Previous Page Next Page 
జనపదం పేజి 28

 

    శాసనసభ్యులు కొందరు హర్ష ధ్వానాలు చేశారు. కొందరు అభ్యంతరం తెలియజేస్తూ కేకలు వేశారు. అసలు దీనికి శాసనసభ రికార్డు నుంచి తొలగించాలన్నారు "కొత్త దొరలు" అనే పదం పార్లమెంటరీ కాదన్నారు.
    శాసనసభలో తర్జనభర్జనలు జరిగాయి. కొంత గొడవ కూడా జరిగింది. చివరకు ప్రభుత్వం "కొత్త దొరలు" అనే పదానికి నిర్వచనం సూచించడానికి గాను ఒక కమిటీ వేయడానికి అంగీకరించింది. ప్రతిపక్షాల వారు అది తమ విజయంగా భావించి హర్ష ధ్వానాలు చేశారు. బల్లలు చరిచారు.
    పత్రికలూ ఈ సంఘటనకు ఏంతో ప్రాముఖ్యాన్నిచ్చాయి. వీరభద్రం ఫోటో సహితంగా అతని ఉపన్యాసాన్ని యధాతదంగా ప్రకటించాయి. ఊళ్ళో రామయ్య వీరభద్రం బొమ్మ చూచి పత్రిక మడిచి దాచేశాడు. మల్లయ్య పత్రిక పట్టుకొని ఊరందరికీ చదివి వినిపించాడు. మస్తాన్ చుట్టుపట్ల గ్రామాలకు వెళ్లి అందులోని విషయాలు వివరించి చెప్పి అఖండ ప్రచారం చేశాడు.
    వీరభద్రానికి శాసనసభలోనూ బయటా గౌరవ ప్రతిష్టలు పెరిగాయి. ప్రతికలవారు ప్రశ్నల వర్షం కురిపించారు.
    "కొత్త దొరలు అనే పదానికి ముద్ర మీదేనా?" ఒకరు అడిగారు.
    "ఆ పదానికి మీ నిర్వచనం మేమి?" ఇంకొకరు ప్రశ్నించారు.
    "పదాలు వేయడంతో మీకు సంతృప్తి కలిగిందా?"" మరొకరు ప్రశ్న వేశారు.
    "పదాలు ప్రజల్లోంచి , పరిస్థితుల్లోంచి పుడ్తాయి. మన ప్రభువులు, నాయకులు ప్రజలకు దూరం అయినారు. వారికి ప్రజల బాష అర్ధం కావడం లేదు. అది అర్ధం చేసుకోడానికి కమీటిలు వేసే దశకు వచ్చాం మనం. సమస్యను బుట్టదాఖలు చేయడానికి కమీటీలు" అన్నాడు వీరభద్రం.
    పత్రికల వాళ్ళు వీరభద్రం మాటలకు చిలవలు పలవలు కల్పించారు. కొన్ని పత్రికలు వ్యాఖ్యలు, కొన్ని కువ్యాఖ్యలు చేశాయి. కొన్ని సంపాదకీయాలే వచ్చాయి. మంగమ్మ చాలా సంతోషించింది.
    డాక్టరు ఆవిడ విషయంలో మరింత శ్రద్ధ తీసుకోసాగింది.
    వీరభద్రానికి అట్టే తీరడం లేదు. అతడు రోజు ఆస్పత్రికి రాలేకపోతున్నాడు. అయినా అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి పోతూనే వున్నాడు. వచ్చినప్పుడల్లా విమలమ్మను చూస్తూనే ఉన్నాడు. కాని ఆమె స్పృహలో ఉండడం గాని మాట్లాడడం గాని జరగడం లేదు.
    ఆరోజు వీరభద్రం వెళ్ళేవరకు విమలమ్మ కాస్త తెలివిగా ఉంది. గుర్తించింది.
    "రోజూ నీకోసం చూస్తున్న వస్తావేమోనని?"
    "అప్పుడప్పుడు వచ్చి పోతూనే ఉన్న. మీరు నిద్రలో ఉంటున్నారు"
    "అవును నాయనా ఏకంగా నిద్ర వస్తే బాగుండును. భూమిమీద యింకా గింజలు అయిపోలే. ఆ దేవునికి దయ రాలేదు' అని చేతులెత్తి కనిపించని భగవంతునికి నమస్కరించింది.
    'అట్లనకండి. డాక్టరుతో మాట్లాడిన. బాగవుతుందన్నాడు."
