హాస అతడికి వివరాలు చెప్పి- "వాళ్ళిద్దరికీ వారం రోజుల్లో గుళ్ళో పెళ్ళి జరుగుతుంది. అది ఆదర్శ వివాహంగా అన్ని పత్రికల్లోనూ వస్తుంది...." అంటూ వివరాలు చెప్పింది.
ఆ ప్రకారం రమణ ప్రతిభ భావిజీవితానికి చాలా రక్షణయేర్పాటు చేశాడు.
ఈ రోజుల్లో ఆదర్శ వివాహం పేరిట ఎందరో యువకులు కన్నెపిల్లల గొంతులు కోస్తున్నారు. వారిని వ్యభిచారంలోకి దింపి ధనార్జన చేసి వారి జీవితాలనంతం చేసి మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నారు. తమ సరదా తీరేక నవవధువుల్ని కిరసనాయిలు పోసి అంటించి చంపేస్తున్నారు. దేవేంద్ర అటువంటి యువకులకు భిన్నం. అతడు అసలుసిసలు ఆదర్శవాది. ప్రతిభ, దేవేంద్రల వివాహం యువతరానికి ఆదర్శంగా ఉండాలని__ఓ పత్రిక వీరి వివాహానుభవాలను సీరియల్ గా ప్రచురించబోతోంది. నవవధువుగా ప్రతిభ వారం వారం ఆ పత్రికలో తన జీవితానుభవాలు రాస్తుంటుంది. ఆ పత్రికా విలేఖరి స్వయంగా ప్రతిభనడిగి వివరాలు సేకరించి రసవత్తరంగా మార్చి వ్రాస్తాడు.
"రమణ మహిళా సంక్షేమం కోసమే పుట్టాడు. అతడు నేనూహించిన దానికంటే చాలా చాలా గొప్పవాడు" అంది హాస.
"అది సరే! కానీ నాకతడి మీద కొన్ని అనుమానాలున్నాయి. రేపు నీవతణ్ని నీకు చరిత అనే అమ్మాయి తెలుసా అనడిగిచూడు. ఏమంటాడో చూద్దాం!"
"చరిత ఎవరు?"
"ఆ విషయం రమణ చెబుతాడు."
* * * *
అదే పార్కు అదే మనుషులు.
వాన మాత్రం లేదు.
"నీకు చరిత్ర తెలుసా?" అంది హాస.
"చరిత ఎవరు?" అన్నాడు.
"నేను నిన్న ప్రశ్న అడగమనలేదు...."
"చరిత తెలుసు నాకు...." అన్నాడు రమణ.
"ఎలా?"
"చరిత్రలేని అమ్మాయిగా...."
ఆమె వింటోంది.
రమణ చెప్పుకుపోతున్నాడు.
రమణకు డబ్బుంది. అందముంది. అతడిమీద వల విసరాలని చాలా మంది అమ్మాయిలు ప్రయత్నించారు. రమణకు సంస్కారముంది. ఒక్కసారి ఎవరి వలలోనైనా పడితే పెళ్ళి చేసుకుని తీరతాడు. అదా పిల్లకు వరం. అతడికి శాపం.
చరిత అతడి మీద వల విసిరింది, మాటలలో ప్రేమ ఒలికించింది. శరీరాన్ని ఎరగా చూపించింది. రమణ లొంగకపోతే అతణ్ని మోసగాడంది. తనకు తెలిసిన వాళ్ళందరికీ అతడి గురించి దుష్ప్రచారం చేసి చెబుతుంటుంది.
"నువ్వూరు కున్నావా?" అంది ఆమె.
"రాజకీయ నాయకులకూ, సినీతారలకూ, నాలాంటి మగాళ్ళకూ దుష్ప్రచారం సహజం. ఆ ప్రచారానికి విలువనివ్వడం అసహజం" తాపీగా అన్నాడు రమణ.
"నువ్వు అమాయకుడివనుకున్నాను. శీలంలో నిన్ను నువ్వే రాజకీయ, సినీ ప్రముఖులతో పోల్చుకున్నావు" అంది ఆమె.
