ఆర్య, అనార్య యుద్దాలు జరుగుతున్నప్పుడు ఆర్యులు తమకి లొంగిపోయి, తమపట్ల వినయ విధేయతలు, భక్తీ ప్రవత్తులు చూపించినా అనార్యజాతుల స్థాయిని మాత్రం కొద్దిగా పెంచి వాళ్ళని వానరులన్నారు.
శ్రద్దగా వింటున్నాడు రాజా.
క్లయివు చెబుతూనే వున్నాడు. "అలాగే, ఎన్నెనో విదేశజాతులు ఇందియామీద దండయాత్రలు చేశాయి. దండెత్తి వచ్చిన వాళ్ళలో చాలా మంది ఇక్కడే స్థిరపడిపోయి, ఇక్కడి మతలను అవలంభించి, ఇక్కడివారిలో కలిసిపోయారు.
ఒక వాదన ప్రకారం చూస్తే , హుణులే ఇప్పటి రాజపుత్రులు. దండెత్తివచ్చిన విదేశీయులలో క్షత్రియ విద్యలపట్ల అభిమానం ఉన్నవాళ్ళు ఇక్కడి క్షత్రియలలో కలిసిపోయారు. వేదవేదాంగాల పట్ల అభిరుచి కలిగిన వాళ్ళు బ్రాహ్మణులలో కలిసిపోయారు. శకులు, యవనులు, వహ్లవులు, ఇలా అనేక జాతులవారు వచ్చారు కదా.........
వాళ్ళలో పహ్లావులే పల్లవులుగా, మారారు. మీ వసంతసాదే ఉన్నాడే- ఎక్స్ మినిస్టర్ - అయిన సారస్వత బ్రహ్మణుడు అలాగే క్రితం తరం హీరోయిన్ ఉంది కదా , లీనా చంద్రావర్కార్ - కోశోర్ కుమార్ భార్య - ఆమె కూడా సారస్వత బ్రాహ్మణ కుటుంబం నుండే వచ్చింది. వీళ్ళంతా ఒరిజనల్ గా గ్రీకులన్నమాట."
నవ్వాడు రాజా.
"అది కరక్టేననుకుందాం! కానీ ఇప్పుడీ చరిత్ర పాఠాలన్ని ఎందుకూ?"
ఉద్వేగంగా ముందుకు వంగి అన్నాడు క్లయివు.
"ఎందుకంటె, ఇప్పుడున్న కులాలూ, మాటలు, తెగలతోనే కొట్టుకు చస్తున్నారు మీ ఇండియన్స్! మనం వాళ్ళని ఇంకా వెనక్కి చరిత్రకాలంలోకి , చరిత్ర అందని కాలంలోకి లాక్కెళ్ళదాం! అప్పుడింకా ఇండియన్స్ అడ్డంగా, నిలువుగా, ఏటవాలుగా, ఖండఖండాలుగా చీలిపోతారు! ఒకే కులంలో పిశాచాలు, ఉండవచ్చు. నాగులు ఉండవచ్చు. వాళ్ళకి వాళ్ళకి పెడదాం. అప్పట్లో హలిక, గోలిక, మూర్ధక మొదలయిన కులాలు కొన్ని ఉండేవి. వాటిని ఇప్పుడు మళ్ళీ పునరుద్దరిస్తాం."
"వెయిట్! వెయిట్!" అన్నాడు రాజా.
"ఏమిటి చెప్పు!" అన్నాడు క్లయివ్.
"ఇన్ని వేల సంవత్సరాలు గడిచాక, ఎవరు పిశాచాలో, ఎవరు నాగులో ఎలా కనిపెదతావు?"
"యక్షులకు సంగీతం మీద విపరీతమైన అభిమానం ఉండేది. యక్షగానాలని ఒక ప్రక్రియే ఉంది కదా! ఇప్పుడు జక్కులవారు ఉన్నారే - వారే యక్షులయి ఉండాలి. జక్కులు ఈ రోజుల్లో కూడా కధలు చెప్పడంలో, నాటకాలు ఆడడంలో సిద్దహస్తులు.
