"రకరకాల ఫ్యాషన్లతో అమ్మాయిలు..."
"ఉంటే? నీ తర్వాతే ఎవరైనా"
అతనలా మాట్లాడుతూంటే ఆమెకెంతో థ్రిల్లింగ్ గా వుంది.
"ఏమండి! ఒకటి అడగనా?"
"ఏమిటి చిన్మయీ?"
"నైట్ క్లబ్స్ కెప్పుడైనా వెళ్ళారా?"
ఒక్కక్షణం మౌనం.
"చెప్పండి ఇది ఓవర్సీస్ కాల్ మీటరు తిరిగిపోతుంది."
"నిజం చెప్పమంటావా? అబద్దం చెప్పమంటావా?"
"ఏమిటండీ పాతాళభైరవి సినిమాలోలాగా? మీరు అబద్దం చెప్పలేరు."
"ఒక్కసారి వెళ్ళాను."
ఈసారి ఆమె మౌనంగా వుండిపోయింది.
"చిన్మయీ! కోపమొచ్చిందా?"
"లేదులెండి."
"ఇక్కడ ఓ ఫ్రెండ్ బలవంతంచేస్తే వెళ్ళాము. తెలుసుకోవటంకోసం. అంతే ఇంకెప్పుడూ వెళ్ళను."
"మీ ఇష్టం"
"ప్లీజ్! కోపంలేదని మనస్ఫూర్తిగా చెప్పు."
"లేదులెండి."
"ఏంచెయ్యను? నిన్ను విడిచి ఇంతదూరంలో ఒక్కడినీ వుంటే జీవితం శూన్యంగా వుంది చిన్మయీ! వంటరితనం భరించలేకుండా వున్నాను. అమాంతం ఎగిరి నీ దగ్గరకు వచ్చెయ్యాలని వుంది."
"మిమ్మల్ని విడిచి నేనూ వుండలేకపోతున్నానండి. ఒక్కక్షణంకూడా గడవటంలేదు. వెంటనే వచ్చేయండి" చిన్మయి ఏడుస్తోంది.
"ఇంకా ఎనిమిది నెలలు మనం ఓర్చుకోవాలి చిన్మయీ!"
"ఎనిమిది నెలలు ఈ లోపల నేనేమైనా అయిపోతానండి..."
"డోన్ట్ బి సిల్లీ చిన్మయీ! నువ్వేమీ కావు. అసలా ఆలోచనే సిల్లీ నువ్వేమిటి? ఏమైనా అవటమేమిటి? అలాంటివన్నీ నాకు వర్తిస్తాయి."
చిన్మయి ఏదో చెప్పబోయింది. పెదవులు వణికినట్లై మాట బయటకు రాలేదు.
"చిన్మయీ! నువ్వు నా ఊపిరివి, నా ప్రాణానివి. నా రక్తంలో ప్రతి అణువులో నువ్వు ప్రవహిస్తూ వుంటావు. యు ఆర్ మై ఆల్."
"థాంక్స్" ఆ రెండు అక్షరాలలో ఆమె మనసులోని సంతోషాన్నంతా వ్యక్తం చేస్తూ అంది.
ఫోన్ పెట్టేశాక ఆమె హృదయమంతా తేలికగా అయిపోయినట్లు ఆమె శరీరంలోని ప్రతి అణువులోనుండీ మాలిన్యం తొలగిపోయినట్లు అనుభూతి పొందింది.
సోఫాలో వెనక్కి వాలి కళ్ళుమూసుకుని పడుకుంది. నిద్ర రాలేదు కని డైజిపాం టాబ్లెట్ల వల్ల అదోరకం తియ్యని మగత.
ఓ అరగంటసేపు గడిచి వుంటుంది. బయటనుండి ఎవరో బజర్ నొక్కారు. చిన్మయి ఉలికిపడినట్టయి కళ్ళు తెరిచింది. పాలప్యాకెట్లు తెచ్చే అబ్బాయి వస్తాడని మధ్యాహ్నంపూట గేటుతాళం వెయ్యటంలేదు.
