Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 28

    "ఆగవే బాబూ- ఇవన్నీ నాకు గుర్తుండవు. కాగితం మీధ రాసివ్వు" అంది సుహాసిని.   
    "అలాగే రాసిస్తాను. కానీ అతని ఎదురుగా చదువుతావా?"   
    "లేదు కంఠస్థం చేస్తాను" అంది సుహాసిని.   
    కాసేపటికి సుబ్బారావు, అరుణ జూ చూడ్డం అయింది వనజ అరుణను విశేషాలడుగుతున్నట్లుగా పక్కకు తీసుకువెళ్ళింది. ఆ అవకాశం తీసుకుని సుహాసిని సుబ్బారావుతో "సాయంత్రం అయిదున్నరకు పార్కుకు రండి" అంది.   
    "బామ్మగారొస్తారా?" ఉత్సాహంగా అడిగాడు సుబ్బారావు.   
    "రారు. మీరు కూడా ఒక్కరే రండి!" అంది సుహాసిని నెమ్మదిగా.   
    "అమ్మొప్పుకుంటుందో ఒప్పుకోదో" అన్నాడు సుబ్బారావు అనుమానంగా.   
    "మా ఇంట్లోనూ ఒప్పుకోరు. కానీ నేనేదో ఉపాయం పన్ని వస్తున్నారు, మీరు కూడా అలాగే రాలేరా ప్లీజ్...నా కోసం!" అంది సుహాసిని.   
    "ప్లీజ్...నా కోసం!" అన్న మాటలు సుబ్బారావు చెవుల్లో గింగురు మంటున్నాయి. అంతనింకేమీ మాట్లాడకుండా అప్రయత్నంగా తల వూపాడు.   
    తర్వాత అంతా ఎవరిండ్లకు వాళ్ళు వెళ్ళారు.   
    ఇంటి దగ్గర సుబ్బారావు తల్లికి పార్కుగురించి చెప్పాలని ఎన్నోమార్లు ప్రయత్నించాడు. కానీ అతడి గొంతు పెగలలేదు. నాలుగున్నరకు సుభద్రమ్మ సుబ్బారావు ముందు ఓ పది వెల్లుల్లీపాయలు పెట్టి, "కాస్త వలిచి పెట్టరా కారప్పొడి చెయ్యాలి!" అంది.   
    పది వెల్లుల్లిపాయలు...ఒక్కొక్కటీ పాయలుగా విడదీసి ఒకొక్క పాయనే ఒలవాలి. అది చాలాసేపు పడుతుంది. అరుణకు వెల్లుల్లిపాయలు ఒలిస్తే చేతులు మండుతాయి. ఈపని ఎప్పుడూ సుబ్బారావుదే! సుబ్బారావు ఎప్పుడూ ఈ పని చేయడానికీ విసుక్కోడు మనసులో కూడా అతను ఇబ్బంది పడలేదు. కానీ ఈ రోజతనికి చిరాగ్గా వుంది.   
    "ప్లీజ్...నా కోసం!" అన్న సుహాసిని మాటలు అతడి చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి, అనాసక్తంగా అతను పాయలు ఒలుస్తున్నాడు. టైము పరుగెడుతోంది. సుబ్బారావు టైము గుణించుకుంటున్నాడు. తనింటినుంచి పార్కుకు చేరడానికి అరగంట పడుతుంది.   
    ఓ పావుగంటసేపు మాత్రం అతను వెల్లుల్లిపాయలు ఒలిచి చటుక్కున లేచి నిలబడి తల్లి దగ్గరకు వెళ్ళాడు. "ఏరా, అప్పుడే ఒలవడం అయిపోయిందా?" అంది తల్లి.   
    "చెబుతాను కానీ-అమ్మా! ఓ చిన్న సందేహం. నేను రాయుడిగారితో అబద్దం చెప్పాననుకో. అందువల్ల ఆయనకే నష్టం కలుగలేదనుకో! కానీ ఆయనకా అబద్దం చెప్పడం వల్ల నీ మనసుకు సంతోషం కలిగిందనుకో. అలాంటప్పుడు అబద్దం చెప్పటం తప్పవుతుంది?" అనడిగాడు సుబ్బారావు.   
    "ఎందుకవుతుంది? ఎవళ్ళకూ నష్టం కలిగించకుండా ఒకరికి సంతోషం కలిగించే అబద్దం-ఎన్నటికీ తప్పుకాదు" అంది సుభద్రమ్మ. "ఇంతకీ ఈ ప్రశ్న ఎందుకడిగినట్లు?"   
    "ఏమీ లేదమ్మా రాయుడుగారు నన్ను అయిదుకల్లా బయల్దేరి రమ్మన్నారు. మరి వెళ్ళనా?" న్నాడు సుబ్బారావు.
