Previous Page Next Page 
హిమసుందరి పేజి 27

                                 12

    తెల్లారి నిద్ర లేవంగానే చాలా హాయిగా వుంది రామకృష్ణకి.

    "ఎలా వుంది?" సీత అడిగింది.

    "కాస్త నీరసంగా వుంది. అంతే!" రామకృష్ణ చెప్పాడు.

    "తలనొప్పి?"

    "అసలు లేదు."

    "అమ్మయ్య!" అంది సీత.

    ఆ తర్వాత రామకృష్ణ బాత్ రూమ్ కెళ్ళాడు. సీత వంట గదిలోకి దారితీసింది.

    మరో పది నిమిషాల తర్వాత-

    "నేను ఈ పూట ఆఫీసుకి వెళ్ళను." కాఫీ తాగుతూ చెప్పాడు రామకృష్ణ.

    "ఈ విషయం నేనే చెపుదామనుకున్నాను" సీత అంది.

    "నాకు తెలుసు అందుకే ఈ ముందు జాగ్రత్త."

    సీత నవ్వింది.

    రామకృష్ణ నవ్వాడు.

    వాళ్ళిద్దరి ప్రాణానికి ఈ ఉదయం ఎంతో హాయిగా వుంది.

    "రాత్రి మిమ్మల్ని చూసి చాలా భయపడ్డాను" సీత చెప్పింది.

    "నాకు తెలుసు. నిన్ను బాధ పెట్టకూడదని ట్రై చేశాను. కుదరలేదు."

    "ట్రై చేశారా?"

    "చేశానని చెప్పాకదా!"

    "ట్రై చేయటం ఎందుకు?"

    "నిన్ను బాధపెట్టకూడదని."

    ఇద్దరికి నవ్వొచ్చింది నవ్వుకున్నారు. ఒకరి మొహంలోకి ఒకరు చూసుకుంటూ.

    "ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడగబోతున్నాను. మీకేమన్నా అభ్యంతరమా?"

    "ఉహూ! శక్తికి, ఉత్సాహానికి, బలానికి, ఆంధ్రా కాఫీని తాగాను కదా! టట్టటాయ్!" అన్నాడు రామకృష్ణ.

    "రాత్రి ఎందుకు ఎందుకు ఆలశ్యంగా వచ్చారు?" సీత అడిగింది.

    "నిన్ను బాధపెట్టకూడదని ట్రై చేశాను."

    "నా ప్రశ్నకు సమాధానం యిదా?"

    "యిదే."

    "సరేలెండి జోక్స్ తర్వాత అసలు విషయం చెప్పండి. రాత్రి ఎందుకు ఇంటికి ఆలశ్యంగా వచ్చారు?"

    "తల తిరగటం కళ్ళు తిరగటం సన్న సన్నగ తలనొప్పి ఆఫీసులోనే మొదలయాయి. యింటికి వచ్చేద్దామనుకున్నాను....."

    "రావాల్సింది" సీత మధ్యలో అడ్డుతగిలి అంది.

    "కాస్త రెస్ట్ తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది కదా అని ఆఫీసు పక్కరూమ్ లో పడుకున్నాను. తగ్గలేదు. జవాను చేత టాబ్ లెట్ తెప్పించుకుని మింగాను. అదేదో కొత్తగా వస్తున్న తలనొప్పి బిళ్ళలు. మత్తుగ నిద్ర పట్టింది. లేచి చూద్దును కదా ఎనిమిది కావచ్చింది. లేచి కూర్చున్నానో లేదో వడ్రంగి పిట్ట రెండు కణతల మీద టక్ టక్ అని పొడిచినట్లు విపరీతమైన తలనొప్పి మళ్ళి మొదలు.

    ఓ పక్క నీ గురించి బాధ మరో పక్క తలనొప్పి బాధ. సాయంత్రం సినిమాకి వెళదాం రెడీగ వుండమని నేనే కదా చెప్పాను. నాకు తలనొప్పిగ వుంది వద్దు అంటే ఏమన్నా బాగుంటుందా?"

    "ఎందుకు బాగుంటుంది!" అంది సీత.

    "ఏమో! నాకు బాగుండదు. ఆశపెట్టి ఆశ నిరాశ చెయ్యటం ఏమన్నా బాగుంటుందా?"

    "నిక్షేపంగా బాగుంటుంది. మీకు వంట్లో బాగుండకపోతే సినిమా పోయిందని నేనేమన్నా బాధపడతానా! వెనకటికో సామెత వుంది."

    "అది నేను చెపుతాను. కొంపకాలి వకడేడుస్తుంటే నిప్పు దొరక్క పొద్దుటి నుంచీ చస్తున్నాను. అమ్మయ్య అన్నాడుట వకడు చుట్టకాల్చుకుంటూ. అలానేనా?"

    "అలాంటి సామెతేగాని నేను సినిమా పోయిందని బాధపడను."

    "నువ్వు పడవు. నాకు బాదే కదా?"

 Previous Page Next Page