Previous Page Next Page 
వెన్నెల వొణికింది పేజి 28


    అమ్మాజీ అనే అమ్మాయి చిన్మయి యింట్లో పనిచేస్తూ వుంటుంది. చీకటితోనే వచ్చి అంట్లు తోమి, మిగతాపని కూడా చేసి రెండు మూడుగంటలు వుండి వెళ్ళిపోతుంది.
    
    అమ్మాజీకి పెళ్ళయింది. ఇద్దరు పిల్లలుకూడా.
    
    అమ్మాజీ ప్రక్కయింట్లోకి పోయి అప్పుడప్పుడూ పనిచెయ్యటం చూసింది చిన్మయి.
    
    "ఎవరూ ఆ ఇంట్లో ఎప్పుడూ పాడుతున్నట్లు వినిపిస్తుంది" అనడిగింది. చిన్మయి ఒకరోజు.
    
    "ఆయనా! ఆనందమోహన్ గారమ్మా ఆ యింట్లోకి కొత్తగా వచ్చారు. పని చెయ్యటానికెవరూ లేరంటే మధ్య మధ్య వెళ్ళి యిల్లూ అదీ వూడ్చి వస్తున్నాను."
    
    "ఆనందమోహనా అతని పేరు? అతనూ, అతని భార్యా ఎప్పుడూ కనబడరే" అంది చిన్మయి.
    
    "ఆయనకింకా పెళ్లికాలేదమ్మా చిన్నవాడే యిరవై నాలుగూ యిరవై అయిదేళ్ళుంటాయి. మంచి ఉద్యోగమే చేస్తున్నారనుకుంటాను."
    
    "ఎప్పుడూ బయటకు రాడనుకుంటాను. ఇంట్లో వుండి పాడుకోవటం తప్ప."
    
    "వస్తూనే వుంటాడమ్మా ఆఫీసుకి స్కూటర్ మీద వెళ్లివస్తూ వుంటాడు. మరి మీకెందుకు కనబడలేదో."
    
    చిన్మయి ఆలోచిస్తూ పరధ్యానంగా వుండిపోయింది.
    
    "ఏమిటమ్మా ఆలోచిస్తున్నారు? ఆయనలా ఎప్పుడూ పాడుకుంటూంటే మీకు ఇబ్బందిగా వుందామ్మా?"
    
    "ఉండదూ మరి? పగటిపూట పాడుకుంటే పాడుకున్నాడు. రాత్రివేళల హాయిగా నిద్రపోయే సమయాన యీయనగారు సంగీతసాధనచేస్తూ కూర్చుంటే ఇరుగు-పొరుగువారు ఇళ్ళలో ఏమైనా వుండాలా? పారిపోవాలా?" అంది చిన్మయి.
    
    ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టక అటూ ఇటూ కదుల్తోంది.
    
    పది... పదిన్నర.... పదకొండు.... పదకొండున్నర.
    
    పాట వినబడలేదు.
    
    ఏం జరిగింది? ఎందుకు పాడటంలేదు? అతనింట్లో లేడా? బయటికెక్కడి కైనా వెళ్ళాడా?
    
    చిన్మయికి తన ఆలోచనలమీద తనకే అసహ్యమేసింది.
    
    అనేక లక్షలమంది పరాయివాళ్ళలో అతనూ ఒకడు. అతన్నిగురించి, అతని పాటగురించి తాను ఆలోచించటమేమిటి? దిసీజ్ టూమచ్.
    
    నిద్రపోవటానికి ఎంతగానో ప్రయత్నించింది. రాత్రి రెండయినా అలా అటూ ఇటూ కదుల్తూ మధ్య మధ్య కిరణ్మయి మీద చెయ్యివేస్తూ, మళ్ళీ తీసివేసి అటు తిరిగి పాడుకుంటూ నానాయాతనా పడిందిగాని నిద్రమాత్రం రాలేదు.
    
    చివరకు లేచి షోకేసులో ఒకప్రక్క పెట్టి వుంచిన కాంపోజ్ టాబ్లెట్స్ లోంచి రెండుతీసి వేసుకుని పడుకుంది.
    
