Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 28

    వనజ పాణి దగ్గరకు వెళుతుందా? తాను సంపాదించిన దానం దొంగిలించడానికే వెళ్ళే దొంగను చూసి నిస్సహాయస్థితిలో ఉంది దుఃఖించినవానిలా బాధపడింది.
    నిముషం తరువాత వనజ వచ్చి పడుకుంది.
    -తానెంత నీచురాలు? వనజ పాణి దగ్గరకు వెళుతూందనుకున్నది. పాణి తనను ప్రేమిస్తాడా? వనజను ప్రేమించాడేమో! ఆ ఊహ ఆమెకు నరకయాతఃన కల్పించింది. వనజ తన గదిలో పడుకోని రోజంతా మేధస్సుకు అందినంతవరకూ గతాన్ని చూచింది. లేదు, వనజ చరిత్ర పాణికి తెలియదా? దాసీదాన్ని ప్రేమిస్తాడా పాణిలాంటివాడు? ఏమో! ఉహు వీలులేదు.
    అలా అనుకునేసరికి అతని గానం ఆమె చెవులలో రింగుమంది. పాణి చిరునవ్వు నవ్వుతూ చేతులు చాచి తనను రమ్మన్నట్లనిపించింది. తాను రెక్కలు కట్టుకొని ఆ ఊహా ప్రపంచంలోకి వెళ్ళగలుగుతే ఎంత బావుండును? అతని వక్షస్థలంపై తల ఉంచగలుగుతే!
    ఆమోఒళ్ళు జలదరించింది.
    నిద్రపోలేదు.
    తెల్లవారింది.
                                           15
    ఒంటికి నూనె రాస్తుంటే కనిపించింది వనజకు పాణి భుజాన వెడల్పుగా వున్న నల్లని పుట్టుమచ్చ.
    "ఇదేమిటి" అడిగింది వనజ.
    "పుట్టుమచ్చ. చిన్నప్పుడు చిన్నగానే ఉండింది, నేను పెరుగుతుంటే అదీ పెరిగి పెద్దదై ఇంతైంది."
    అన్నకు నూనె రాసింది. పన్నీరు కలిసిన పిండితో నలుగు పెట్టింది. అటూ, ఇటూ చూచి ఎవరూ లేరనే విషయం ధృవపర్చుకొని "అన్నయ్యా! ఒక్కమాట" అన్నది.
    "ఏమిటో?"
    'దొర ఏమన్నడో ఎరికేనా?'
    'ఏమన్నడు?'
    'నన్నిచ్చి నీకు పెళ్ళి చేస్తడంట.'
    చల్లని మంచినీరు నెత్తిమీద నుంచి గుమ్మరించి నట్టనిపించింది పాణికి.
    'నువ్వేమన్నావు చెల్లాయి?' చివర పదాన్ని ఒత్తిపలుకుతూ అడిగాడు.
    'ఏమనలే.'
    'ఏం? ఎందుకనలేదూ, అతడు నా అన్నయ్యని!' బాణం వదిలినట్లు వచ్చాయి మాటలు.
    ఆశ్చర్యంగా అన్న ముఖంలోకి చూచింది వనజ. ముఖంలోని ఎరుపుదనం అప్పుడప్పుడు దిగిపోతూంది.
    'అనలే.'
    'ఎందుకు?' ప్రశ్నలో అధికారం కనిపించింది. కోపం వ్యక్తమైనది.
    వనజ కళ్ళు చెమ్మగిల్లాయి. 'ఆడబాపగనే బతకాల్సొస్తది!' అణుకువగా జవాబు చెప్పింది.
    పాణి గ్రహించాడు. వనజలో వచ్చిన మార్పుకు ఆశ్చర్యపోయాడు. ఎంతదూరం ఆలోచించింది! పెళ్ళి చేసుకోనంటే వేశ్యగా జీవించాల్సి వస్తుంది. చేసుకుంటానంటే ఆ జీవితం నేటితో అంతమైనట్లే! నిజమే కానీ, మంజరి ఏమనుకుంటుంది? ముందు ప్రేమించిన వనజ చెల్లెలైంది. ఇప్పుడు నలుగురికీ చూడ్డానికి కాబోయే భార్య అవుతుంది. ఈ విషయం తెలుస్తే మంజరి తనను మనిషనుకుంటుందా? చెప్పేస్తే తాను పెళ్ళి చేసుకోనని! చెల్లెల్ను వేశ్యను చేయాల్సివస్తుంది. వనజ మళ్ళీ వేశ్య కారాదు. ఆమె పవిత్రమైన జీవితం గడపాలి అనుకున్నాడు.
