Previous Page Next Page 
చిల్లర దేవుళ్ళు పేజి 27

    బాజావాళ్ళు గడీలో ప్రవేశించారు. రెడ్డిగారికి నమస్కారం చేసి 'సీతమ్మ పెళ్ళికూతురాయెనే' సన్నాయి పాత ప్రారంభించారు. కొత్త బట్టలు కట్టుకొని, కుంకుమబొట్టు పెట్టుకొని, బతకమ్మను నెత్తిన పెట్టుకొని ఎంకటి బయల్దేరాడు. అతని వెనుక మరో ఇద్దరు, మరి రెండు బతకమ్మల్ని నెత్తినెత్తుకొని బయల్దేరారు. వారిని చూచి మేళాలవాళ్ళు బైల్దేరారు. వారి వెనక బతకమ్మలు కదిలాయి. వాద్యగాళ్ళు కరణం ఇంటికి వెళ్ళారు. అక్కడొక బతకమ్మ బైల్దేరింది. అలా ఊరంతా తిరిగి వందల బతకమ్మల్ని తీసుకొని గడీ ముందుకువచ్చి నుంచున్నారు వాద్యగాళ్ళు. తెరలు కట్టిన కచ్చడం బండి బయల్దేరింది ఊరేగింపు వెనక. బండ్ల వెనక మగవారితో పాణి బయల్దేరాడు.
    ఊరేగింపు సాగిపోతూంది. ఊరేగింపులోని ఆడవారిలో ఒకావిడ పాట చెపుతూంది ఒక్కొక్క పాదం, మిగతావారు చప్పట్లు కొడుతూ పాడుతున్నారు.
    బొడ్డెమ్మ బొడ్డెమ్మ, బిడ్డలెందారె
    బావిల పడ్డావారికి బారిద్దరమ్మా
    చెర్లా బడ్డావారికి చేరిద్దరమ్మా
    కుంట్ల బడ్డావారికి కూరిద్దరమ్మా
    నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా
    నిద్రకూ నూరేండ్లు నీకు వెయ్యేండ్లు.
    ఊరేగింపు ఏటి దగ్గరకు చేరగానే వాద్యగాళ్ళు ఒక పక్కకు దిగి మ్రోగించసాగారు. గుంపులు గుంపులుగా విడిపోయాయి బతకమ్మలు. అనేకచోట్ల గుంపులు గూడారు మగువలు. రెడ్డిగారి బతకమ్మలు ఏటిపైకి కొంతదూరం వెళ్ళాయి. అక్కడ ఇసుకలో వాటిని దింపారు.
    కరణం బతకమ్మ సహితంగా నాలుగు బతకమ్మల్ని ఒకచోట పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడసాగారు గడీ బృందం. మగవారితో దూరంగా నుంచుకొని వింటున్నాడు పాణి. మసక చీకటి పడ్తుంది. ముఖాలు కనిపించడంలేదు. కంఠం మాత్రం వినిపిస్తూంది. మంజరి చెపుతోంది. మిగతావారు చదువుతున్నారు.
    శ్రీలక్ష్మీ నీ మహిమలూ గౌరమ్మ - చిత్రమై తోచునమ్మా   
    భారతీ సతివయ్యు, బ్రహ్మ కిల్లాలివై పార్వతీదేవివై
    పరమేశురాణివై
    పరగ శ్రీలక్ష్మీవయ్యూ, గౌరమ్మ - భార్యవైతివి హరికినీ
    ముక్కోటి దేవతలు, చక్కనీ కాంతలు, మక్కువగా నినుగూర్చి
    పెక్కు నోములు నోచి ఎక్కువ వారైరిగా - గౌరమ్మ ఇహలోకముల యందువా.......
    అలా ఎన్నో పాటలు పాడారు. కోలాటాలు వేశారు. వాయినాలు ఇచ్చుకున్నారు. ఆకాశంలో మబ్బుతెరలు చేరాయి. వెన్నెల మాయం కాసాగింది. క్షణంలో కారుమబ్బులు కమ్మాయి. తొందరపడి నైవేద్యం పెడ్తూ ఉండగానే చిటపటచినుకులు ప్రారంభమైనాయి. వందల బతకమ్మలు ఏట్లో తేలిపోసాగాయి. రెడ్డిగారి బతకమ్మల్ని నీళ్ళలో వాలారించేటప్పుడు వాన జోరున కురిసింది. మగవాళ్ళలో కొందరు ఊళ్లోకి పరిగెత్తారు. కొందరు అక్కడవున్న చెట్లక్రింద చేరారు. పాణి ఏటి ఒడ్డున మర్రిచెట్టు క్రిందికి చేరాడు.
