Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 28

   

    "అగ్ని ప్రమాదమా? అదెప్పుడు జరిగింది? ఇది నాకు తెలీదంటే ఇది ఖచ్చితంగా అధికారపార్టీ కుట్ర" ఆవేశంతో అరిచాడు బాపినీడు.


    అభినయ్ వస్తున్న నవ్వును ఆపుకుంటూ "మీరు పేపర్ చదివారా?"


    "అయ్యో! నేను చదివి వినిపిస్తానండీ" అన్నాడు చిదంబరం.


    "మరి ఈ వార్త పేపర్లో వచ్చింది కూడా. దీన్ని గురించి చెప్పలేదా?"


    చిదంబరం నసిగాడు.


    "ఏదో చిన్న వార్తలే అనుకున్నాను."


    "పోనీలెండి. పొరపాటనేది మానవ సహజం"


    "గిరాలదిబ్బ వాసులకి తిరిగి గుడిసెలు కట్టుకోడానికి మీరేమన్నా సాయం చేస్తారేమోనని రాయాలనుకున్నాను" అన్నాడు అభినయ్.


    "ఇంతేకదా! పదా! చందాలు వసూలుచేసి దగ్గరుండి పని పూర్తి చేద్దాం" బాపినీడు ఉదారతని వలకబోస్తూ అన్నాడు.


    "ఓహ్! బ్యూటీ! గొప్పగా సెలవిచ్చారు కానీ చందాలు వసూళ్ళకే అయితే మీరు రానవసరం లేదు. ఆ పనేదో నేనే చేయగలను" అభినయ్ కోపంగా అన్నాడు.


    "పెద్దవాళ్ళతో మాట్లాడేది అలాగేనా?" అన్నాడు రామరాజు.


    "చూడండి. నేను మిమ్మల్ని రమ్మనలేదు. మీ సహాయాన్ని నేను కోరలేదు. మీరెందుకొచ్చి వుంటారో నేను వూహించగలను."


    "మీకు పదవి ముఖ్యం. అధికారం కావాలి. అవి కావాలంటే మీరు నటించాలి. ముసలి కన్నీరు కార్చాలి!"


    కానీ మాకివన్నీ అనవసరం.


    నన్ను పోలీసులు ఎందుకు కొట్టారో తెలుసా? నేను తప్పు చేశాను.


    అలాగే శాంతిభద్రతలు కాపాడేటప్పుడు చట్టాన్ని పరిరక్షించే సమయాల్లో పోలీసులు కఠినంగా వ్యవహరించవలసి ఉంటుంది. దాన్ని పోలీసుల "జులం"గా మీలాంటి అవకాశవాదులు చిత్రీకరిస్తారు.


    పోలీసులూ మనుషులే.


    ప్రజల్లోనివారే.


    రాక్షసులు కాదు, వాళ్లది వేరే జాతికాదు. బ్రతుకుతెరువుకోసం ఈ ఉద్యోగాలు వాళ్ళు చేస్తుంటారు.


    నాకు జరిగినదానికి కొత్త రంగు పులిమి నా పరిస్థితికి మీ గుండె తరుక్కుపోయి సానుభూతి వచనాలతో నన్ను రెచ్చగొట్టి మీరేం సాధించాలనుకుంటున్నారో తెలీని ఫూల్ని కాదు నేను బాపినీడుగారు!


    నా సిద్దాంతాలు మీకు తెలీకపోవచ్చు.


    "ముందు నేను మనిషిని.


    జాతిరీత్యా మనిషిని.


    మతంరీత్యా మనిషిని.


    కులంరీత్యా మనిషిని.


    నాది మానవతావాదం.


    తోటి వ్యక్తి నాకు తెలిసినా, తెలీకపోయినా వ్యక్తిగా ఆ మనిషి బ్రతకడానికి తోడ్పడటం అనే నైతిక బాధ్యతకి నేనెప్పుడూ లొంగిపోయే వుంటాను. ఈ బాధ్యతని నిర్వహించేందుకు నేను ఏ ప్రయోజనాన్నీ ఆశించను."


    బాపినీడు చివాల్న లేచి నించున్నాడు. ఆయన కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి.


    "నీతిచంద్రిక వినడానికి రాలేదు నేను" ఆవేశంతో ఊగిపోయాడు బాపినీడు.


