ఏదో శృతి...
అంతలోనే ఏదో అపశృతి...
చాలా తెలుసుకోవాలనుకుందిగాని అడిగినా ఏదీ చెప్పేట్టు లేడు.
"అమ్మా...ఆశ్రితా..." ఆప్యాయంగా తల నిమిరాడు "డబ్బు అమ్మా..."
ఇవ్వాలని లేదు. తాగి తాగి ఏ క్షణంలో అయినా నేలరాలేట్టున్న ఆ వ్యక్తిని సంస్కరించే శక్తిని ఈ స్వల్ప పరిచయంలో ప్రయోగించాలనీ లేదు.
గూటిలో వున్న రెండు పదుల్ని ఓ అయిదునీ అతడికిచ్చింది.
ఉత్సాహంగా అందుకున్నాడు.
"మహా కావ్యానికి క్రైటీరియా సైజూ బరువూ కావయా! నిన్నటి మహాకావ్యం పద్దెనిమిది పర్వాలైతే, నేటి మహాకావ్యం పద్దెనిమిది పేజీలే అని అన్నది అరుద్రమ్మా! అదీ శ్రీశ్రీ గురించి... అంత గొప్పగా కావ్యసృష్టికి నువ్వూ కారణమవుతావ్..."
గాయపడ్డ ఓ విజ్ఞాన ఖనితో తనకు పరిచయమైందని గ్రహించడానికి ఇంతకన్నా ఆమెకు ఉదాహరణేం కావాలి? ఏకనాథ బెదిరించాలని వస్తే ఈ భీష్ముడు అంపశయ్యలాంటి జీవితం నుంచి తనకు దిక్సూచిలా ప్రత్యక్షమయ్యాడు.
వెళ్ళబోతున్న ఆ వృద్దుడి చేయి పట్టుకుందామె. "మీ పేరు?"
"తాతయ్య..." అంతకన్నా చెప్పనన్నట్టుగా చూశాడు.
"మీ గురించి తెలుసుకోవాలనుంది"
ఉన్నట్టుండీ ఆ వృద్దుడి కళ్ళలో నీళ్ళు సుడులు తిరిగాయి.
సన్నగా కంపిస్తూ కవితలా చెప్పాడు.
"తిండి లేదు కండ లేదు తీపి బ్రతుకు చేదు చేదు
వృద్దాప్యం నాకిప్పుడు, వృధా ప్రయాసే ఎప్పుడు
చేస్తున్నాను రవ్వంత బ్రతుకు చప్పుడు
చేసినవాడేమో ముగింపు చెప్పడు"
గొణుగుతూ వెళుతున్న వృద్దుడికి అడ్డం పడింది ఏదో గుర్తుకొచ్చినట్టుగా "ఇందాక వచ్చిన ఏకాంత గురించి చెబుతానన్నారు."
"ఒకనాడు ఆమె ఏమన్నా కాని ఇప్పుడు సూర్నారాయణ వుంచుకున్న ఆడది... తెలివైనది. నీ సంగతి తేల్చాలని వచ్చింది"
అంతేకాదు. ఆమెను సూర్నారాయణ ఎక్కడ వుంచాడో అదీ చెప్పాడు. జాగ్రత్తమ్మా అంటూ మరోసారి హెచ్చరించి వెళ్ళాడు.
పోరాటంలోకి దిగిన తనకు ప్రమాదం తప్పదని ముందే తెలుసుగాని, ఇప్పుడు మరింత జాగ్రత్తగా అడుగువేయాలని నిర్ణయించుకున్న ఆమె బడలికగా కళ్ళుమూసుకుంది.
సరిగ్గా అదే సమయానికి...
కమీషనరు సవ్యసాచి తన ఛాంబర్ కి సర్కిల్ ఇన్స్ పెక్టర్ ధనంజయని పిలిచాడు.
నమ్మిన బంటులా శాల్యూట్ చేసి నిలబడ్డ ధనుంజయని చూస్తూ-
"రేపు ఉదయం దామోదరం డెయిలీ న్యూస్ పేపర్లో ఆశ్రిత ఇంటర్వ్యూ రాబోతూంది" అన్నాడు.
"ఎస్సర్"
"సరిగ్గా అదే సమయైకి మరో దినపత్రికలో ఆశ్రిత అరెస్టు వార్త రావాలి" క్షణం ఆగి అన్నాడు సవ్యసాచి. "అంటే.... ప్రచురణకి వీలుగా ఆమెను రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నువ్వు అరెస్ట్ చేయాలి....ఆ బాధ్యత నీది"
"ఓ.కే.సర్"
"ఏ నేరం మీద అరెస్ట్ చేస్తావ్?"
చెప్పాడు ధనంజయ.
సవ్యసాచి నవ్వాడు ఉత్సాహంగా.
