"రాయుడుగారు చెప్పారు."
"రాయుడుగారెవరూ?" అంది సుహాసిని.
"ఆయనెవరో నాకు తెలియదు. కానీ ఆయన చాలా గొప్పవాడు. నాకు పెద్ద ఉద్యోగం ఇప్పిస్తానంటున్నాడు" అన్నాడు సుబ్బారావు.
"ఆయనెవరైతే మనకెందుకుగానీ - కథ చెప్పండి" అంది సుహాసిని.
"ఈ వేళ కథ చెప్పాలని లేదు" అన్నాడు సుబ్బారావు.
"ఎందుకని" అంది సుహాసిని.
"ఏమో తెలియదు. వెల్లుల్లిపాయలు కూడా వొలవాలనిపించలేదు" అన్నాడు సుబ్బారావు.
"తలా తోకా లేని ఈ మాటలేమిటి?" అన్నాడు రాయుడు విసుగ్గా.
"వెల్లుల్లిపాయలేమిటి?" అంది సుహైస్ని ఆశ్చర్యంగా.
"ఇక్కడికి బయల్దేరేముందు నేను వెల్లుల్లిపాయలొలుస్తున్నాను. అమ్మ వొలవమంది. కానీ రాయుడిగారి పేరు చెప్పి మధ్యలో వచ్చేశాను" అన్నాడు సుబ్బారావు.
"నాకు వెల్లుల్లిపాయలెంతో ఇష్టం. మా అమ్మకీ ఇష్టమే! కానీ బామ్మ వద్దంటుంది. బామ్మ వద్దంటే మా యింట్లో ఇంకేం లాభంలేదు" అంది సుహాసిని.
"నాకూ చాలా ఇష్టం వెల్లుల్లి!" అన్నాడు సుబ్బారావు.
"ఏవీ మీ చేతులు వాసన చూపించండి!" అంది సుహాసిని.
సుబ్బారావు తన చేతులు ముందుకు చాపాడు. సుహాసిని వంగి వాసన చూసి - "ఎంత బాగుందీ!" అంది.
"వీళ్ళిద్దరిముందూ ఇన్ని లక్కపిడతలూ, పప్పులూ పొస్తే గుజ్జన గూళ్ళు ఆడుకుంటారు" అన్నాడు రాయుడు కసిగా.
"రాత్రికి మా యింటికి రాకూడదూ - వెల్లుల్లిపాయ కారప్పొడి తీసుకు వెళ్ళొచ్చు" అన్నాడు సుబ్బారావు.
"రాను ఆలస్యమైతే మా బామ్మకు అనుమానం వస్తుంది" అంది.
"పోనీలెండి. నేనే మా చెల్లెలిచేత పంపిస్తాను" అన్నాడు సుబ్బారావు.
"కథచెబుతారా? నాకెంతో సంతోషంగా ఉంటుంది" అంది సుహాసిని.
"మీకు సంతోషంగా ఉండేలా ఈ రోజు కథ చెప్పలేను. అందుకే చెప్పడంలేదు" అన్నాడు సుబ్బారావు.
ఇద్దరూ కాసేపు మౌనంగా కూర్చున్నారు. తర్వాత సుహాసిని నెమ్మదిగా, "మీతో ఓ మాట చెప్పాలి" అంది.
"చెప్పండి!" అన్నాడు సుబ్బారావు కుతూహలంగా.
"మీకు నేను ఓ యువతి గురించి చెప్పాలి!"
"ఎవరామె!"
"ఆమె...ఆమె...." అని ఆగిపోయింది. సుహాసిని__"మీ రిక్కడే ఉండండి. నేను అలా కాస్త పక్కగా వెడతాను" అంటూ ఆమె పక్కన వెళ్ళి తనకు వనజ యిచ్చిన కాగితం చూసుకుని, మరోసారి అందులోని విశేషాలు మననం చేసుకుంది. అలా రెండు మూడుసార్లుచేశాక ఆమెకు నమ్మకం కుదిరి సుబ్బారావు దగ్గరకు వచ్చింది.
"మిమ్మల్ని ... మిమ్మల్ని ఓ యువతి...." అంది సుహాసిని.
"ఊఁ!" అన్నాడు సుబ్బారావు.
"ఆమె అసమాన సౌందర్యవతి. ఆమెను వివాహం చేసుకోవాలని ఎందరో యువకులు కలలుకంటున్నారు. కానీ ఆ యువతి మాత్రం మిమ్మల్నే ప్రేమిస్తోంది. ఆ యువతి పేరు..." సుహాసిని వనజ పేరు వెంటనే చెప్పలేకపోయింది. వనజ మాటలు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించాయి, "ఒకసారి నా గురించి తెలిశాక అతను నన్ను తప్ప ఇంకెవరినీ కలలో కూడా తల్చుకోకూడదు..."