    'వనజ! ఎంత ఆలోచించావ్?'
    "అంతా అన్నదయే. మనం అన్నా, చెల్లెళ్ళమని ఎవ్వరికి ఎరిక కాకూడదు."
    పిడుగు పడ్డది పాణిమీద. స్తిమితపడి స్థిరస్వరంతో, "మంచిది, అలాగే" అన్నాడు.
    స్నానం చేసి గదికి వచ్చేసరికి రామారెడ్డిగారు కొత్త "రాజ్ కుమార్" ధోవతులు పంపించారు. అవి కట్టుకొని క్రిందికి వెళ్తే బ్రాహ్మణుడొచ్చి పూజ ప్రారంభించాడు. రామారెడ్డిగారు. ఇందిరమ్మ పీటలమీద కూర్చున్నారు. బ్రాహ్మడు మంత్రాలుచదివి "చిందొరసాన్ని పిలవాలె" అన్నాడు. ఎంకటి మంజరిని తీసుకొని వచ్చాడు. తలంటి పోసుకుంది. పండుగ ముస్తాబయి ఉంది.
    గడపలో అడుగు పెడ్తూనే మంజరి పాణిని చూచింది.
    పాణి మంజరిని చూచాడు.
    ఇద్దరి చూపులు రాచుకున్నాయి. మల్లెలు రాలేయి. పూజ జరుగుతున్నంతసేపూ మంజరి పాణిని చూసింది. ఎప్పుడు చూచినా పాణి తనను చూస్తునట్లే అనిపించిందామెకు. పూజ పూర్తికాగా వీణమీద సరళి వరుసలు ప్రారంభించాడు పాణి.
    ప్రసాదం అందుకుంటూ "పంతులూ! చావిడికాడ నీకోసం ఇంతజార్ (వేచి వుంటారు) చేస్తాంటరు, పోదం నడువు" అన్నారు రెడ్డిగారు.
    బియ్యం వగైరాలు మూటకట్టుకొని భుజాన వేసుకొని పెరిగెత్తాడు బాపడు.
    రెడ్డిగారూ, పాణి వీధిన బయల్దేరారు చావడికి.
    "పంతులూ! ఇయాల్టినుంచి మాతోనే తిను. నీ ముంగల గోషా ఎవరికున్నది గనుక అర్రల తింటవ్?"
    "చిత్తం."
    "గడీని నీ ఇల్లనుకోవాలె."
    "చిత్తం. ఇంటికంటే సుఖంగా ఉన్నానండీ!"
    "మంజరి నీ చెల్లెలనుకో"
    ఒళ్ళు జల్లుమంది. ఎన్నో ఆలోచనలు భ్రమించాయి. తన తడబాటు మించి, గొంతులో పైతం దాన్ని వ్యక్తం కానివ్వకుండా 'చిత్తం' అన్నాడు.
    "దొరసాన్ని తల్లనుకో. ఆమె నిన్ను కొడుకోలే చూసుకుంటది."
    ఈలోగా చావిడి వచ్చేసింది. "దొరొచ్చిండు. దొరొచ్చిండు" అని అంతా లేచి వినయంగా నమస్కరించారు, తలగుడ్డలు తీసి.
    రెడ్డిగారు అందర్నీ ఒక్కసారి కలయజూచి "కరణం రాలే" అనడిగారు.
    ఒకడు పరిగెత్తాడు. తిరిగివచ్చి "కరణం దొరకు సుస్తిగున్నదన్నడుండి" అని చెప్పాడు. ఇందుక్కారణం వేరే ఏదో ఉందని గ్రహించిన రెడ్డిగారు "గడీకి పోయేటప్పుడు దొరొస్తనన్నడని చెప్పు" అని పంపించారు వాణ్ని మళ్ళీ.