     "ఇంతకీ ఆ అబద్దం గురించి చెప్పలేదు" అంది సుభద్రమ్మ.   
    "అబద్దం చెప్పడం అయిపోయిందమ్మా" అని సుబ్బారావు అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. సుభద్రమ్మ అయోమయంగా కొడుకు వెళ్ళిన వైపు చూస్తూండిపోయింది. అతడి మాటల భావం ఆమెకు అంతుపట్టలేదు.   
    సుబ్బరావు నేతాజీ సుభాష్చంద్రబోస్ పార్కుకు అయిదున్నర కావడానికి అయిదునిముషాలముందే వెళ్ళాడు. ఆ అయిదు నిముషాలూ ఆయాసం తీర్చుకోడానికి అతడికి అక్కరకు వచ్చింది. సుహాసిని మాత్రం కరెక్టు టైముకి వచ్చింది. ఆమె తాపీగా నడిచి వచ్చిందనడానికి చిహ్నంగా ఆయాసం సూచనలు లేవు.   
    పొదల మాటున రామగోపాల్, మోనికా, రాయుడు రచయిత సర్దుకున్నారు. జరుగబోయే విషయం గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.   
    "బహుశా ఆపిల్ల వనజ గురించే చెబుతుంది" అన్నాడు రాయుడు.   
    "లేదు. వనజ మాటలు ఆమెమీద తీవ్రంగా పనిచేశాయి. ఇప్పుడు సుహాసినికి సుబ్బారావుమీద ప్రేమ అధికమవుతుంది" అన్నాడు రచయిత.   
    సుహాసిని సుబ్బారావుని సమీపించి "నాకంటే ముందుగా వచ్చేశారే అంది. సుబ్బారావు తల్లికి తనెలా ఠోకరా ఇచ్చాడో చెప్పాడు.   
    రచయిత రాయుడితో "చూశారా, కుర్రాడు దారిలో పడుతున్నాడు. వాళ్ళమ్మతో అన్నాడు. అబద్దాలు చెప్పడం మొదలెట్టాడు"   
    "మీరు చాలా తెలివైన వారు" అంది సుహాసిని "ఆ రోజు వానలో తడిసినప్పట్నించి మీతో ఏకాంతం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజా అవకాశం వచ్చింది."   
    "అయితే మన వానజల్లు ప్రభావం చూపించిందన్న మాట." అన్నాడు రాయుడు గర్వంగా మీసం దువ్వుతూ.   
    "చెప్పండి!" అన్నాడు సుబ్బారావు.   
    "అదే- ఆ కథ మీరు పూర్తిచేయలేదు. రాజకుమార్తె ఏమయింది? శకారుడు, రాజకుమారుడు ఒకరి కొకరు ఎదురౌతారా? చివరికేమవుతుంది?"   
    రాయుడు తల పట్టుకుని "తల్లీ నీలాంటి వాళ్ళుండబట్టే తెలుగు సినిమాలిలా ఏడుస్తున్నాయి. శకారుడు చస్తాడనీ రాజకుమార్తె, రాజకుమారుడు. పెళ్ళి చేసుకుంటారని నీకా సుబ్బారావే చెప్పాలా?" అన్నాడు.   
    "మీకు అంతకంటే విచిత్రం చెప్పనా?" అన్నాడు సుబ్బారావు.   
    "ముందు కథ పూర్తి చేయండి" అంది సుహాసిని.   
    "అది కాదు ఆరోజు వానెలా వచ్చిందో తెలుసా మీకు?"   
    సుహాసిని కళ్ళు పెద్దవయ్యాయి. "సూర్యుడి ఎండా వేడికి సముద్రం మీదా, నదుల మీదా నీరు ఆవిరై ఆకాశంలోకిపోయి మేఘాలుగా ఉండిపోతుంది. చల్లగాలికి ఆ మేఘాలు మళ్ళీ వానలు కురిపిస్తాయి. అంతే కాదా!"   
    "కాదు, ఓ సినిమా పార్టీ వాళ్ళు ఇక్కడ షూటింగ్ ఏర్పాటు చేశారుట. కృత్రిమంగా వాన కురిపించే ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారుట. రాత్రి షూటింగ్ ఉన్నదట, సాయంత్రం పార్కు బయటనుంచి ఓసారి స్విచ్ ఆన్ చేసి వానెలా కురుస్తుందో చూశారుట. లోపల మనమున్నామని వాళ్ళకు తెలియదు" అన్నాడు సుబ్బారావు.   
    "ఇదంతా మీకెలా తెలుసు?" అంది సుహాసిని.

 Previous Page Next Page