"ఇలా ఎందుకు జరిగి ఉంటుందో ఊహించావా?"
సునంద తల అడ్డంగా తిప్పింది.
"అరుణను చూసినా నీకు అర్ధం కాలేదా? ఆ చిరిగిన బ్లౌజ్, ముఖం మీద రక్కుళ్ళు, జారిపోయిన కుచ్చెళ్లు...."
"అంటే...... ఓ మైగాడ్!"
"ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరా?"
"వంట మనిషి ఉంది."
"ఆవిడేం చెప్పలేదా?"
"సరిగ్గా చెప్పడం లేదు."
"ఆ అనుమానం రాలేదు. ఎవరో వచ్చి బెదరించి ఉంటారనుకున్నాను. ఆ వచ్చింది రవే అయివుంటాడనుకున్నాను. అరుణ అమాయకురాలు. పిరికిది కూడా. రవి అంటే చచ్చేంత భయం."
"ఇది రేప్ కేసు...." అంటూ పరీక్షించింది సుమతి." వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి. పూర్తిగా అబార్షన్ కాలేదు" అన్నది సుమతి.
సునంద స్థాణువులా నిలబడిపోయింది.
సుమతి అరుణను సునంద సహాయంతో కారులోకి చేర్చింది.
అరుణ స్పృహలో లేదు.
సునంద వెళ్ళి కార్లో అరుణ తల దగ్గర కూర్చుంది. ఏదో గుర్తొచ్చి నట్టు "ఒక్కక్షణం" అని కారు దిగి ఫోన్ దగ్గరకు పరుగు తీసింది.
విమలకు వెంటనే సుమతి నర్సింగ్ హోమ్ కు రమ్మని చెప్పి ఫోన్ పెట్టేసి కార్లో కూర్చుంది.
సునంద మనసు మధనపడసాగింది.
తన ఇంట్లోనే రేప్ కేసా?
ఎవరు చేశారు?
ఇలాంటి కేసుల్లో కలుగజేసుకున్నందుకు తన మీద చాలా మందికి కసిగా ఉంది. ఎవడో తన మీద కసిని ఇలా తీర్చుకున్నాడు.
ఆమె తలలోకి వెచ్చటి రక్తం చివ్వున చిమ్మినట్టయింది.
ఎవడు వాడు?"
"ఎవడైనా సరే, వాడిని తను ఉరికంబం ఎక్కించేదాకా నిద్రపోదు.
స్పృహ తప్పి పడివున్న అరుణ ముఖంలోకి చూసింది.
ఆమె కళ్ళలోకి నీరు చిప్పిల్లింది.
పాపం, అరుణ! అమాయకురాలు. పసిబిడ్డలాంటిది. ఇప్పటికే జీవితంలోని ఎంతో చేదును రుచి చూసింది. అయినా ఆమె స్వభావం చేదు లేదు. అంతా తీపే.
ఆ రవి ఈ సంగతి తెలిస్తే మళ్ళీ అరుణ ముఖం చూడడు.
ఒకవేళ రవే ఇలా చేయించాడా?
ఛ! ఛ! తనేమిటిలా ఆలోచిస్తూంది?
రవి అంత దుర్మార్గుడు కాడు.
బెదిరించగానే భయపడి అరుణను పెళ్ళి చేసుకున్నాడు. అతను చేసుకోనని మొండికి తిరిగితే న్యాయంగా ఎవరూ చెయ్యగలిగిందేమీ లేదు."
రవికి తనమీద కసిగా ఉంది.
తన ఇంట్లో ఇలా జరిగినందుకు ఆ తప్పంతా తన మీద వేస్తాడు. ఎలాగయినా అతడు అరుణను వదిలించుకోవాలనుకుంటున్నాడు.
నర్సింగ్ హోమ్ ముందు కారు ఆగింది.
ఎమర్జెన్సీ గదిలో చేర్చారు. సుమతితో పాటు మరో డాక్టరు కూడా పరీక్ష చేశాడు.
గది ముందున్న బల్లమీద కూర్చుని ఉంది సునంద.
సుమతి బయటికి వచ్చింది.
"ప్రాణ భయం లేదు. కాని గర్భం నిలవదు. అయిదో నెల కూడా నిండినట్టుగా ఉంది."
"అరుణకు స్పృహ వచ్చిందా?"
