Previous Page Next Page 
ప్రేమించండి ప్లీజ్ పేజి 28


    "కాస్తంత వివరంగా చెప్పు" మేనేజర్ అడిగాడు.
    "చిన్న పిల్లలప్పుడు తమ మర్మాంగాల పట్ల కొన్ని అపోహలు ఏర్పడతాయి. ఉదాహరణకు ఓ అమ్మాయిని తీసుకుందాం. తన తమ్ముడిలానో, అన్నలాగానో అక్కడ తనకు లేదనీ, అది తనల అదృశ్యమై పోయిందనీ అనుకుంటుంది. తనకులాగే తన తల్లికీ అక్కడ ఏమీలేదని గుర్తిస్తుంది. ఇంత మోసం అమ్మవల్లే జరిగిందని ఓ విధమైన అయిష్టతను పెంచుకుంటుంది. అదే సమయంలో నాన్న పట్ల ఇష్టాన్ని పెంచుకుంటుంది. అయితే ఈ ఆకర్షణ ఎప్పుడూ కార్యరూపం దాల్చదు కనుక కాంప్లెక్సుగానే మిగిలిపోతుంది."
    "మరి అబ్బాయికి"
    "అబ్బాయీ అంతే అమ్మపట్ల ఆకర్షణ పెంచుకుంటాడు. పెద్దయ్యాక ఇతర ఆపిల్లలపట్ల కలిగే ఇష్టంవల్ల ఈ ఆకర్షణ క్రమంగా తగ్గిపోతుంది. రేర్ గానే అనుకోండి కొందర్లో ఇది మోతాదుకు మించేవుంటుంది"
    అందరూ శ్వాస పీల్చడం కూడా మరిచిపోయినట్టు వింటున్నారు.
    "అందుకే అబ్బాయి బాగా ఇష్టపడే అమ్మాయిల్లో తల్లి లక్షణాలు వుంటాయని అంటారు. బాయ్ ఫ్రండ్ లో తండ్రి లక్షణాలను వెదుక్కుంటారు అమ్మాయిలు. కొందరు ఆడపిల్లల్లో ఇది కాస్తంత ఎక్కువగా వుంటుందనడానికి నిజంగానే జరిగిన ఓ స్మఘటన చెబుతాను." వినయ్ ఆగాడు.
    "త్వరగా చెప్పవయ్యా వెరీ ఇంటరెస్టింగ్" మేనేజర్ తొందర చేశాడు.
    వినయ్ చెప్పడం ప్రారంభించాడు. "మా ఫ్రండ్ ఒకతను వుండేవాడు పేరు ఆనందరావు వెరీ ఇంటిలిజెంట్. మద్రాసులో ఇంజనీరింగ్ చదివేవాడు. అతని రూమ్ కెదురుగ్గా ఓ అమ్మాయి వుండేది. ఆమె తండ్రి ఆడిటర్. చిన్నప్పుడే తల్లి చనిపోయింది. తండ్రి పరిరక్షణలో పెరిగింది అప్పుడామె యూనివర్శిటీలో ఎం.ఏ. చదివేది.
    మా ఫ్రండ్ కూ, ఆమెకూ పరిచయం ఏర్పడింది. అది చిగురించి ప్రేమ పూలు పూసింది. ఓ శుభ సమయాన పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
    "ఇదంతా ఆమె తండ్రికి తెలుసా?"
    "వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాక తెలిసింది."
    "తరువాత?"
    "మామూలే ఆమె తండ్రి వాళ్ళ ప్రేమను అంగీకరించలేదు. పెళఅళి చేసుకోవడం కుదరదన్నారు. బెదిరించాడు. ప్రార్దించాడు. అర్ధించాడు. చివరకు కళ్ళ నీళ్ళు పెట్టుకుని వేడుకున్నారు.
