కరూ వెళ్ళిపోతున్నారు.
చివరికి వినయ్, ఆంజనేయులు, మహాలింగం మిగిలారు.
"మీరు ఎలా వెళతారు? కావాలంటే మిమ్మల్ని నా బైక్ లో డ్రాప్ చేస్తాను"
"వద్దులెండి మేము నడిచే వెళతాం. దేవుడిచ్చిన కాళ్ళున్నాయి." మహాలింగం ధోరణి తెలిసిందే కనుక వినయ్ నవ్వేసి "మీ ఇష్టం ఓ.కే. గుడ్ నైట్" అని స్టాండ్ వైపు కదిలాడు.
అతన్ని పిలవాలని ఆంజనేయులు ఒకడుగు ముందుకు వేశాడు. కానీ నోరు పెగల్లేదు! ఎన్నో రోజులుగా అతన్ని ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాడు. ఇది మంచి సమయమనిపించింది. తన ప్రశ్న విని ఏమనుకుంటాడన్న జంకును బలవంతంగా తుడిచేసుకున్నాడు లేని ధైర్యాన్ని తెచ్చుకున్నాడు.
నాలుకతో ఎండిపోతున్న పెదవులను అడ్డుకున్నాడు. వినయ్ కోసం చూస్తున్నారు.
అతను మోటార్ బైక్ స్టార్ట్ చేసి గేరు మార్చాడు. పొట్టలో మెషీన్ దాచుకున్న సింహంలా బుల్లెట్ ముందుకు దూకింది.
ఆపమన్నట్టు చేయి వూపాడు ఆంజనేయులు.
బుల్లెట్ ఆగింది. ఏమిటన్నట్టు చూసి ఎక్స్ లేటర్ ను పూర్తిగా తగ్గించాడు.
"చాలాకాలం నుంచి ఓ ప్రశ్న అడగాలనుకుంటున్నాను" ఆంజనేయులు అప్పుడే మాటలు నేర్చుకున్నట్లు మెల్లగా అడిగాడు.
"అడగండి"
"అదీ.....అదీ.....ఆడపిల్లలతో సానిహిత్యం ఎలా సంపాదించాలి?"
వినయ్ ఓస్ ఇంతేనా అన్నట్టు నవ్వి "సంభోగంలో ఆడపిల్ల కళ్ళెందుకు మూసుకుంటుందో తెలుసుకోండి? చుట్టూ చీకటైనా ఆ సమయంలో స్త్రీ రెండుకళ్ళనూ గట్టిగా మూసుకుంటుంది! అది ఎందుకో తెలుసుకున్నారి ఆడపిల్ల అభిమానాన్ని ఎలా పొందాలో దానంతట అదే తెలిసిపోతుంది. ఓకే మీ సందేహం తీరిందనుకుంటాను గుడ్ నైట్" అని బైక్ ను రైజ్ చేశాడు.
ఆ శబ్దం విన్పించడం లేదు ఆంజనేయులకు. వినయ్ మాటలనే నోట్లో చప్పరించుకుంటున్నాడు.
"ఆ సమయంలో స్త్రీ కళ్ళు మూసుకుంటుందా? అదే నిజమైతే ఎందుకు?"
ఉదయం పదిగంటలు ప్రాంతాన ఆంజనేయులు పెద్ద తమ్ముడు రామ్మూర్తి యూత్ క్లబ్ దగ్గరకు వెళ్ళాడు. తెల్లటి కాటన్ ప్యాంటు మీద ఖద్దరు చొక్కాలో అతను యువరాజు నాయకుడిలానే వున్నాడు. చేతిలోని గోల్డుస్టార్ సిగరెట్ పెట్టెను వూపుకుంటూ లోపలికి అడుగుపెట్టాడు.
అతని కోసమే ఎదురు చూస్తున్నట్టు అందరూ మాటలాపారు.
"రా రామ్మూర్తి! నీ కోసమే మేమంతా చూస్తున్నాం" జగదీష్ అన్నాడు.
అక్కడ దాదాపు పదిమంది యువకులు వున్నారు. వాళ్ళేదో సీరియస్ గా డిస్కస్ చేసుకుంటున్నట్టు వాళ్ళ ముఖాలే చెబుతున్నాయి.
రామ్మూర్తి ఓ నవ్వును పెదవులకు తగిలించుకుని "నాకోసమా ఎందుకు!" అని అడిగాడు.
"నీ కోసమే మహానుభావా రాజకీయనాయుకుడివి నీతో చాలా పనులుంటాయి మా బోటి సామాన్య జనానికి" మనోహర అనే యువకుడు అన్నాడు.
రామ్మూర్తి ఛాతీ వుబ్బింది ఆమాటలకు? గర్వంగా ఫీలయ్యాడు అందరిలోకీ తను అధికుడన్న భావన మధుర సంచలనాలను రేపింది, దాంతో ఎంతో ఉత్సాహం వచ్చింది.
పక్కనున్న టేబుల్ మీద ఎగిరి కూర్చున్నాడు.
"విషయాలేమిటో చెప్పండి. నేను చేయగలిగింది వుంటే చేస్తాను"
"నువ్వు చేయగలవు నీ పరపతి మాకు తెలియదా! మాజీ మంత్రి సుధాకరనాయుడితో ఎంతోసాన్నిహిత్యం వుంది నీకు మండలాధ్యక్షుడు ఎంతో భక్తవత్సలం నిన్ను 'రేయ్' అని పిలిచే క్లోజ్ నెస్ వుంది. ఇక ఎమ్మెల్యే గోపాలకృష్ణ కు నువ్వు నమ్మినబంటువు. అలాంటి నువ్వు తలుచుకుంటే జరగనిది వుంటుందా!" రాజు అనే మరో సభ్యుడు రామ్మూర్తి దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుని చెప్పాడు.
"నువ్వు చెప్పేదంతా నిజమే మహాప్రభూ! ముందు విషయానికి రా నాకు అవతల అర్జంట్ పనులున్నాయి."
"ఏమిటంత అర్జంట్?" జగదీష్ ప్రశ్నించాడు.
"రేణిగుంటలో ఒక వ్యక్తికి లైసెన్స్ ఇప్పించాలి. సారా కాంట్రాక్టర్ ఆయన. ఏదో కొత్త ఫ్యాక్టరీ పెడుతున్నాడు. దానికి లైసెన్స్ కావాలి. ఇక కరకంబా అడవిలో పోరంబోకు భూములున్నాయి. వాటిని గొల్లపల్లి గిరిజనులకు ఇప్పించాలి. దీనికోసం ఎమ్.ఆర్.ఓ ను కలవాలి. ఆ తరువాత ఏర్ పోర్ట్ కెళ్ళాలి. కొత్తగా మంత్రి అయిన దామోదరరెడ్డి వస్తున్నారు. ఆయన్ను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాలి."
"చాలా పెద్ద ప్రోగ్రామ్ చెప్పావే. ఇవన్నీ ఎప్పుడు చేసుకుంటారో మాకు తెలియదుగానీ మా పనిమాత్రం ఈ రోజు చేసిపెట్టాలి" మనోహర్ ఖచ్చితంగా అన్నాడు.
"ఏం పనో చెప్పండి"