ఇలాంటి ఆధారాల సాయంతో, ఎవరు పిశాచాలో, ఎవరు నాగులో, ఎవరు హలకులో, ఎవరు గోలికులో, ఇలా అనాది వర్గాలన్నీతిని గుర్తుపట్టే ఒక కంప్యుటర్ సిస్టమ్ తయారు చేశాను నేను. అదంతా చెప్పాలంటే మళ్ళీ అంత్రోపాలజీ పాఠాలు మొదలెట్టాలి. మొత్తానికి పాత తెగలని, వర్ణాలని, కులాలని, రీడిస్కవర్ చేస్తాం! వాళ్ళకి వాళ్ళకి పెడతాం కొట్టుకుచస్తారు." ఆ తర్వాత ఆందోళనలు, రాస్తారోకోలు, రైలురోకోలు, భైఠాయింపులు , బందులు.
ఈలోగా సహజంగానే ఎక్కడో ఒకచోట పరిస్థితి అదుపు తప్పుతుంది. పొలిసు పైరింగు జరుగుతుంది. కొంతమంది అమాయకులు మరణిస్తారు. అలాంటి అవాంచనీయ సంఘటనలు జరిగాక, ఇంక ఆ కులంలో అప్పటిదాకా తటస్థంగా వున్నవాళ్ళు కూడా మారిపోతారు. అందరికి శివమెత్తి పోతుంది. ఆ తర్వాత రామ రావణ యుద్ధం మొదలవుతుంది. ఉద్యమం తీవ్రతరమైన కొద్ది అన్నెం పున్నెం ఎరగని సీదా సాదా జనాలు చస్తారు. నువ్వు గమనించావా! ఏ ఉద్యమంలో అయినా కూడా నాయకులు ముందుకు రారు. మాములు జనాన్నే ముందుకు నెడతారు.
"కానన్ పౌడర్!" అన్నాడు రాజా నిర్లిప్తంగా.
"యా! కరెక్టుగా చెప్పావు. కానన్ పౌడర్! యుద్దంలో ఫిరంగులకి ఆహారం అని అర్ధం. ప్రపంచవ్యాప్తంగా పాటించే నీతి ఇదే! ఫిరంగులకి ఆహారంగా సైనికులని పంపుతారు - జనరల్సు సురక్షితంగా వెనకే వుంటారు."
అందుకే -
ఏ ఉద్యమం వచ్చినా కూడా చచ్చేది మాములు జనమే ! ఉద్యమాలు వేడెక్కించేది నాయకులు - ఆ తర్వాత అదే ఉద్యమాలకి చల్లబరచడానికి బేరసారాలు పెట్టి పదవుల్ కేక్కేది నాయకులు. దట్ ఈజ్ ఇండియా ! అవునా?"
కోపాన్ని అణుచుకుంటూ అన్నాడు రాజా-
"అలాగే అనుకుందాం ! మన స్కీములో ఈ నాయకులు ఏం చేస్తారు?"
"చెబుతున్నాను కదా! కుక్కలకి, మాంసం ముక్కలు విసిరేసినట్లు వాళ్ళకి కొన్ని పదవులూ, కొంత అధికారం పడేస్తాం? టాప్ లెవెల్లో నువ్వు ఉంటావు."
కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు అభినయించాడు రాజా.
ఆ తర్వాత అన్నాడు.
"దటీజ్ ఓకే విత్ మీ!"
వాచ్ చూసుకున్నాడు క్లయివ్.
"ఇటీజ్ గెట్టింగ్ ప్రెట్టి లేట్! నాకు ఇంకో ఎంగేజ్ మెంట్ ఉంది, ఐ విల్ పుష్ ఆఫ్! రేపు మళ్ళీ కలుద్దాం."
"ఎక్కడ?" అన్నాడు రాజా.
"సేమ్ టైం! సేం ప్లేస్!"
"ఒకే దెన్!"
ఇద్దరూ బయటికి నడిచారు. క్లయివ్ వచ్చిన ఇంపోర్టెడ్ ఎలక్ట్రాగ్లయిడ్ మోటార్ సైకిలు పార్కింగ్ లాట్ లో ఉంది.