"కంటికి కనబడేదే నిజం నాకు...."
"అయితే రాజకీయ, సినీ ప్రముఖులపై జరిగే ప్రచారం అబద్దమంటావా?
"హాసా! ఒక హీరో, మరో హీరోయిన్ తో తెరపై శృంగారం జరిపితే అది ఎంతో సంతోషంగా చూస్తున్నాం. మన సంతోషం కోసం తెరపై శృంగారం జరిపిన వాళ్ళు తమ సంతోషం కోసం తెరమడుగున శృంగారం జరిపితే అది తప్పెలాగయింది?"
ఆమె యిబ్బందిగా, "నువ్వు, చరిత జీవన సినీ తెరపై హీరో హీరోయిన్లా?" అంది.
రమణ తన జేబులోంచి ఓ కవర్ తీసి ఆమెకందించాడు.
ఆ కవరు బ్రౌన్ కలర్లో వుంది. తెరిస్తే అందులో అయిదు ఫోటోలున్నాయి. ఒకో ఫోటోలో ఒకో అమ్మాయి. అందరూ అందంగా ఉన్నారు.
"వాళ్ళ పేర్లు ఫోటోల వెనుక వున్నాయి" అన్నాడు రమణ.
మానస, చంచల, దీప, గౌతమి, చరిత.... ఆమె ఆ పేర్లన్నీ చదివి అతడివంక ప్రశ్నార్ధకంగా చూసింది.
"నాతో ఏ ఆడపిల్లయినా ప్రేమగా మాట్లాడితే నన్ను నేను మరచిపోకుండా ఉండటానికి హెచ్చరికగా ఈ ఫోటోలు. ఎందుకంటే నేను మొత్తం అయిదు సార్లు మోసపోయాను. నేను ప్రేమతృష్ణలో ఉన్నానని గ్రహించి దరికి చేరి మృగతృష్ణ చూపించిన ఘనులు వీళ్ళు.
"మొత్తం అయిదుగురు.... కొన్నాళ్ళకు ఆరుగురవుతారు. అయితే నేను ఫోటో తీయించుకోవాలన్న మాట...." అంది ఆమె.
"హాసా! నువ్వు నన్ను వెంటాడలేదు. నేను నిన్ను వెంటాడుతున్నాను. నిన్ను చూడగానే నాకు ప్రేమంటే తెలిసింది...."
ఆమె నవ్వింది. "నేనడిగేదాకా ఈ ఫోటోల సంగతి చెప్పలేదు నాకు...."
"హాసా! నువ్వు నన్ననుమానిస్తున్నావా?"
"అనుమానించాననుకో_ అనుమానం పొగొట్టగలవా?"
"ఊఁ" అన్నాడు రమణ నమ్మకంగా.
"ఎలా?"
"నువ్వు చెప్పిన డాక్టరు చేత పరీక్ష చేయించుకుంటాను. ఇంతవరకూ నాకే స్త్రీతోనూ పరిచయం లేదని ఆ పరీక్ష ఋజువు చేస్తుంది.
అతడి కళ్ళలో అమాయకత్వం, ముఖంలో నమ్మకం మాటల్లో నిర్భయత్వం....
ఆమె ముగ్ధురాలై అతడి వంక చూస్తుండిపోయింది.
* * * *
25
ఆ రోజు దక్షిణామూర్తింట్లో పెద్ద యుద్ధం జరిగింది.
ఓ ప్రక్కన దక్షిణామూర్తి, హాస....
మరో ప్రక్కన మిగతా అందరూ....
విషయం పెళ్ళి!
సరిగ్గా మూడు వారాల్లో పెళ్ళి ముహుర్తముంది. ఆ ముహుర్తానికి హాస ఓ ఇంటిదవాలని కోదండపాణి నిర్ణయం. ఆయన తాత్కాలికంగా ఒకో పాయింటే వివరిస్తూ దక్షిణామూర్తి ప్రశ్నలకు తెలివిగా బదులిస్తూ ఆయనకు తెలీకుండానే క్రమంగా ఆయన్ను బుట్టలో వేసుకున్నాడు.
