"అసలు రాష్ట్ర హోం మినిస్టరుగారికి మీ తమ్ముడ్ని అంత దారుణంగా దండించాల్సిన అవసరం ఏమిటి?"
క్షణం ఆగింది ఆమె శ్వేత గురించి వివరంగా చెబితే తప్ప ఈ ప్రశ్నకి జవాబు సంతృప్తికరంగా తాను ఇవ్వలేదు. అయినా సాటి ఆడపిల్లగా శ్వేత మీద జాలి చూపించాలనుకుంది. ఆమె ఎంత అవమానించినాగాని రేపు ఓ వ్యక్తికి భార్య కావాల్సిన ఆడపిల్ల.... ఆ స్థితిలో కూడా ఆమె ఈ సత్యాన్ని మరిచిపోలేదు.
"హోం మినిస్టర్ గారి కూతురు శ్వేతని మా తమ్ముడు అవమానించాడన్నది అభియోగం... అందులో నిజానిజాల మాటెలా వున్నా, ఒకవేళ తమ్ముడు తప్పే చేసివుంటే శిక్షించటానికి చట్టం వుంది. పోలీసులూ, కోర్టులూ వున్నాయి."
"మీరు సూటిగా జవాబు చెప్పాలి. మీరు సేకరించిన వివరాల ప్రకారము జరిగినదానిలో మీ తమ్ముడి బాధ్యత ఎంత?"
ఇబ్బందిగా కదిలింది ఆశ్రిత. "నా తమ్ముడు నిరపరాధి అని ఓ వందమంది విద్యార్ధులు సాక్ష్యంగా రాసిచ్చారు."
"అంటే...శ్వేత కావాలని...."
"వద్దు.....ఓ ఆడపిల్ల గురించి చేదుగా నేను మాట్లాడలేను."
"మీరు వివరంగా చెప్పాలి"
"ఇక్కడ సమస్య శ్వేత కాదు.....పర్యవసానంగా జరిగిన సంఘటనలు" కంక్లూడ్ చేసింది మొండిగా.
"ఇందులో కమీషనరుగారి బాధ్యత ఏమిటో చెబుతారా?"
"చాలా వుంది ఒకవేళ సకాలంలో నా తమ్ముడ్ని గాని, హింసనుంచి నా తండ్రిని గాని ఆయన చట్టపరంగా కాపాడి వుంటే ఇద్దరూ కడతేరిపోయే పరిస్థితి వచ్చేదికాదు"
"తర్వాత మీరు పోలీసుల్ని అప్రోచయ్యారా?"
"అయ్యాను కాని న్యాయం జరగాలేదు."
"ఎందుకని?"
"సామాన్య పౌరుడికి జరగాల్సిన న్యాయం కోర్టులకన్నా ముందు పోలీసుల చేతుల్లో వుంది కాబట్టి, సవ్యసాచిగారే ఈ నగర పోలీసు శాఖకి అధికారి కాబట్టి."
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
రెండు నిమిషాల తర్వాత అడిగాడు విలేఖరి. "ఇప్పుడు మీ లక్ష్యం ఏమిటి?"
"ముందే చెప్పాను... నాకు జరిగిన నష్టం మరో ఆడపిల్లకి గాని, మరో కుటుంబానికి గాని జరక్కూడదు"
"మీరిలా ఇంటర్వ్యూ ఇవ్వడంలో ఏదన్నా ప్రమాదాన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారా?"
"ప్రెడిక్ట్ చేస్తున్నాను. ప్రమాదం నుంచి రక్షణగా కూడా ఈ ఇంటర్వ్యూ సహకరిస్తుందని నమ్ముతున్నాను."
"ఇది మీకు రక్షణ ఎలా అవుతుంది?"
"ఇలా నేను ఇంటర్వ్యూ ఇవ్వడం ఈ కేసుకి సంబంధించిన వ్యక్తుల పరపతికి సహజంగా ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి నామీద కక్ష పెట్టుకొనే అవకాశం వుంది. ఈ విషయం ఇంటర్వ్యూలో నేను చెప్పాను కాబట్టి నా ప్రత్యర్ధులు కాస్త వెనుకడుగు వేయొచ్చు."
"అయినా అలాంటి ప్రమాదం వుంటుందని ఎందుకనుకుంటున్నారు?"
"ప్రమాదం వుండకపోతే ఎన్ కౌంటర్ డెత్స్ అంటూ మీరు పేపర్లలో ఎలా ప్రకటనలిస్తున్నారు? ఏదో వుండబట్టేగా."
దృఢంగా, మొండిగా జవాబులిస్తున్న ఆశ్రిత కేసి నవ్వుతూ చూశాడు విలేఖరి. "జాతీయ స్థాయిలో ఐ.ఎ.ఎస్ ఫైనల్ సెలెక్షన్ కి వెళ్ళిన కేండిడేట్ గా పోలీసుల నుంచి మీరెలాంటి ప్రమాదాల్ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో తెలుసుకోవలనుంది."
