వేగంగా వెనక్కి జరిగాడు.
పాము బుసలు ఆ నిశీధిలో ప్రేతాత్మల గుసగుసల్లా వినిపిస్తుంటే ఒక్కొక్క అడిగే వెనక్కి వేస్తున్నాడు.
అతడ్ని అనుసరిస్తూ మరింత పైపైకి వస్తుంది త్రాచు.
చీకటిలో దాని కళ్ళు మణుల్లా మెరుస్తున్నాయి.
తుపాకీని గురిపెట్టి కాల్చే వ్యవధి కాని, దూరం కాని లేకపోవడంతో కేవలం ఓ కట్టెగా మాత్రం ఉపయోగించుకున్నాడు.
నిజానికి చైతన్య ఉద్దేశం త్రాచు బారినుండి తప్పించుకు పోవాలనే తప్ప హత మార్చాలని లేదు.
మొండితనంతో చాలా మీదికి వచ్చిన త్రాచు అతడ్నెంత రెచ్చగొట్టిందంటే ,నిగ్రహాన్ని కోల్పోయిన చైతన్య లిప్తపాటుతో టార్చి వెలిగించి కాంతి రేఖలతో దాని గమనాన్ని నిరోధించడంతోపాటు రైఫిల్ మపిల్ తో గట్టిగా బాదేశాడు.
అంతే. చాలా కసిగా నేలపైకి కాటేసిన త్రాచు మరుక్షణం పొదల్లోకి దూరిపోయింది.
చైతన్యకు తెలీదు, త్రాచు గాయపడిందని.
సరిగ్గా ఇదే సమయంలో దూరంగా గాండ్రించిన మేనీటర్ పశువుల కాపరిపై లంఘించింది.
14
బడలికగా నిద్ర లేచాడు చైతన్య .అతడక్కడ వచ్చిన అతి స్వల్పకాలంలో ఎన్నో విచిత్రమైన అనుభవాలు.
అడుగడుగునా ఎదురౌతున్న ప్రమాదాలు, వైఫల్యాలు ఎంతటి ధైర్యవంతుడినయినా బలహీన పరుస్తాయి.
తాను వచ్చింది కేవలం మేనీటర్ ను ఎదుర్కోటానికి!
కాని, అంతకుమించి ప్రమాదకరమయిన మనుషులూ అజ్ఞాతంగా తనచుట్టూ తారట్లాడుతున్నారు.
తన ముందు చాలా అనుభవజ్ఞులైన రఘునందన్ పాముకాటుతో మరణించడమూ, నట్వర్ సింగ్ మేనీటర్ కు బలి కావడమూ గుర్తుకొచ్చాయి.
ఇక్కడి పరిస్థితుల్లో తన అనుభవంకాని, ఆలోచనా పరిజ్ఞానం కాని ఉపకరిస్తాయా అన్న మీమాంసతో కొన్ని క్షణాలు అలాగేవుండి పోయాడు.
మేనీటర్ తోపాటు తనకు తెలీని ప్రత్యర్ధులూ తనతో దోబూచు లాడుతున్నారు.
కాలకృత్యాలు ముగించి బయటికి వచ్చాడు. తనకు విశ్రాంతిలేదు ఉండకూడదు. సాధ్యమయినంత త్వరలో తాడో పేడో తేల్చుకోవాలి.
సాధారణమైన పులిని వధించేపద్ధతులు మేనీటర్ విషయంలో పనికిరావు. నిర్దిష్టమైన మార్గాల ద్వారా మేనీటర్ ను డీకోవటం సాధ్యంకాని పని. వివిధ మార్గాలలో, తన అనుభవానికి వినూత్నమైన యుక్తుల్ని జోడించి తన ప్రయత్నాన్ని సుగమం చేసుకోవాలి.
ఇప్పుడేం చేయాలి?
ఇంత విశాలమైన అడవిలో రోజుకో ప్రాంతంలో హఠాత్తుగా దర్శనమిచ్చి తన విశృంఖల విహారంతో అందర్ని హడలగొడుతున్న మేనీటర్ ను ట్రాప్ చేయాలంటే ప్రాణంతో ఉన్న పశువుల్నో, మేకల్నో ఎరలా వాడాలా? అసలు మనిషి రక్తానికి అలవాటు పడ్డ మేనీటర్__సులభంగా మనుషులు లభ్యమౌతుంటే తను ఉపయోగించే బైట్స్(ఎరలు)కు ఆకర్షితురాలౌతుందా, లేక మరో మనిషి బలయ్యే వరకూ ఎదురు చూడాలా?
ఎంత బాధాకరమైన ఆలోచనిది?
అంతకు ముందురోజు సాయంకాలానికి జీప్ రిపేరు చేయబడింది.చైతన్య ఫారెస్టులో తిరుగుతుండగానే జీప్ ను రెస్టుహౌస్ దగ్గరుంచి, రేంజర్ పంపిన మెకానిక్ వెళ్ళిపోయాడు.
ముందు కుందనపల్లి వెళ్ళి చినబగతానికలుసుకోవాలనుకున్నాడు.