దాని పక్కన భయభక్తులతో నిలబడివున్నాడు ఒక మనిషి. నల్లగా, పొట్టిగా, లావుగా వున్నాడు. బుర్ర ముక్కు కనుబొమ్మలు దట్టంగా వున్నాయి. నవ్వుతూ వుండాలనే ప్రయత్నంలో పెదిమలు కాస్త తెరచుకుని వున్నాయి . గోగ్గిరిపళ్ళు.
"ఇతనే పిశాచం!" అన్నాడు క్లయివ్ నెమ్మదిగా.
"పేరేమిటి?" అన్నాడు రాజా.
"సవారన్న"
"అతను నీతోనే ఉంటాడా?"
"నమ్మినబంటు!"
"అతనివల్ల నీకేం లాభం?"
"ఉద్యమం వేడెక్కాక, అగ్నిలో ఆజ్యం పోస్తాడు ఇతను....."
"అంటే?"
"పిశాచాల పెద్ద ఒకడు పదవికి రాజీనామా చేస్తాడు. వాళ్ళలోనే తక్కువ వర్గం నుంచి వచ్చిన ఇతను నడిరోడ్డులో అందరూ చూస్తూ ఉండగా తన మీద పెట్రోలు పోసుకుని, తనని తాను తగలబెట్టుకుంటాడు. దానితో ఇంక రావణకాష్టం అంటుకున్నట్లే! అతని కుటుంబానికి పదిలక్షల రూపాయలు ఇస్తానని ఒప్పందం!" అని మోటారు సైకిలు స్టార్ట్ చేశాడు క్లయివ్. "పిశాచం" సవారన్న వినయంగా వెనకాతల కూర్చున్నాడు.
"ఓకే!" అని తల పంకించి, మోటారు సైకిల్ ముందుకు పోనిచ్చాడు క్లయివ్.
అతను అలా వెళ్ళి వెళ్ళగానే -
హోటల్ కెప్టెన్ ఒకతను రాజా కారు కీస్ తీసుకొచ్చి, వినయంగా రాజాకి అందించాడు.
"థాంక్స్!" అని చెప్పి , టిప్పుగా ఒక వంద రూపాయలు నోటు ఇచ్చాడు రాజా. అతను వంగి , సలాం చేసి వెళ్ళిపోగానే -
ఆఠీన్ రాణీ మీనాక్షి వచ్చింది అక్కడికి. ఇంకా అక్కడే వున్న రాజాని చూడగానే ఆమె మొహం వికసించింది.
"థాంక్ గాడ్! మీరు వెళ్ళిపోయారేమో అని చాలా భయపడ్డాను." అంది గుండె మీద చెయ్యి వేసుకుంటూ.
నవ్వాడు రాజా.
వాచ్ చూసుకుంది మీనాక్షి.
"బాగా లేటయిపోయింది . ప్లీజ్! నన్ను ఇంటిదగ్గర డ్రాప్ చెయ్యగలరా?" అంది బతిమాలుతున్నట్లు.
"ఇటీజ్ ఏ ప్రివిలేజ్!" అన్నాడు రాజా, కారు ప్రంట్ డోర్ తెరచి పట్టుకుంటూ.
ప్రంట్ సీట్లో కూర్చుంది మీనాక్షి.
రాజా అటువేపు తిరిగివచ్చి , స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు. కారు మృదువుగా ముందుకు పరిగెత్తింది.
అతనితో ఏం మాట్లాడాలో తోచలేదు మీనాక్షికి.
ప్రేమ నాటకం ఆడతానని సుందరం దగ్గర అయిదు లక్షలు తీసుకుంది గాని, ప్రేమ దైలాగులెం తట్టలేదు. అసలు తనది ఎవరితోను మాట్లాడే స్వభావమే కాదు కదా - మాట్లాడినా కట్టే విరిచినట్లు మాట్లాడడమే తన పద్దతి. ఇప్పుడతనితో ప్రేమ డైలాగులు చెప్పాలంటే ప్రాణాలు కడబట్టిపోతున్నట్లే ఉంది.
కానీ - ఏదో ఒకటి మాట్లాడక తప్పదు కదా! అందుకని, పెదిమలు తడిచేసుకుని అంది మీనాక్షి.