    తండ్రి సకల రసాలూ కురిపించడంతో ఆమె తన మనస్సు మార్చుకుంది. తండ్రి ఆనందం కోసం తన ప్రేమను త్యాగం చేయాలని నిశ్చయించుకుంది. చాలారోజుల సంఘర్షణ తరువాత ఓ రోజు ఆనందరావుకి తన నిర్ణయాన్ని చెప్పింది. అతను షాక్ తిన్నాడు. తన తండ్రికోసం ప్రేమను త్యాగం చేస్తున్నాననీ, అర్ధం చేసుకొమ్మనీ, ఇంకెప్పుడూ తనకోసం రావద్దని అంది ఏడుపుమధ్య. అతను ఆమెను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాడుగానీ వీలుకాలేదు. అతను తిరిగి వచ్చేశాడు.
    కానీ కుర్రాడు గదా ఆమె అంత సడన్ గా దూరమైపోవడం భరించలేకపోయాడు."
    "విషం తాగేశాడా?" ప్రియంవద విషాదానికి ప్రిపేర్ అయినట్టు ఏడుపు గొంతుతో అడిగింది.
    "అంత పని చేయలేదు గానీ మనిషి మాత్రం చాలా నీరసించి పోయాడు. జీవితమంటేనే విరక్తి ఏర్పడింది. అన్నం మీద ధ్యాసలేదు. నిద్ర పోవాలన్న ఆశలేదు. చిక్కి సగమైపోయాడు. ఓరోజు అలా పడుకుని తమ పరిచయాన్ని, ఆమెతో పంచుకున్న మధుర క్షణాలనూ నెమరువేసుకుంటూ వున్నాడు. సడెన్ గా అతనికి ఏదో బుర్రలో ఫ్లాష్ అయింది. అంత రాత్రిపూట ప్యాంట్ వేసుకుని ఆమె ఇంటికి వెళ్ళాడు. బజర్ నొక్కాడు.
    అదృష్టవశాత్తూ ఆమె తలుపు తీసింది. నిద్రవల్ల ఆమె కళ్ళు ఎర్రగా వున్నాయి. నిద్రలేమివల్ల ఇతని కళ్ళు ఎర్రగా వున్నాయి. ఆ వేళప్పుడు ఆనందరావుని చూసి ఆమె బిగుసుకుపోయింది. దాన్నేమీ గమనించలేదు అతను.
    "నీకో విషయం చెప్పాలని ఇంత రాత్రిపూట వచ్చాను. మనం విడిపోయేటప్పుడు నువ్వు ఓ విషయం చెప్పావు గుర్తుందా? మీ నాన్న కోసం నీ ప్రేమను త్యాగం చేస్తున్నానన్నావు కానీ అది అబద్దం. నువ్వు నన్ను ప్రేమించలేదు. కేవలం ఇష్టపడ్డావు. అదీ ఎందుకో తెలుసా? మీ నాన్న పేరూ నా పేరూ ఒకటే గనుక. గుడ్ నైట్" అని సీరియస్ గా వచ్చేశాడు.
    "అంటే ఆమె తండ్రిపేరు కూడా ఆనందరావేనా?" శకుంతల అడిగింది.
    "ఎగ్జాట్లీ ఆయన పేరూ ఆనందరావే."
    "పూర్ ఫెలోస్ దట్ టూ ఆనందరావ్స్" అన్నాడు తమాషాగా మేనేజర్.
    "అమ్మాయిలకు స్వంత వ్యక్తిత్వముండదు. చిన్నప్పట్నుంచీ ఎవరో ఒకరిమీద ఆధారపడి వుంటారు" రాహుల్ స్త్రీల మీద కోపం ప్రకటించాడు.
    "అది వాళ్ళ తప్పుకాదు. పురుషుడే స్త్రీలను అలా తయారుచేశాడు. స్త్రీ ఎప్పుడూ రెండో పౌరురాలిగానే గుర్తింపబడుతోంది. సాంఘికంగా, ఆర్ధికంగా, మానసికంగా. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో ఓ కారణం చెప్పనా? మగాడిలా తమకూ హుందాగా, దర్జాగా అక్కడ మర్మాంగం లేదని ఆడపిల్లలు బాధపడిపోతుంటారట చిన్నతనంలో తమకు లేని అవమితం మగాడికి వుండడంవల్ల ఆడపిల్ల వాడ్ని ఎక్కువగా చూస్తుందట. అందుకే ఆడపిల్లకు మరీ తెలిసీ తెలియని వయసులో "డిజైర్ ఫర్ బేబీ పుడుతుంది. అందుకే ఆడపిల్లలు చిన్నప్పుడు బొమ్మలను పాపాయిలుగా చేసి ఆడుకుంటూ వుంటారు."