తవిటయ్య ఎప్పటిలాగే ఓ మూల నిలబడి క్రూరమృగంలా చైతన్యని చూస్తుంటే, చైతన్య బ్రేక్ ఫాస్టు సైతం చేయకుండా జీప్ తో కూర్చున్నాడు.
ఫర్వాలేదు బ్రేక్ కండిషన్ లోనే వున్నాయి అనుకున్నాడు జీప్ నడుపుతూనే చెక్ చేసుకుని.
నెమ్మదిగా చుట్టూ వున్న ప్రకృతిని పరిశీలిస్తూ నడుపుతున్న చైతన్య సువాసనలు వెదజల్లుతున్న చందన తోట దగ్గరకు రాగానే అనాలోచితంగా జీప్ ఆపాడు. చెట్టు బెరడల్ని తొలగిస్తేగాని సుగంధాన్ని వెదజల్లదు గంధపుచెట్టు.
మరికొన్ని వృక్షాల్ని నరికే ప్రయత్నం చేసినట్టుగా మొదళ్ళ దగ్గర గొడ్డళ్ళతో నరికిన గుర్తులు కనిపించాయి. అనుమానంతో మధ్యలోనే ప్రయత్నాల్ని ఆపేసినట్టుంది.
చందనమన్నది ప్రకృతి వరప్రసాదం. కానట్టే మైసూర్ ను పాలించిన టిప్పుసుల్తాన్ చందనపు చెట్టును రాజవృక్షంగా అభివర్ణించాడు. భారతీయుల పూజా పురస్కారాలలో దేవుడికి చేసే షోడశోపచారాలలో గ్రంధం సమర్పించడం ఒక అంశం. పరిమళాన్ని వెదజల్లే అత్తరు, పన్నీరుల్లో గంధపు నూనెను కలుపుతారు. మధుమేహం, రక్తపుపోటు వంటి దీర్ఘ వ్యాధుల చికిత్సకు చందన ఉపయోగపడుతుందని అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల డాక్టర్లు అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తే ,పరమాణుశక్తివల్ల కలిగే రేడియో ధార్మికశక్తిని ఆపగల గుణం రక్తచందనంలో వుందని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు.
అంతటి విలువగల ఎర్రచందనం ప్రభుత్వాధికారులతో చేతులు కలిపిన అక్రమ వ్యాపారస్తుల మూలంగా క్రమంగా అతరించిపోవడం ఎంతటి దురదృష్టం. 1968లో సాలువ నాలుగువేల టన్నుల ఉత్పత్తిగల ఎర్రచందనం 1982వ సంవత్సరం నాటికి రెండువేల టన్నులకు పడిపోయింది.
కారణం అటవీశాఖ నిర్లక్ష్యం!
నిజానికి చందనపు చెట్లను పెంచడానికి అటవీశాఖ సైతం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. బుల్ బుల్ పక్షులు చందనపు వేళ్ళను తిని గింజల్ని విసర్జిస్తాయి. అవి నేలపైపడి మొలకెత్తుతాయి.
ఏది ఏమయినా, చాలా యుక్తిగా జరుగుతున్న దొంగరవాణాని ఆపడానికి బలమయిన పథకం వేయాలి.
జీప్ ధూళిరేపుతూ మరో నాలుగు ఫర్లాంగుల దూరం వెళ్ళక ముందే చాలా ఆందోళనతో ఎదురయ్యారు కొందరు గ్రామస్థులు.
అసంకల్పితంగా జీప్ నాపాడు.
వంజరు గ్రామానికి చెందిన ఓ యువకుడు పశువుల్ని తోలుకువెళ్ళి తిరిగిరాలేదు. కాని పశువులు మాత్రం తిరిగి వచ్చేశాయి.
ఇదీ వారు అందించిన సమాచారం!
కుందనపల్లి వెళ్ళాలన్న ఆలోచన విరమించుకున్నాడు.
ఓ ఎత్తయిన గుట్టపై నుంచి సామాన్యంగా వారు పశువుల్ని ఎక్కడ మేసేదీ చూపించారు. దగ్గర కాదు....చాలా దూరంలో వున్న ప్రాంతమది....
అతడు ఆలస్యం చేయలేదు.
ఆ ప్రదేశాన్ని ఖచ్చితంగా చూపాలని కొందరు ముందుకు వస్తే మరి కొందరు వెనకడుగు వేశారు.
ఇరుకుగా వున్న కాలిబాటపై ఒకరి వెనుక మరొకరు నడుస్తూ ముందుకు వెళుతున్నారు.
మేనీటర్ తిరిగే జోన్ లో మౌనంగా నడవడం అతి ప్రమాదకరం. మాటేసిన వేళలో తప్ప నిశ్శబ్దాన్ని పాటించకూడదు. ఒకవేళ వారు నడిచే ప్రాంతంలోనే మేనీటర్ ఉంటే చప్పుడు చేయకుండా పాకి వెనుక ఉన్న వ్యక్తిపై లంఘిస్తుంది.
అందుకే గట్టిగా మాట్లాడుతూ వారిని నడవమని చెప్పి వెనుక అనుసరించాడు.