కాసేపయ్యాక చూస్తే హాస ఒక్కతీ ఉంది. దక్షిణామూర్తి కూడా ఆమెకు ప్రతిపక్షమై పోయాడు.
అయినా ఆమె గుండె నిబ్బరం తప్పలేదు.
"నాకిష్టంలేదని ముందే చెప్పేశాను. ఆ తర్వాత మీ యిష్టం" అందామె.
అందరూ తలోమాటా అన్నారు. ఆమె చలించలేదు.
చివరకు పార్వతమ్మ, "ఇంతలా మొండిపట్టు పడుతుందంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది ఎవణ్నో మరిగింది. వాడు మాయచేసి మాయమైయుంటాడు. వాడిమీద నమ్మకంతో ఎదురు చూస్తోంది. ఎమ్మేలేదు, నా బొందాలేదు. అంతా నాటకం. దీనికిప్పుడు నెల తప్పిందేమోనని నా అనుమానం...." అనేసింది.
ఊహించని ఆ అభియోగానికి అంతా నిశ్చేష్టులైపోయారు. పార్వతమ్మ కూడా తనేనా ఈ మాటన్నది అనుకుని నిశ్చేష్టురాలైపోయింది.
హాస, "బామ్మా!" అని కేకపెట్టి క్రిందపడిపోయింది.
కాసేపటికి అంతా తేరుకున్నారు. ఆమె మాత్రం తేరుకోలేదు. అందరూ వెళ్ళి చూస్తే ఆమె స్పృహతప్పి పడి ఉంది.
"హాసా! హాసా!" అని ఒక్కొక్కరే పిలిచారు ముఖం మీద నీళ్ళు జల్లారు.
ఆమెకు స్పృహ రాలేదు.
అప్పుడు రమణ అక్కడకు వచ్చాడు. పరిస్థితి చూసి ఆశ్చర్యపడి ఏం జరిగిందని అడిగాడు.
"చెప్పినమాట వినడంలేదని మనసుకు కష్టం కలిగించేమాట అనేసరికి, ఎప్పుడూ మాటపడి ఎరుగని పిల్ల షాక్ తిని పడిపోయింది" అన్నాడు దక్షిణామూర్తి.
"మాటంటే షాక్ తిని స్పృహతప్పి పడిపోతే అది అనారోగ్య లక్షణం. మనం వెంటనే ఆమెను డాక్టరు దగ్గరకు తీసుకెళ్ళడం మంచిది" అన్నాడు రమణ.
* * * *
రమణ కార్లో కుటుంబమంతా రమణకు తెలిసిన డాక్టర్ విశ్వేశ్వరయ్యను చూశారు. కార్లో ఉండగానే ఆమెను స్పృహ వచ్చింది.
విశ్వేశ్వరయ్య ఆమెను పరీక్షించి, "అమ్మాయి బాగా నీరసంగా ఉంది" అన్నాడు.
"ఈమధ్య పరీక్షలయ్యాయి" అంది ఆమె.
విశ్వేశ్వరయ్య ఆమెకు ఎక్సురే తీయించమన్నాడు. బ్లడ్ టెస్టింగ్ కావాలన్నాడు.
కార్లోంచి ఆమె దిగుతూంటే, ఆటోలో ప్రతిభ దిగింది.
హాసా, ప్రతిభ ఒకరినొకరు పలకరించుకున్నారు.
ప్రతిభ, దేవేంద్ర హోటల్లో కూల్ డ్రింక్స్ తాగుతుంటే ఆమెకు కళ్ళు తిరిగాయి. దేవేంద్ర ఆమెను డాక్టరుకి చూపించాడు. డాక్టరు టెస్టింగ్ క్లినిక్ కు వెళ్ళాలన్నాడు. ఆ ఊళ్ళో ఎక్సురే, రక్తపరీక్షలు క్షుణ్ణంగా జరిపే వ్యాపారసంస్థ టెస్టింగ్ క్లినిక్!
"సీరియస్సా?" అంది హాస.
"కాదు ప్రేమ నటిస్తున్నాడు...." అంది ప్రతిభ.