"మీరు నిజంగానే ఒక రాజా అని విన్నాను. మరి మీ కారుకి డ్రైవరు కూడా లేడా ఏం?" అంది.
"ఉన్నాడు - కానీ నేనే వెళ్ళిపొమ్మని చెప్పాను" అన్నాడు రాజా.
"ఎందుకూ?" అంది మీనాక్షి అప్రయత్నంగా.
"మనిద్దరం ఇప్పుడు ఇలా కలిసి వెళతామని నాకు ముందే తెలుసుకాబట్టి!" అన్నాడు రాజా నవ్వుతూ.
దొరికిపోయిన దొంగలా ఓరచూపులు చూసింది మీనాక్షి. అమ్మో! ఇతగాడు అసాధ్యుడే.
కాసేపు ఆగి, "ఆ మల్ హోత్రా గాడి పళ్ళు రాలగొట్టింది మీరేనా?" అంది.
"అందులో సందేహం ఏమి లేదు" అన్నాడు రాజా.
"ఎందుకు కొట్టారు?"
"నీకు అపకారం చెయ్యకుండా ఉండాలని వార్నింగ్!" మళ్ళీ మాటల కొరత!
మీనాక్షి ఆలోచించింది.
ఇంక నెక్స్ ట్ తనేం చెప్పాలి?
"ఐ లవ్ యూ!" అని చెబితే -
చచ! ఎంత మోటుగా ఉంటుంది?
కానీ ఏం మాట్లాడకుండా ఇలాగే కూర్చుంటే, పుణ్యకాలం కాస్తా గడిచిపోతుంది!
మాటలకంటే చేతలే సులభం అనిపించింది మీనాక్షికి.
అందుకని -
ఒక్క అంగుళం రాజావైపు జరిగింది.
అంగుళం జరిగానని అనుకుంది గాని, నిజానికి అర్ధ సెంటిమీటరు కూడా జరగలేకపోయింది తను - ఆ మాత్రానికే ఆమె గుండె గుబగుబలాడింది. అరిచేతుల్లో చెమటలు పోసేశాయి.
అదే టైం లో -
డైమండ్ రాజా కూడా మనసులోనే రిహార్సల్స్ చేసుకుంటున్నాడు.
"ఐ లవ్ యూ" అనేస్తే ఒక్కసారిగా స్ప్రింగ్ బోర్డు మీద నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకేసినట్లుండదూ? ఆ డైలాగు చెప్పేముందు ప్రిలిమినరీగా ఇంకేమన్నా చెబితే బాగుంటుంది గదా!
"నువ్వు చాలా బాగున్నావు!" అంటే బాగుంటుందా?
ఉత్త సెక్స్ మానియాక్ అనుకుంటుందేమో!
మరి ఇంకేం అనాలి?
అతనలా ఆలోచిస్తుండగానే -
హటాత్తుగా , అనాలోచితంగానే అతని కాలు బ్రేకుని బలంగా నొక్కేసింది.
"స్కీచ్ చ్ చ్ ......." అనే శబ్దంతో సడెన్ గా ఆగిపోయింది కారు.
అక్కడ -
రోడ్డుకి అడ్డంగా ఒక రోడ్డు రోలర్ ఉంది! కారు ఆగి ఆగగానే, రోడ్ రోలర్ నుంచి కొంతమంది దిగారు. రోడ్ రిపెయిర్ చేసే వర్కర్ ల గ్యాంగ్ లా ఉన్నారు వాళ్ళు. చేతులో పారలూ, పలుగులు వున్నాయి.
"దిగుబే!" అన్నాడు వాళ్ళలో ఒకడు, రాజాతో రఫ్ గా.
"నన్నా?" అన్నాడు రాజా భయం నటిస్తూ.
"నిన్నే!"
"నన్నేనా సార్!"
"నిన్నేనే!"
"ఎందుకు?"
"నాలుగు ఉతికాక తెలుస్తుంది ఎందుకో!"
"అరె! చెప్పొచ్చు కద సార్!" అన్నాడు రాజా వినయంగా.