స్వామి భక్తిని ప్రకటించిన ధనంజయ తన పథకానికి సమాయత్తమవుతూ వెళ్ళాడు.
* * *
రాత్రి ఏడు గంటల సమయం...
భూమ్యాకాశాలను ఏకం చేసే తిరుగులేని శక్తిలా చీకటి నగరాన్ని కప్పి క్రూరంగా కరాళనృత్యం చేస్తున్న వేళ 'నేడు' పత్రిక ఎడిటరు ఛాంబర్ లో ఆశ్రిత ఇంటర్వ్యూ జరుగుతోంది.
రూలింగ్ పార్టీకి మాత్రమేగాక హోం మినిస్టర్ సూర్నారాయణకి ముఖ్య ప్రత్యర్ధిలాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త దామోదరంగారి ఆదేశం ప్రకారం చాలా పటిష్టంగా ప్లాన్ చేయబడిన ఇంటర్వ్యూ అది.
ప్రజలకీ, ప్రభుత్వానికీ మధ్య వారధిలా నిలిచే పత్రికలు ఎంత శక్తివంతమైనవో నిరూపించే చాలా సంఘటనలకు కారణమైన దామోదరం ఇప్పుడు సూర్నారాయణ భవంతిని మొత్తం కాకపోయినా కనీసం పునాదిలోని ఒక్క రాయినైనా కదల్చడానికి అవకాశంగా తీసుకోవాలనుకున్నాడు. సంఘటన చిన్నది కావచ్చుగాని దానికి బలంగా పబ్లిసిటీ ఇస్తే నిద్రపోతున్న ప్రతిపక్షాల్ని కదిపినట్టవుతుంది. అది చాలు సూర్నారాయణపై ప్రభుత్వము ఓ కమిషన్ వేసి కంగారు పుట్టించడానికి అలా ప్రభుత్వం మీద కసి పుట్టించడమేగాక తన పత్రిక్కీ పాప్యులారిటీ పెంచుకోవచ్చు.
"ఈ ఇంటర్వ్యూ ద్వారా మీరేం సాధించాలనుకుంటున్నారు?" ఆశ్రితని అడిగాడు రిపోర్టర్.
"ఐక్యరాజ్యసమితిలోనో, ప్రపంచ మానవ హక్కుల సంఘంలోనో నా తండ్రి, తమ్ముళ్ళ మరణం చర్చించబడాలని కోరుకోవడంలేదు. కనీసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అనూహ్యంగా స్పందించి దీన్నో అయోధ్య సంఘటనలానో, హజ్రత్ బల్ సన్నివేశంలానో చర్చించుకోవాలనీ అనుకోవడం లేదు. మేధావుల ఆలోచనలతో రూపుదిద్దుకున్న రాజ్యాంగము ఓ పౌరుడి కివ్వాల్సిన రక్షణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహించిందో ప్రజలకి తెలియచెప్పాలన్నదే నా ఉద్దేశ్యం"
"ప్రజలకు తెలియడం వలన మీకు ఒరిగేదేమిటి?"
"నాకు తెలుసు. పోయిన నా తండ్రిగాని, తమ్ముడుగాని తిరిగి రారు. కాని మనం ఎలాంటి పరిపాలనాదక్షుల చేతుల్లో బ్రతుకుతున్నామో అర్ధమౌతుంది. మరో తండ్రిగాని, బిడ్డగాని బలిగాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడుతుంది"
"మీ తండ్రీ, తమ్ముళ్ళ చావుకి కారణం ఎవరనుకుంటున్నారు?"
"ఖచ్చితంగా కారణం నా తమ్ముడ్నీ, తండ్రినీ హింసించిన హోం మినిస్టర్ సూర్నారాయణగారు, సకాలంలో ఇన్ఫర్మేషన్ అందినా స్పందించని కమీషనర్ సవ్యసాచిగారూ..."
వాళ్ళు మీ తమ్ముడ్ని ఆత్మహత్యకి పురికొల్పలేదే?"
"హత్య చేయడం ఒక్కటే నేరంకాదు. హత్యకి ప్రేరేపించడమూ చట్టరీత్యా నేరమే. అలాంటప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించిన సూర్నారాయణగారూ నేరస్థులే అన్నది నా అభిప్రాయం..." విలేఖరి మరేదో అడగబోతుంటే తనే అంది ఆశ్రిత- "కొట్టడం, హింసించడమూ అనుకూలమైన పరిస్థితుల్ని సృష్టించడమెలా అవుతుందన్నది మీ అనుమానమైతే దానికి నా జవాబు ఒక్కటే... పరువుగా, నిజాయితీగా బ్రతికే వ్యక్తులు కొన్ని అనుమానాల్ని భరించలేరు.... అందులోనూ చేయని తప్పుకి నా తమ్ముడూ, తండ్రీ శిక్షించబడ్డారు."