    "అంటరు" చిరునవ్వు నవ్వి అన్నది. "డాక్టర్లు అట్లనక ఎట్లంటరు? బతికి చేసేదేమున్నది . దొరవారు నాకోసం ఎదురు చూస్తుంటారు అక్కడ. ఎంత తొందరగా పొతే అంత మంచిది."
    "ఎంత ఇశ్వాసం! యెంత నమ్మకం!!" అదీ ఎవడూ చూడనిదాన్ని గురించి అనుకున్నాడు వీరభద్రం. "సరేగాని రాముడు గింజా గిరిజా సరిగ్గా యిస్తున్నాడా?"
    "అడగకు నాయనా అడగకు. ఆ పాపిష్టి పేరు ఎత్తకు. బుద్ది గడ్డి తిన్నది. వాడన్న వాటి కన్నిటికీ తల ఊపిన. ముంచిండు. ఏడాది రెండేళ్ళు అంతో ఇంతో పంపించిండు. ఇంతలో నేను రోగాన పడ్డ. మళ్ళ ముఖం చూపించాలే. కరణీకం వాని చేతుల్నే ఉండే. అంగుష్టలేసి తన పేరా చేసుకున్నడట. ఎవరో చెప్పంగ విన్న. ఎంతవరకు నిజమో ఆ భగవంతునికి తెలియాలే."
    వీరభద్రం రక్తం సలసల కాగింది. అయినా అ సౌమ్యమూర్తి ముందు వ్యక్తం కానివ్వలేదు. "మీరు ఊ అంటే అన్నీ సాధించి పెడ్తా" అన్నాడు.
    "ఏం సాధించను? ఎవరి కోసం సాధించను?"
    "మీకు అంత వైరాగ్యం కలుగుతే పెదా, బిక్కికి పంచి పెట్టండి. తలచుకుంటారు"
    'ఎవడు ఎవడికిస్తాడు నాయనా? భగవంతుడివ్వాలే. ఎవడి కర్మ వానిది. నా కర్మ ఇట్లా..."
    మాట పూర్తీచేయలేకపోయింది. గుండె నొప్పి వచ్చింది. విలవిల్లాడింది. డాక్టరు ఇంజక్షన్ ఇచ్చాడు. మత్తులోకి జారిపోతూ పలవరిస్తున్నట్లు అన్నది.
    "నాయనా! వీరభద్రం! నన్ను బూది చెయ్యి. వచ్చే జన్మలో నీ ఋణం తీర్చుకుంటా.
    కర్మ సిద్దాంతం మీద కోపం వచ్చింది  వీరభద్రానికి. ఈ వెర్రె దేశాన్ని నాశనం చేసింది అనుకున్నాడు.
    మంగమ్మకు ఆ రోజు మళ్ళీ నొప్పులు వచ్చాయి - పోయాయి. మనిషి మహా నీరసం అయిపొయింది. మంచంలో పడి ఉంది. మత్తుగా ఉంది. ఆమె దగ్గర చాలా సేపు కూర్చున్నాడు. వీరభద్రం. తరువాత డాక్టరును, నర్సునూ కలుసుకొని వెళ్ళిపోయాడు.
    ఆ రాత్రి వీరభద్రానికి నిద్రపట్టలేదు.
    మంగమ్మ, విమలమ్మ ఇద్దరు చెరోకవైపు చేరారు. ఇద్దరూ అతన్ని సతమతం చేస్తున్నారు. పరిస్థితులు పెద్ద వలపన్ని తనను అందులోకి లాగుతున్నట్లనిపించింది. మమత మానవత తనను నీరసింప చేస్తున్నాయి. చేసిన వాడొకడు చిక్కుకున్నాడు తాను! ఈ ఆలోచనలే అతనిని సతమతం చేశాయి. మమత మానవతా మంచివి కావా? వదులుకోవాలా? పరుల కోసం బాధ పడటంలో అనందం ఉంది. తనకోసం తాను ఏనాడూ జీవించడు అనుకున్నాడు. ఈ ఆలోచన తనకు కొత్తగా వచ్చిందనుకున్నాడు. ఏదో సంతృప్తి కలిగింది. అయిన వ్యధను అది అట్టే కాలం కప్పి ఉంచలేదు.
    ఉదయం లేచి ఆస్పత్రికి పరిగెత్తాడు. ఏదో తరుముతున్నట్లనిపించింది. ఎవరో పిలుస్తున్నట్లనిపించింది. గుండె ఎందుకో కొంతసేపు దడదడలాడింది. గబగబా ఉరికాడు. ఆస్పత్రి మెట్లెక్కి జనరల్ వార్డు లోంచి చరచరా సాగిపోతున్నాడు. విమలమ్మ మంచం కనిపించింది. చూచి వెళ్దామనుకున్నాడు. కప్పు తీసి ముఖం మీద చేయి వేశాడు.