    బతకమ్మను వాలాడించేసరికి తడిసిపోయారు పూర్తిగా మంజరీ. వనజలు. మర్రి క్రింద తప్ప ఎక్కడా స్థలం కనిపించలేదు. పరుగెత్తి మర్రి క్రిందికి వచ్చి, అక్కడున్న పాణిని చూచి వెనక్కు తగ్గింది మంజరి. వెనక పరుగెత్తుకొచ్చిన వనజ 'పంతులు - భయంలేదు' అని చేయిపట్టుకొని మర్రిచెట్టు మొదటికి తీసికెళ్ళింది. ఇద్దరూ పైట చెరుగుల్తో ముఖాలు తుడుచుకున్నారు.
    పాణి గుండెలో మెరిసింది ఆకాశంలోని మెరుపు, బట్టలు పూర్తిగా తడిసి ఒంటికి అంటుకొని పోయినాయి మంజరికీ వనజకూ. కానీ అతని దృష్టి మంజరి మీదనే పడింది. నెత్తినుంచి ఇంకా నీరు కారుతూనే ఉంది. ఎడమ భుజం మీద కుడిచేయి, కుడి భుజం మీద ఎడమచేయి వేసుకొని ఉరుమును దాచుకుంటూంది.
    ఉరుము వినిగాని ఈ లోకంలోకి రాలేదు పాణి.
    "వనజా! ఇదిగో కండువా, మంజరి తల తుడిచి వంటిమీద కప్పు! చూడు ఎలా వణుకుతోందో పాపం!'
    'అవు, నేనుగూడ మరిచిన' అని కండువా అందుకొని మంజరి వారిస్తున్నా వినకుండా తల తుడిచి, భుజాలమీద కప్పింది. చలి కొద్దిగా తగ్గింది. కండువా ఒక చేత్తో పట్టుకొని నదిలోకి పోతున్న పిల్లకాలువల్ని చూస్తుంది మంజరి.
    పాణి ఒక్క అడుగు ముందుకు వేసి, "మంజరీ! చాలా బాగా పాడావు" అన్నాడు.
    "ఇంక బాగ పాడ్తది" అన్నది వనజ.
    "మంజరీ! నీది నిజంగా కోకిల కంఠం, సంగీతం నేర్చుకుంటే రాళ్ళను కరిగించగలవు."
    మంజరి మాట్లాడదల్చుకోలేదు. చిరునవ్వుమాత్రం ఆపలేకపోయింది.
    మెరుపు మెరిసింది.
    మంజరి తలెత్తి చూచింది.
    కంటిరెప్పల వెంట్రుకలపై అక్కడక్కడా ఉన్న నీటి బిందువులు ముళ్ళ చివరనున్న తుహిన బిందువుల్లా ఉన్నాయి.
    మంజరి కళ్ళు తళుక్కుమన్నాయి.
    పాణి చూపు తాకడంతో తల వంచుకుంది.
    "కాన్తే దృష్టి పధంగతే, నయనోరాసీద్వికాసో మహన్."
    మంజరికి తిండి సహించలేదు. నిద్ర రాలేదు. కన్ను మూసినా, తెరిచినా పాణి రూపం ప్రత్యక్షం అవుతూంది. ఉంగరాల క్రాపు, విశాలమైన నుదురు, పెద్దకళ్ళు, కొనదేరిన ముక్కు, కోలముఖం, పొడవైన మెడ, విశాలమైన వక్షం, బలమైన బాహువులు, కళ్ళల్లో ఏదో తేజస్సు, ఆకర్షణ ఆమెను వదలడం లేదు.
    మర్రిచెట్టు
    జోరున వర్షం
    తాను, పాణి.....
    అదొక చెరగని చిత్రంగా తయారైంది ఆమె మనోఫలకం మీద. పాణి క్రాపు తల్చుకుంది, తన జుట్టు చూచుకుంది. రెండూ ఒకేరకంగా ఉన్నాయి. కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి! మళ్ళీ తన కళ్ళతో పోల్చుకుంది. ఏవో పోలికలున్న జాడలు కనిపించాయి. ఏమిటో పోలికలు? ఎందుకలా ఉన్నాయి? అతని పాట - ఆ మాటే ఆమె గుండెను జలదరింప చేసింది. ఎంత తీయగా పాడగలను, ఎంత విజ్ఞానం ఉందతని దగ్గర, ఎన్ని విషయాల గురించి మాట్లాడ్తాడాయన, జన్మాంతర సౌహృదాని, పూర్వజన్మలోని స్నేహం ఏదో ఉండాలి.
