Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 29


     "ఏమిటా పైట వేసుకోవడం? ఏ వైపు కిటికి తెరిచేసినట్టు. పైట వేసుకున్నా, అక్కడికి గాలి తగులుతుందిలే " అంది మందలింపుగా.

    నేను ఓ క్షణం బిత్తరపోయి పైటకేసి చూసుకున్నాను. ఏమరుపాటుతో అది జరగుతున్నట్టు వుంది గానీ పని గట్టుకుని జార్చినట్టులేదు.

    అమె కసి తెలిసిందే. బాగా చిన్నతనంలోనే అమెకు భర్త పోయాడు. అప్పట్నుంచీ ఒంటరి జీవితం. అడపిల్లగా అలా సరదాగా వుంటే ఒప్పదు. పైట జార్చామనో, నడుం కనిపిస్తుదనో, అబ్బాయిలవైపు చూస్తున్నామనో మందలిస్తూ వుంటుంది. అయితే వేదవతి జోలికి మత్రం వెళ్ళదు.

    మొదట్లో తను కాపురానికి వచ్చినప్పుడు ఇలాంటి వంకరమాటలు ఏవో అంటే వేదవతి దులిపి పారేసింది.

     "నీకంటే మొగుడూ మొద్దులూ లేకపోవడంతో మేమూ మీలాగా వుండమంటే కుదరదు. బంగారు నగలుండేవాళ్ళు వాటిని దాచుకుంటారా? మెడకు పెట్టుకుని నలుగురికి చూపించాలని అనుకోరా? అలానే ఇదీను.

    ఎత్తు ఎదవున్నవాళ్ళు అది అప్పుడప్పుడు ప్రదర్శించుకోవడం తప్పెలా అవుతుంది? ఉన్నవాటినే  చూపించుకుంటాం గానీ లేనివాటిని ఎలా చూపించగలం?" అని కొత్త  "లా పాయింట్ లేవదీసింది.

    అప్పట్నుంచి జ్యోతిర్మయి పిన్ని అమెను ఏమీ అనేదికాదు. ఎదురుపడ్డప్పుడు మూతి తిప్పుకునేది.

    భోజనానికి కూర్చున్నాను. వడ్డించేవాళ్ళకి దారి వదిలేసి మొదట్లో సెటిల్ అయ్యాను. నా పక్కన వేదవతి., అటువైపంతా స్త్రీలే. కుడిపక్క పురుషులు కూర్చున్నారు. నాగమణి స్వీటు తీసుకొచ్చింది.

    అందరికీ తలా ఒకటి వేసి బాబుకి రెండేసింది.

    పక్కనున్న వెంకటాచలం ఉండబట్టలేక అడిగేశాడు.

     "వాడికి మాత్రం ఏం రెండు లడ్లు, మేమేమన్నా వాడికన్నా తీసిపోయామా?"

    నాగమణి ఏం చేప్పేదో గానీ వేదవతి ఠక్కున  "మరిది గదా . ఎప్పుడైనా ఏ అవసరానికైనా పనికొస్తాడేమోనని " అంటూ కొంటెగా చూస్తూ నవ్వింది.

    నాగమణితో సహా అందరూ నవ్వేశారు. ఇక నాగమణి తరువాత వడ్డనంతా చేసింది యువకులే.

     "ఇంతకుముందు బంతులకి వడ్డించేప్పుడు మీరంతా ఏమయ్యారు? ఇప్పుడు మాత్రం హాజరైపౌయారు " అని నాగమణి ఆశ్చర్యం ప్రకటిస్తూ అడిగింది.

     "ఇది అడవాళ్ళ కూచున్న బంతికదా. అందుకే పాపం హడావుడి " అంది వేదవతి. అమె దేన్నయినసరే ముక్కు సూటిగా మాట్లాడుతుంది.

    రమణ కూడా వాళ్ళలో ఉన్నాడు.

    అతను చూస్తున్నప్పుడు తినడానికి నాకు సిగ్గుగా వుంది. అందుకే నిదానంగా తింటున్నాను.

    అతను నా ఎదురుగా నిలుచుండి నాకేం  కావాలో తెలుసుకుని వడ్డిస్తున్నాడు.

     "బంతిలో శతరూప ఒక్కటే కాదయ్యా రమణా! మేమూ ఉన్నాం" అంది వేదవతి నిష్టూరం ధ్వనించేటట్టు.

    నాకు చచ్చేంత సిగ్గేసింది. అంత నిర్మొహమాటంగా మాట్లాడటం వేదవతికే చెల్లు.

    ఆ తరువాత ఏదో తిన్నానంటే తిని లేచాను.

    ఆ సాయంకాలం అయిదు గంటలకి ట్రాక్టర్లు బయల్దేరుతాయి ఇంట్లో కాసేపు నడుంవాల్చి నాలుగ్గంటలనుంచి తయారుకావడం మొదలుపెట్టాను.

    ముందు అనుకున్నట్లే మైసూర్ సిల్క్ చీర కట్టుకున్నాను. తల స్నానం చేయడంవల్ల లూజుగా జడ వేసుకున్నాను. జుమికీలు పెట్టుకున్నాను.

    మొదటి ట్రాక్టర్లో ముసలీ ముతకా కూర్చున్నారు.

    రెండో ట్రాక్టర్లో కుర్రకారంతా ఎక్కింది.

     ఆ చీరలో కింత కూర్చోవడం కుదరదు. గనుక ట్రాలీ చెక్కకు అనుకుని నిలబడ్డాను.

    కొందరైతే కింద ఓ దుప్పటిపరిచి దానిమీద కూర్చున్నారు. ట్రాక్టర్లు బయల్దేరాయి.

    అవి తార్రోడ్డుమీద కొంతదూరం ప్రయాణించి ఆ తరువాత మట్టి రోడ్డులోకి దిగాయి. నా పక్కన ఎప్పుడు చేరాడో ఏమోగానీ రమణ వచ్చి నిలుచున్నాడు.

    ట్రాక్టర్ గుంతల్లో దిగి పైకి లేచినప్పుడల్లా అతని వేళ్ళు నా వేళ్ళను తగులుతున్నాయి. నిజం చెప్పద్దూ! అలా అతని వేళ్ళు తగులుతున్నప్పుడంతా గుండె జల్లుమంటోంది. ఎద నీళ్ళుపీల్చుకున్న చుట్టచుట్టిన చేమంతుల దండే అవుతోంది.

 Previous Page Next Page