Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 29


    
    గుర్తుందా మిమ్మల్ని కాపాడింది ఎవరో?


    ఆ హీరోనే ఈ అభినయ్!

    
    మా విద్యార్థిలోకం అంటే ఏమిటో నీకు తెలీకపోవచ్చు.


    వెల్లువై ముంచెత్తితే ఆ ప్రవాహంలో నీలాంటివాళ్ళు నామరూపాలు లేకుండా కొట్టుకుపోతారు"


    అభినయ్ మాటలు వింటూనే నోటమాట లేకుండా నిర్ఘాంతపోయి బొమ్మలా నిలబడిపోయాడు బాపినీడు.


    అభినయ్ సింహకిషోరంలా లేచి నిలబడ్డాడు.


    "గెటవుట్!" అరిచాడు చేత్తో గుమ్మంవైపు చూపిస్తూ అభినయ్.


    బాపినీడు అవమానభారంతో గుమ్మం వైపు నడుస్తుంటే అభినయ్ మిత్రులు ఆనందంతో చప్పట్లు కొట్టసాగారు.


    బాపినీడు గుమ్మందాటి ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు.


    పళ్ళు పటపటమని కొరికాడు. కళ్ళు విషాన్ని కక్కుతున్నాయి.


    "నీకు రోజులు చెల్లిపోయినాయిరా అభినయ్!"


    ఒక్కొక్కమాట కఠినంగా బాపినీడు నోటివెంట వెలువడినాయి.


    నిశ్శబ్దంగా వుంది లైబ్రరీ.


    ఒక మూలగా ర్యాక్ లో వున్న పుస్తకాలలో దేనికోసమో వెదుకుతున్నాడు అభినయ్.

    
    లైబ్రరీలో ఇంకెవరూ లేదు.


    అలాంటి సమయంలో నిశ్శబ్దాన్ని చీలుస్తూ "అభీ!" అన్న పిలుపు విని మెడ తిప్పి వెనక్కి చూశాడు అతను.


    గీత నించుని వుంది.


    అతని ఆశ్చర్యానికి అంతులేదు.


    గీత తనని పలకరిస్తోంది.


    పదిరోజుల తర్వాత కాలేజీలో అడుగు పెట్టాడు అతను కానీ క్లాసుకి వెళ్ళబుద్ధికాక లైబ్రరీలోకి వచ్చాడు.


    "నువ్వా!" అన్నాడు మెల్లగా.


    ఆమె కళ్ళతోనే నవ్వింది.


    ఆమె కళ్ళల్లోకి చూస్తుంటేనే అతను గ్రహించాడు. ఆమెకిప్పుడు తన మీద కోపం లేదని, ఎంతో ప్రసన్నంగా మారిపోయిందని.


    అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది.


    తను తప్పు చేసి, ఆ తప్పునించి కూడా గెలుపుని పొందగలిగిన భావన అతని చూపులో కదలాడుతోంది.


    "నాతో మీకేమన్నా పనుందా?" అడిగాడు.


    "చాలా పనుంది. నువ్వు చేసిపెడతావా?" కింది పెదిమని మునిపంటితో కొరుకుతూ అంది గీత.


    "నాకు చేతకావాలి కదా!" అన్నాడు.


    "చేతనవునని నువ్వు నిరూపించుకోవాలి. అవునూ ఇంతకీ ఒళ్ళెలా వుంది?" అడిగింది గీత.


    ఓ పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఓ అబ్బాయిని రెచ్చగొట్టేలా ప్రశ్న వేస్తుంటే సహజంగా మగాడిలో కలిగే స్పందనే అతనిలోనూ కలిగింది.    


    "ఒళ్ళునొప్పులు తగ్గిపోయినాయి. కానీ మళ్ళీ హూనం చే్సుకోవాలనుకుంటున్నాను."


    "ఎందుకు?" ఆమె కళ్ళు పెద్దవి చేసింది.


    "అందమైన అమ్మాయిని ముద్దు పెట్టుకోడంలో ఉన్న థ్రిల్ ముందు ఈ దెబ్బలు లెక్కలోకి రావు" అన్నాడు అతను.


    గీత క్షణంపాటు ఉలికిపడి, తుళ్ళిపడిన గోదావరిలా గలగలా నవ్వింది.


    "మళ్ళీ నన్నేనా?"


    "ఉహూ....... ఇంకెవరన్నది నేనింకా డిసైడ్ చేసుకోలేదు" చెప్పాడు అతను.


    గీత చిరుకోపంతో కొంచెం ముందుకి వచ్చింది.


    "నువ్వెవరితోనన్నా అలా చేస్తే చంపేస్తాను" అంది.


    ఆమె అధరాలు అమృతంతో తడిసినట్లు మెరుస్తున్నాయి.


    "బాగుంది. ఎవరితోనూ అలా చేయద్దంటే నేనేమైపోవాలి?"


    "ఎదురుగా వెదుక్కొంటూ వచ్చినదాన్ని నేను లేనా?"


    అతను విజయగర్వంతో చూశాడు.


    "నీకిప్పుడు ఎలాంటి అభ్యంతరం లేదన్నమాట!"


    "ఉంటే నిన్ను వెదుక్కుంటూ ఎందుకొస్తాను?"


    ఆమె చూపుని కిందికి దించుకొంది.


    ఆమె తియ్యని మాటలు అతనికి అమృతధారల్ని పోస్తున్నట్టుగా అనిపిస్తోంది.


    "నేనిక్కడ వున్నానని నీకెలా తెలుసు?" అడిగాడు.


    గీత కనురెప్పలు రెపరెపలాడాయి


    "నీకు ధైర్యముందే కానీ బుద్ధిలేదు" అంది.


    అతను ఉలిక్కిపడ్డాడు.


    గీత అంత నిస్సంకోచంగా మాట్లాడుతుంటే అతనికే ఆశ్చర్యంగా వుంది.


    గీత తిరిగి అంది--

    
    "నీకు తెలీదు అభీ! ఆడపిల్ల కంటిచూపు కోసం మగాడు తపించిపోతూ వెంటపడి రోడ్లన్నీ సర్వే చేస్తాడు.


    కానీ ఆడపిల్ల అలాకాదు 'నావాడు' అనుకొన్న వాడికోసం కంటిచూపుతోనే వెంటాడుతోంది. అతని ప్రతి కదలికనీ గమనిస్తుంది."


    అతను గమ్మత్తుగా చూశాడు ఆమెకేసి.


    "నన్ను వేటాడ్డానికి కాదుగా?" అడిగాడు.


    గీత కోపంగా చూసింది.


    "నీకు నిజంగానే బుద్ధి లేదు. ఆడపిల్ల ఎప్పుడూ తను మనసుపడే వాడిచేత వేటాడబడాలనుకొంటుంది."


    అతను కూర్చుంటూ ఆమెని రెచ్చగొట్టడానికి అన్నాడు-


    "కానీ నాకు వేట అంతగా రాదు."


    "ఎంతవరకూ వచ్చో చెప్పాల్సినదాన్ని నేను కదా!"


    "ఒక్క మాట అడగనా?" అన్నాడు అభినయ్.


    అంతలో కాలేజీ గంట ఠంగ్ మని మోగింది.


    "ఛీ.... మాటల్లో గంట గడిచిపోయింది. ఇక జనమొచ్చేస్తారు" అంది గీత.


    "అయితే మళ్ళీ....."


    "మళ్ళీ కాదు, ఇప్పుడే!"

 Previous Page Next Page