Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 27

    "లాల్ జీ! నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీవి నగలు రెండు పోతాయి. ఓ నగ గోపన్న దగ్గర దొరుకుతుంది. రెండో నగ ఏదని, నీతో చేయి కలిపిన దొంగ ఎవడని అడుగుతాము. నాకు తెలియదు మొర్రో అంటాడు గోపన్న మీరు వినరు. కేసు నాకు అప్పగిస్తారు. నేను వాడిని నా అధికారంతో జైలులో పెడతాను. అక్కడ వాడి పనిపట్టి విషయం కక్కిస్తాను."
   
    "మీ ప్లాను చాలా బాగుంది." బన్సీలాల్ మెచ్చుకున్నాడు.
   
    ఇన్ స్పెక్టర్ గోపన్న మీద పగబట్టి గోపన్నని నేరస్తుడనే ముద్రతో తన్ని తగ లేయతానికి ప్లాను వేశాడని, తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు ముందుగా రిపోర్ట్ ఇస్తే ఇన్ స్పెక్టర్ కడలి వస్తాడని బన్సీలాల్ బుర్రకి తట్టలేదు.
   
    "రేపే రంగంలోకి దిగండి" ఇన్ స్పెక్టర్ అన్నాడు.
   
    అలాగే అన్నాడు బన్సీలాల్.
   
    ఆ తర్వాత గోపన్న మీద చోరీ నేరం ఎలావేయాలి ఏ విధంగా పట్టుకోవాలి అన్నది ఇరువురూ కలసి ప్లాను లేశారు.
   
    రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువా!
   
    ఇన్ స్పెక్టర్ చెప్పిన ప్రకారం బన్సీలాల్ తు.చ తప్పకుండా చేశాడు.
   
    ఫలితం...!
   
    గోపన్న చోరీ నేరంతో జైలు పాలయ్యాడు. బన్సీలాల్ తన ఇంటో చోరీ జరిగిందని రిపోర్టు యివ్వటం, వెంటనే ఇన్ స్పెక్టర్ మంది మార్భలంతో కదలిరావటం గోపన్నని అరెస్టుచేసి తీసుకెళ్ళటం మామూలుగా జరిగిపోయింది.   
   
    ఇన్ స్పెక్టర్ కన్నారావు తన నోటికి, చేతికి పని కల్పించి నాలుగు గోడలమధ్య గోపన్న వళ్ళు వాయగోట్టి కసి తీర్చుకున్నాడు. అయినా తృప్తిగా లేదు.
   
    ఆశపోతుకి తృప్తి ఉండదు.
   
    ఇన్ స్పెక్టర్ కన్నారావు అత్యాశాపరుడు. తృప్తి లేని మనిషి.

    "అర్దరాత్రి ఒంటిగంట సమయంలో నీ గదిలోకి రహస్యంగా వచ్చి వెళ్ళిన మనిషి ఎవరు? చెప్పు నిజం చెప్పక పోతే ప్రాణం తీస్తాను. నీ గుండు గొరిగించి, ముఖమంతా సున్నంబొట్లు పెట్టి గాడిదమీద ఊరంతా ఊరేగించినా అదేమని నన్నడిగే నాధుడు లేడు. అలాగే నీ ప్రాణం తీసి నిలువులోతు గోతిలో కప్పెట్టి నీవు జైలునుంచి పారిపోయావని చెపితే ఈ లోకం నమ్ముతుంది. నరకంలో నీవు మగ్గుతూ ఉంటావు."
   
    "అని ఇన్ స్పెక్టర్ బెదిరింపుగా అంటుంటే గోపన్నకి విష్యం బాగానే అర్ధం అయ్యింది. తను దొంగతనం చేయలేదు. కాని, చోరీనేరం మోపి జైలులో తోసిన కారణం తను అర్దరాత్రి చాటుగా కల్సుకున్న మనిషి గురించి వాళ్ళు తెలుసుకోవటానికన్నమాట....!
   
    ఆ విషయం తనెలా చెపుతాడు.
   
    తన ప్రాణం తన సర్వం కంఠంలో వూపిరి వున్నంత వరకు చెప్పకూడదు. నిజం చెప్పిన మరుక్షణం ఘోరం జరిగిపోతుంది....తను చావనన్నా చస్తాడుగాని పెదవి కదపడు అంతే!
   
    గట్టి నిర్ణయానికి వచ్చిన గోపన్న ఇన్ స్పెక్టర్ చేతిలో చావు దెబ్బలు తింటూ కూడా నోరు మెడపలేదు.
   
    గోపన్నని కొట్టి కొట్టి తన చేతులు తిట్టి తిట్టి నోరు పడిపోతున్నది గాని వాడు మాత్రం పెదవి కదపటం లేదు అన్న విషయం అతనికి అవమానంగా వుంది.
   
    ఆ రోజు బన్సీలాల్ ఇన్ స్పెక్టర్ కన్నారావు కల్సుకున్నారు....గోపన్న విషయం మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.
   
    "దెబ్బలకి లొంగక వాడంత మొండి కేశాడూ అంటే ఏదో పెద్ద రహస్యమే వున్నట్లు లెక్క" అతను చెప్పింది విని బన్సీలాల్ అన్నాడు.
   
    "విషయం చెప్పకపోతే మనం ప్రాణం తీస్తాం. చెపితే ఠాకూర్ ప్రాణం తీస్తాడు. ప్రస్తుతం గోపన్న పరిస్థితి అది" ఇన్ స్పెక్టర్ అన్నాడు.
   
    "నిజం చెప్పి మన పక్షం చేరవచ్చు కదా!"
   
    "చేరవచ్చు కాని మీకన్నా ఠాకూర్ కే వాడు నమ్మినబంటు కావటం అసలు విషయం..."
   
    "అంతేనంటారా?"
   
    "అక్షరాలా అంతే!"
   
    బన్సీలాల్ అప్పటికప్పుడే ఆలోచనలో పడిపోయాడు అలా ఆలోచిస్తుంటే కొత్త విషయం తట్టింది....ఇంతకాలం ఆ ఆలోచన తనకి తట్టనందుకు విచారించాడు.
   
    "గోపన్న ఠాకూర్ మనిషి అయినప్పుడు..."
   
    "చెప్పండి లాల్ జీ! ....మీ అనుమానం ఏమిటో చెప్పండి.... మీ అనుమానాలు తీర్చేమనిషిని నేను రెడీగా మీ ఎదుట వున్నాను... అనుమానాలు తీర్చటమే కాదు ఆపదలో ఆదుకుంటాను."
   
    "ఠాకూర్ మనిషి గోపన్న. వాడిమీద దొంగతనం నేరం మోపాను నేను మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి జైలులో తోశారు. గోపన్న జైలులో వున్నాడన్న సంగతి ఈసరికి ఠాకూర్ కి తెలిసే వుంటుందికదా?"
   
    "వాళ్ళ మనిషి కాబట్టి గ్యారంటీగా తెలుస్తుంది."

 Previous Page Next Page