లేచి వెళ్ళి తలుపు తెరిచింది.
వరండాలో ఓ యువకుడు నిలబడి వున్నాడు. ఇరవై నాలుగు ఇరవై అయిదేళ్ళుంటాయి. నొక్కుల నొక్కుల జుట్టు, అమాయకంగా మెరిసే నల్లటి కళ్ళు.
చిన్మయి అతనివంక ప్రశ్నార్ధకంగా చూసింది.
"నేనీ పక్కింట్లో వుంటానండీ. ఈ మద్రాసు మహానగరంలో తెల్లవారు జామున ఏ నాలుగింటికో ఓ గంటసేపు తప్ప నీళ్ళు రావుకదండీ. అదైనా రెండ్రోజులకొకసారి మెలకువ రాక మంచినీళ్ళు పట్టుకోవటం మరచిపోయాను. బాగా దాహమేస్తోంది. ఇంటిలో నీళ్ళులేవు. అందుకని....?" చాలా చిన్నపిల్లాడిలా అమాయకంగా కన్పిస్తున్నాడు.
అప్పుడు చూసింది అతని చేతిలోని స్టెయిన్ లెస్ స్టీల్ గిన్నెవంక.
"మీరుండేది ఏ ఇంట్లో?"
"ఈ ఇంటిలో" ప్రక్కింటికేసి చేయి పెట్టి చూపించాడు.
గుండె దడదడమని కొట్టుకున్నది. ఇతనేనా.... ఇతనేనా పాటలు పాడే అబ్బాయి ఇతన్నేనా చూడాలని కొన్నిరోజులుగా అనుకొంటున్నది?
ఎందుకనో....మంచినీళ్ళిచ్చి పంపేయడం సభ్యతగా తోచలేదు. ఒక్కక్షణం సంకోచించి "లోపలికి రండి" అన్నది.
అతనుకూడా సంకోచంగానే లోపలకడుగుపెట్టాడు.
"కూచోండి" అన్నది.
అతను సిగ్గుపడుతూ, సందేహిస్తూ సోఫాలో కూర్చున్నాడు.
"చేతిలో ఆ గిన్నేమిటి? అక్కడ పెట్టండి" అన్నది చిన్మయి.
తాను అతనితో ఎంతోకొంత చనువుగా మాట్లాడటం చిన్మయికికూడా ఆశ్చర్యంగా వుంది. ఇంతవరకూ ఏ పరాయిమనిషి దగ్గరా యీ మాత్రం చనువు ప్రదర్శించలేదు. కాని ఆమె మనసులో ఏ భావమూ లేదు. నిర్మలంగా, నిశ్చలంగా వున్నది. ఏ అసహజమైన అస్వాభావికమైన హావభావమూ ఆమెలో లేదు.
"పాపం! దాహమేస్తుందన్నారు కదూ మంచినీళ్ళు తీసుకువస్తానుండండి." అంటూ ఫ్రిజ్ దగ్గరకెళ్ళి బాటిల్ లోంచి గాజుగ్లాసులోకి నీళ్ళు వంచి అతని దగ్గరకు తీసుకొచ్చింది.
ఆనందమోహన్ ఆమెచేతిలోంచి మంచినీళ్ళ గ్లాసందుకుని కొంచెం కొంచెం త్రాగాడు. అంత దాహంమీద వున్నవాడు ఎంత ఆత్రంగా త్రాగుతాడో అనుకొంది. కొంచెం కొంచెం చొప్పున కాఫీ త్రాగినట్టు త్రాగాడు.
కూచోమనటానికైతే అందిగాని చిన్మయికి ఏం మాట్లాడాలో తోచలేదు.
"ఆ మధ్య రోజూ పాడేవారు. ఉన్నట్టుండి మానేశారేం?" అనడిగింది.