"వచ్చింది. కాని చాలా ఉద్రేక పడుతోంది. ఈ సమయంలో మీరెవరూ కనిపించడం అంత మంచిది కాదు" అన్నది సుమతి.
సునంద నీరసంగా బల్లమీద కూలబడింది. సుమతి లోపలి కెళ్ళింది.
విమల వచ్చింది. "ఏం జరిగింది?" సునందను ప్రశ్నించింది.
"విమలా, నువ్వు ఇక్కడే ఉండు. నేను ఇంటికి వెళ్ళి త్వరగా వచ్చేస్తాను" ఆమె సమాధానానికి ఎదురుచూడకుండానే ఇంటికి బయలు దేరింది సునంద.
"వెంకటమ్మా!" ముందు హాల్లో సోఫాలో కూలబడి కేక పెట్టింది సునంద.
వచ్చి ఎదురుగా నిల్చుంది ఆమె.
సునంద వెంకటమ్మ ముఖంలోకి చూసింది.
ఆమె కళ్ళు వాచి ఉన్నాయి.
చాలా భయపడిపోతున్నట్లుగా కనిపిస్తోంది.
"అలా కూర్చో!"
సునంద ఎదురుగా నేలమీద చతికిలబడింది వెంకటమ్మ.
"అదేమిటి? ఆ స్టూలు మీద కూర్చో!
"ఫర్వాలేదమ్మా!" కంఠం వణుకుతోంది.
"ఎందుకంత భయపడతావ్? నీకు ఏ హానీ జరక్కుండా చూసుకొనే బాధ్యత నాది" ధైర్యం చెపుతూ అన్నది.
"నా భయం నా గురించి కాదమ్మా!"
"మరి?"
తలవంచుకొంది వెంకటమ్మ.
"చెప్పు! అనవసరంగా సాగదీయకు." అసహనంగా అరిచింది.
మౌనంగానే ఉండిపోయింది ఆమె.
"ఆ దుర్మార్గున్ని గుర్తుపట్టావా?"
తల ఊపింది వెంకటమ్మ.
"మరైతే చెప్పు!"
"నోరు రావడం లేదమ్మా!"
"అంత దారుణం చేసిన ఆ దుర్మార్గుడి పేరు చెప్పడానికి నీకు నోరు రావడం లేదా? అంటే నీకు సంబంధించినవాడా?"
"అయ్యో! కాదమ్మా!"
"మరి చెప్పు!"
"గౌతమ్ బాబు!" ఒక్కసారిగా అని తలదించుకుంది.
సునంద త్రుళ్ళిపడింది.
ఆమెను అయోమయంగా చూసింది.
"నీకు మతిపోయినట్టుంది."
"అవునమ్మా! ఆ బాబును చూడగానే నాకు మతిపోయింది. ఆ బాబు అలాంటి వాడనుకోలేదు. ఇందు తల్లికి తెలిస్తేగా.....అదే నా బాధ అమ్మ గారూ! ఇందు తల్లిని నేను ఈ చేతుల్తో పెంచాను" ఆమె కంఠం బొంగురు పోయింది.
సునందకు మాటలు వినిపించలేదు.
గౌతమ్ ఇలాంటి పని చేశాడా?
నో! నో! నమ్మలేను. నమ్మను.
ఈమె సరిగా చూసి ఉండదు.
అరుణ కొంత స్థిమితపడ్డాక అసలు విషయం తెలుస్తుంది.
"వెంకటమ్మా! నువ్వు సరిగ్గా చూశావా?"
"చూశానమ్మా! తన పేరు చెబితే చంపేస్తానని బెదిరించాడు కూడా."
"ఎలా వచ్చాడు?"
"ఎప్పుడూ వచ్చే మోటార్ సైకిల్ మీదే."
సునంద కళ్ళు మూసుకొని వెనక్కు వాలింది సోఫాలో.
"అమ్మా కాఫీ!"
వంటమనిషి అందించిన కాఫీ యాంత్రికంగా తాగింది. చివ్వున లేచి చకచకా బయటికి వెళ్ళిపోయింది.
9
విమల సునంద కోసం ఎదురుచూస్తోంది. ఆమె ముఖం వెలవెలా పోతోంది. జరగరానిదేదో జరిగినట్టుగానే ఉంది ఆమె ముఖం చూస్తే.
"ఏమైంది? అరుణ బాగుందా?" ఆతృతగా అడిగింది సునంద.