    చావిడిలో కత్తులూ, తుపాకులూ పెట్టారు. వాటికి కంకణాలు కట్టారు. రెడ్డిగారికి కంకణం కట్టి పూజ చేయించాడు బాపడు. ఆయుధపూజ ముగిసింది. ఊరిపెద్ద "ముత్రాస" మేకను పట్టుకొనివచ్చాడు. చాకలి ఒక గడ్డినిండిన గంప తెచ్చాడు. ఆ గంపలో మేకను పండుకోబెట్టారు. ఇద్దరు దాని తల, ఇద్దరూ కాళ్ళూ పట్టుకున్నారు. రెడ్డిగారు కరవాలం పుచ్చుకొని యెత్తి "జై మహాకాళికి" అన్నారు. జనమంతా "జై" అన్నారు. ఒక్కవేటుకు మేక మెడ తెగడమూ, తుపాకులు పేలటమూ ఒకేసారి జరిగాయి.
    రెడ్డిగారు బైల్దేరారు. వారివెంట పాణి బైల్దేరాడు. కరణం ఇల్లు కనిపించగానే "నడువు, నేనొస్త" అని సారంగపాణితో చెప్పి కరణాన్ని పిలిచారు రెడ్డిగారు. కరణం వచ్చి రెడ్డిగార్ని లోపలికి తీసికెళ్ళి కూర్చోబెట్టారు.
    "ఒళ్ళు మంచిగ లేదన్నరట?"
    "ఏదో జర సుస్తీగున్నది."
    "పూజకు రాలే?"
    "నేను లేకుంటే ఎళ్ళకపోతదా?"
    "అదేంది. గట్లెందుకుకంటరు?"
    "లేకుంటే ఏంది? గా సంగీతపోన్ని ఎంటేసుక తిరుగుతారు. వానికేమన్న కులమా? వాడుంటే నేనెట్లొస్త ననుకున్నరు?"
    "అట్లంటరెందుకు? పంతులు బ్రాహ్మడే కద!"
    'బావ నోడైతే రెడ్డోళ్ళింట్ల తింటాడు?' అందామనుకున్నాడు. కాని రెడ్డిగార్ని కించపర్చినట్లవుతుందని "బాపనోడైతే గిట్లెందుకు చేస్తడు!" అన్నాడు.
    "ఏం చేసిండేం!"
    "ఎట్ల చెప్పేటిది? తిడ్డామంటే అక్కబిడ్డ, కొడ్దామంటే యాకటి మనిషి అన్నట్లున్నది. ఎవరిమీద చెప్పుదు? పంతుల్నంటే దొరకు కోపమొస్తది. బయట పెట్టుకుంటే బిడ్డ పరువు పోతుంది."
    "ఏం చేసిండో చెప్పరాదు?"
    "ఏమని చెప్పాలే. ఎట్లని చెప్పాలే, నేను లేనప్పుడొచ్చిండట. తాయార్ను గుంజిండంట. అది రానంటే దొరతో చెప్పి ఊళ్ళనుంచి ఎళ్ళగొట్టిపిస్తనన్నడట."
    రెడ్డిగారి ఒళ్ళు మండింది. తన కూతురు శపధం నెగ్గించడానికి చేస్తున్న పథకం అని గ్రహించారు.
    "అచ్చా, వస్త." అని బైల్దేరారు.
    కరణానికి ఒళ్ళు మండింది. పంతులలా చేశాడని చెపితే మాట్లాడకుండ లేచిపోతాడు! సరే. చేతిలోకి రాకపోతాడా అనుకున్నాడు. మీసం మీద చెయ్యి వేశాడు. అది చేతికి తగలకుంటే గుర్తుకువచ్చింది, బస్తీలో మీసం గొరిగించాడనే విషయం.
    సురసురమంటూ గడీలోకి చేరారు దొరవారు. గజ్జెల బల్లెం గల్లు గల్లు మనిపించుకొంటూ వచ్చిన టపా బంట్రోతు సలామ్ చేసి ఒక పెద్ద కవరు అందించి వెళ్ళిపోయాడు. కవరు తెరిచి చూస్తే ఎన్లార్జ్ అయిన ఫోటోలున్నాయి. ముఖం చాటంతైంది రెడ్డిగారికి. పాణిని పిలిపించాడు ఉత్సాహంతో. 'పంతులూ! పెద్దగైతే తస్వీర్లు ఎంత బాగున్నై,' అని ఒక్కొక్క ఫోటో చూచారిద్దరూ. తరువాత "మంజరీ!" అని పిలుస్తూ ఫోటోలు పట్టుకొని గదిలోకి కుర్రాడిలా పరిగెత్తారు రెడ్డిగారు, పాణి నిలిచిపోయాడనే విషయం సహితం గ్రహించకుండా.

 Previous Page Next Page