క్షణం ఆలోచించింది ఆశ్రిత. "నేనిప్పుడు ఒంటరిదాన్ని మాస్టారూ! నామీద హత్యాప్రయత్నం జరగొచ్చు...నేను మానభంగానికి గురికావచ్చు... పోలీసులు నన్నో రేడికల్ గా ముద్ర వేయొచ్చు. అదీ కాకపోతే సర్దాగా ఆర్ డి ఎక్స్ లాంటిది నా ఇంటిలో వుంచి నాకూ, టెర్రరిస్టులకీ సంబంధం వుందని టాడా కింద నన్ను అరెస్టు చేయొచ్చు. వాళ్ళ శక్తి చాలా అపారమైనదిగా!"
ఆ వాక్యాలు చెబుతున్న ఆశ్రితకి అది ఇంట్యూషనో లేక ఇందాక ఏకాంత వెళ్ళాక వచ్చిన వృద్దుడి హెచ్చరికే గుర్తుకొచ్చిందో వెంటనే ఎసిపి. వశిష్టని కలుసుకోవాలనిపించింది.
ఆమె ఆలస్యం చేయలేదు. ఇంటర్వ్యూ పూర్తికాగానే పత్రికాఫీసునుంచే ఎసిపి వశిష్టకి ఫోన్ చేసింది.
అదృష్టవశాత్తు అతడు ఆఫీసులో వుండడంతో మరో పది నిమిషాలకల్లా డెయిలీ న్యూస్ పేపర్ గేటు దగ్గర వెయిట్ చేస్తున్న ఆశ్రితని కలుసుకున్నాడు.
"ఇట్సే సర్ ప్రయిజ్" అన్నాడు మృదువుగా నవ్వుతూ.
ఒక పోలీసాఫీసరు, పైగా వయసులో వున్న వ్యక్తి తాను పిలవగానే రావడంలో చూపించిన ఆసక్తికి ఆమె అర్ధం వెదకాలని ప్రయత్నించలేదు.
అసలు ఆ మూడ్ లో లేదామె.
"చెప్పండి" అన్నాడు వశిష్ట.
"ఓ గంట మీతో గడపాలనుంది" అంది అసంకల్పితంగా.
అబ్బురంగా చూశాడు.
"ఏమిటలా చూస్తున్నారు?"
"మీ భాష కాస్త ఇబ్బందిగా అనిపించి"
"నేనేమన్నాను?"
మింగుడుపడనట్టుగా క్షణం చూసి "కొన్ని పదాలు తెలుగులోకన్నా ఇంగ్లీషులోనే బెటరుగా వుంటాయి ఆశ్రితా! గంట గడపడం అనటం కన్నా ఓ గంట సర్దాగా స్పెండ్ చేద్దాం అంటే బాగుండేది" అన్నాడు జీపులో కూర్చోమన్నట్టు సంజ్ఞ చేస్తూ.
అతడి మాటలు ఏ గుండె అరల్లో తాకేయో సూటిగా చూడలేకపోయింది. "ఏదన్నా రెస్టారెంట్ కి వెళదాం" అంది టాపిక్ ని ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేనట్టుగా.
"వెల్ కమ్" అన్నాడు భుజాలు ష్రగ్ చేస్తూ.
అప్పుడు రాత్రి ఎనిమిదిన్నర కావస్తుంది.
ఆశ్రిత అంచనా తప్పుకాలేదు.
అప్పటికి అరగంట క్రితమే ఆమె ఇంటికి పది గజాల దూరంలో నిలబడ్డ సి.ఐ. ధనంజయ ఆమె కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు అసహనంగా.
* * *
సరిగ్గా పది నిమిషాలలో హోటల్ వైస్ రాయ్ రెస్టారెంట్ లోకి వచ్చాడు వశిష్ట ఆశ్రితతో సహా.
అప్పటికే అక్కడ ఫేమిలీతో రద్దీగా వుంది.
యూనిఫాంలో వున్న వశిష్టని చూడగానే రెస్టారెంట్ లోని స్టీవార్డ్స్ అలర్టయి "ప్లీజ్ కమిన్ సర్" అంటూ హడావుడి చేయడం మొదలుపెట్టారు.
సెంట్రలైజ్డ్ ఏసి కావడంతో చలిగా అనిపిస్తూంటే ఓ టేబుల్ దగ్గర చీర చెంగుని ఒంటికి చుట్టుకుని వశిష్టకి అభిముఖంగా కూర్చుంది ఆశ్రిత.
అతడి ఆదేశం కోసం ఎదురుచూస్తున్నట్టు స్టీవార్డ్ పేడ్ పట్టుకుని సమీపంలో నిలబడ్డాడు.