Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 29

 

    "చెప్పాల్నా! ఈ పోరిని మేం తీసుకెళ్తం!"


    "ఎక్కడికి?"


    "దేశ్ పాండే ఎరికనా?"


    "అరె! దేశ్ పండే సాబ్ తెలీకపోవడం ఏంది సార్! నెంబర్ వన్ గూండాకదా!"


    "మరి సక్కగా పోరీని పంపు!"


    చటుక్కున కారు దిగాడు రాజా.


    "ముందు మిమ్మల్ని మీ ముత్తాతల దగ్గరికి పంపుతా! అడ్రసెంది? స్వర్గమా? నరకమా?"


    "ఏం? హుషారీ చూపిస్తున్నావా?" అన్నాడు ఆ గ్యాంగు లీడరు.


    "హుషారీ ఏంది సార్? మీకు సత్యం చెప్పదలుచుకున్నా! నాలో ఒక స్పెషాలిటీ ఉంది" అన్నాడు రాజా.


    "ఏమిటది?"


    "మేము కొడితే దెబ్బలు తగలవు! గ్యారెంటీ!"


    "మరి?"


    "ఎముకలు విరుగుతాయ్!" అని ఫట్ మని ఎదుటివాణ్ణి కొట్టాడు రాజా! అతని చేతులే గడ్డ పలుగులంత బలంగా వుంటాయని ఉహించలేకపోయాడు. గింగరాలు తిరిగి కిందపడ్డాడు.


    అదే ఊపులొ ఇంకో నలుగురిని చేతికింద వేస్తె చేతి దెబ్బా, కాలి కింద వేస్తె కాలి దెబ్బా అన్నట్లు చావచితక తన్నాడు రాజా.


    ఈలోగా -


    ఒక మాహాకాయుడిలాంటి వాడు రాజా మీదికి లంఘించాడు. కానీ, వాడు తన మీద పడకముందే, గాల్లోనే వాడి చేతిని అందుకుని మెలిపెట్టేశాడు రాజా......దుర్భరంగా మూలుగుతూ ధన్ మని కిందపడ్డాడు వాడు. వాడి చెయ్యి విడవకుండానే మీనాక్షితో అన్నాడు రాజా. "ఎముకలు విరిగే శబ్దం ఎప్పుడైనా విన్నావా?"


    భయంగా చూసింది మీనాక్షి.


    "భయపడకు! ఎముకలు ఇలా ఫట్ మని విరుగుతాయ్!" అని వాడి చేతిని వెనక్కి వంచాడు రాజా. ఎముక విరిగిన చప్పుడు వినబడింది.


    "అబ్బా! అన్నవాడి కేక నాలుగు రోడ్ల అవతలికి కూడా వినబడింది.


    అంతలోనే -


    వెనకనుంచి ఒకడు కత్తితో రాజావైపు రావడం చూసింది మీనాక్షి.


    'అయ్యో ! అటు చూడండి!" అని ఆమె హెచ్చరించేలోపలే, తన తలలో వెనకవైపున కూడా కళ్ళు ఉన్నట్లు వాడి మూమెంట్స్ కనిపెట్టేశాడు రాజా. కాలుని విసురుగా వెనక్కి పోనిచ్చాడు. కాలు వాడి చేతికి తగిలి, కత్తి గాల్లోకి ఎగిరింది. అక్కడ ఇంకొకడు రివాల్వర్ ని రాజా వైపు ఎయిమ్ చేస్తున్నాడు. కత్తివచ్చి వాడి చేతికి తగిలింది. రివాల్వర్ కిందపడింది.


    గిరిక్కున వెనక్కి తిరిగాడు రాజా. కత్తిగాడిని, రివాల్వర్ గాడిని ఇద్దరి తలలూ , చెరో చేత్తో పట్టుకుని, పటపట నాలుగుసార్లు కొట్టాడు. అంతే! మరుక్షణంలో రౌడీలందరూ బతుకు జీవుడా అని కాళ్ళకి బుద్ది చెప్పారు.


    షర్టు చేతులు పైకి మడిచి, రోడ్డు రోలర్ దగ్గరికి వెళ్ళాడు రాజా.


    బలంగా దాన్ని తొయ్యడం మొదలెట్టాడు.


    అంత బరువున్న రోడ్డు రోలరు ముందుకి జరిగిపోయింది!


    రోడ్డురోలరు అడ్డు తొలగిపోగానే, క్రాపు సరిచేసుకుని , కార్లో ఎక్కి స్టార్ట్ చేశాడు రాజా.


    సినిమాల్లో తప్ప ఇలాంటి స్టంట్స్ఎప్పుడూ చూడలేదు మీనాక్షి. ఉపిరి పీల్చడం మర్చిపోయి చూస్తోంది ఇదంతా.


    "వీళ్ళకెందుకు నీమీద ఇంత ఇంట్రెస్టు?" అన్నాడు రాజా.


    "అందమైన ఆడపిల్లను గనక!" అనబోయి ఆగిపోయింది మీనాక్షి. తనకి తనే ఒక "అందమైన" సర్టిఫికేట్ ఇచ్చేసుకోవడానికి మనస్కరించలేదు.


    ఇంతకీ అసలు తను అందంగా ఉంటుందా?