    "కుర్రరక్తం. ఆవేశంతో భవిష్యత్తుని కాలరాచుకోకు నాయనా! బాబుగారి మాటవింటే వృద్ధిలోకి వస్తావు" చిదంబరం హెచ్చరిస్తున్నట్లుగా చెప్పాడు.


     "ఏం మాట వినాలి?" చాలా నిర్లక్ష్యంగా అడిగాడు అభినయ్.


    "అలా అడిగావు బాగుంది. నిన్ను బాబుగారు తన పార్టీలో చేర్చుకోవాలని స్వయంగా వచ్చారు. నువ్వు  "ఊ"  అంటే చాలు అందలం ఎక్కిస్తారు" రామరాజు చెప్పాడు.


    "కునుకు తీసినా, కన్ను తెరిచినా మనశ్శాంతి వుండాలి. రాజకీయాలు నాకు అనవసరం."


    "పోనీ పార్టీలో చేరకు ఆయనకు మద్దతునివ్వు."


    ఆ మాటతో మండిపడిపోయాడు బాపినీడు.


    "ఒరే! నీ దగ్గర నీతిపాఠాలు చెప్పించుకోడానికి రాలేదురా నేను. పెద్ద నీతిమంతుడిలా, నిజాయితీపరుడిలా, సంఘ సేవకుడిలా ఫోజు కొడుతున్న వెధవ్వి ఒక ఆడపిల్ల పరువుని నడిరోడ్డున ఎలా తీశావు.


    అదే నా కూతురయితే ఈపాటికి నిన్ను కైమా కొట్టించేవాడిని.


    నీ తల నరికి నా కూతురు కారుకి కట్టి ఊరంతా ఊరేగించే వాడిని."


    అభినయ్ చిరునవ్వుతో చూశాడు.


    "అయిందా నీ ఉపన్యాసం. ఇప్పుడు నా మాటకూడా వినండి.


    మనిషికో బలహీనత వుంటుంది. అది సమాజం. నా బలహీనత ఆడది. అంతెందుకు? మీ అమ్మాయితో కలిసి నేను నాలుగు అడుగులు వేసి వుంటే ఈపాటికి మీరు తాత అయ్యేవాళ్లు."


    "నోర్ముయ్" అరిచాడు బాపినీడు.


    అభినయ్ నొచ్చుకున్నాడు.


    అభినయ్ మిత్రులు చప్పట్లు చరిచారు.


    "పాపం పెద్దవారు ఊరికే అలా అరిస్తే బి.పి. వస్తుంది.


    ప్రజాప్రతినిధులు మీకేమన్నాఅయితే ప్రజలగతి ఏంకాను?"


    "నిన్ను......" చెయ్యెత్తాడు బాపినీడు.


    "చెయ్యి దించు బాపినీడూ! పెద్దరికం నిలవాలంటే చెయ్యిదించు.


    గీత విషయంలో నేను తప్పుచేశానని అంగీకరించాను.


    కానీ ఆ అమ్మాయే వచ్చి నేనేం తప్పు చేయలేదని నిరపరాధినని అంటోంది.


    ఒకవేళ నీ కూతురు జయశ్రీ అయినా అంతేనేమో!


    నా కళ్ళలో ఏం మెస్మరిజం వుందో తెలీదుకాని ఒక్క ముద్దుతో సరెండర్ చేసుకోగలను!"


    "ఆ కళ్ళని నేను లేకుండా చేస్తాను" ఆవేశంతో వూగిపోయాడు బాపినీడు.


    "మిస్టర్ బాపినీడూ! నన్ను అనవసరంగా రెచ్చగొట్టి మాట తూలేలా చేస్తున్నావు.


    ఇదిగో ఇదివరలో మనం ఎక్కడయినా కలుసుకున్నామా అని అడిగిన నీ ప్రశ్నకి సమాధానం చెపుతున్నాను విను.....


    నీ ప్రాణాలని తీయబోయిన దుండగుల బారినించి నిన్నూ, మానభంగం కాబోతున్న నీ కూతుర్నీ కాపాడితే పారితోషికంగా వంద రూపాయలు ఇవ్వబోయిన ఘనుడివి. అంటే నీ ప్రాణం విలువ, నీ కూతురి మానం విలువ వందరూపాయలని రేటుని నువ్వే ఫిక్స్ చేసుకొన్నావారోజు.

 Previous Page Next Page