"మీకు మాట లేక్కువయిపోయాయ్! ఇవిగో ముందు! టీ తాగండి! ఇంతసేపూ ఎక్కడ తిరుగుతున్నారూ?"
"ఎక్కడయితేనేం! అనుకొన్నది మాత్రం జరగలేదు!"
"ఏమిటది?"
"ఉద్యోగం సంపాదించడం!"
"ఉద్యోగం కోసం నిన్నప్పుడేవరు తిరగామన్నార్రా? ఎప్పుడో పదకొండింటికీ ఇల్లు వదిలినవాడివి రెండింటివరకూ ఇంటికి రాలేదని సావిత్రి ఖంగారుపడి నాకు ఫోన్ చేసింది. నేను వెంటనే మీ ఆఫీస్ కెళ్ళి కనుక్కొంటే అంతకు ముందెప్పుడో అక్కడనుంచి బయలుదేరావని తెలిసింది. చేసేదేం లేక ఇంటికొచ్చాను! వెనుకే నువ్వూ వచ్చావ్!" చెప్పాడు శ్రీకాంత్.
చలపతికి నవ్వొచ్చింది.
"ఓహో! కధ అద్భుతంగా అల్లారు! ప్రశ్నల శీర్షిక లేకుండా ముందే జాగ్రత్త పడ్డారు. ఇంక అనుమానపడడానికి ఆస్కారం లేకుండా చేసేశారు'
తిరిగి వచ్చి హాల్లో కూలబడ్డాడు చలపతి. శ్రీకాంత్ ఏదో పనుందని మళ్ళీ వెళ్ళిపోయేడు సావిత్రి గార్డెన్ లో తిరుగుతోంది.
అవును! ఇప్పుడు తన దగ్గరుండాలంటే చిరాగ్గా ఉంది కాబోలు. శ్రీకాంత్ సాన్నిధ్యమే హాయినిస్తోంది కాబోలు. కొత్తొక వింత , పాతొక రోత.........
ఎవరు చెప్పరది? ఆ చెప్పిన వారికి ఇలాగే జరిగిందా? తనలాగానే చిత్రవధ అనుభవించారా? ఏమో ఆ కధ తనకి తెలీదు!
"అలా కూర్చుండి పోయారేందుకు?" నవ్వుతూ అడుగుతోంది సావిత్రి.
"ఊరికినే!"
"తోటలో కూర్చుందాం, రాకూడదూ?"
"శ్రీకాంత్ లేడుగా?" ఆమె ముఖంలోకి చూస్తూ కావాలనే అన్నాడు.
"శ్రీకాంత్ లేకపోతేనేం? ఇద్దరం కుర్చోకూడదా?" ఆశ్చర్యంగా అడిగింది.
"అతనుంటే సరదాగా వుంటుందేమో .........."
"మీరు మాట్లాడే మాటల్లో తలాతోకా లేకుండా వుంటోంది?" నవ్వుతూ అందామె.
చలపతి నడిచాడామెతో. ఇద్దరూ కుర్చీల్లో కూర్చున్నారు. ఎండ పూర్తిగా తగ్గిపోయింది. చల్లని గాలి ఆహ్లాదం కలిగిస్తోంది.
* * *
"నీకు ఇక్కడే చాలా బావున్నట్లుంది కదూ సావిత్రీ!" తిరిగి అడిగాడు చలపతి.
"ఎక్కడ?"
"శ్రీకాంత్ ఇంట్లో!"
"ఎందుకు బావుండదు. ఇంత అందమైన ఇంట్లో ఉండటం ఎవరికయినా బాగానే ఉంటుంది."
"ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనికూడా అనిపించటం లేదుకదూ?"
"బాగుంది! ఇదేం మన సొంత ఇల్లా వదలకుండా కూర్చోడానికి?"
"సొంత ఇల్లు కాకపోతేనేం! సొంతం చేసుకోవడం కష్టం కాదుగా?"