    ఏమిటో బాధ? ఎన్నడూ ఎరుగని వ్యధ! బాధలోనే ఏదో తీయదనం! ఏమిటిది?
    '......నీ కుటిలాలక లాలితాస్యమిచ్చావిధి జూడకున్న నిముషంబులు మాకు యుగంబులై చనున్.'
    గోపికలు కృష్ణున్ని చూడకుండా ఉండలేనట్లు తాను పాణిని చూడకుండా ఉండలేనట్లుంది. ఒక్క చూపులో, ఒక్క క్షణంలో యింతమార్పా?
    వనజను చూస్తే ఆదమరచి నిద్రపోతూంది.
    వనజ పాణిని చూడలేదా? అంత హాయిగా ఎలా నిద్రిస్తూంది? తానూ నిద్రపోవడానికి ప్రయత్నించింది. కళ్ళు మూసుకుంది.
    మర్రిచెట్టు
    జోరున వాన   
    తాను, పాణి....
    మెరుపు మెరిసింది. ఉరుము విని కళ్ళు తెరిచింది, పుండులో ఉప్పు కూరినట్లయింది. ఏం చేయాలి తాను? ఎలా?
    'అక్కట బంధువులున్ మగలు నన్నలు దమ్ములు బుత్రకాదులన్ నెక్కొని రాత్రి బోకుడన నీ మృదు గీతరవంబు వీనులన్ వెక్కసమైన వచ్చితిమి వేగమె మోహము నొంది నాథ!'
    పాణి దగ్గర లేకుంటే ఈ బాధకు అంతంలేదు. వనజను చూసింది. హాయిగా నిద్రపోతూంది. లేపుదామనుకుంది. దగ్గరికి వెళ్ళింది. కదిలించింది. లేవలేదు. గాఢనిద్ర, నిశ్చింతగా నిద్రపోతూంది. బాధలేని గుండెవుంటే నిద్ర కేంకరువు? మరికసారి కదిలించింది. లేవలేదు. వనజ లేస్తే మాత్రం? ఏమని చెపుతుంది తాను? ఇది పరులకు చెప్పేబాధా? ఒకరు పంచుకోగలిగే బాధా? తనలో తానే కుమిలి చావాల్సిన బాధ. ఈ బాధంతటికీ కారణం పాణి. అతన్ని చూసింది. ఛ, అతనిదేం తప్పు? తనను బాధపడమన్నాడా అతడు? తాను పడాలనుకుందా? లేదే! తనకు తెలియకుండానే ఒక బాధ తన గుండెలో గూడు కట్టుకుంది ఎందుకో తనకు తెలియదు. ఆ వానలో, ఆ మర్రిచెట్టు క్రింద పాణిని తాను చూడాలనుకుందా? ఆ ఘటన ఏమిటో?
    అది ఎవరికీ తెలీదు.
    ఇప్పుడు తానేం చెయ్యాలి? వెళ్ళాలి సారంగపాణి దగ్గరకు, చప్పుడు కాకుండా తలుపు తీసింది. పుచ్చ పూవులా ఉంది వెన్నెల. ఇంతరాత్రి పాణి దగ్గరికి ఒంటరిగా వెళ్ళడమే? ఒళ్ళు జల్లుమంది. తండ్రి తల్లి, వారేమంటారు? వనజ లేచి చూస్తే? వెనక్కు వెళ్ళి చూస్తే వనజ నిద్రపోతూంది. తాను వెళ్ళినా పాణి ఏమంటాడు? తాను ఆడది! అందులో దొరబిడ్డ! అర్దరాత్రి, ఒంటిగా అతని దగ్గరికి వెళ్ళడమా? వీలులేదు, తలుపు మెల్లగా వేసింది! పడకపై చేరింది! కళ్ళు మూసుకుంది.
    మర్రిచెట్టు   
    జోరున వాన
    తాను, పాణి
    ఎందుకిలా బాధ పెడ్తారు? సగం గుండె కోసుకొని వెళ్ళిపోయాడు.
    వనజ కదిలిన అలికిడైంది. చూస్తే వనజ లేచింది. మంజరి గట్టిగా కళ్ళు చూసుకుంది. వనజ తలుపు తెరచుకొని బయటికి వెళ్ళింది.

 Previous Page Next Page