    ఏమో! ఆ సంగతి ఇతవరకు తను ఎప్పుడూ ఆలోచించలేదు అసలు!


    బహుశా తను యావరేజ్ గా ఉంటుందేమో! అంతే!


    ఈలోగా డైమండ్ రాజానే అన్నాడు.


    "ఎందుకంటె - నువ్వు చాలా అందమైన ఆడపిల్లవి గనక! అవునా! డోంట్ వర్రీ.....వాళ్ళ సంగతి నాకొదిలెయ్!" అన్నాడు.


    చాలా రిలీఫ్ గా ఫీలయింది మీనాక్షి.


    ఆ తర్వాత, అతను అన్నదానిలో అర్ధం అర్ధమై ఆమె చెంపలు ఎర్రబడిపోయాయి.


    ఈలోగా -


    మళ్ళీ సడెన్ బ్రేకుతో కారు ఆపేశాడు రాజా!


    "ఏమయింది" అంది మీనాక్షి ఆదుర్దాగా.


    మాట్లాడకుండా చేత్తో చూపించాడు రాజా.


    "అయిల్లెవరిదో తెలుసా?" అన్నాడు.


    తెలిదన్నట్లు తల అడ్డంగా ఆడించింది మీనాక్షి.


    "అది జానకిరామయ్య మాస్టారి ఇల్లు! చాలా నిజాయితీ పరుడు అయన. ఈ మధ్యనే రిటయిర్ అయ్యారు. కూతురికి పెళ్ళి చెయ్యాలి! అందుకే ఇంటికి సున్నాలు వేస్తున్నారు. ..కానీ వాడెం చేస్తున్నాడో చూడు!" అన్నాడు.


    అంత రాత్రిపూట ఒకడు కొరివి దెయ్యంలా తెల్లటి ఆ గోడపక్కన కూర్చుని, గోడ మీద ఏదో రాస్తున్నాడు. వాడి పక్కనే పెయింట్ డబ్బా! చేతిలో బ్రష్షు.


    "ఛలో అసెంబ్లీ"


    అని తాటికాయలంత అక్షరాలు....


    ఆ క్రింద ఇంకా ఏదో రాస్తున్నాడు.


    "వీడి పులుసు దించుదాం ఉండు!" అంటూ కారు దిగి, కొరివి దెయ్యంగాడి దగ్గరికి వెళ్ళాడు రాజా.


    "ఏంట్రా గోడమీద వాంతి చేసుకుంటున్నావు?" అన్నాడు.


    "ఛలో అసెంబ్లీ!" అన్నాడు వాడు.


    "అయితే, శుభ్రంగా సున్నం వేసిన గోడలు ఖరాబు చేస్తావట్రా?"


    "ఏయ్! నేనే పార్టీనో తెల్సా?" అన్నాడు వాడు బెదిరిస్తున్నట్లు.


    "పార్టీలపేరెత్తితే పేగులు పీకేస్తా! గోడలు పాడుచేసే వెధవ్వి నువ్వే పార్టీ అయితే నాకేమిట్రా? ఛలో అసెంబ్లీ! నశించాలి! ఖండించండి! బందు! అంగుళం మేర గోడలని తెల్లగా ఉండనివ్వరుకదా ఛీ........."


    అని చెయ్యత్తబోయాడు రాజా.


    కోడతాడెమోనని కిందకి వంగాడు వాడు.


    "బక్కెట్లో ఏముందిరా?" అన్నాడు రాజా.


    "పెయింటు" అన్నాడు వాడు భయంగా.


    "నీచెతిలొ ఏముంది?"


    "బ్రష్షు!"


    "నీ మొహం ఎక్కడుంది?"


    "ఇదిగో ! ఇక్కడే"


    "ఆ పెయింటుని, ఆ బ్రష్షుతో నీ మొహానికి పులిమేసుకో!"


    "అరె! ఇదేంటి భాయ్?" అన్నాడు వాడు.


    "నరుకుతా! చెప్పినట్లు చెయ్!" అన్నాడు రాజా!

    
    ఏడుపు మొహం పెట్టి , బ్రష్షుతో మొహానికి రంగు పులుముకున్నాడు వాడు.


    "ఇంకా రంగు మిగిలిందా?"


    "మిగిలింది"


    "అది నీ తలకు పట్టించుకో"


    ఇంకాస్త ఏడుపు మొహం పెట్టి రంగుని నెత్తికి పట్టించుకున్నాడు వాడు.


    "ఇంక పో!" అన్నాడు రాజా.


    వాడు బక్కెట్టు అక్కడే వదిలేసి పరిగెత్తడం మొదలెట్టాడు.


    నవ్వుతూ మీనాక్షి వైపు చూశాడు రాజా. మీనాక్షి కూడా నవ్వుతోంది.


    సరిగ్గా అదే క్షణంలో.


    వాళ్ళిద్దరి దృష్టి కి ఒక దృశ్యం కనబడింది.


    అక్కడ -


    ఆ నిశిరాత్రిలో -


    డైమండ్ రాజా, ఆఠీన్ రాణిలకి కనబడిన దృశ్యం చూడడానికే చాలా ఇబ్బందికరంగా ఉంది! ఎంతో వికారంగా వుంది! హృదయ విదారకంగా వుంది? కడుపులో దేవేసినట్లు ఉన్నది!

 Previous Page Next Page