    గుండె ఆగినంత పనైంది.
    గొంతులోంచి మాట పెగల్లేదు.
    కన్నీరు టపటప రాలింది.
    నర్స్ పరిగెత్తుకొని వచ్చి అత్యంత ఉత్సాహంగా వార్త వినిపించింది.
    "మంగమ్మగారు ప్రసవించారు. మగబిడ్డ. అభినందనలు" అన్న నర్సు అతన్ని చూసి నిశ్చేష్టంగా నుంచుండిపోయారు. ఆమె విషయం గ్రహించింది. విమలమ్మ ముఖం మీద గుడ్డ కప్పింది.
    సంతోషించాలో , దుఃఖించాలో అర్ధం కాలేదు వీరభద్రానికి. అయినా కృంగిన మనసుకు ఆలంబన లభించినట్లయింది. మౌనంగా ఒక అడుగు ముందుకు వేశాడు. అడుగుల్లో మణుగుల బరువు చేరినట్లయింది. నర్సు కూడా మౌనంగా ముందుకు నడిచింది. రోగులంతా మంచాల ముందు నుంచొని మౌనంగా వారిని చూస్తున్నారు.
    నిశ్శబ్దం.
    ప్రశాంతంగా విగతాత్మ ఆకాశంలోకి ఎగిరిపోతున్నట్లుంది!
    వీరభద్రం భారంగా నడుస్తున్నాడు. అతనికి వాష్ బేసిన్ కనిపించింది. అద్దం చూచాడు. మూర్తీభవించిన డుఖంలా ఉన్నాడు తాను. ముఖం కడుకున్నాడు. తడుచుకున్నాడు. కొంత ప్రసన్నత ముఖంలోకి తెచ్చుకున్నాడు. నడిచాడు. అడుగులు కొంత తెలికపడ్డాయి. చరచరా సాగిపోయాడు. నర్సును అందుకున్నాడు.
    మంగమ్మ మంచంలో పడుకొని ఉంది. మొఖంలో ప్రసన్నత గోచరించింది. వీరభద్రాన్ని చూచింది. చిరునవ్వు నవ్వింది. "మగపిల్లాడు" అని తొట్టి చూపించింది.
    "నీ కోరిక ఫలించింది. మగబిడ్డను కన్నావు."
    'అంతా నీ దయ"
    ఊయలలో పాపను చూశాడు. కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ముద్దుగా ఉన్నాడు. వేలతో బుగ్గ తాకి ముద్దు పెట్టుకున్నాడు. పరిశీలనగా చూచాడు. పాప ముఖంలో రాముడు కనిపించాడు. రాముణ్ణి, పాపను, పాపను, రాముణ్ణి చూచాడు. ఏదో మనస్తాపం కలిగింది. వీడు మరొక రాముడు కాడు కదా అనుకున్నాడు. కాడు. కాకూడదు. కారాదు . వెంటనే విమలమ్మ ప్రత్యక్షం అయింది. శవం. ఏదో బుగులు చేరింది. పాపను చూచాడు పాప! ఎంత ముద్దుగా ఉన్నాడు! మనసుకు గిలిగింతలు పెట్టినట్లయింది. అతనికి తెలియకుండానే పెదవుల మీద చిరునవ్వు చిందులాడింది.
    పుట్టుక ఆనందాన్ని కలిగిస్తుంది.
    చావు దుఃఖాన్ని కలిగిస్తుంది.
    వీటిలో ఏది నివార్యం అనుకున్నాడు.
    విమలమ్మ చావు విషయం మంగమ్మకు చెప్పదలచుకోలేదు. దానంతట అదే తెలుస్తుందా -- తెలవనీ అనుకున్నాడు. ఏదో అత్యవసరం అయిన పని వుందని బయలుదేరాడు.
    శవయాత్రకు ఏర్పాట్లలో మునిగిపోయాడు.
    సాయంకాలానికి ట్రక్కు మీద శవం స్మశాన వాటికకు చేరింది. చితికి చిచ్చు అంటించాడు వీరభద్రం. చిటపటమని అంటుకున్న చితి భగ్గున మండింది. విమలమ్మ భౌతిక కాయం పంచభూతాల్లో కాలిసి బూడిద అయి కూలింది.

 Previous Page Next Page