"ఎందుకని కాదు?"
"ఏమో! ఏదో రకంగా ఇక్కడే ఉండిపోవచ్చని అనుకొంటున్నాను."
"ఎంతకాలం ఉంటామలా? ఏదొక రోజు పోవాల్సిందేగా?"
"తల్చుకుంటే శాశ్వతంగా కూడా ఉండిపోవచ్చు."
"ఎలా?"
"ఏం లేదు" సంభాషణ అపివేస్తూ అన్నాడు చలపతి.
డైరెక్టుగా తన మనసులోనీమాట ఎంత ప్రయత్నించినా అనలేకపోతున్నాడు తను. వాళ్ళిద్దరి మధ్యా ఉన్న సంబంధాన్ని తను కళ్ళతో చూడలేదు. కాని జరుగుతున్న సంఘటనలు చూస్తోంటే తన అనుమానాలు బాగా బలపడుతున్నాయ్! అయినా ఎంత తెగించినవారయిన తన కళ్ళ బడేట్లుగా విశృంఖలంగా ప్రవర్తిస్తారా ఏం?
"ఆపరేషన్ కి ముందే నయం! మీరు చక్కగా మాట్లాడేవాళ్ళు."
"ఇప్పుడు మాట్లాడటం లేదా?" అడిగాడు చలపతి.
"ఏమిటో మరి - ఇప్పుడు అంతా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు! మనసులో ఏదో ఉంచుకొని ఏదో మాట్లాడుతుంటారు."
"ఇదొక సరదా అనుకోరాదూ?"
"అవును! అలాగే వుంది!" నవ్వుతూ అంది సావిత్రి.
"అది సరే గాని --- ఉద్యోగం సద్యోగం లేకుండా ఎన్నాళ్ళు శ్రీకాంత్ దగ్గర పడి వుండాలో అర్ధం కావడం లేదు నాకు."
"నిజమే! నాకు అలాగే ఉంది! కానీ ఈ పరిస్థితుల్లో మరి కొంతకాలమయినా మనం ఇక్కడ వుండక తప్పదు."
"ఎందుకని?"
"ఎందుకేమిటి? మీకు మరో ఉద్యోగం దొరకవద్దూ?"
"దొరక్కపోతే!"
"............"
"దొరక్కపోతే?"
"దొరక్కుండా ఎలా వుంటుంది?"
"ఒకవేళ దొరక్కపోతే?"
"అప్పుడే ఆలోచించుకోవచ్చు."
"అంతేగానీ అప్పటికీ ఈ ఇల్లు వదిలి వెళ్ళాలని నీకు లేదన్నమాట!"
తత్తరపడి చలపతి వంక చూసింది సావిత్రి. అతనా మాటలు ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడో ఆమెకు బోధపడటం లేదు. ఒకోసారి స్పురిస్తున్న విపరీతార్ధం కేవలం యాదృచ్చికమేమో అనిపిస్తోంది.
"మిమ్మల్ని మరోసారి డాక్టర్ కి చూపిస్తానని అంటున్నారు శ్రీకాంత్" కొద్దిక్షణాలాగి అందామె.
ఎందుకట?"
"మరోసారి చెక్ మంచిదని అంటున్నారు నేనూ అలాచేస్తేనే బాగుంటుందనుకొంటున్నాను...."
"ఈసారయినా తిరిగి రాకుండా పోతానేమో అనా?" కావాలని నవ్వుజోడిస్తూ అన్నాడతను.
సావిత్రి అతని వంక చురచురచూసింది.
"ఏమిటా మాటలు?"
"ఊరికినే అన్నానులే" నవ్వేస్తూ అన్నాడు చలపతి.
"అలాంటి మాటలు సరదాకి కూడా మాట్లాడటం నాకిష్టం లేదు......." చిన్న బుచ్చుకొంటూ అందామె. చాలాసేపు మాటల్లెకుండానే కూర్చుండిపోయారిద్దరూ.