ఇంట్లోకెళ్ళి స్నానంచేసి చీర మార్చుకుంది. కేరళనుంచి కొన్ని చీరలు కొనుక్కువచ్చింది తను. వాటికి మాచింగ్ పెట్టీకోటు, జాకెట్ బట్టలూ కొనాలి. నెల రోజుల నుంచి అనుకుంటున్నా, టైం దొరకలేదు. ఇవాళ తను ఖాళీగానే ఉంది కాబట్టి షాపింగ్ పనులన్నీ చక్కబెట్టుకు రావచ్చు.
గేరేజులో చూసింది. బెంజు సుధీర్ తీసుకెళ్ళాడు. టొయోటా వుంది.
కారు స్టార్ట్ చేసి, జేమ్స్ స్ట్రీట్ వైపు వెళ్ళింది శశి.
జేమ్స్ స్ట్రీట్ నుంచి జనరల్ బజార్ లోకి వెళ్ళే ఇరుకైన సందు. కానీ, ఆ చిన్న సందులోనే మంచి మంచి షాపులు, ఖరీదైన వస్తువులు, ఖరీదైన కస్టమర్లూను.
మెయిన్ రోడ్డులో అబ్దుల్ ఖాదర్ షాపు ముందు కారాపి షాపులో కెళ్ళి- "నా కారు కాసేపు ఇక్కడ పార్క్ చేస్తున్నాను, అభ్యంతరం లేదుకదా?" అంది నవ్వుతూ. ఆమె ఆ షాపుకి రెగ్యులర్ కస్టమర్.
"ఎంతమాట, డాక్టర్ సాబ్! వెళ్ళేముందు మా షాపు కూడా ఒక్కసారి పావనం చేసి వెళ్ళండి." అన్నాడతను మర్యాదపురస్కరంగా.
తల వూపి బయటికి నడిచింది శశి. ఆ సందులోకి ఒక షాపులోకి వెళ్ళి, పెద్ద ప్లాస్టిక్ బాగ్ లో తను పట్టుకొచ్చిన కొత్త చీరలు బయట పడేసి, మాచింగ్ పెట్టీకోట్స్ చూపించమని అడిగింది. పెట్టీకోట్స్ కొన్న తరువాత ఇంకా మాచింగ్ బ్లౌజ్ పీసెస్ తీసుకుని, ఆ తర్వాత మోండా దగ్గర షాపులో చేతినిండా గాజులేయించుకుంటే, ఆ రోజుకి షాపింగ్ పూర్తయినట్లే. ఆ పనులు ఇంకోళ్ళకి అప్పగించదు తను. ఇవి తన టేస్ట్ ప్రకారమే జరగాలి. తనకి నచ్చిన రంగులే కొనాలి. వీటిలో రాజీ లేదు- వూపిరి తిరగని పని ఉన్నా సరే!
"శారదా! దానిమీద ఆనుకోకు-అద్దం పగిలి పోతుంది" అని పిల్లని గదమాయిస్తూంది ఒకామె.
తిరిగి చూసింది శశి. ఆ శారద అనే పిల్ల బుద్దిగా నిలబడి వుంది.
శారద!
శంకర్రావు భార్య శారద గుర్తొచ్చింది శశికి.
శారద ప్రెగ్నెంటు!
మనసు మళ్ళీ అదోలా అయిపోయింది. ఇక్కడికి చాలా దగ్గరే శంకర్రావు వాళ్ళిల్లు.
ఎందుకు రాలేదు తను మళ్ళీ?
ఒక్కసారి వెళ్ళి చూస్తే?
కొన్నవి త్వరత్వరగా ప్యాక్ చేయించి, బిల్లు ఎంతయిందో చూడకుండానే వంద రూపాయల నోటు అందించి, చిల్లర లెక్క పెట్టుకోకుండానే పర్సులో వేసుకుని బయటి కొచ్చింది. తర్వాత, మొహమాటానికి అబ్దుల్ ఖాదర్ షాపులో కెళ్ళి ఏం కొనాలో తోచక, సుధీర్ కోసం జోడియాక్ టై కొన్నది. వాళ్ళు దాన్ని పాక్ చేసి ఇస్తూ దానితోబాటు ఒక కాలెండర్ కూడా చుట్టలా చుట్టి, రబ్బర్ బాండ్ వేసి ఇచ్చారు.
వాళ్ళ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసి, కారు స్టార్ట్ చేసింది శశి..
శంకర్రావు ఇల్లు పక్కనే చిన్న సందులో వుంది.
ఇదివరకెప్పుడో పిన్ని కొడుక్కి ఉపనయనం అయినప్పుడు, కూరలు కొనడానికి శంకర్రావును పంపమంది అమ్మ. అతనికి ఆరోజు ఆఫ్. అందుకని తను గాంధీ హాస్పిటల్ లో పనుండివెళుతూ, శంకర్రావు ఇంటిమీదుగా పోనిమ్మంది కారుని. డ్రైవరు ఆ సందు మొదట్లో కారాపి, శంకర్రావుకి కబురు అందచేసి వచ్చాడు. ఆ సందు బాగా గుర్తుంది శశికి.
కారు ఆ సందులోకి టర్న్ చేసి, మెల్లిగా డ్రయివ్ చేస్తూంది శశి.
మూడో స్ట్రీట్ లైట్. ఆపక్కనే పోస్టు బాక్సు. పెద్ద ఆర్చీలాంటి ద్వారం. లోపల కాపురాలుండే పోర్షనులు. ఈ ఆర్చిలోకే ఆ రోజు డ్రైవర్ వెళ్ళాడు.
కారు ఆపి దిగింది. అక్కడున్న జనం అందరూ ఆమెనీ, కారునీ, చిత్రంగా చూశారు. మురికివాడల్ని సందర్శించడానికి వచ్చిన మినిస్టర్ గారిని చూసినట్లు చూశారు.
కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది శశికి. గ్రేకలర్ ప్లెయిన్ పట్టుచీర కొంగు భుజం చుట్టూ లాక్కుని సందేహంగా చూస్తూ అక్కడున్న ఒకతన్ని అడిగింది- "ఇక్కడ శంకర్రావు ఉండేదెక్కడా?"
"శంకర్రావా? ఏం చేస్తుంటాడు!"
"కాంపౌండరు - పద్మావతీ నర్సింగ్ హోమ్ లో!"
"ఏమో! తెలీదు. సారీ!"
"ఫర్వాలేదు లెండి" అంటూ చుట్టూ చూసింది శశి.
అక్కడ ఒక గుమ్మం దగ్గర నిలబడి. శశివైపు ప్రశ్నార్ధకంగా చూస్తూంది దుర్గ. కళ్ళు విప్పారి ఉన్నాయి. శశినీ ఆమె చీరనీ ఆరాధనగా చూస్తూంది.
"శంకర్రావు గారిల్లు ఎక్కడమ్మా?" అంది శశి.
"ఆ పక్క తలుపే!" అన్నట్లు చూపించింది దుర్గ. అంతలో తనే పరుగెత్తి తలుపు దబదబ కొట్టింది.
"వస్తున్నా!" అంటూ శారద గొంతు వినబడింది. రెండు నిముషాల తరవాత చేతులు కొంగుకి తుడుచుకుంటూ తలుపు తీసింది శారద.
కాస్త పక్కగా నిలబడి ఉంది శశి.
'ఎవరో వచ్చారు!" అన్నట్లు సైగ చేసింది దుర్గ.