    మనసులో రకరకాల ఆలోచనలు మనకి ప్రియాతి ప్రియమైనవ్యక్తి ఎంతో దూరాన వున్నప్పుడు, నెలల తరబడి కనిపించనప్పుడు ఆ వ్యక్తిమీద ప్రేమ అద్వితీయంగా పెరుగుతూ వుంటుంది. శాశ్వతంగా ఎడం ఏర్పడుతున్నట్లూ, దూరం పెరిగిపోతున్నట్లూ క్రమంగా విస్మృతిలో పడిపోతున్నట్లూ భ్రమకు లోనవుతూంటారు. కొత్తవ్యక్తిని చూసినట్లు ఇద్దరిమధ్యా ఓ పిరికితనం ఏర్పడుతూ వుంటుంది.
    
    ఓ అరగంట తర్వాత కాంపోజ్ ప్రభావంవల్ల చిన్మయి నిద్రలో పడిపోయింది.
    
                                                                 * * *
    
    అమ్మాజీ ఏమైనా అతనికి చెప్పిందేమో, అందుకే అతను పాడకుండా వూరుకుంటున్నాడేమో.
    
    అమ్మాజీని అడుగుదామనుకుని చీప్ గా వుంటుందని వూరుకుంది. అసలిట్లా అడుగుదామన్న ఆలోచన వచ్చినందుకే బాధపడింది. బాధపడింది గాని ఆ ఆలోచన రాకుండా అరికట్టలేకపోయింది.
    
    అదే మానవ జీవిత అంతరాంతరాల రహస్యం.
    
    ఇంకో రెండురోజులు గడిచిపోయాయి. గొంతు వినబడటం లేదు.
    
    ఆ రోజు మధ్యాహ్నం రాజీవ్ దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడు టైం రెండుగంటలు అయింది.. అంటే అమెరికాలో తెల్లవారుఝాము అయి వుంటుందన్నమాట.
    
    "చిన్మయీ!" రాజీవ్ గొంతు ఎంతో ప్రేమగా పిలిచింది.
    
    "ఏమండీ! ఎలా వున్నారు? పదిహేనురోజులైంది మీ దగ్గర్నుంచి ఉత్తరమొచ్చి" అతని కంఠం వినగానే ఆమెకేడుపు వచ్చినట్లైంది.
    
    "సారీ చిన్మయీ! అసలు టైం వుండటంలేదు. ఇక్కడి ప్రజలుపడే కష్టం, వర్క్ లో సిన్సియారిటీ చూస్తే, మనం పడే కష్టం, మన శరీరాలకు మనం చేసుకొనే గారాబం మనమెంత సోమరిపోతులమో తెలుస్తుంది."
    
    అంత దుఃఖంలోనూ చిన్మయి నవ్వింది. "చాలామందిలాగే మీరుకూడా ఇక్కడ ప్లేన్ దిగుతూనే బ్లడీ ఇండియా అని విసుక్కుంటారా?"
    
    "లేదు. మాతృభూమి అని గుర్తుచేసుకుని ఒక్కసారిగా నేలమీద పడి ముద్దు పెట్టుకుంటాను."
    
    "అంతేకాని నన్ను కాదన్నమాట."
    
    "అదే అమెరికా అయితే అప్దిమంధిలో నిన్ను ముద్దుపెట్టుకోవచ్చు కాని అక్కడ ఇంటికి వెళ్ళగానే..."
    
    "ఏమండీ! ఒక్క విషయమడుగుతాను. చెపుతారా?"
    
    "ఏమిటి?"
    
    "నన్ను మరిచిపోతున్నారా?"
    
    "నిన్నా! ఏమిటి చిన్మయీ కొత్తగా మాట్లాడుతున్నావు? నా జీవితంలో అసాధ్యమైనదేమైనా వుంటే అదే."
    
    "అక్కడ మీకు బోలెడు పరిచయాలు..."
    
    "ఐతే...?"   

 Previous Page Next Page