Previous Page Next Page 
మౌన రాగాలు పేజి 28


    
    కుక్క అరిచిందా? ఏమో! అరిచిన అలికిడి వినబడలేదు.
    
    కారుని, చక్రాలు కుక్కమీద ఉండేటట్లు కొద్దిక్షణాలు ఆపి, తర్వాత ముందుకు పోనిచ్చి విండోలోంచి వెనక్కి చూశాడు.
    
    చలనంలేని కుక్క! దానినోటి దగ్గర రక్తపు మడుగు!
    
    వెర్రిగా చూశాడు సుధీర్. అతని మొహాన చెమటలు పట్టాయి.
    
                                                               * * *
    
    అదే క్షణంలో, అదే సందులోకి టర్న్ అయింది ఒక ఫియట్ కారు. డ్రయివింగ్ సీట్లో కూర్చుని వున్నాడు రాజన్. అతని పక్కనే అతన్ని ఆనుకుని కూర్చుని ఉంది వసుమతి.
    
    "వద్దు వద్దంటే తీసుకొచ్చారు. నాకిలాంటి హారర్ పిక్చర్సంటే భయం బాబూ! ఇక రాత్రికి నిద్రపట్టదు!" అంటోంది వసుమతి గారాలు పోతూ.
    
    "షటప్, యూ స్వీట్ లిటిల్ ఇడియట్! ఇవాళ రాత్రికి అసలు మనం నిద్ర పోవడం లేదు" అన్నాడు రాజన్. సంభాషణ ఇంగ్లీషులోనే జరుగుతోంది.
    
    "అయ్యబాబోయ్! ఎంత భయంకరమైన సీన్లండీ! తలుచుకుంటేనే..."
    
    "అవన్నీ సినిమాలో సీన్లు తల్లీ! నిజంగా జరుగుతాయేమిటి? అరెరె. అదేమిటి?"
    
    "ఆ!" అని కేకేసింది వసుమతి వణికిపోతూ. అతన్ని గట్టిగా కావలించేసుకుని, అతని ఛాతీలో మొహం దాచేసుకుంది.
    
    రాజనే ముందు తేరుకున్నాడు. కుక్కకారు కింద పడినట్టుంది!" నో ఫియర్, బేబీ! ఐయామ్ హియర్!" అన్నాడు, లావుగా, మోటుగా ఉన్న చేతులు ఆమె వీపు మీదుగా వేసి వెన్ను తడుతూ.
    
    వసుమతి ప్రయత్నం మీద ఒక్క గుటక మింగి, తలెత్తి చూసింది. అవును! ఏదో కుక్కకారు కింద పడినట్లుంది. అది అంత అసాధారణ దృశ్యం కాదు. కాని, భయానకమైన ఆ సినిమా చూసి వస్తూ ఉండడం చేత ప్రతి దృశ్యానికి వూహించరాని అర్ధాలు గోచరిస్తున్నాయి.
    
    క్షణాల్లో ఆమె నుదుటిమీద పాదరసం బిందువుల్లా వ్యాపించిన స్వేదాన్ని చూసి నవ్వాడు రాజన్. ఆ చిరుచెమటను తన పెదిమలతో తుడిచేస్తూ, "డార్లింగ్! డార్లింగ్! అప్ సెట్ అయిపోకు!" అన్నాడు అనునయంగా.
    
    వసుమతి దృష్టి కేంద్రీకరించి చూసింది. దూరంగా ఏదో కారు తాలూకు ఎర్రలైట్లు రక్తంలో తడిసిన మిణుగురు పురుగుల్లా కనబడుతున్నాయి.
    
    "ఆ కారే అయుంటుంది కుక్కని చంపింది" అంటూ యాక్సిలేటరు మీద కాలు బలంగా మోపాడు రాజన్.
    
    సెకండ్లలో వేగం అందుకుంది కారు. ముందు వెళుతున్న కారుకీ, అతని కారుకీ మధ్య దూరం తరుగుతూంది. దగ్గరగా....ఇంకా దగ్గరగా...బెంజు కారు. లెఫ్ట్ హాండ్ డ్రైవ్. నెంబరు మసక మసగ్గా కనబడుతూంది.
    
    'మన శశిదండీ కారు." ముందు వెళుతున్న కారుకీ, అతని కారుకీ మధ్య దూరం తరుగుతూంది.
    
    ఇద్దరూ పరీక్షగా చూశారు. శశి లేదు కారులో. సుధీర్ ఉన్నాడు. ఆకాశంలోకి ఎగరడానికి ముందు వేగం పుంజుకుంటూ నేలమీద పరుగెడుతున్న విమానంలా దూసుకుపోతూంది సుధీర్ కారు. రాజన్ కారు వేగం తగ్గించేశాడు.
    
    శశి వాళ్ళ ఇల్లు దాటిన తర్వాత వస్తుంది రాజన్ ఇల్లు.
    
    "పక్క సందులోంచి వెళదాం" అంది వసుమతి, ఆ సమయంలో సుధీర్ కి కనబడటం ఇష్టంలేక.    

 

    "మన డాక్టర్ కుక్కని గుద్దేశాడన్నమాట ఇవాళ!" అన్నాడు రాజన్.
    
    వసుమతి ఏమీ మాట్లాడలేదు.
    
    చూడకుండా గుద్దేశాడా?
    
    లేక...
    
    ఆ రోజు జూ పార్క్ లో అతను సీతాకోక చిలుకని నలిపెయ్యడం గుర్తొచ్చింది వసుమతికి. కుక్క రోడ్డు మధ్యలో లేదు. ఫుట్ పాత్ దగ్గర వుంది. ప్రమాదవశాత్తు దాని మీద నుంచి కారు పోనియ్యడానికి అంత అవకాశం లేదు. రాజన్ కారు పక్క సందులోకి మళ్ళించాడు.    

                                                                 * * *
    
    ఇంటిముందు కారు సడెన్ బ్రేకుతో ఆపి కర్చీఫ్ తో మొహం తుడుచుకుని, హిప్ పాకెట్లోకి చాకుని ఒకసారి ఆప్యాయంగా తడిమి చూసుకున్నాడు సుధీర్.
    
    తరువాత కారుని నెమ్మదిగా గేట్లోకి పోనిచ్చాడు.
    
                                   6
    
    అంతకు కొన్ని గంటల ముందు....
    
    సుధీర్ సినిమాకి వెళ్ళే దాకా వూపిరాడనంత బిజీగా ఉంది శశికి. అతను వెళ్ళిన తర్వాత ఒక గంటలో పని తెమిలి పోయింది. చూడాల్సిన పేషెంట్లు లేరు.
    
    కాసేపు క్లినిక్ లోనే కుర్చీలో కూర్చుని 'సైన్స్ టుడే' తిరగేసింది. అరగంట తర్వాత విసుగేసింది. పని లేకుండా వూరికే కూర్చోవడం తనకి ఎప్పుడూ అలవాటు లేదు. ఇవాళ చదవడం మీద మనసు నిలవడం లేదు. పని ఒక్క గంట ముందు అయిపోయి ఉంటే తనూ సుధీర్ తో బాటు సినిమా కెళ్ళిపోయి వుండేది. రాత్రి పొద్దుపోయే దాకా పని ఉంటే కనీసం కాలం గడిచిపోయి ఉండేది. ఇప్పుడు అటూ ఇటూ కాకుండా అయింది తన పని.

 Previous Page Next Page