సుహాసిని మాట్లాడేలోగానే సుబ్బారావు లేచి నిలబడి, "ఆమె పేరు నాకు తెలుసులెండి" అని చటుక్కున వెనక్కు తిరిగి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.
సుహాసిని అవాక్కయి అతన్నే చూస్తూ ఉండిపోయింది. వనజ గురించి సుబ్బారావుకెలా తెలుసు? వనజ చూపుల్నిబట్టి ఊహించాడా? లేక వనజ ఒక్కతే తన స్నేహితురాలనుకున్నాడా? లేక...లేక...
ఆలోచనకే సుహాసిని బుగ్గలు ఎర్రబడ్డాయి. తనే ఆ యువతి అని సుబ్బారావు అనుకున్నాడా?
ఇంక ఏం ఆలోచించాలో తెలియక కాబోలు సుహాసిని లేచి నిలబడింది.
ఆమె వెళ్ళగానే రచయిత రాయుడితో, "చూశారా, కథ కొత్త మలుపు తిరిగింది. ఇంకా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు" అన్నాడు.
"అందుకేమిటి ఆధారం?"
"సుహాసిని కథ అడిగింది. కానీ సుబ్బారావు చెప్పలేకపోయాడు. అతడికి ఇంకేమైనా మాట్లాడాలని ఉంది. తప్పితే కథ చెప్పాలని లేదు. ఇది అతడిలో మంచి మార్పు. అలాగే సుహాసిని ప్రేమగురించి మాట్లాడిన వెంటనే అర్ధమైపోయింది. ఆమె వనజ గురించి చెబుతున్నప్పటికీ తన గురించే అని పొరబడి సిగ్గుపడి వెళ్ళిపోయాడు. ఈ రాత్రి వీరిద్దరి హృదయాల్లోనూ సంచలనం రేగుతుంది. చాలా ముఖ్యమైన రాత్రి ఇది. జీవితంలొ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలి" వాళ్ళు అన్నాడు రచయిత.
"అయితే వాళ్ళొకర్నొకరు ప్రేమించుకుంటారంటావా?"
"ప్రేమించుకోవచ్చు. కోకపోవచ్చు. కానీ వాళ్ళ మధ్య ఆకర్షణ పెరిగింది. రోజూ ఒకర్నొకరు కల్సుకోకుండా ఉండలేరు. ఏం చేయాలో వాళ్ళకి తెలియదు. పెళ్ళిచేసుకుంటామని నొక్కి చెప్పలేరు. కానీ రోజూ ఒకరినొకరు చూసుకోవాలి" ఇదో అవస్థ..."
"అయితే?" అన్నాడు రాయుడు. "సుబ్బారావుకి గోంగూర పచ్చడి, పులిహోర ఆవకాయ, వెల్లుల్లిపాయలు ఇలాంటివి మాట్లాడటం తప్పితే ప్రేమ కబుర్లు చెప్పటం చేతగాదు. అతను సుహాసినితో మాట్లాడాలంటే ప్రేమ డైలాగులు మనమే రాసివ్వాలి. అందుకేం ఏర్పాటు చెయ్యాలి?"
రచయిత కూడా ఆలోచనలోపడ్డాడు. సుబ్బారావుకు సుహాసిని పరిచయం తమ నాటకంలో భాగమని తెలియదు. తెలియజెప్పడం తమకూ ఇష్టంలేదు. అతను సుహాసినితో ప్రేమ డైలాగులు చెప్పేలా చెయ్యడం ఎలా?
ఎంత ఆలోచించినా రచయిత బుర్రకీ ఉపాయం తట్టలేదు. ఏమైతే అయిందని తెగించి ఆరోజు రాత్రి సుబ్బారావుకు కబురుపెట్టి రప్పించాడు. అతడితో నెమ్మదిగా "నీ వ్యవహారం మాకు తెలియదనుకోకు. మేమొకందుకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పార్కుకు పంపితే అక్కడ నువ్వో అమ్మాయిని పట్టావు. ఎవరా అమ్మాయి? ప్రేమ వ్యవహారం ఎంతవరకూ వచ్చింది? అన్నాడు.
"అమ్మాయెవరని అడుగుతారేం? మీరు చెప్పిన సుహాసినే! ఆమె ఇప్పుడు నన్ను ప్రేమిస్తోంది. ఏంచేయాలో నాకు పాలుపోవడం లేదు" అన్నాడు సుబ్బారావు.