"తలనొప్పితో నాకంతా అయోమయం అయింది. నిన్ను బాధపెట్టకూడదని ఆలస్యం చేయటం అదే ఆలస్యంగ రావటం తెలివి తక్కువ కదూ?"
"కరెక్ట్"
"మీకు అమృతాంజనం అంటే ఎలర్జీ కదా?"
"ఎస్ మేడమ్!"
"ఆ సీసాని చేత్తో కూడా తాకరు కదా?"
"ఎస్ మేడమ్!"
"మరి మీరెందుకు సగం అమృతాంజనం సీసా ఖాళీ చేసినట్లు?" సీతామనోహరి లా పాయింట్ లాగుతూ అడిగింది.
"ఇందాక నీవే మన్నావు?" రామకృష్ణ సీరియస్ గ అడిగాడు.
"ఏమన్నాను?"
"గుర్తు లేదా?"
"ఉహూ."
"తలనొప్పి ఎక్కువగ ఉండేసరికి అబ్బాయిగారికి బుర్ర బొత్తిగ పని చెయ్యలేదు. అన్నావు."
"అంతమాట అన్నానా!"
"ఆ... పతిదేముడిని పట్టుకుని అంతమాట అన్నావు."
"సారీ అండీ! ఇంతకీ ఈ మాట మీరెందుకు గుర్తు చేసినట్లు?"
"తలనొప్పి ఎక్కువ అయింది. దాంతో బుర్ర తిరుగుడు జాస్తి అయింది. దాంతో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా పోయింది. దాంతో అమృతాంజనం ఎడా పెడా పోసుకున్నాను."
సీత కిల కిల నవ్వింది. "పోసుకోటం కాదు మహానుభావా పూనుకోటం."
"పూనుకోటమో రాచుకోటమో ఏదో వక ఘనకార్యం చేశాకదా?" తనూ నవ్వేస్తూ అన్నాడు రామకృష్ణ.
"ఇహ పై తలకాయ పగిలి పోయేటంతగా తలనొప్పి వచ్చినా సరే మీరు అమృతాంజనం ముట్టుకోవద్దు."
"అదేమి?"
"నేనో సత్యం కనుక్కున్నాను."
"సత్యమా!" ఉలిక్కిపడ్డాడు రామకృష్ణ.
"ఎస్. అట్లాంటి యిట్లాంటి సత్యం కాదు నగ్న సత్యం. రాత్రి మీకొచ్చిన తలనొప్పి చాలా ఘోరమైందే కావచ్చు కాని మీరు వాంతి చేసుకుంది, తలనొప్పికి కాదు. ఆ రహస్యం నాకు తెలుసు" సీత గంభిర్యంగా అంది.
రామకృష్ణ గుండె దడ దడ లాడింది. పై ప్రాణాలు పైననే పోయినట్లు అయ్యాయి. నిజం గ్రహించిన సీత యింత ప్రశాంతంగ వుంటుందా?
"అదేమిటి బెల్లంకొట్టిన రాయిలా అలా వుండిపోయారు? ఆ రహస్యం ఏమిటి అని అడగండి?" సీత అంది.
"అది...... అది....."
"మీరు తెలుసుకోలేరు లెండి. నేనే చెపుతాను. తలనొప్పి బాధ భరించలేక అమృతాంజనం తలకి వంటికి పక్కలకి పట్టించారు కదా ఆ వాసన పడక కడుపులో తిప్పి వాంతి అయింది యామై కరెక్ట్?"
రామకృష్ణ ప్రాణం కుదుటపడింది. పైకి మాత్రం అమాయకంగా "అంతే అంటావా సీతా!" అన్నాడు.
"మీకు తెలియదు కరెక్ట్ గా అంతే. ఈ తఫా తలనొప్పి వస్తే డాక్టర్ దగ్గరకు పోదాం. ఇంత ఘోరంగా తలనొప్పి వచ్చిందంటే దానికేదో తగిన కారణం వుంటుంది."
"అదీ నిజమేలే" తేలికగా వూపిరి పీల్చుకుంటూ అన్నాడు రామకృష్ణ.
"అమృతాంజనం సీసా జోలికి వెళ్ళారంటే నా మీద ఒట్టే.
"ఇంక వెళతానా? ఓసారి బుద్ధి వచ్చిం తరువాత ఆ సీసాని ముట్టుకోను గాక ముట్టుకోను. పైగా నీవు వట్టు కూడా వేశావు కదా! ఇంక ఆ సీసా పేరెత్తితే వట్టు."
"రాముడు మంచి బాలుడు" అంటూ సీత అందంగ నవ్వింది.
సీత అమాయకత్వం చూస్తుంటే రామకృష్ణకి "అయ్యో" అనిపించింది. "ఈ పిచ్చి పిల్లనా నేను మోసం చేసింది?" అని క్షణకాలం బాధపడ్డాడు. అంతలోనే తెలివి తెచ్చుకుని "నిప్పులాంటి నిజం సీత భరించలేదు. భరించలేదు. నిజం చెప్పి సీతని బాధపెట్టి సీత అపార్ధం చేసుకుంటే తను బాధపడి ఈ గోలకన్నా నోరు మూసుకోటం వుత్తమం" అనుకున్నాడు.