    వినయ్ కాసేపాగి, అందరివైపు చూసి తిరిగి అన్నాడు "స్త్రీలు తమ అవయవాన్ని చూసుకుని ఎవరో అక్కడ అంగ విచ్చేధనం చేస్తే ఏర్పడిన గాయం అలా తయారైందని అనుకుంటారట కార్లీ అబ్రహాం అనే సైకాలజిస్టు ఆ విధంగా సెలవిచ్చాడు."
    "ఆయన ఇంకేమీ అనలేదా?" మహాలింగం వ్యంగ్యంగా అడిగినా దాన్ని గుర్తించలేదు వినయ్.
    "చాలా చెప్పాడు అబ్బాయిలా తన అవయవాన్ని చేతిలో పెట్టుకుని దర్జాగా తమకు నచ్చిన రీతిలో ఇష్టం వచ్చిన డైరెక్షన్ లో యూరినేట్ చేయాలని చాలామంది స్త్రీలు కోరుకుంటారట. వాళ్ళ అవయవ నిర్మాణం దృష్ట్యా కిందకు తిప్పి నచ్చిన డైరెక్షన్ లో యూరినేట్ చేయలేరు కదా.అ న్దుకే పూల మొక్కలకు నీళ్ళు పోస్తూ ఆ ఆనందాన్ని అనుభవిస్తారట. తనకు దేవుడు ప్రత్యక్షమైతే జీవితంలో ఒకే ఒక్కసారి అబ్బాయిలా దర్జాగా యూరినేట్ చేసే వీలు కల్పించమనే వరం కోరతానని కరేన్ హార్నే అనే ఆమె అంది."
    "అందుకేనన్నమాట మా ఆవిడ చాలా ఇంట్రెస్టింగ్ గా రోజూ గార్డెన్ కు నీళ్ళు పెడుతుంది." మేనేజర్ అలా అనడంలో అందరూ నవ్వేశారు.
    మహాలింగం మాత్రం గుర్రుగా వినయ్ వైపు చూసి ఆంజనేయులు చొక్కాను కిందకు లాగాడు.
    "చూశారా సార్ వాడి ప్రజ్ఞాపాటవాలు. బూతురొచ్చు. యూరిన్ కంపు. వాడేకాక ఆ రొంపిలోకి మనల్ని ఎలా దించేశాడో గమనించారా"
    "ఇలాంటి విషయాలను ఆధారం చేసుకునే మనం చాలా విషయాలను అర్ధం చేసుకోవచ్చు. అత్తాకోడళ్ళు వ్యవహారానికి మూలం ఇడిపస్ కాంప్లెక్సే. తను యిన్ని రోజులు పెంచి, పోషించి ఎంతో ఆత్మీయతను పంచుకున్న కొడుకును ఈ రోజు వచ్చిన పెళ్ళాం సొంతం చేసుకుంటే వుంటే తల్లి భరించజాలదు. అందుకే కోడలంటే అసహ్యం పెంచుకుంటుంది. "పొద్దెక్కి గంటైంది. ఇంకా నిద్ర లేవలేదా. ఎప్పుడూ రూమ్ లో పడుకుని తైతక్కలాడ్డమేనా" అన్నదే ఏ అత్తయినా కోడలు మీద ప్రయోగించే మొదటి అస్త్రం. అయితే అల్లుడుకి ఇది వర్తించదు. కూతుర్ని తన ప్రతిరూపమని తల్లి భావిస్తుంది. కూతుర్ని పంచుకుంటున్న అల్లుడంటే ఇష్టం ఏర్పడుతుంది. అందుకే అల్లుడు యింటికి వస్తే అత్తలు చాలా ఖుషీ అయిపోతరు. కోడిని కోయడం వడలు చేయడం తలంటిపోయడం, నానా హంగామా చేస్తారు." వినయ్ చెప్పడం పూర్తయినట్టు రిలాక్స్ డ్ గా వెనక్కి వాలాడు.

 Previous Page Next Page