Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 28

    "మరి ఠాకూర్ చేతులు ముడుచుకుని ఊరుకుంటాడంటారా?" అనుమానంగా అడిగాడు బన్సీలాల్.
   
    ఆ మాట వినగానే అతని కళ్ళు తళుక్కుమన్నాయి.
   
    "ఊరుకోడు లాల్ జీ! ఎప్పుడో ఒకప్పుడు సమయం చూసి ఏదో ఒకటిచేస్తాడు" అంటూ చల్లగా శెలవిచ్చాడు.
   
    బన్సీలాల్ ముఖం వివర్ణమైంది.
   
    ఇన్ స్పెక్టర్ కి ఈ కొత్త ఆలోచన యింకా రాలేదు. తనని చావచితక కొట్టింది నలుగురు నౌకర్లు వాళ్ళని తనని తగలేస్తేగాని మనశ్శాంతి చిక్కదు. ఒక నౌకరు గోపన్నని చావచితక గొట్టే ఛాన్స్ లభించింది తతిమ్మా నౌకర్లు ఏదో వంకన తన చేతికి చిక్కక పోరు. అప్పుడు వాళ్ళ భరతము పట్టకపోడు. నౌకర్లు తనని కొడుతుంటే బన్సీలాల్ నవ్వుతూ చూస్తూ నుంచున్నాడు. కనుక బన్సీలాల్ కి పెద్ద పరాభవం అయితే తను మనసారా నవ్వొచ్చు అదిచూసి...కనుక...లాల్ జీ మెదడులో మరో పెద్ద అనుమానంపురుగుని మాటల ద్వారా ఎక్కించాలి...
   
    అతని ఆలోచనలు అలా సాగుతున్న వేళ "ఏమిటి దీర్ఘాలోచన చేస్తున్నారు?" అన్నాడు బన్సీలాల్.
   
    "మీ అనుమానం మీ ఆలోచన నాకెప్పుడో వచ్చాయి లాల్ జీ!"
   
    "మరి నాతో చెప్పలేదు?"
   
    "చెప్పి మిమల్ని గాభరా పెట్టడం యిష్టం లేక."
   
    "గాభారానా?"
   
    "ఎస్, మనం లెటర్ రాసిన సంగతి తెలిసి నన్ను కొట్టించాడు__ఈ తఫా మీ జోలికి వాడు...."
   
    బన్సీలాల్ ముఖం వివర్ణమైంది. "ఈ తఫా వాడు ఏ దుష్టపధకం పన్ను తాడో?"
   
    "చాలా పెద్దదే పన్నవచ్చు మీరు జాగ్రత్తగా వుండండి లాల్ జీ! తర్వాత విషయం నేను చూసుకుంటాను. గోపన్నని జైలులో పెట్టి వారం అయింది..."
   
    "అయినా వాడు నా జోలికి రాలేదుకదా!" కాస్త ఆశగా అన్నాడు బన్సీలాల్.
   
    "అక్కడే వుంది అసలు కిటుకు లాల్ జీ! మనం ఒకసారి వాళ్ళ వలలో పడ్డాం....కనుక మనకి గాయం బాధ తెలుసు. మనం అంతా మరచిపోయిన వేళ మరో పరాభవం చేయటానికి తయారవుతాడు."
   
    "అంతేనంటారా?"
   
    "నా పోలీసు బుర్రతో ఆలోచిస్తే అంతే మరి..."
   
    "ఇప్పుడు మనం ఏమి చేయాలంటారు?"
   
    "ప్రస్తుతం చేసేది ఏమీలేదు. ఠాకూర్ ఏదో ఒకటి చేస్తాడు, అంతవరకూ ఖాయం...అతని ప్లాను ఏమిటో ప్రస్తుతం మనవూహకి అందటం లేదు కాబట్టి మనం మౌనం వహించక తప్పదు....విషయం ఏదన్నా మనం ముందే పసిగట్టగలిగితే తిప్పి కొట్టడం తేలిక" సాలోచనగా అన్నాడు అతడు.
   
    నిజమేనన్నట్లు తల తాటించాడు బన్సీలాల్.
   
    ఇన్ స్పెక్టర్ ఆలోచన వేరు. ఠాకూర్ ఏదో చేస్తున్నాడని కథఅల్లి బన్సీలాల్ కి అనుమాన పిశాచాన్ని అంటించాను. నిజం చెప్పాలంటే ఠాకూర్ పాత్ర వుందో లేదో అతడికి ఇసుమంతయినా తెలియదు...చాటు మనిషిఎవడో అసలు తెలియదు. బన్సీలాల్ ని అవమానం చేయటానికి సమయం చేతిలోకి వచ్చింది....కాపోతే ఎలా అవమానం చేయాలి! కథ ఎలా మలుపు తిప్పాలి! అన్న అయిడియా రాలేదు. సారి పథకం బుర్రకి తడితే సారి అయిన సమయంలో సవ్యంగా అమలులో పెట్టి బన్సీలాల్ ని పరాభవించాలి.
   
    అతడు పథకం ఆలోచిస్తూ వుండిపోయాడు.
   
    "చావగొట్టి చెవులు మూసి అయినా సరే గోపన్న నోట్లోంచి అసలు రహస్యం కక్కించాలి మీరు" కొద్దిసేపు ఆగి బన్సీలాల్ అన్నాడు.
   
    "ఆ ప్రయత్నంలోనే వున్నాను లాల్ జీ" అన్నాడు ఇన్ స్పెక్టర్.
   
                                                        19
   
    సాయంత్రం...
   
    ఆరుపది నిమిషాలు...
   
    చామంతి రెండు మోకాళ్ళకి చేతులు చుట్టుకుని మోకాళ్ళమధ్య తల దూర్చుకుని ఏడుస్తూ అలా ఎంతసేపటి నుంచో కూర్చుని వుంది.
   
    చెట్టు చాటున దాక్కున్న సోదెమ్మ వకతి పావుగంట నుంచీ చామంతి చర్యలని గమనిస్తూ వుంది.
   
    చామంతి అడవికి వచ్చింది. అక్కడ ఎవరో దాక్కున్నారా అన్నట్లు చెట్లు పుట్టలు గాలించింది. పిచ్చిదానిలా అటూ ఇటూ తిరిగి చివరికి దోవ పక్కగా కూలబడి ఏడవటం మొదలుపెట్టింది.
   
    అప్పుడు__
   
    సోదెమ్మ కిందనున్న బుట్ట చంకనెత్తుకుని చెట్టు చాటునుంచి యివతలికి వచ్చింది. తన ఉనికి గుర్తుచేస్తూ చిన్న పాటని కూనిరాగంగా తీసింది.
   
    ఎవరో నడచి వస్తూ పాట పాడటం వినిపించి చటుక్కున తల ఎత్తి చూసింది చామంతి.

 Previous Page Next Page